ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని మొక్కలు చాలా దృఢంగా ఉంటాయి. ఎంత దృఢంగా ఉంటాయంటే.. అసలు ఆక్సిజన్ లేకపోయినా బతకగలవు. అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగలవు.
ఇటువంటి మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లో చూపే అసాధారణ ప్రతిఘటనను గమనించిన శాస్త్రవేత్తలు.. ఆహార పంటలు పండించటంలో మన సామర్థ్యం మీద వాతావరణ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుంది, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎలా రూపాంతరం చెందగలవు.. అనే అంశం మీద పరిశోధనలు సాగిస్తున్నారు.
అయితే.. ఒక మొక్క మరొక మొక్క కన్నా ఎక్కువగా మనగలిగేలా దోహదం చేసేది ఏమిటి?
ఇది తెలుసుకోవటానికి వృక్ష శాస్త్రజ్ఞుడు, బీబీసీ ప్రజెంటర్ జేమ్స్ వాంగ్ ప్రయాణం మొదలుపెట్టారు. ఆ క్రమంలో.. మన భూగోళం మీద గల కొన్ని అత్యంత దృఢమైన మొక్కల గురించి ఆశ్చర్యకరమైన, వింతైన విషయాలు తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రాచీన మొక్కలు మార్స్ మీద వృద్ధి చెందగలవు
అంగారక గ్రహం అంటే మార్స్ మీద కూడా వేళ్లూనుకుని బతికేంత దృఢమైనవని తాము భావిస్తున్న రెండు రకాల మొక్కలను జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
అవి.. లిచెన్స్, సియానోబ్యాక్టీరియా. స్విట్జర్లాండ్, అంటార్కిటిక్‌ల నుంచి వీటిని సేకరించారు. భూమిని ఆక్రమించిన తొలి జీవుల్లో ఇవి కూడా కొన్ని అని భావిస్తుంటారు. అప్పటి నుంచీ జీవించి ఉన్నాయంటే ఈ జీవులు ఎంత బలమైనవో అర్థమవుతుంది.
అరుణ గ్రహం మీద ఉండే పరిస్థితులను - నిలువునా చీల్చే సౌర అణుధార్మికత, తీవ్రంగా మారిపోతుండే ఉష్ణోగ్రతలు, అత్యధిక పొడివాతావరణం, అతి తక్కువ వాయు పీడనం వంటి వాటిని పరిశోధకులు కృత్రిమంగా సృష్టించారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాచీన మొక్కలు ప్రాణాలతో ఉంటాయా అనేది పరీక్షించారు.
ఫలితంగా ఏం తేలింది? ఈ మొక్కల జాతులు కేవలం బతికి ఉండటమే కాదు.. కిరణజన్య సంయోగక్రియను, ఇతర కార్యకలాపాలను కొనసాగిస్తూ ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి కూడా.

ఫొటో సోర్స్, Getty Images
దీర్ఘాయుష్షుకు మూలం క్లోనింగ్
తూర్పు కాలిఫోర్నియాలో ఉన్న బ్రిజిల్‌కోన్ పైన్ వృక్షాన్ని భూమి మీద జీవించి ఉన్న వృక్షాల్లో అత్యంత వృద్ధ వృక్షంగా భావిస్తారు. 2012లో ఆ వృక్షం వయసు 5,062 సంవత్సరాలుగా గుర్తించారు.
అంతకన్నా అచ్చెరువొందించే దీర్ఘాయుష్షును సాధించటానికి కొన్ని చెట్లకు.. తమ కొమ్మల మీద ఒక కిటుకు ఉంది. అదే క్లోనింగ్.
అవును. అవి తమను తాము క్లోన్ చేసుకుంటాయి. అలా క్లోన్ కాలనీలను ఏర్పాటు చేసుకుని జీవిస్తాయి. ఒకే మూలంతో (వేరుతో) అనుసంధానమై ఉండే జన్యుపరంగా సారూప్యత కలిగిన చెట్లు అవి.
ఈ క్లోన్ కాలనీలు వేల సంవత్సరాలు మనుగడ సాధించగలవు. అమెరికాలోని యుటా రాష్ట్రంలో గల పాండో కాలనీ వయసు 80,000 సంవత్సరాలని అంచనా. కాలిఫోర్నియాలోని జురుపా ఓక్ కూడా 13,000 సంవత్సరాలుగా జీవిస్తున్నట్లు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'సజీవ శిలల'తో మరింత సమర్థమైన పంటలు
లిథోప్స్‌ను 'సజీవ శిలలు' అని కూడా అంటారు. అలా ఎందుకంటారో అర్థం కావాలంటే వాటిని చూడాల్సిందే. అవి ప్రాణులుగా కన్నా గులకరాళ్ల మాదిరిగా కనిపిస్తాయి.
కానీ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉండే ఈ అద్భుత జీవులు.. నిజానికి మారువేషంలో ఉన్న మొక్కలు. మరింత సమర్థమైన పంటలకు దారి చూపే రహస్యం వీటిలో ఉండొచ్చు.
అతి తీవ్రమైన ఎడారి వాతావరణంలో, రాతి ప్రదేశాల్లో ఈ మొక్కలు మనగలవు. తమను తినేయకుండా రాళ్లలో రాళ్లుగా కనిపిస్తూ మారువేషంలో దాక్కుంటాయి.
ఈ లిథోప్స్ ఎక్కువగా నేల కింద పెరుగుతాయి. అయితే.. సూర్యకాంతిని స్వీకరించటానికి పారదర్శకమైన పై పొర వీటికి ఉంటుంది. అలా స్వీకరించే సూర్యకాంతిని ఇవి శక్తిగా మార్చుకుంటాయి.
భూమి మీద ప్రకాశవంతమైన వెలుగును, నేల కింద తక్కువ వెలుగును - రెండిటినీ ఉపయోగించుకోగల ఈ లిథోప్స్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటే.. భవిష్యత్తులో మరింత సమర్థమైన పంటలను అభివృద్ధి చేయవచ్చునని పరిశోధకులు ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పుతో.. కాఫీ స్థానంలో కొకోవా రావచ్చు
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. మన సాధారణ కాఫీ గింజలను అంతమొందించేలా ఉన్నాయి. అయితే కాఫీ స్థానాన్ని భర్తీ చేయటానికి అంతకన్నా దృఢమైన మొక్క సిద్ధంగా ఉంది. అది కొకోవా.
వేడి వాతావరణంలో అరబికా కాఫీ రకపు మొక్క ఎంత కష్టపడుతోందో.. ఇటీవలి కాలంలో సెంట్రల్ అమెరికాలో కాఫీ తోటలను నేలమట్టం చేస్తున్న ఆకు తెగులుకు ఎంతగా గురవుతోందో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో నమోదుచేశారు.
ఉష్ణోగ్రతలు పెరుగుతోంటే.. దిగువ ప్రాంతాల్లోని తోటలు నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేయటం కష్టంగా మారుతోంది. ఫలితంగా వేలాది మంది ప్రజల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతోంది.
దీంతో నికరాగువా, హోండూరస్, ఎల్ సాల్వెడార్‌లలోని రైతులు ఇప్పటికే కాఫీ బదులు కొకోవా సాగులోకి మారుతున్నారు. వేడి వాతావరణాల్లోనూ వృద్ధి చెందే బలమైన పంట ఇది.
మరికొన్ని సంవత్సరాల్లో మీ ఉదయం కాఫీ స్థానంలో హాట్ చాకొలేట్ వచ్చి చేరినా ఆశ్చర్యం అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చెట్లు కార్చిచ్చుతో వ్యాపిస్తాయి
యూకలిప్టస్ చెట్లు కేవలం దృఢమైనవే కాదు.. ప్రమాదకరం కూడా కాగలవు.
పైరోఫైటెస్ అనే వృక్ష జాతికి చెందిన చెట్లు ఇవి. పైరోఫైటెస్ అంటే ప్రాచీన గ్రీకు భాషలో అర్థం 'అగ్ని మొక్క'. ఈ మొక్కలు అగ్నిని తట్టుకునేలా రూపాంతరం చెందాయి. ఇంకా చెప్పాలంటే తాము విస్తరించటానికి, మనుగడ సాగించటానికి ఈ చెట్లకు మంటలు కూడా అవసరం.
సహజసిద్ధంగా మంటలు పుట్టించే ఈ చెట్లు.. మండే స్వభావమున్న నూనెలు, జిగుర్లను ఉత్పత్తి చేస్తాయి. ఎండుటాకులు, బెరళ్లను రాలుస్తాయి. అవి చాలా సులభంగా భీకరమైన కార్చిచ్చులను రాజేయగలవు.
అగ్గి రేగినపుడు యూకలిప్టస్ వంటి చెట్లు, కొన్ని రకాల దేవదారు (పైన్) చెట్లు వృద్ధి చెందుతాయి.
ఆ అగ్నిగుండం నుంచి వెలువడే వేడి.. ఈ చెట్ల బీజ కోశాలను ఉత్తేజితం చేస్తుంది. మంటల్లో కాలిపోయిన నేల నుంచి పునరుజ్జీవనం కోసం ఇతర మొక్కలు తంటాలు పడుతుంటే.. అదే నేల నుంచి ఈ చెట్లు కొత్త మొలకలు వేస్తూ పెరుగుతాయి.
పైగా.. పెద్ద వృక్షాలు చాలా వరకూ కాలిపోవటం వల్ల.. అడవి నేల మీద దొరికే అదనపు వెలుతురును ఈ కొత్త మొలకలు అందిపుచ్చుకునే వీలు కలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అణుధార్మిక పరిస్థితులకూ అనుగుణంగా మారే మొక్కలు
అణుధార్మికత.. జీవ కణాలను ధ్వంసం చేస్తుంది. డీఎన్‌ఏను దెబ్బతీస్తుంది. కాబట్టి ఏదైనా అణు ప్రమాదం జరిగిన తర్వాత మొక్కలు బతికి బట్టకట్టటం అసాధ్యమని మీరు భావించవచ్చు.
కానీ.. ఎల్లప్పుడూ అలాగే జరగదని.. 1986 నాటి చెర్నోబిల్ విషాదం ప్రభావాల మీద పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
జనపనార, సోయా చిక్కుడుతో ప్రయోగాలు చేసి.. కలుషిత వాతావరణంలోనూ వికసించేలా ఈ మొక్కలు తమ జీవనిర్మాణాన్ని రూపాంతరం చేసుకోగలవని గుర్తించారు.
అణుధార్మిక ప్రమాదాలను తట్టుకోగలిగే ఈ సామర్థ్యం.. భూమి మీద చాలా అధిక అణుధార్మిక స్థాయులు ఉన్న లక్షల సంవత్సరాల కిందటే అభివృద్ధి చెంది ఉండవచ్చునని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
32,000 సంవత్సరాలు మనుగడ సాగించిన గింజలు
ఎంతో కాలం కిందట అంతరించిపోయిన ఒక జీవికి రష్యా పరిశోధకులు మళ్లీ ప్రాణం పోశారు. ఒక ఉడుత 32,000 సంవత్సరాల కిందట నేలలో పాతిపెట్టిన గింజలను ఉపయోగించి వారు దీనిని సాధ్యం చేశారు.
శీతల వాతావరణంలో ఉండగల ఓ పూల మొక్క సైలెన్స్ స్టెనోఫిలా. మంచు యుగానికి చెందిన ఈ మొక్క ఆనవాళ్లు సైబీరియాలో ఘనీభవించిన నది ఒడ్డున లభించాయి.
శాస్త్రవేత్తలు ఆ గింజల నుంచి కణజాలాన్ని సేకరించి, దానిని ఉపయోగించి కొత్త మొక్కలను పుట్టించారు. అవి ఇక తమకు తాముగా పునరుత్పత్తి కొనసాగించాయి.
ఆర్కిటిక్ పెర్మాఫ్రాస్ట్ (శాశ్వత మంచు)లో దాగివున్న అవశేషాల నుంచి.. అంతరించిపోయిన చాలా వృక్ష జాతుల పునరుద్ధరణకు ఇది ఆరంభమని నిపుణులు ఆశిస్తున్నారు.
బీబీసీ రేడియో ప్రోగ్రామ్ 'కాస్టింగ్ ద ఎర్త్' నుంచి ఈ కథనం రూపొందింది.
ఇవి కూడా చదవండి.
- ‘12 ఏళ్లప్పుడు ఇస్లామిక్ స్టేట్ బందీగా పట్టుకుంది.. 8 మంది పురుషులకు అమ్మేసింది’
- మెషీన్లు ఆటోమేటిగ్గా మిమ్మల్ని 'ఫైర్' చేస్తే ఎలా ఉంటుంది
- ప్రధాని రేసులో చంద్రబాబు, కేసీఆర్: చరిత్ర పునరావృతం అవుతుందా?
- శ్రీలంకలో ముస్లిం వ్యతిరేక అల్లర్లు... ఉక్కుపాదంతో అణచివేస్తామన్న ప్రభుత్వం
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








