బ్రెజిల్ దీవులు: ఒకప్పుడు కరడుగట్టిన నేరస్థుల కారాగారం... నేడు పర్యటకుల స్వర్గధామం

- రచయిత, అనా టెర్రా అథైడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రెజిల్‌లోని తెల్లని ఇసుక బీచ్‌లు, పచ్చని అడవులతో కనువిందు చేస్తున్న ఫెర్నాండో డీ నోరోన్హా దీవులకు అందరూ వెళ్లలేరు.
ఇక్కడికి రావాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. కానీ, రోజుకు 420 మందిని మాత్రమే ఇక్కడ పర్యటించడానికి అనుమతిస్తారు.
బ్రెజిల్ ఈశాన్య తీరానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ 21 అందమైన ద్వీపాలు ఉన్నాయి. 1988లో ఇందులో నాలుగో వంతు ప్రాంతాన్ని జాతీయ రక్షిత సముద్ర అడవులు, అభయారణ్యాలుగా ప్రకటించారు.
ప్రధాన ద్వీపం 28.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అగ్నిపర్వత శిలలతో ఇది ఏర్పడింది. దీని చుట్టూ మరో 20 చిన్న ద్వీపాలు ఉన్నాయి.
దీనిని 16వ శతాబ్దంలో పోర్చుగీస్ నావికుడు ఫెర్నాండో డీ నోరోన్హా కనుగొన్నారు.
డచ్, పోర్చుగల్ దేశాల సైన్యాలు దీనిని తమ కేంద్రంగా ఉపయోగించాయి. క్రీ.శ. 1700లో దీనిని జైలుగా మార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
సముద్రంలో జైలు
బ్రెజిల్‌లోని భయంకర నేరస్థులను 20వ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ప్రధాన ద్వీపంలోని జైలులోనే ఉంచేవారు.
కిల్లర్స్, దొంగలు, రేపిస్టులు, రాజకీయ ఖైదీలను ఈ ద్వీపానికి శిక్షగా పంపేవారు.
"ప్రజలు దీన్నో స్వర్గంగా భావించి ఇక్కడికి వస్తారు. కానీ, ఒకప్పుడు ఈ ప్రాంతం కరుడగట్టిన నేరస్థులకు కేంద్రంగా ఉండేది.'' అని చరిత్రకారులు గ్రాజిల్ రోడ్రిగ్స్ పేర్కొన్నారు.
అయితే, ఫెర్నాండో డీ నోరోన్హాను ఇప్పటికీ ఏకాంత ప్రదేశంగానే పరిగణిస్తారు.

''1822లో పోర్చుగల్ నుంచి బ్రెజిల్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్న రెండేళ్ల తర్వాత ఈ ద్వీపం గురించి ప్రజలు తెలుసుకున్నారు.'' అని రోడ్రిగ్స్ చెప్పారు.
భూతల స్వర్గంగా పేరొందిన ఈ ద్వీపాన్ని బ్రెజిల్ రచయిత గ్యాస్టో పెనాల్వా ''ఫోరా డో ముండో'' అని పిలిచారు. ప్రపంచం వెలుపల అని దీనర్థం.
ఫెర్నాండో డీ నోరోన్హాను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. బ్రెజిలియన్ తీరంలో జనావాసంగల ఏకైక ద్వీపం కూడా ఇదే.

ఫొటో సోర్స్, Getty Images
మారుమూల ప్రాంతం
''సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ ఉన్న ఈ కాలంలో కూడా ఇది మారుమూల ప్రాంతమే'' అని రోడ్రిగ్స్ అంటారు.
ఏకాంతంగా ఉన్న ఈ ద్వీపాన్ని 18 నుంచి 20వ శతాబ్దం వరకు జైలుగా ఉపయోగించారు.
అయితే, ఆ కాలంలో సత్ప్రవర్తన ఉన్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను ఇక్కడికి పంపమని కోరే వెసులుబాటు ఉండేది. వారు జైలు బయట నివసించవచ్చు.

ఇక్కడి జైలును 1957లో మూసివేశారు. కానీ, అప్పటి వరకు అక్కడే శిక్ష అనుభవించిన కొంతమంది ఖైదీలు తిరిగి బయటి ప్రపంచంలో అడుగుపెట్టలేదు.
తమ బిడ్డలతో కలసి ఈ ద్వీపాన్నే నివాసంగా మార్చుకున్నారు.
ఫెర్నాండో డీ నోరోన్హాకు వచ్చే పర్యటకులు ఇప్పటికీ అక్కడ జైలు శిథిలాలను గమనించవచ్చు.

ఖైదీల కుటుంబాలు
డొమికో అల్వెస్ కార్డిరో, డేవిడ్ అల్వెస్ కార్డిరోలు తోబుట్టువులు. వారిద్దరు ఈ ద్వీపంలో ఉన్న అత్యంత పెద్దవాళ్లు. ఈ ద్వీపంలోనే వారు జన్మించారు.
వీరి తండ్రి 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ ద్వీపానికి ఖైదీగా వచ్చి జైలు అధికారిగా మారారు.
ద్వీపంలోని వివిధ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఖైదీలు, వారి కుటుంబాలు అనుమతి తీసుకోవలసి ఉండేది.

ఫొటో సోర్స్, Alamy
'ఇంతకంటే గొప్ప ప్రదేశం లేదు'
మైరా ఫ్లోర్ కూడా ఇక్కడే నివసిస్తారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాసేపు నడవడానికి ఆమె తీరంవైపు వచ్చారు.
ఈ ద్వీపంలో ఆస్పత్రులు లేవు. దీంతో ప్రసవానికి బ్రెజిల్‌లోని ప్రధాన ప్రాంతానికి వెళ్లాలి.
''ఇక్కడ ఉన్న కుటుంబాల్లో మాదే అత్యంత పెద్ద కుటుంబం. చాలా ఏళ్ల కిందటే మా పూర్వీకులు ఇక్కడికి వచ్చారు. సైన్యంలో పనిచేయడానికి మా అమ్మమ్మ సోదరుడు మొదటిసారి ఇక్కడికి వచ్చారు.'' అని ఆమె తెలిపారు.
కొన్నాళ్ల తరువాత మైరా అమ్మమ్మ, తాత కూడా తమ పిల్లలతో ఇక్కడకు వచ్చారు.

ఇక్కడి శాంతియుత వాతావరణాన్ని మైరా ఇష్టపడుతుంది. ''ఇక్కడ ట్రాఫిక్ ఏం ఉండదు.
వేరే ప్రాంతంలో మాదిరిగా గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కునే బాధ నాకు లేదు'' అని ఆమె చెప్పారు.
ఈ ద్వీపం అట్లాంటిక్ మహాసముద్రంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది.

ఫొటో సోర్స్, CEPEHC
నోరోన్హా చుట్టూ పచ్చ రంగులో వేడిగా ఉండే నీరు మెరుస్తూ కనిపిస్తుంది. ఇక్కడ రొయ్యలు, చేపలు, తాబేళ్లు, డాల్ఫిన్లు ఎక్కువగా ఉంటాయి.
బ్రెజిల్‌లోని అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో నోరోన్హా ఒకటి, దక్షిణ అమెరికాలో డైవింగ్, సర్ఫింగ్‌కు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా దీన్ని పరిగణిస్తారు.
''భూమిపై చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ, ఇంతకంటే అందమైన ప్రదేశం నాకు దొరకదు'' అని మైరా చెబుతారు.
ఇవి కూడా చదవండి:
- మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...
- డిజిటల్ డ్రెస్... ఓ భర్త తన భార్య కోసం దీన్ని దాదాపు 7 లక్షలకు కొన్నారు
- వొడాఫోన్ ఇండియాకు మూడు నెలల్లో రూ. 51,000 కోట్ల నష్టానికి కారణాలేమిటి?
- మా అమ్మకు వరుడు కావలెను
- అయోధ్య-రామ మందిర ఉద్యమంలో ముఖ్య పాత్రధారులు వీరే..
- సచిన్ రికార్డును బ్రేక్ చేసిన అమ్మాయి మళ్లీ అదరగొట్టింది
- విజయవాడలో స్విగ్గీ సర్వీస్ ఎందుకు ఆగిపోయింది...
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








