పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనలు: ఉత్తర్ ప్రదేశ్ ముస్లింలలో భయాందోళనలకు కారణాలేమిటి?

మొహమ్మద్ రయీస్ తల్లిదండ్రులు
ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ రయీస్ తల్లిదండ్రులు
    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనలతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. డిసెంబరు 20 నుంచి యూపీ ఆందోళనల్లో 19 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఇంత పెద్దయెత్తున హింసాత్మకంగా నిరసనలు జరగడానికి కారణాలేమిటి? బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే రాష్ట్రంలో పర్యటించి అందిస్తున్న కథనం..

కాన్పూర్ నగరంలోని ఇరుకు సందుల్లో మొహమ్మద్ షరీఫ్ ఇల్లు ఉంది.

అదో చిన్న ఇల్లు. అంతా ఒకే గది. నేను వెళ్లినప్పుడు షరీఫ్ ఇంటి బయట కూర్చుని ఉన్నారు. నేను కలిశాక ఆయన లేచి నిలబడి నన్ను హత్తుకుని ఏడ్చేశారు. కొన్ని నిమిషాలు మా మాధ్య మాటల్లేవు.

"నేను సర్వం కోల్పోయా. నాకు బతకాలని లేదు. నా కొడుకు ఏం తప్పుచేశాడు? పోలీసులు వాణ్ని ఎందుకు కాల్చారు" అని ఆయన పొంగుకొస్తున్న దుఃఖాన్ని అతికష్టమ్మీద ఆపుకొంటూ అడిగారు.

కాన్పూర్‌లో ఆందోళనకారులపై తుపాకీ గురిపెట్టిన పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాన్పూర్‌లో ఆందోళనకారులపై తుపాకీ గురిపెట్టిన పోలీసులు (డిసెంబరు 21)

పోలీసు కాల్పుల్లో షరీఫ్ కొడుకు మొహమ్మద్ రయీస్‌ కడుపులో గాయమైంది. మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఆయన డిసెంబరు 23న చనిపోయారు. రయీస్ వయసు 30 ఏళ్లు.

"నా కొడుకు నిరసనల్లో కూడా పాల్గొనలేదు. అతడు వీధుల్లో తిరుగుతూ వస్తువులు అమ్ముకొనేవాడు(హాకర్). అనుకోకుండా అక్కడ ఉన్నాడు. ఒకవేళ అతడు నిరసనల్లో పాల్గొన్నా, అతన్ని చంపడం సరైనదేనా" అని షరీఫ్ ప్రశ్నించారు.

"మేం ముస్లింలం అయినందునే అతడు చనిపోయాడా? మేం ఈ దేశ పౌరులం కాదా? నేను చచ్చే వరకు ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటా" అని ఆయన చెప్పారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిలో రయీస్‌పై కాల్పులు జరిగిన ఆందోళన ఒకటి.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో కొన్ని హింసాత్మకంగా మారాయి. రాళ్లు రువ్వే నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు జరిగాయి.

ఒక్క యూపీలోనే ఇలాంటి ఘటనల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులపై పోలీసులు అవసరానికి మించి బలప్రయోగం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులకు సీఏఏ పౌరసత్వం కల్పిస్తుందని, ముస్లింలపై వివక్ష చూపుతుందని పౌర హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల వల్ల భారత్‌కు వచ్చిన మైనారిటీలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారు.

మరోవైపు నాలుగు కోట్ల మందికి పైగా ముస్లింలున్న యూపీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై 'ప్రతీకారం' ఉంటుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆందోళనకారులు కలిగించిన నష్టానికి పరిహారంగా వారి ఆస్తులను జప్తు చేస్తామని ఆయన హెచ్చరించారు.

లక్నోలో దహనమైన బస్సు
ఫొటో క్యాప్షన్, లక్నోలో దహనమైన బస్సు

ముఖ్యమంత్రి ఆదేశానుసారం పొలీసులు చర్యలు చేపడుతున్నారు. పలువురిని 'వాంటెడ్' వ్యక్తులుగా గుర్తించి, కాన్పూర్ అంతటా పోస్టర్లు అతికించారు. వీరిలో అత్యధికులు ముస్లింలు.

ఈ పరిణామాలతో ముస్లింలలో భయాందోళన నెలకొంది. బాబూపూర్వ ప్రాంతంలో నేను అనేక మంది మహిళలను కలిసి మాట్లాడాను. అరెస్టులు, చిత్రహింసల భయంతో వేరే నగరాలకు పారిపోవాలని తమ భర్తలు, కొడుకులు నిర్ణయించుకొన్నారని వారు చెప్పారు. ఇలా వెళ్లిపోవాలనుకొంటున్న మగపిల్లల్లో కొందరి వయసు పదేళ్లలోపేనని తెలిపారు.

జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) అంశంతో ఇక్కడి ముస్లింలలో ఆందోళన రెట్టింపవుతోంది.

ఎన్‌ఆర్‌సీ చేపడితే ప్రజలు భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని కాన్పూర్‌లో రాజకీయ నాయకుడు, ముస్లిం సమాజ ప్రతినిధి అయిన నసీరుద్దీన్ చెప్పారు.

"ఉదాహరణకు హిందూ కుటుంబం, ముస్లిం కుటుంబం రెండూ పౌరసత్వాన్ని నిరూపించుకోవడంలో విఫలమయ్యాయని అనుకోండి. సీఏఏతో హిందూ కుటుంబం పౌరసత్వం పొందవచ్చు. కానీ ముస్లిం కుటుంబానికి పౌరసత్వం తొలగిస్తారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

సమీప భవిష్యత్తులో ఎన్‌ఆర్‌సీని చేపట్టే ప్రణాళికలేవీ లేవని ప్రభుత్వం చెబుతోంది. అయితే పౌరసత్వాన్ని నిరూపించుకొనేందుకు అవసరమైన పత్రాలను తాము సమర్పించలేకపోవచ్చని ముస్లిం కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

కాన్పూర్‌లో పోలీసులు అతికించిన 'వాంటెడ్' జాబితా

ఫొటో సోర్స్, Anshul Verma

ఫొటో క్యాప్షన్, కాన్పూర్‌లో పోలీసులు అతికించిన 'వాంటెడ్' జాబితా

రాష్ట్రంలోని ముస్లింలు భయపడుతున్నారని, పాలక బీజేపీపై వాళ్లకు నమ్మకం లేదని నసీరుద్దీన్ వ్యాఖ్యానించారు.

"మేం ఏ తప్పు చేశాం. ఇది ప్రజాస్వామ్య దేశం. మనం అంగీకరించనిదానిపై నిరసన తెలిపే హక్కు మనకు ఉంది. కానీ మమ్మల్ని రక్షించాల్సినవాడే మాకు ప్రమాదకారిగా మారాడు. మేం ఇక ఎక్కడికి పోవాలి" అని వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని ఒక మహిళ ఆక్రోశం వ్యక్తంచేశారు.

కాన్పూర్‌లో వివిధ వీధుల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. మగవారు, మగపిల్లలు చాలా తక్కువగా తారసపడ్డారు. చాలా చోట్ల మహిళలు బృందాలుగా కనిపిస్తున్నారు. ఎవరైనా తమను ప్రశ్నిస్తే బాధను చెప్పకోవచ్చు అనే ఎదురుచూపులు వారిలో కనిపించాయి.

పోలీసులు రాత్రి వేళ తమ ప్రాంతానికి వచ్చి మగవారినందరినీ అరెస్టు చేస్తామని చెప్పారని, నిరసనల్లో పాల్గొంటున్నవారి వివరాలు చెప్పాలని అడిగారని మరో మహిళ ముందుకొచ్చి నాతో అన్నారు. ఆమె కూడా తన పేరు రాయొద్దని కోరారు.

ముస్లింలలో భయాందోళనకు వారికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా కారణమే. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తరహాలో భారత్‌లోనూ ముస్లింల ప్రయాణంపై ఆంక్షలు విధించాలని యోగి లోగడ చెప్పారు. ముస్లింలలో మగవారు హిందూ మహిళలను బలవంతంగా మతం మార్పిస్తున్నారని ఆరోపించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే మిలిటంట్ హఫీజ్ సయీద్‌తో పోల్చారు.

ప్రధాని మోదీ దుందుడుకు హిందూ జాతీయవాదాన్ని సీఎం యోగి అనుసరిస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు.

ఈ భావజాలానికి ఉత్తర్‌ప్రదేశ్ ప్రయోగశాలగా మారిందని నసీరుద్దీన్ వ్యాఖ్యానించారు.

చాలా ప్రాంతాల్లో అల్లర్ల నియంత్రణ బృందాలను మోహరించారు

ఫొటో సోర్స్, Anshul Verma

ఫొటో క్యాప్షన్, చాలా ప్రాంతాల్లో అల్లర్ల నియంత్రణ బృందాలను మోహరించారు

సీఏఏ ఆందోళనల నేపథ్యంలో యూపీ వ్యాప్తంగా వేల మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికులు ముస్లింలే. ఇక్కడ రోజుల తరబడి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

మాజీ పోలీసు ఉన్నతాధికారి సహా అనేక మంది ప్రముఖ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. కాన్పూర్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళ ఇళ్లను, కార్లను పోలీసులు ధ్వంసం చేస్తున్నారనే వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలాంటి ఆరోపణలు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వచ్చినట్లు బీబీసీ ప్రతినిధులు అందించిన వార్తాకథనాలు చెబుతున్నాయి.

కాన్పూర్‌కు దాదాపు 580 కిలోమీటర్ల దూరాన ఉన్న ముజఫర్‌నగర్లోని పలు చోట్ల ముస్లింల ఇళ్లను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయని బీబీసీ ప్రతినిధి యోగితా లిమయే చెప్పారు. ఓ ఇంట్లో అయితే టీవీ, ఫ్రిజ్, వంట సామగ్రి సహా అన్నింటినీ పోలీసులు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

తమను పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టారని తనతో పలువురు మగవారు, మగపిల్లలు చెప్పారని యోగిత తన కథనంలో తెలిపారు.

పశ్చిమ యూపీలోని మేరఠ్, బిజ్నౌర్‌ నగరాల్లోనూ పోలీసులు క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయని బీబీసీ మరో ప్రతినిధి జుబేర్ అహ్మద్ అందించిన కథనం చెబుతోంది.

ఈ ప్రాంతాల్లో తూటా గాయాలతో కనీసం ఎనిమిది మంది చనిపోయారు. వాళ్లను పోలీసులే కాల్చారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు.

ఈ ఘటనల్లో సారూప్యాలు ఉన్నాయి. అవేంటంటే- మొదట వ్యక్తులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడం, తర్వాత ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి పూట కార్లు, ఇళ్లు ధ్వంసం కావడం.

పోలీసులు తమను నిర్బంధంలోకి తీసుకొని కొట్టారని కొందరు మైనర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Varun Nayar

ఫొటో క్యాప్షన్, పోలీసులు తమను నిర్బంధంలోకి తీసుకొని కొట్టారని కొందరు మైనర్లు చెబుతున్నారు.

ఈ ఆరోపణలను యూపీ శాంతిభద్రతల పోలీసు ఉన్నతాధికారి పీవీ రామశాస్త్రి తోసిపుచ్చారు.

ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినవారిని అరెస్టు చేస్తున్నామని ఆయన చెప్పారు. బాధ్యులను డిజిటల్ ఆధారాలను బట్టి గుర్తిస్తున్నామన్నారు.

వీడియోల ప్రాతిపదికగా నిరసనకారులపై శరవేగంగా చర్యలు చేపడుతున్న పోలీసు యంత్రాంగం, పోలీసు అధికారులను మాత్రం ఎందుకు ఉపేక్షిస్తోందని ప్రశ్నించగా- ఆరోపణలు ఎవరైనా చేయొచ్చని రామశాస్త్రి బదులిచ్చారు.

ఏ ఆస్తులనూ పోలీసులు ధ్వంసం చేయలేదని ఆయన చెప్పారు. పోలీసులు విధ్వంసానికి పాల్పడుతున్నట్లున్న ఒక వీడియోను ఆయనకు చూపించగా, ఎక్కడో పోస్ట్ చేసిన ఒక వీడియోను తీసుకొచ్చి, దానిని పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలంటే సరిపోదని వ్యాఖ్యానించారు.

ముజఫర్‌నగర్లో పోలీసులు ధ్వంసం చేశారని చెబుతున్న ఒక ముస్లిం కుటుంబ ఇల్లు

ఫొటో సోర్స్, Varun Nayar

ఫొటో క్యాప్షన్, ముజఫర్‌నగర్లో పోలీసులు ధ్వంసం చేశారని చెబుతున్న ఒక ముస్లిం కుటుంబం ఇల్లు
పోలీసులు కార్లు ధ్వంసం చేశారని కాన్పూర్లో స్థానికులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Anshul Verma

ఫొటో క్యాప్షన్, పోలీసులు కార్లు ధ్వంసం చేశారని కాన్పూర్లో స్థానికులు చెబుతున్నారు

యూపీ ఆందోళనల్లో 19 మంది మరణాల్లో పోలీసుల పాత్ర లేదని, దీనిపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.

ఈ మరణాలకు పోలీసులను జవాబుదారీ చేయాలని సామాజిక కార్యకర్త సుమైయా రాణా డిమాండ్ చేశారు.

"హింస పరిష్కారం కాదు. ఇది పోలీసులు, నిరసనకారులు రెండు పక్షాలకూ వర్తిస్తుంది" అని ఆమె వ్యాఖ్యానించారు. హింసకు పాల్పడినవారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని, అయితే నిరసనకారులపై కాల్పులు జరపడమొక్కటే పోలీసులకున్న మార్గమా అని ప్రశ్నించారు.

చాలా మంది చనిపోయారని, నిష్పాక్షిక విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆందోళనల్లో ఆహుతైన పోలీసుల వాహనం

ఫొటో సోర్స్, Anshul Verma

ఫొటో క్యాప్షన్, ఆందోళనల్లో ఆహుతైన పోలీసుల వాహనం

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే కొందరు పోలీసులతో నేను మాట్లాడాను. తాము తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నామని తెలిపారు. ఎలాగైనా నిరసనకారులను నియంత్రించాలని తమకు ఆదేశాలు వచ్చాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు వెల్లడించారు.

"మేం లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. సొంత పౌరులపై బలం ప్రయోగించడం తేలిక కాదు. పోలీసుల పరిస్థితి అడకెత్తెరలో పోకచెక్కలా ఉందనే విషయాన్ని గుర్తించాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆందోళనలకు కారణం నువ్వంటే నువ్వంటూ రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకొంటున్నాయి.

ముస్లిం యువతను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, అందుకే ఆందోళనలు హింసాత్మంగా మారాయని పాలక బీజేపీ ఆరోపిస్తోంది.

"మూడేళ్ల క్రితం మేం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలను బాగా కాపాడుతున్నాం. కానీ ఈసారి రాజకీయాల వల్ల హింస చోటుచేసుకొంది. పౌరసత్వ సవరణ చట్టం గురించి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు అయోమయం కలిగిస్తున్నాయి. ఆ పార్టీలే ఆందోళనలకు పథకం వేశాయి, నిరసనకారులను ఉసిగొల్పాయి" అని యూపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ బీబీసీతో చెప్పారు.

"సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదు, నిజానికి ఇది ఏ మతానికీ వ్యతిరేకం కాదు. కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరి కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. విమర్శను మేం స్వాగతిస్తాం. కానీ ఎవ్వరూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకూడదు" అని ఆయన పేర్కొన్నారు.

హింసకు విపక్షాలే కారణమని యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఆరోపించారు.
ఫొటో క్యాప్షన్, హింసకు విపక్షాలే కారణమని యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఆరోపించారు.

మృతుల్లో అత్యధికులు ముస్లింలే.

ఎవరి మరణమైనా విచారకరమని, అయితే రాష్ట్రంలో జరిగినదానికి విపక్షాలే బాధ్యులని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొట్టిపారేశారు.

ఆయా వ్యక్తులపై ఎవరు కాల్పులు జరిపారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. హింసను నివారించే చర్యలను పోలీసులు ఎందుకు చేపట్టలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.

"ఆరోపణలు చేయడం తేలిక. రాష్ట్రంలో శాంతి పరిరక్షణలో బీజేపీ వైఫల్యాన్ని సీఏఏ ఆందోళనలు సూచిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, ఉద్యోగాల లేమి లాంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ సీఏఏను తీసుకొచ్చింది. మత ప్రాతిపదికన వాళ్లు రాష్ట్రాన్ని చీల్చాలనుకుంటున్నారు" అని అఖిలేష్ విమర్శించారు.

అఖిలేష్ యాదవ్
ఫొటో క్యాప్షన్, అఖిలేష్ యాదవ్

"రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి ముఖ్యమంత్రి, ఆయన హిందుత్వ అజెండానే కారణం. పోలీసులు వ్యవహరించిన తీరును చూసి ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలి. కనీస మానవ హక్కులు కూడా లేకుండా చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి, దేశానికి ప్రమాదకరం" అని ఆయన వ్యాఖ్యానించారు.

సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన, సమాధానాలు ఇవ్వాల్సిన పక్షాలన్నీ పరస్పరం నిందించుకోవడానికే పరిమితమయ్యాయని సామాజిక కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు.

"ఒక పెద్ద రాష్ట్రంలో 19 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ నిరసనకు మూల్యం మరణం కాజాలదు" అని సుమైయా రాణా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)