CAA - NRC: భారత సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సేవలు నిలిపివేయాలని బంగ్లాదేశ్ నిర్ణయం

ఫొటో సోర్స్, OATAWA
భారత సరిహద్దు వెంబడి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న తమ భూభాగంలో మొబైల్ నెట్‌వర్క్ సేవలు నిలిపివేయాలని బంగ్లాదేశ్ తమ దేశంలోని టెలికాం సంస్థలను ఆదేశించింది.
ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా ఆగిపోతాయి.
బంగ్లాదేశ్ టెలికాం విభాగం బీటీఆర్‌సీ తరఫున ఆదివారం దేశంలోని నాలుగు టెలికాం ఆపరేటర్లకు ఓ లేఖ అందింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సేవలు నిలిపివేయాలని అందులో బీటీఆర్‌సీ సూచించింది.
అయితే, బంగ్లాదేశ్ టెలికాం మంత్రి ముస్తఫా జబ్బార్‌ను ఈ విషయంపై బీబీసీ వివరణ కోరగా తమ శాఖ నుంచి అలాంటి ఆదేశాలేవీ జారీ కాలేదని ఆయన తెలిపారు.
''ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీటీఆర్‌సీకి ఆదేశాలు ఇచ్చింది. బీటీఆర్‌సీ ఏం ఆదేశాలిచ్చిందన్నది, ఆ సంస్థే చెప్పగలదు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టెలికాం సంస్థలకు లేఖ పంపిన విషయం వాస్తవమేనని బీటీఆర్‌సీ అధ్యక్షుడు జహూరూల్ హక్ బీబీసీతో చెప్పారు.
''ఉన్నత స్థాయి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో కొంత అసంతృప్తికర వాతావరణం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే, ప్రభుత్వం ఈ నియంత్రణ చర్యలు తీసుకుని ఉంటుంది. ఇప్పటికైతే మేం ఏమీ చేయలేదు. ఏం చేయాలన్నదాని గురించి, సమాలోచనలు కొనసాగుతున్నాయి'' అని జహూరూల్ హక్ అన్నారు.
భారత ఎన్ఆర్‌సీ గురించి అసంతృప్తి, వదంతులు వ్యాపించకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
''సరిహద్దు ప్రాంతంలో ఇటువైపు వార్తలు అటూ, అటువైపువి ఇటూ వ్యాపిస్తూ ఉంటాయి. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేయొచ్చన్న సమాచారం ప్రభుత్వానికి అంది ఉండొచ్చు. నిఘా వర్గాల నివేదికలు కూడా అదే చెబుతున్నాయి. అందుకే, ఈ విషయంలో ఏం చేయొచ్చనేది బీటీఆర్‌సీకి ప్రభుత్వం చెప్పింది'' అని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏర్పడే భిన్నమైన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
''మొబైల్ సేవలు ఆగిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ విషయం గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడైతే దీన్ని పరీక్షిస్తున్నాం. గందరగోళం ఏమీ ఉండదంటే ఏ చర్యలూ ఉండకపోవచ్చు'' అని జహూరూల్ హక్ అన్నారు.
''ఒకవేళ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే, ఆయా ప్రాంతాల్లో మొబైల్ టవర్లను నిలిపివేస్తాం. మా సాంకేతిక బృందం ఈ విషయం గురించి పరిశోధన చేస్తోంది'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ చట్టం: ‘వాస్తవాలకు అతీతంగా వ్యతిరేకతలు.. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్న మేధావులు’ - అభిప్రాయం
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- ప్రియాంకా గాంధీ: 'ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నా గొంతు పట్టుకున్నారు.. నాతో గొడవపడ్డారు'
- ఆపరేషన్ చేస్తుండగా పేషెంట్‌కు అంటుకున్న మంటలు
- CAA-NRC: ‘మేము 'బై చాన్స్' ఇండియన్స్ కాదు, 'బై చాయిస్’ ఇండియన్స్’ - మౌలానా మహమూద్ మదనీ
- పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు: యూపీ ముస్లింలలో భయాందోళనలకు కారణాలేమిటి
- నీళ్ళ లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు...
- అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటులో మోదీ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









