2020లో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది? సవాళ్లకు పరిష్కారం లభిస్తుందా?

నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, NArendra Modi/Facebook

ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ అయిన భారతదేశం 4.5 శాతం రేటుతో వృద్ధి చెందుతోంది. ఆరేళ్లలో ఇది అతి తక్కువ వృద్ధి రేటు.

ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుండవచ్చునని 2019 చివరి నెలలో భారత పార్లమెంటుకు ఆర్థికమంత్రి విస్పష్టంగా చెప్పారు. అయితే మాంద్యం ప్రమాదం లేదన్నారు.

ఈ సంవత్సరం ముగిసి 2020లోకి అడుగుపెడుతున్న తరుణంలో.. ప్రభుత్వం ఎదుర్కొంటున్న కీలక ఆర్థిక సవాళ్లు ఏమిటి?

ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడినప్పుడు అది సామాజిక, రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని ఆర్థికవేత్తల్లో ఏకాభిప్రాయం ఉంది.

ప్రస్తుతం ఇండియాకు అనేక సవాళ్లున్నాయి: మందకొడిగా సాగుతున్న ఆర్థికవ్యవస్థ, అత్యధిక నిరుద్యోగిత, తీవ్ర ద్రవ్య లోటు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఆరంభంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేటపుడు.. ప్రస్తుత ఆందోళనలను పరిష్కరించటం కోసం విధానాలను రూపొందించటంలో, పాత వాటిని సమీక్షించటంలో ఈ అంశాలన్నిటినీ గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

నరేంద్రమోదీ, నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

వృద్ధి మందగమనం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది సవాళ్లతో కూడిన సంవత్సరంగానే ఉంది. దాని పర్యవసానాలు భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపాయి. మూడో త్రైమాసిక వృద్ధి 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు మార్కెట్ అంచనాల కన్నా తక్కువకు పడిపోవటం ఇది వరుసగా ఆరో త్రైమాసికం.

భారత వృద్ధి రేటు ఆరేళ్లలో అత్యల్పంగా నమోదైంది. ప్రైవేటు వినిమయం, పెట్టుబడులతో పాటు ఎగుమతులు కూడా గట్టిగా దెబ్బతిన్నాయి. భారత జీడీపీలో 60 శాతంగా ఉండే దేశీయ వినిమయం ఆందోళనకర అంశంగా ఉంది.

భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను 2019లో అనూహ్యంగా ఐదు సార్లు తగ్గించింది. అయితే దాని ప్రభావం ఇంకా కనిపించాల్సి ఉంది. ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. అవి సరిపోవకపోవచ్చునని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

భారతదేశం ఆర్థిక మందగమనంలో ఉందని చెప్పిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.. 2020లో భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తామని చెప్పటం ద్వారా ప్రమాద ఘంటికలు మోగించింది. ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేలా చేసి, వ్యయం పెరిగేలా చేయటానికి.. ఆర్‌బీఐ ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మీద ఒక కన్ను వేస్తూనే వడ్డీ రేట్లను ఇంకా తగ్గించేందుకు అవకాశం ఉందని ఐఎంఎఫ్ సలహా ఇచ్చింది.

వడ్డీ రేట్లను తగ్గించే వెసులుబాటు ఆర్‌బీఐకి ఉండి ఉండొచ్చునని ఆర్థికవేత్త వివేక్ కౌల్ అంగీకరిస్తున్నారు. అయితే.. అలా తగ్గించిన వడ్డీ రేట్ల ''బదిలీ అత్యంత కీలకం'' అంటారాయన. ''పదే పదే తగ్గించిన వడ్డీ రేట్లను బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేసి తీరాలి. ఇలా జరుగుతుందని ఆర్‌బీఐ ఆశించింది కానీ అలా జరగలేదు'' అని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

ద్రవ్యలోటును పరిష్కరించటానికి, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు తీసుకురావటానికి ప్రభుత్వం కృషి చేయవచ్చు. ఆ చర్యలు ''నిర్ణయం తీసుకోవటంలో వాణిజ్య దృష్టి మరింతగా పెరగటం, బాధ్యతను పెంచే విధంగా వీటి దిశ ఉండాలి'' అని ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రణిల్ సల్గాడో చెప్పారు.

ప్రభుత్వం ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించటం, కార్పొరేట్ పన్నులు తగ్గించటం వంటి చర్యలు చేపట్టిందని.. కానీ అవి సరిపోవని ప్రఫెసర్ అరుణ్‌కుమార్ అంటారు. ''ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించినా కూడా.. పెట్టుబడి రేట్లు పడిపోయాయి. వాణిజ్య రుణం 88 శాతం క్షీణించి 10 శాతానికి పడిపోయింది. అది భారీ పతనం. వినియోగదారులు అతి తక్కువగా రుణాలు తీసుకుంటున్నారు'' అని ఆయన వివరించారు.

ప్రభుత్వం కార్పొరేట్ రంగం మీద భారాన్ని తగ్గించటానికి బదులు.. దిగువ స్థాయిలో కొనుగోలు శక్తిని పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. ''మొత్తం పెట్టుబడుల్లో 5 శాతం కన్నా తక్కువగా ఉన్న విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడే బదులు.. బయటి నుంచి పెట్టుబడులు తెచ్చుకోవటానికి ప్రయత్నించటం కన్నా.. దేశీయ మార్కెట్‌లో పెట్టుబడులను పెంచాల్సిన అవసరముంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఈ సమస్యని పరిష్కరించటానికి.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం రూ. 100 లక్షల కోట్లకు పైగా వ్యయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా కాలం ఫలితమిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే.. ఇది సాఫీగా జరుగుతుందా? ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఎటువంటి అదనపు ప్రయోజనాలను ప్రకటిస్తారు? అనేది చూడాల్సి ఉంది.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

నిరుద్యోగం మీద పోరాటం

భారతదేశపు నిరుద్యోగిత రేటు 45 సంవత్సరాల గరిష్టానికి పెరిగిందని 2019 మే నెలలో ప్రభుత్వం అంగీకరించింది. నిరుద్యోగిత 2017 జూలై నుంచి 2018 జూన్ మధ్య 6.1 శాతంగా ఉందని చెప్పింది. పట్టణ యువతలో 7.8 శాతం మందికి ఉద్యోగాలు లేవు.

''ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నపుడు.. రాజకీయ, సామాజిక రంగాలు కూడా ప్రభావితమవుతాయి. నిరుద్యోగిత సమస్య రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయంగా ప్రభావం చూపించవచ్చు'' అని ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

భారతదేశంలో ఉపాధిలో 94 శాతంగా ఉంటూ.. దేశీయ స్థూల ఉత్పత్తిలో 45 శాతం వాటా ఉండే అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన భావిస్తున్నారు.

అయితే.. ఈ అసంఘటిత రంగానికి సంబంధించిన గణాంకాలు ప్రభుత్వానికి నివేదించకపోవటం అతి పెద్ద సవాలు. ఈ లెక్కలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వస్తాయి. కాబట్టి.. సంఘటిత రంగం వృద్ధి రేటుతో సమానంగా అసంఘటిత రంగం కూడా వృద్ధి చెందుతున్నట్లు అంచనా వేస్తారు.

నిరుద్యోగం

కానీ వాస్తవంలో భారత వృద్ధి రేటు అధికారికంగా చెప్తున్న దానికన్నా ఇంకా తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ అభిప్రాయం. పెద్ద నోట్ల రద్దు అనంతర ప్రభావాలు మూడేళ్ల తర్వాత కూడా ఈ రంగం మీద కనిపిస్తున్నాయి. దానివల్ల ఉద్యోగాల నష్టం తీవ్రంగా ఉంది. ప్రభుత్వ చర్యలు.. ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ రంగానికి చేరలేదు.

ఆర్థికవేత్త వివేక్ కౌల్.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి మరింత విశ్లేషణ అందిస్తున్నారు.

''ఆర్థిక అభివృద్ధి చరిత్రను చూస్తే.. చాలా దేశాలు తమ శ్రామిక శక్తిని వ్యవసాయం నుంచి నిర్మాణ రంగానికి బదలాయించగలిగాయి. ఎందుకంటే.. నిర్మాణ రంగం తక్కువ నైపుణ్యం, మధ్యమ స్థాయి నైపుణ్యం గల ఉద్యోగాలను విస్తారంగా సృష్టిస్తుంది. ఇది భారతదేశంలో జరగటం లేదు. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం - నిర్మాణ రంగం - చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది'' అని ఆయన చెప్పారు.

నిర్మాణ రంగంలో వృద్ధి పదేళ్లలో 12.8 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయింది. వృద్ధిలో ఈ రంగం వాటా కూడా 13.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిపోయింది.

ప్రభుత్వం 2020లో చేపట్టదగ్గ చర్యల్లో.. మరింతగా ప్రభుత్వ పెట్టుబడులు పెట్టటం, గ్రామీణ మౌలికసదుపాయాలు, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులు అందించటం ఒకటని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. పెట్టుబడుల వల్ల అనివార్యంగా మరిన్ని ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుంది.

ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం దాదాపు ఆరేళ్ల గరిష్టానికి పెరిగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ డిసెంబర్ 16న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఉల్లిపాయల ధరలు మార్చి నుంచి 400 శాతం పెరిగాయి. అక్టోబర్‌లో 4.62 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం కూరగాయల ధరల్లో పెరుగుదల ఫలితంగా నవంబర్‌లో 5.54 శాతానికి పెరిగింది. ఇది మూడేళ్లలో గరిష్టం.

అయితే.. ఆహార ధరల పెరుగుదలకు ప్రధానంగా.. రుతుపవనాల ఆలస్యం, కొన్ని ప్రాంతాల్లో కరవు వంటి సహజ అంశాలే కారణమని.. దానివల్ల సాధారణ సరఫరా క్రమం ప్రభావితమైందని నిపుణులు చెప్తున్నారు.

2019లో రుతుపవనాలు సాధారణంగా లేవు. అవి మామూలుగా ఉన్నట్లయితే ధరలను తగ్గించటానికి దోహదపడేవి. ఇరవై ఏళ్లలో అత్యధిక వర్షపాతాన్ని కూడా ఈ ఏడాదే చవిచూసింది. దానివల్ల వేసవి పంటలు దెబ్బతినటంతో పాటు, శీతాకాలం పంటలు ఆలస్యమయ్యాయి.

అయితే.. ఈ పరిస్థితి వచ్చే కొన్ని నెలల్లో మెరుగుపడే అవకాశం ఉందని.. రబీ పంట మార్కెట్‌లోకి రావటంతో ధరలు స్థిరీకృతమవుతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

అయినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నిశితంగా గమనిస్తుండటం ముఖ్యం. ఎందుకంటే.. ఆహార ధరల్లో ఎటువంటి అస్థిరత అయినా ఆర్‌బై ద్రవ్య విధానం మీద నేరుగా ప్రభావం చూపుతుంది. దానివల్ల.. వినియోగదారుల వ్యయం పెంచటం కోసం ఆర్‌బీఐకి వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే వెసులుబాటు తగ్గిపోతుంది.

ఆర్థిక వృద్ధి మందగిస్తున్నా కానీ డిసెంబర్ నెలలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను సవరించకపోవటం పట్ల చాలా మంది నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వడ్డీ రేట్లను ఇంకా తగ్గించటానికి వెసులుబాటు ఉందని ఆర్‌బీఐ అంగీకరించినప్పటికీ.. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం గురించిన ఆందోళన కూడా వ్యక్తంచేసింది.

పెద్ద నోట్ల రద్దు

ద్రవ్య లోటు

కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన ఇతర సవాళ్లలో.. ప్రస్తుత ద్రవ్య లోటుకు సంబంధించిన ఆందోళలను పరిష్కరించటం ఒకటి.

2019లో పన్ను వసూళ్లు అంచనాలకన్నా తక్కువగా ఉన్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2019 అక్టోబర్ నాటికి భారతదేశ ద్రవ్య లోటు రూ. 7.2 ట్రిలియన్లు - అంటే 7.2 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 1.45 లక్షల కోట్ల ఆదాయం సృష్టించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలపై.. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం మరింత ప్రభావం చూపుతుంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ వ్యయం రూ. 28 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఆర్‌బీఐ 2019 ఆగస్టులో ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్లు అందించినప్పటికీ లోటులోనే ఉంది. చివరికి తేలుతున్నదేమిటంటే.. ప్రభుత్వం మరింతగా డబ్బులు ఆర్జించాల్సిన అవసరముంది.

దీనిని పరిష్కరించటానికి.. ప్రస్తుతమున్న పన్ను వ్యవస్థని సమీక్షించటం ఒక మార్గమని నిపుణులు చెప్తున్నారు.

''సంపన్నుల మీద పన్నులు పెంచాలి'' అనేది ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ సూచన. నిజానికి.. ఈ అంశంతో పాటు, అనేక ఇతర చర్యలు కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. అధిక ఆదాయ వర్గంలో ఉన్నవారికి కొత్త పన్ను రేట్లు నిర్ణయించే వెసులుబాటు గురించి, కార్పొరేట్ పన్నులు తగ్గించినట్లుగానే వ్యక్తిగత ఆదాయ పన్నును తగ్గించటం గురించి పరిశీలిస్తోంది.

ద్రవ్యలోటు

ఫొటో సోర్స్, Getty Images

ఇలా సేకరించిన డబ్బును రైతులకు సాయం చేయటం కోసం, వృద్ధిని పెంపొందించటం కోసం, ఉపాధి అవకాశాలు కల్పించటం కోసం గ్రామీణ రంగానికి సరఫరా చేయాలని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇబ్బందికర పరిస్తితుల్లో ఉన్నప్పటికీ.. జీఎస్‌టీ రేట్లను పెంచకపోవటం గమనార్హం. మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఇటీవల ఎన్‌డీటీవీ చానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. ''ఒకవైపు జీఎస్‌టీ రేట్లు పెంచి.. మరొకవైపు ఆదాయపన్నులు తగ్గించటం గురించి ఆలోచించజాలం. జీఎస్‌టీ రేట్లు పెరిగితే వినిమయం మీద ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది'' అని చెప్పారు.

''జనం చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉండేలా చేయటానికి వేగవంతమైన మార్గం.. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించటం'' అంటారు ఆర్థికవేత్త వివేక్ కౌల్. అయితే.. పన్నులు వసూలు చేయాలనే ఒత్తిడి కారణంగా.. పౌరులను పన్ను అధికారులు వేధించరాదని ఆయన పేర్కొన్నారు.

పన్నుల పరిధికి అతీతంగా కౌల్ మరొక సూచన చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన బలంగా చెప్తున్నారు. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలు ఆలస్యమయ్యాయి. దానివల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 40,000 కోట్ల లోటు ఉంటుంది.

పనితీరు సరిగా లేని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం అమ్మివేయటం చాలా కీలకమని వివేక్ కౌల్ భావిస్తున్నారు. ''ఈ పీఎస్‌యూలు పెట్టుబడులను స్వాహా చేస్తున్నాయి కానీ తగినంతగా లాభాలు అందించటం లేదు. అదనపు ఆదాయాన్ని సృష్టించుకోవటం కోసం.. ఈ పీఎస్‌యూల వినియోగంలో ఎంత భూమి ఉంది, వాటిని ద్రవ్యరూపంలోకి మార్చుకోవటం ఎలా అనేది ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించాలి'' అని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్

ఫొటో సోర్స్, AFP

భారతదేశం 2018 వరకూ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2016లో త్రైమాసిక వృద్ధి రేటు 9.4 శాతానికి పెరిగింది. ప్రస్తుతం.. 2020 ఆశాజనకంగా ఉందని ఆర్థికవేత్తలు భావించటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలు ఏమంతగా ప్రభావం చూపలేదు.

ఆర్థికవ్యవస్థ ఇప్పటికీ.. 2016 నాటి నోట్ల రద్దు, తదనంతరం జీఎస్‌టీ అమలులోకి తెచ్చిన ప్రభావాల్లో కొట్టుమిట్టాడుతోందని.. పైగా ప్రపంచ ఆర్థిక వాతావరణం కూడా ఏమాత్రం సాయపడలేదని నిపుణులు చెప్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 20వ తేదీన అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సదస్సులో మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థను తన ప్రభుత్వం క్రమశిక్షణలో పెట్టిందని.. 2025 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగటానికి పునాదులు వేసిందని చెప్పారు.

కానీ.. దానిని సాధించే దిశగా భారతదేశం పయనిస్తోందా? ''ప్రభుత్వం సమస్యను అంగీకరించాల్సిన అవసరముంది. అప్పుడు మాత్రమే పరిస్థితి మెరుగుపడుతుంది'' అని వివేక్ కైల్ ముక్తాయించారు.

మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి జవాబులు, ప్రణాళికలు 2020 బడ్జెట్‌లో ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)