జొమాటో, పేటీఎం వంటి భారత 'యూనికార్న్'లు మరీ శక్తిమంతంగా ఎదుగుతున్నాయా? - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోనే 'యూనికార్న్'లు చెప్పుకోదగ్గస్థాయిలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ సందర్భంలో యూనికార్న్ అంటే ఒంటికొమ్ముతో ఉండే కల్పిత జంతువు కాదు, వంద కోట్ల డాలర్లకు పైగా విలువ (వాల్యుయేషన్) ఉన్న అన్‌లిస్టెడ్ కంపెనీ.
దిల్లీకి చెందిన టెక్నాలజీ విధాన పరిశోధకురాలు స్మృతి పర్షీరా- భారత యూనికార్న్‌ల విజయగాథ, భారత ఈ-కామర్స్ విధానాలతో వీటి ప్రస్థానం ఎలా ముడిపడి ఉందనే విషయాన్ని ఈ వ్యాసంలో చర్చిస్తున్నారు.
'యూనికార్న్' అనే మాటను వ్యాపార వ్యవహారంలో తొలిసారిగా 2013లో వెంచర్ క్యాపిటలిస్ట్, కౌబాయ్ వెంచర్స్ సంస్థ వ్యవస్థాపకురాలు అయిలీన్ లీ వాడారు. ఒక బిలియన్ డాలర్ కంపెనీని నిర్మించేందుకు అవకాశాలు చాలా తక్కువని, ఇందులో విజయవంతం కావడం అంటే 'యూనికార్న్'ను చూసినట్లేనని అర్థంలో ఆమె ఈ మాటను ప్రయోగించారు.
అమెరికాలో 2003 నుంచి 2013 మధ్య యూనికార్న్ హోదాను కేవలం 39 కంపెనీలే అందుకోగలిగాయని అయిలీన్ లీ గుర్తించారు.
అనలిటిక్స్ సంస్థ సీబీ ఇన్‌సైట్స్ గణాంకాల ప్రకారం- ఇప్పుడు అంతర్జాతీయంగా దాదాపు 418 యూనికార్న్‌లు ఉండగా, వీటిలో 18 భారత్‌కు చెందినవి. ఇందులో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, బ్రిటన్ ఉన్నాయి.
ప్రపంచంలోని మొత్తం యూనికార్న్‌లలో 25 శాతానికిపైగా కంపెనీలు ఈ ఏడాదే ఈ హోదాను దక్కించుకున్నాయి. వీటిలో ఐదు భారత కంపెనీలు.

ఫొటో సోర్స్, Getty Images
తమ ముందు తరం వాళ్లకు మంచి కార్పొరేట్ కెరీర్‌లాగా, ఆ ముందు తరానికి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం లాగా నేటి తరానికి 'స్టార్టప్' రంగం కనిపిస్తోంది.
స్టార్టప్‌ను విజయవంతంగా నడిపిస్తే ఇబ్బడిముబ్బడిగా సంపద వచ్చి పడుతుంది. దీంతోపాటు అదే స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఈ రంగంపై ఇతర సంస్థల ప్రాబల్యం, పరపతి కూడా ప్రభావం చూపిస్తాయి.
యూనికార్న్‌లలో వెయ్యి కోట్ల డాలర్లకు పైగా విలువ ఉన్న కంపెనీలను 'డెకాకార్న్స్' అంటారు. భారత యూనికార్న్‌ల జాబితాలో రెండు డెకాకార్న్‌లు- పేటీఎం బ్రాండ్ పేరుతో డిజిటల్ వ్యాలెట్ సేవలు అందించే వన్ 97 కమ్యూనికేషన్స్, బడ్జెట్ హోటళ్ల అగ్రిగేటర్ ఓయో రూమ్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఓయో రూమ్స్ 18 దేశాల్లో 800కు పైగా నగరాల్లో వ్యాపారం నిర్వహిస్తోందని చెబుతున్నారు.
యూనికార్న్‌ల జాబితాలోని ఇతర ప్రముఖ సంస్థల్లో - ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా క్యాబ్స్, ఆహార సరఫరా, రేటింగ్ సంస్థ జొమాటో, ఆన్‌లైన్ అభ్యాస వేదిక బైజూస్ లాంటి సంస్థలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
భారత యూనికార్న్‌లలో అత్యధికం ఇంటర్నెట్ ఆధారిత, వినియోగదారులతో నేరుగా వ్యవహరించే వ్యాపారాలు చేస్తున్నాయి. కొన్ని ఇందుకు భిన్నమైనవి. ఉదాహరణకు గోల్డ్‌మన్ సాక్స్, అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ మద్దతుతో నడిచే సౌర, పవన విద్యుత్ సంస్థ 'రిన్యూ పవర్'. అలాగే పార్సిల్ సేవల సంస్థ 'డెలివరీ'. 2019లో భారత తొలి యూనికార్న్ 'డెలివెరీ'యే.
2018లో ఒకప్పటి భారత ప్రముఖ యూనికార్న్, ఈ-వాణిజ్యం వేదిక అయిన ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ 16 వేల కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద అక్విజిషన్ ఇదే.
ఈ విలువలో ఎక్కువ భాగం ఫ్లిప్‌కార్ట్ ప్రధాన పెట్టుబడిదారులైన జపాన్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్, అమెరికా కేంద్రంగా పనిచేసే టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, అసెల్ పార్ట్‌నర్న్స్‌కు వెళ్లింది. ఈ సంస్థలు, సెక్వోయా క్యాపిటల్, చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ లాంటి భారీ సంస్థలు చాలా భారత యూనికార్న్‌లలో ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి.
భారత స్టార్టప్‌లపై ఈ భారీ సంస్థల ప్రభావం గురించి అజయ్ షా, అవిరూప్ బోస్, నేను కలిసి రాసిన ఒక పరిశోధన పత్రంలో చర్చించాం. ఇలా పెట్టుబడిదారుల మద్దతుతో డిస్కౌంటింగ్, వ్యయాలు అధికంగా ఉండే నమూనాలో నడిచే ఈ స్టార్టప్ వ్యాపారాలు దీర్ఘకాలం విజయవంతంగా నడవగలవా అనే సందేహాలూ ఉన్నాయి.
భారత స్టార్టప్‌లకు పెట్టుబడులు గణనీయంగా విదేశీ సంస్థల నుంచే వస్తాయి. దీనివల్ల కంపెనీ వ్యూహాలు, వ్యవహారాలపై వాటికే ఎక్కువ నియంత్రణ ఉంటుంది. అయితే స్టార్టప్‌ల వ్యవస్థాపకులు భారతీయులైనందున, దేశీయ యాజమాన్యం ఉన్నందున, ఈ సంస్థలు భారత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహారిస్తాయనే భావనా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇదే సమయంలో ఈ వ్యాపార సంస్థల ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా విధాన రూపకల్పనలో.
ఉదాహరణకు జాతీయ ఈ-వాణిజ్యం విధానం ముసాయిదా రూపొందించడానికి గత సంవత్సరం ప్రభుత్వం ఒక మేధో బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలని 16 ఈ-కామర్స్ కంపెనీలకు ఆహ్వానం వెళ్లింది. భారీగా అంతర్జాతీయ పెట్టుబడులున్న భారత యూనికార్న్‌లు, ఇతర స్వదేశీ యూనికార్న్‌లు ఇందులో ఉన్నాయి.
ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. వ్యాపార పోటీకి సంబంధించిన చట్టాలు, నిబంధనల్లో తేవాల్సిన సమగ్రమైన సంస్కరణలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రధాన అధ్యయన అంశాల్లో కొత్త మార్కెట్లు, బిగ్ డేటా ఉన్నాయి.
ఈ అంశాలపై చర్చలకు కేవలం ఐదు భారత యూనికార్న్‌లకే ఆహ్వానం లభించింది. వీటికన్నా చిన్నస్థాయి స్టార్టప్‌లుగాని, భారీ అంతర్జాతీయ సంస్థలుగాని ఈ చర్చల్లో నేరుగా పాల్గొనలేదు.
బాగా స్థిరపడిపోయిన కొన్ని కంపెనీల సమూహం సంబంధిత రంగం మొత్తం ప్రయోజనాల కోసం కృషి చేస్తుందనుకోవడం సరికాదు. ఈ వైఖరి తప్పుడు ఫలితాలను ఇస్తుంది.
అలాగే ఈ-వాణిజ్య రంగంలో అనాలోచిత నియంత్రణలకు పూనుకొనేందుకు ఇతర లాబీయింగ్ గ్రూప్‌ల తీవ్రమైన ఒత్తిడి ప్రాతిపదిక కారాదు.
నిన్నటి కొత్త వ్యాపారాలే కాలక్రమంలో ఎదిగి నేటి భారీ సంస్థలు అయ్యాయి. అదే సమయంలో- ఈ సంస్థలు వీటి ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసే ఆస్కారంపైనా ఆందోళనలు పెరిగాయి.
ఓలా, స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ వ్యాపార సంస్థలపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ముందుకు వచ్చాయి. ఇప్పటివరకైతే ఈ కేసుల్లో పోటీతత్వానికి విరుద్ధమైన వ్యవహారాలు జరిగాయనే నిర్ధరణ ఏదీ సీసీఐ చేయలేదు. కానీ ఈ రంగం నుంచి ఫిర్యాదుల తాకిడి మాత్రం కమిషన్‌కు ఉందన్నది స్పష్టం.

ఫొటో సోర్స్, Getty Images
ఈ-కామర్స్ రంగంపై మార్కెట్ అధ్యయనం వివరాలతో మధ్యంతర నివేదికను ఒకటి సీసీఐ ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసింది. ఆన్‌లైన్ వాణిజ్య వేదికలకు వ్యతిరేకంగా వ్యాపారులు వ్యక్తంచేస్తున్న చాలా అంశాలను ఇది వెలుగులోకి తెచ్చింది.
ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అందరికీ ఒకే విధానం అనుసరించకపోవడం, పోటీయే లేకుండా చేసే దురుద్దేశంతో ధరను అతితక్కువగా నిర్ణయించడం, అనుచిత వ్యాపార ఒప్పందాలు లాంటి విమర్శలు ఇందులో ఉన్నాయి. వీటిని ఈ-వాణిజ్య సంస్థలు కొట్టిపారేస్తున్నాయి. ఈ రంగంలో గట్టి పోటీ ఉందని, తాము వినూత్న విధానాలను పాటిస్తున్నామని, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నామని వాదిస్తున్నాయి.
భారత యూనికార్న్‌ల విజయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ విలువను జోడించాయి. పెద్దయెత్తున ఉపాధి అవకాశాలను సృష్టించాయి. అంతర్జాతీయ వ్యాపార చిత్రపటంలో భారత్‌కు ప్రముఖ స్థానాన్ని కల్పించాయి. ఆవిష్కరణల సృష్టిని, వ్యాపారాల ఏర్పాటుకు ఉత్సాహాన్ని పెంచాయి.
ఈ సానుకూల పరిణామాల ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే సమయంలో- దృఢంగా స్థిరపడిన కొన్ని భారీ కంపెనీలే భారత ఆర్థిక ప్రయోజన పరిరక్షకులని పొరబడరాదు. వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వరాదు. సాధ్యమైనన్ని ఎక్కువ సంస్థలకు, వ్యక్తులకు వ్యాపార, పెట్టుబడి అవకాశాలు, విధాన చర్చల్లో వీరందరికీ భాగస్వామ్యం ఉండాలి.
ఇవి కూడా చదవండి:
- అలీబాబా అధిపతి జాక్ మా: అపర కుబేరుడి అయిదు విజయ రహస్యాలు
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- మార్కెట్లోకి ఏడాది పాటు నిల్వ ఉండే కొత్త రకం ఆపిల్
- ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే
- హైదరాబాద్ ఎన్కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








