ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రేసులో అమెరికా కంటే చైనా ముందుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ షెర్మన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చైనా పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని, మరే దేశమూ చేయని స్థాయిలో కృషి చేస్తోందని అభిషుర్ ప్రకాశ్ అంటున్నారు. భౌగోళిక రాజకీయాలపై ఏఐ చూపే ప్రభావం గురించి ఆయన కొన్ని పుస్తకాలు రాశారు.
ఏఐ సాంకేతికతలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఈ రంగంలోని స్టార్టప్ సంస్థలకు చైనా బిలియన్ల కొద్దీ నిధులను సమకూర్చుతోంది. డేటా విధానాలను మెరుగుపరుచుకుని, విదేశాల్లో ఉన్న పరిశోధకులను ఆకర్షించే కార్యక్రమాలను ప్రారంభించింది.
వార్తలు చదివే రోబోలను ఆవిష్కరించింది. విదేశాంగ వ్యూహాలకూ ఏఐతో పదును పెడుతోంది.
అయితే, సైనికపరంగా ఏఐను వినియోగించుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నేళ్లుగా చైనా నుంచి వచ్చే పెట్టుబడుల పర్యవేక్షణను చైనా కఠినతరం చేసింది. కొన్ని చైనీస్ సంస్థలతో వ్యాపారం చేయకుండా అమెరికా సంస్థలకు ఆంక్షలు విధించింది. టెక్నాలజీ దోపిడీపై విచారణలను కూడా పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘భౌగోళిక రాజకీయ శక్తిని ఈ యుగం పునర్నిర్వచించగలదని అమెరికాకు తెలుసు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు సంకేతాలు’’ అని ప్రకాశ్ అన్నారు.
టోరంటోలోని సెంటర్ ఫర్ ఇన్నొవేటింగ్ ద ఫ్యూచర్ సంస్థలో ప్రకాశ్ పనిచేస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. అయితే, అమెరికా చర్యల వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికన్ మైక్రో చిప్‌ల వంటివి చైనాకు చేరకుండా చేస్తే, ఆ దేశం ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకుంటుందని అంటున్నారు.
ట్రంప్ ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై బిలియన్ల డాలర్ల కొద్దీ సుంకాలు విధిస్తోంది. చైనా అనుసరిస్తున్న ‘అన్యాయమైన’ విధానాలకు ప్రతిగా ఇలా వ్యవహరిస్తోంది.
చైనా భాగస్వామ్య సంస్థలతో బంధాలను సమీక్షించుకోవాలని అమెరికన్ యూనివర్సిటీలపై వైట్ హౌస్ ఒత్తిడి తెస్తోంది. విద్యార్థి వీసాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు కూడా చేసింది. చైనాలో అమెరికా పెట్టుబడులపైనా కొన్ని నిబంధనలు తెచ్చే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఒకప్పుడు ఇది ఊహకు కూడా అందని విషయం.

భవిష్యత్తులో ఆర్థిక, సైనిక శక్తి సామర్థ్యాలను శాసించగల సామర్థ్యమున్న సాంకేతికతలపై తమ నాయకత్వాన్ని పరిరక్షించుకోవాలని అమెరికా ఈ చర్యలు తీసుకుంటోంది.
‘‘మా దేశం స్థాయికి చైనా ఆర్థిక వ్యవస్థ ఎదగడం తప్పకపోవచ్చేమో. అది జరిగేందుకు స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా దోహదపడాలా, వద్దా అన్నది మన చేతుల్లో ఉన్న నిర్ణయం’’ అని అమెరికా రక్షణ శాఖ అధికారులు 2018లో ఓ నివేదికలో అభిప్రాయపడ్డారు.
మెషీన్ లెర్నింగ్, ఫేషియల్ రికగ్నిషన్, ఇతర ఏఐ సాంకేతికతలను సొమ్ము చేసుకునేందుకు అమెరికా, చైనా ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని కార్నెగీ మెలన్‌లోని రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థాపకుడు టామ్ మిచెల్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘టెక్ సంస్థల స్థాపనలో అమెరికాకు చాలా అనుభవం ఉండొచ్చు. కానీ, ఏఐ అప్లికేషన్స్, బిగ్ డేటా సెట్స్‌లో చైనాకు మెరుగైన అవకాశాలున్నాయి’’ అని మిచెల్ చెప్పారు. వైద్య రంగాన్ని ఇందుకు ఉదాహరణగా చూపించారు.
‘‘20 ఏళ్లుగా అమెరికాలో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులు ఉన్నాయి. అయినా, వాటన్నింటినీ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌తో కలపలేకపోయాం. గోప్యత పరమైన అంశాలు అమెరికాను ఆపుతున్నాయి’’ అని అన్నారు.
‘‘కానీ, చైనాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ఉండాలా, వద్దా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకుంటే, అది జరిగిపోతుంది’’ అని మిచెల్ అభిప్రాయపడ్డారు.
గత ఏడాది అమెరికాలో చైనా పెట్టుబడులు 4.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2011 తర్వాత ఇదే అత్యంత కనిష్ఠం. చైనాలో అమెరికా పెట్టుబడులు కూడా 14 బిలియన్ డాలర్ల నుంచి 13 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి.
రోడియం గ్రూప్ వార్షిక నివేదికలో ఈ సమాచారం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో సంబంధాల విషయంలో అమెరికన్ యూనివర్సిటీలు పునరాలోచనలో పడుతున్నాయి. చైనాలో వ్యాపారం చేసే అమెరికా సంస్థలు కూడా ఆచితూచి వ్యవహరించడం పెరిగింది.
‘‘చైనాలో ఉన్న అవకాశాలను చాలా పాశ్చాత్య దేశాలు ఉపయోగించుకుంటున్నా, ప్రస్తుత పరిస్థితులు చర్చల స్వరూపాన్ని మార్చివేశాయి. భౌగోళిక రాజకీయాలే ఇప్పుడు ప్రధానాంశంగా మారాయి’’ అని ప్రకాశ్ అన్నారు.
ఏఐ అంశాల్లో పరస్పర ప్రయోజనకరమైన వాటిని, పోటీకి ఆస్కారమిచ్చేవాటిని విధానకర్తలు వేరు చేసి చూడగలగాలని ప్రొఫెసర్ మిచెల్ అన్నారు.
అమెరికా జాతీయవాద వైఖరి పెరుగుతుండటం వల్ల విదేశీ విద్యార్థులు, పరిశోధకులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీలో అమెరికా నాయకత్వం వహించే స్థాయికి చేరుకోవడంలో చైనా పరిశోధకుల పాత్ర కూడా ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టెక్నాలజీ దోపిడీ విషయంలో అమెరికా చేస్తున్న వాదన సబబుగానే ఉన్నా, అతిగా స్పందిస్తున్నట్లుగా తనకు అనిపిస్తోందని మిచెల్ అభిప్రాయపడ్డారు.
‘‘ఏఐ టెక్నాలజీలో నాయకత్వం వహించాలని ఏ దేశమైనా నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. అందులో విమర్శించాల్సిందేముంది’’ అని అన్నారు.
‘‘పెట్టుబడులను ప్రోత్సహించడం, వలస విధానాన్ని సంస్కరించడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం కష్టమైన పనులు. రాజకీయ ప్రయోజనం కోసం చైనా పట్ల కఠినంగా వ్యవహరించడం సులభం. ఇది మన కాలిని మనమే తుపాకీతో కాల్చుకోవడం లాంటిది’’ అని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషన్ స్టడీస్‌కు చెందిన విలియం కార్టర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా, చైనాల టెక్నాలజీ రేసు మిగతా దేశాలకూ పాకుతోంది. రెండు దేశాల సంస్థలు పోటీపడుతున్న తరుణంలో ఏ దేశ పక్షం వహించాలో నిర్ణయించుకోవాలన్న ఒత్తిడి వాటిపై పెరుగుతోంది.
చైనా సంస్థ హువావేకు చెందిన పరికరాలు వాడొద్దని అమెరికా ఇప్పటికే తన మిత్ర దేశాలకు సూచించింది. ఆ పరికరాలను చైనా హ్యాకింగ్‌కు ఉపయోగించుకోవచ్చని ఆందోళనలు వ్యక్తం చేసింది. మానవహక్కులకు సంబంధించి కూడా అభ్యంతరాలు లేవనెత్తింది.
చైనాలోని టెక్ సంస్థలు ఓ రకంగా అక్కడి పాలక కమ్యూనిస్టు పార్టీ సంస్థలే అని ఇటీవల ఓ సదస్సులో అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘చైనా ప్రభుత్వం సొంతదేశంలో సాగిస్తున్న అణిచివేతలో, అంతర్జాతీయంగా ప్రయోజనాలను నేరవేర్చడంలో ఆ సంస్థలు పూర్తిగా మునిగిపోయాయి’’ అని అన్నారు.
‘‘ఏఐ సాంకేతికతలు.. నిఘా, గోప్యత, భావప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలకు కారణమవుతున్నాయి. దేశాల మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి’’ అని వాషింగ్టన్‌లోని ఓ మేధో సంస్థకు చెందిన నికోలస్ రైట్ అన్నారు.
‘‘కొంతవరకూ ఇది సహజంగా తలెత్తే సవాలే. కొత్త సాంకేతికతలు వస్తున్నప్పుడు, మొదటగా అందిపుచ్చుకున్నవారికి లాభం ఉంటుంది. అలాగే వాటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
- డిజిటల్ డ్రెస్... ఓ భర్త తన భార్య కోసం దీన్ని దాదాపు 7 లక్షలకు కొన్నారు
- రోబో చేతి మద్యం తాగాలంటే ఆ బార్‌కు వెళ్లాల్సిందే
- అతిపెద్ద డంప్ యార్డ్ పాతికేళ్ల ముందే నిండిపోయింది
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
- రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించిన రోబో చేయి
- భూమి మీద నివసించిన అతి పెద్ద కోతి రహస్యాలు
- యోని గురించి మీరు తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








