మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్: 2019లో వైద్య రంగం సాధించిన అద్భుత విజయాలు

ఎక్సోస్కెలెటన్

ఫొటో సోర్స్, FONDS DE DOTATION CLINATEC

ఫొటో క్యాప్షన్, పక్షవాత పీడితుడైన తిబాల్ట్ ఎక్సోస్కెలెటన్ ద్వారా తన కాళ్లూ, చేతులను మళ్లీ కదిలించగలుగుతున్నారు
    • రచయిత, జేమ్స్ గళగర్
    • హోదా, ఆరోగ్యం, సైన్స్ ప్రతినిధి

''చంద్రుడి మీద అడుగు పెట్టిన మొదటి మనిషిని నేనే అన్నట్లు అనిపించింది'' అని చెప్పారు 30 ఏళ్ల తిబాల్ట్.

రెండేళ్ల కిందట పక్షవాతం బారిన పడిన తాను.. మళ్లీ మొదటిసారి అడుగులు వేయగలగినప్పటి అనుభూతిని అతడు అలా అభివర్ణించాడు.

ఇప్పుడతడు.. పక్షవాతంతో చచ్చుబడిన తన కాళ్లూ, చేతులను మెదడు నియంత్రిత రోబో సూట్ (ఎక్సోస్కెలెటన్ సూట్‌) ద్వారా కదిలించగలడు.

అతడి కదలికలు.. ముఖ్యంగా నడవటంలో ఇంకా ఖచ్చితత్వం లేదు. ఆ రోబో సూట్‌ను ప్రస్తుతం ప్రయోగశాలలో మాత్రమే వాడుతున్నారు.

కానీ.. పక్షవాత బాధితుల జీవితాలను మెరుగు పరచే రోజు త్వరలో వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

మరోవైపు.. పక్షవాతం బారిన పడిన వారి శరీరాల్లో నరాలను రీవైర్ చేయటం ద్వారా.. వారి కాళ్లూ, చేతులకు కదలికలు వచ్చేలా చేశారు.

ఆస్ట్రేలియాలో రోగులు ఇప్పుడు తమకు తాముగా భోజనం చేయగలరు. మేకప్ వేసుకోగలరు. తాళం తీయగలరు. డబ్బులు సరిచూసుకోగలరు. కంప్యూటర్ కీబోర్డుపై టైప్ చేయగలరు.

line

ఒక బాలిక కోసం అనూహ్యమైన వేగంతో తయారైన కొత్త ఔషధం

మిలా

ఫొటో సోర్స్, BOSTON CHILDREN'S HOSPITAL

ఫొటో క్యాప్షన్, మిలా కోసం ఏడాదిలోనే పూర్తిగా కొత్త ఔషధం తయారు చేశారు

మిలా మకోవెక్ వైద్యులు.. అసాధ్యమనిపించే విజయం సాధించారు. ప్రాణాంతకమైన మెదడు వ్యాధి - చికిత్స లేని బాటన్ వ్యాధి - ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలికకు.. ఆమె కోసమే ఏడాది వ్యవధిలో సంపూర్ణంగా ఒక కొత్త మందును తయారు చేసి అందించారు.

మిలా అనే బాలిక డీఎన్‌ఏ జన్యుపటాన్ని సవివరంగా అధ్యయనం చేసిన బోస్టన్ వైద్య బృందం.. ఆమెకు ఆ వ్యాధికి కారణమైన జన్యుపరివర్తనను కనుగొన్నారు.

ఆ లోపాన్ని నిర్ధారించుకున్న అనంతరం.. దానికి చికిత్స చేయటం సాధ్యం కావచ్చునని పరిశోధకులు భావించారు.

దీంతో ఒక ఔషధానికి రూపకల్పన చేశారు. మిలా జీవ కణాల మీద, ప్రయోగశాలలో జంతువుల మీద పరీక్షించారు. దానిని ఉపయోగించటానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందారు.

సాధారణంగా ఒక ఔషధం ప్రయోగశాల నుంచి, క్లినికల్ పరీక్షలు పూర్తిచేసుకుని, ఆమోదం పొంది రోగులకు చేరటానికి దశాబ్ద కాలం పడుతుంది.

అమెరికా వైద్య, పరిశోధక బృందం ఇదంతా ఒకే ఒక సంవత్సరంలో పూర్తిచేసింది.

ఇప్పుడు ఆ బాలిక మిలా జబ్బు నయం కాలేదు.. కానీ ఆమెకు మూర్ఛలు రావటం చాలా వరకూ తగ్గింది.

line

జీన్ సైలెన్సింగ్ ఔషధాల ఆవిష్కరణ

సూ బరెల్

ఫొటో సోర్స్, SUE BURRELL

ఫొటో క్యాప్షన్, సూ బరెల్‌కు ఇప్పుడు విపరీతమైన నొప్పులు రావటం లేదు

ఇంతవరకూ చికిత్స లేని వ్యాధులను తిప్పికొట్టటంలో.. 'జీన్ సైలెన్సింగ్' (జన్యు సాంత్వన) అనే ఓ కొత్త రకం ఔషధం తన సామర్థ్యాన్ని చాటింది.

జన్యువు అనేది మన డీఎన్ఏలో భాగం. మన శరీరంలో హర్మోన్లు, ఎంజైములు లేదా నిర్మాణ పదార్థాల వంటి ప్రొటీన్ల తయారీ ప్రణాళిక ఇందులో ఉంటుంది.

కానీ.. మన డీఎన్‌ఏ కణ కేంద్రకంలో దాగి ఉంటుంది. కణంలోని మాంసకృత్తుల తయారీ కర్మాగారాలకు దూరంగా ఉంటుంది.

ఈ అంతరానికి వంతెన వేస్తూ, సూచనలు అందించటానికి మన శరీరం.. ఆర్ఎన్ఏ అనే దూతను ఉపయోగిస్తుంది.

ఈ దూతను జీన్ సైలెన్సింగ్ ఔషధాలు సంహరిస్తాయి.

సూ బరెల్‌కు తీవ్రమైన పోర్ఫీరియా అనే వ్యాధి ఉంది. దానివల్ల ఆమెకు తరచుగా తీవ్రమైన నొప్పి వస్తుండేది. ఇప్పుడు ఆ బాధ లేదు.

విన్సెంట్, నీల్ నికొలస్‌లు.. అమిలాయిడోసిస్ అనే తమ వ్యాధి కోసం జీన్ సైలెన్సింగ్ ఔషధాలు వాడుతున్నారు.

విన్సెంట్, నికొలస్
ఫొటో క్యాప్షన్, విన్సెంట్, నికొలస్ ఇద్దరూ జీన్ సైలెన్సింగ్ మందులు వాడుతున్నారు
line

కాపాడే వైరస్‌లు...

ఇసబెల్ కార్నెల్

ఫొటో సోర్స్, JO CARNELL HOLDAWAY

ఫొటో క్యాప్షన్, ఇసబెల్ శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియాతో పోరాడటానికి వైరస్‌ల మిశ్రమాన్ని అందిస్తున్నారు

ప్రయోగాత్మకంగా చేసిన పలు వైరస్‌ల మిశ్రమం ఇసబెల్ కార్నెల్ హాల్డవే జీవితాన్ని కాపాడింది.

ఈ టీనేజర్ శరీరం మీద ఒక ప్రాణాంతక బ్యాక్టీరియా దాడి చేస్తుండేది. దానికి చికిత్స కనిపించలేదు. ఆమె బతికే అవకాశం ఒక్క శాతం మాత్రమే ఉందని చెప్పారు.

ఆమె శరీరం మీద పెద్ద పెద్ద నల్లని గాయాలు అవుతుండేవి. వాటిలో ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉండేది.

ఆమె కాలేయం విఫలమవటం మొదలవటంతో ఆమె శరీరంలో బ్యాక్టీరియా భారీ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంది. దీంతో ఆమెను చికిత్స కోసం ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చారు.

అయితే, గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ వైద్యులు ఇప్పటివరకూ పరీక్షించని ''ఫేగ్ థెరపీ''తో ఆమెకు చికిత్స చేశారు. ఈ ప్రక్రియలో రోగి శరీరంలోని బాక్టీరియాను సంహరించటానికి పలు వైరస్‌లను ఉపయోగిస్తారు.

ఈ ఫేగ్-థెరపీ ప్రధాన స్రవంతి చికిత్సగా మారలేదు. ఇంకా సులభంగా ఉపయోగించగల యాంటీబయాటిక్స్ ఆవిష్కరణతో ఈ రంగం మరుగునపడిపోయింది.

కానీ ఇప్పుడు యాంటీబయాటిక్స్‌ను తట్టుకోగల సూపర్‌బగ్స్ విస్తరిస్తుండటంతో ఫేగ్ థెరపీ పునరుద్ధరణ జరుగుతోంది.

ఇటువంటి తొలి కేసుల్లో ఇసబెల్ ఉదంతం ఒకటి కావచ్చు.

line

క్యాన్సర్ మీద పోరాటానికి కొత్త వ్యూహం

చార్లొట్ స్టీవెన్సన్

ఫొటో సోర్స్, ROYAL MARSDEN

ఫొటో క్యాప్షన్, చార్లొట్‌ క్యాన్సర్‌కు కొత్త తరహా మందులతో చికిత్స అందించారు

బెల్‌ఫాస్ట్‌కు చెందిన చార్లొట్ స్టీవెన్సన్ వయసు రెండేళ్లు. విప్లవాత్మక కొత్త శ్రేణి క్యాన్సర్ మందులతో ప్రయోజనం పొందిన తొలి రోగుల్లో ఇతడు ఉన్నాడు.

మొట్టమొదటి ఔషధం.. లారోట్రెక్టినిబ్‌ను యూరప్ అంతటా ఉపయోగించటానికి ఆమోదం తెలిపారు.

ఎన్‌టీఆర్‌కే జీన్ ఫ్యూజన్ అనే జన్యు వైపరీత్యంతో కూడిన ట్యూమర్లను లక్ష్యంగా చేసుకునేలా ఈ ఔషధాన్ని రూపొందించారు.

చార్లొట్‌కు వచ్చిన సర్కోమా క్యాన్సర్‌తో పాటు.. కొన్ని రకాల బ్రెయిన్, కిడ్నీ, థైరాయిడ్ తదితర క్యాన్సర్లలో ఈ జన్యు వైపరీత్యం కనిపిస్తుంది.

ఇదిలావుంటే.. క్యాన్సర్‌కు ఇమ్యునోథెరపీ మరో భారీ మైలురాయిని చేరుకుంది.

ఈ ఔషధంలో.. క్యాన్సర్ మీద పోరాడటానికి రోగి స్వీయ రోగనిరోధక శక్తిని ఉపయోగిస్తారు.

ఒక దశాబ్దం కిందట చికిత్స సాధ్యం కాదని పరిగణించిన ప్రాణాంతక మెలనోమా (చర్మ) క్యాన్సర్‌ను అధిగమించి సగం మందికి పైగా రోగులు జీవిస్తున్నారు.

ఇరవై ఏళ్ల కిందట.. మెలనోమా క్యాన్సర్ ముదిరిన దశలో ఉన్నట్లు గుర్తించిన ప్రతి 20 మందిలో ఒక్కరు మాత్రమే ఐదేళ్ల వరకూ జీవించగలిగేవారు. చాలా మంది కొన్ని నెలల్లోనే చనిపోయేవారు.

క్యాన్సర్ చికిత్సలో ఇది అద్భుతమైన, అత్యంత వేగవంతమైన మార్పు.

line

డిమెన్షియాను నెమ్మదింపజేసే మొదటి ఔషధం?

అల్జీమర్స్

ఫొటో సోర్స్, Getty Images

తీవ్ర మతిమరుపు కలిగించే అల్జీమర్స్ వ్యాధిని నెమ్మదింపజేయటానికి మొట్టమొదటి ఔషధాన్ని అభివృద్ధి చేశామని అమెరికా ఔషధ సంస్థ ఒకటి చెప్తోంది.

అడ్యుకానుమాబ్ అని పిలిచే ఈ ఔషధం.. మెదడులో పెరిగే విషపూరిత ప్రొటీన్లను శుభ్రంచేసే యాంటీబాడీగా పనిచేస్తుంది.

బయోజెన్ సంస్థ అక్టోబర్‌లో చేసిన ప్రకటన విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

ఈ ఔషధాన్ని అత్యధిక మోతాదులో తీసుకుంటున్న వారిలో జ్ఞాపకాలు, భాషా సామర్థ్యం మరింత అధికంగా నిలిచివున్నట్లు చూపే ఆధారాలను సమీక్షించారు. శుభ్రం చేసుకోవటం, షాపింగ్ చేయటం, దుస్తులు ఉతకటం వంటి రోజు వారీ పనులు మరింత మెరుగయ్యాయని కూడా గుర్తించారు.

ఈ ఔషధం ఆమోదం పొందితే.. ఆధునిక వైద్యశాస్త్రంలో మరో కీలక ఘట్టం అవుతుంది.

కొత్త రకం డిమెన్షియా

మరోవైపు.. ఓ కొత్త తరహా డిమెన్షియాను గుర్తించామని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకూ లక్షలాది మందికి వచ్చిన ఈ వ్యాధిని పొరపాటుగా అంచనావేసి ఉండొచ్చని కూడా వారు భావిస్తున్నారు.

మెదడుకు వచ్చే అనేక వ్యాధుల్లో కనిపించే లక్షణం డిమెన్షియా. ఇందులో అత్యంత సాధారణమైన అంశం మతిమరుపు.

అల్జీమర్స్ అనేది అత్యంత సాధారణమైన డిమెన్షియా రూపం. వాస్క్యులార్ డిమెన్షియా, లువీ బాడీస్ డిమెన్షియా, ఫ్రాంటో-టెంపొరల్ డిమెన్షియా, పార్కిన్సన్స్ డిసీజ్ డిమెన్షియా, అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ వంటి ఇతర రకాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు ''లింబిక్-ప్రిడామినంట్ ఏజ్-రిలేటెడ్ టీడీపీ-43 ఎన్‌సెఫలోపతీ'' అనే కొత్త తరహా డిమెన్షియాను ఈ జాబితాలో చేర్చారు. ఈ వ్యాధిని పొట్టిగా ''లేట్'' అని వ్యవహరిస్తున్నారు.

line

అవిభక్త కవలలను విడదీయటం

అవిభక్త కవలలు సాఫా, మార్వా
ఫొటో క్యాప్షన్, అవిభక్త కవలలు సాఫా, మార్వా

ఇక ఈ ఏడాది ఆసక్తి రేకెత్తించిన వైద్య చికిత్స కథనాల్లో.. అవిభక్త కవలలను వేరుచేయటం ఒకటి.

సాఫా, మార్వా కవలలు. వీరి తలలోని పుర్రె కలిసిపోయి పుట్టారు. వీరిద్దరూ ఒకరి ముఖం మరొకరు చూడగలిగేవారు కాదు.

ఇటువంటి అవిభక్త కవలల జననం ఎంత స్థాయిలో ఉంటుందని చెప్పే అధికారిక గణాంకాలు ఏవీ లేవు. అయితే ప్రతి 25 లక్షల జననాల్లో ఒకసారి పుర్రెలు కలిసిపోయిన కవలలు జన్మిస్తారని ఒక అంచనా.

ఇటువంటి వారిలో ఎక్కువ మంది ఒక్క రోజుకు మించి జీవించరు.

వారిని వేరు చేయటానికి.. బహుముఖ శస్త్రచికిత్సలు అవసరం. నెలల తరబడి శ్రమించాలి. వందలాది మంది ఆస్పత్రి సిబ్బంది నైపుణ్యం కావాలి.

line

చనిపోయిన నాలుగు గంటల తర్వాత.. పంది మెదడు పాక్షిక పునరుద్ధరణ

పంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ పరిశోధన ఫలితాలతో మెదడు వ్యాధులకు కొత్త చికిత్సలు రావచ్చు

జీవన్మరణాల మధ్య ఉండే రేఖ 2019లో అస్పష్టంగా మారింది.

పందులను చంపిన తర్వాత.. నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించారు.

మెదడు కణాల మరణాన్ని నిలిపివేయచ్చునని.. మెదడులోని కొన్ని అనుసంధానాలను పునరుద్ధరించవచ్చునని ఈ అధ్యయనం చూపింది.

జంతువుల శరీరం నుంచి వేరు చేసిన మెదళ్లకు.. సింథటిక్ రక్తాన్ని లయబద్ధంగా పంపించటం ద్వారా ఈ ప్రయోగం నిర్వహించారు.

మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాల్ చేస్తున్న ఈ ఆశ్చర్యకర ఫలితాలు.. మెదడు దెబ్బతినటం సహా ఇతరత్రా మెదడు వ్యాధులకు కొత్త చికిత్సలకు దారిచూపగలవు.

అయితే.. మెదడులో అవగాహన లేదా స్పృహ ఉందని సూచించే సంకేతాలేవీ కనిపించలేదు.

line

డీఎన్‌ఏ లోపాలను సరిచేసే కొత్త టెక్నాలజీ

డీఎన్ఏ

ఫొటో సోర్స్, Getty Images

ఇక.. డీఎన్‌ఏలో వ్యాధులను కలిగించే లోపాల్లో 89 శాతాన్ని సరిచేయగల కొత్త తరహా జన్యు సవరణ కూడా ముందుకొచ్చింది.

ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైమ్ ఎడిటింగ్ అని వ్యవహరిస్తున్నారు. దీనిని జన్యు సంకేతాలను సరిగ్గా పునర్లిఖించగల ''జెనిటిక్ వర్డ్ ప్రాసెసర్'' అని అభివర్ణిస్తున్నారు.

ఇది ఒక రకంగా.. కంప్యూటర్‌లో మనం మార్చాలని భావించే పదాన్ని వెదకటానికి కంట్రోల్-ఎఫ్ నొక్కి.. ఆ తర్వాత కొత్త పదాన్ని కాపీ చేయటానికి కంట్రోల్-సి, కంట్రోల్-వి (మాక్ యూజర్లయితే కమాండ్ కీ) నొక్కటం వంటిది.

మనుషుల్లో వ్యాధులు కలిగించే జన్యు పరివర్తనలు సుమారు 75,000 రకాలు ఉన్నాయి. ప్రైమ్ ఎడిటింగ్ ద్వారా.. వీటిలో ప్రతి పదిలో తొమ్మిదిని సరిచేయవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయోగశాలల్లో.. సికిల్ సెల్ అనీమియా, టే-సాచ్స్ వ్యాధి (అరుదైన ప్రాణాంతక నరాల రుగ్మత) వంటి వాటికి కారకమయ్యే నష్టదాయకమైన జన్యుపరివర్తనలను సరిచేయటానికి ఉపయోగిస్తున్నారు.

line

మెదడును చదివి, మనసులోని మాటలు వినొచ్చు

ఎలక్ట్రోడ్స్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, మెదడులో విద్యుత్ కార్యకలాపాలను ఎలక్ట్రోడ్‌లు చదువుతాయి

మనుషుల మెదళ్లను చదివి వారి ఆలోచనలను మాటలుగా మార్చగల ఒక బ్రెయిన్ ఇంప్లాంట్‌ను కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

పెదవులు, నాలుక, స్వర పేటిక, దవడలను కదిలించే విద్యుత్ సంకేతాలను పట్టుకునే ఒక ఎలక్ట్రోడ్‌ను మెదడులో చొప్పిస్తారు.

ఆ తర్వాత.. నోటిలో, గొంతులో కదలికలు విభిన్న స్వరాలను ఎలా రూపొందిస్తాయనేది అనుకరించటానికి శక్తివంతమైన కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు.

దీని ఫలితంగా.. కృత్రిమ స్వర పేటిక సమకూర్చిన మాటలు బయటకు వస్తాయి.

ఏదైనా వ్యాధి వల్ల మనుషులకు మాటలు రాని పరిస్థితుల్లో.. వారికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడగలదని శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బృందం చెప్తోంది.

line

ఈ-సిగరెట్లతో ధూమపానం మానేయవచ్చు

వేపింగ్

ఫొటో సోర్స్, Getty Images

వేపింగ్ అనేది ఈ సంవత్సరం నిశిత పరీక్షలు ఎదుర్కొంది.

అమెరికాలో ''ఈ-సిగరెట్లు లేదా వేపింగ్ ఉత్పత్తుల వినియోగంతో సంబంధమున్న ఊపిరితిత్తుల గాయాల'' వల్ల 2,400 మందికి పైగా వ్యక్తులకు ఆస్పత్రిలో చికిత్స అవసరమైంది. మరో 50 మంది చనిపోయారు కూడా.

వేపింగ్ వల్ల ఊపిరితిత్తుల్లో ప్రాణాంతక రియాక్షన్ రావటంతో ఒక టీనేజీ బాలుడు దాదాపు చనిపోయినంత పనైంది.

కానీ.. టొబాకో పొగతాగటం కన్నా వేపింగ్ సురక్షితమని నిపుణులు చెప్తూనే ఉన్నారు. ధూమపానం మానివేయటానికి వేపింగ్ సాయపడుతుందనేందుకు ఈ సంవత్సరంలో ఆధారం కూడా లభించింది.

న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరీక్షలో.. ధూమపానం చేసేవారు పొగతాగటం మానేయటానికి వేపింగ్ ఉపయోగించినపుడు.. వారిలో 18 శాతం మంది ఏడాది తర్వాత కూడా ధూమపానానికి దూరంగానే ఉన్నారని వెల్లడైంది. అదే పొగతాగటం మానివేయటానికి సంప్రదాయ నికొటిన్ ప్రత్యామ్నాయాలను ఉపయోగించిన వారిలో కేవలం 9.9 శాతం మంది మాత్రమే ఏడాది తర్వాత కూడా ధూమపానానికి దూరంగా ఉన్నారు.

line

ఆసక్తికరమైన ఇతర ముఖ్యమైన అంశాలు:

మెదడు సంకేతాలు

గర్భంలోనే ఉన్న శిశివు గుండెకు సంబంధించి అనూహ్యమైన చిత్రాలను పరిశోధకులు తీయగలిగారు.

శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మీద మీజిల్స్ (తట్టు) విధ్వంసకర ప్రభావం చూపుతుంది.. ఇన్‌ఫెక్షన్ల మీద పోరాడటం ఏళ్ల తరబడి చాలా కష్టంగా మారుతుంది.

ఆహారం తినే రుగ్మత అనోరెక్సియా నెర్వోసా మూలాలు ఆలోచనల్లోనూ, శరీరంలోనూ ఉన్నాయి. కొవ్వులు, చక్కెరలను వారు శుద్ధి చేసే విధానాన్ని మార్చివేసే మార్పులు వారి డీఎన్‌ఏలోకి చొచ్చుకుపోయి ఉంటాయి.

టూర్ డి ఫ్రాన్స్, ఇతర ప్రముఖ కార్యక్రమాల్లో 3,000 మైళ్ల పరుగును విశ్లేషించటం ద్వారా.. మనిషి శరీరం తట్టుకోగల సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు లెక్కించారు.

అరటిపండ్లు, సెనగలు, వేరుసెనగలతో కూడిన బలవర్థక ఆహారం.. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంపొందించగలదు. ఇలా చేయటం పోషకాహారం లోపించిన పిల్లల్లో పెరుగుదలకు దోహదపడుతుంది.

మనుషుల మెదడుల్లో వారి జీవితాంతం కొత్త మెదడు కణాలు తయారవుతూనే ఉంటాయని (కనీసం 97 సంవత్సరాల వరకూ) ఒక అధ్యయనం చెప్తోంది.

గుండె పోటుతో జరిగిన నష్టాన్ని బాగుచేయటానికి లక్షలాది సజీవ మూల కణాలు (స్టెమ్ సెల్స్)ను పంపించే అచ్చు సాయపడగలదు.

సాలీడు విషాన్ని ఉత్పత్తి చేయటానికి జన్యుపరంగా మెరుగుపరచిన ఒక ఫంగస్.. మలేరియాను వ్యాప్తి చేసే దోమలను పెద్ద సంఖ్యలో వేగంగా సంహరించగలదు.

మానవ కాలేయాన్ని మంచు మీద పెట్టినప్పటికన్నా.. మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతకు అతిశీతలీకరణ (సూపర్‌కూలింగ్) చేసినప్పుడు.. దానిని మార్పిడి చేయటానికి ముందు నిల్వ ఉంచగల సమయం మూడు రెట్లు పెరుగుతుంది.

ఇది ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు కానీ.. మనం తింటున్న ఆహారం ప్రతి ఏటా 1.1 కోట్ల మందిని త్వరగా సమాధుల్లోకి పంపుతోంది.

క్యాన్సర్ బలహీనతలను బట్టబయలు చేయటానికి.. దానిని ఖండఖండాలుగా వలిచిన శాస్త్రవేత్తలు.. చికిత్స కోసం కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చారు.

ఆరోగ్యవంతమైన జీవనశైలితో జీవించటం ద్వారా.. దాదాపు ప్రతి ఒక్కరూ తమకు డిమిన్షియా వచ్చే ప్రమాదాన్ని మూడో వంతు తగ్గించవచ్చు.. అది వంశపారంపర్యంగా వస్తున్నా సరే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)