అమెరికా: 'ఈ శిలువను బహిరంగ ప్రదేశం నుంచి తొలగించండి'

శాంతి శిలువ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో బహిరంగ ప్రదేశంలో దాదాపు వందేళ్ల కిందట నెలకొల్పిన ఓ శిలువ మీద వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు బహిరంగ ప్రాంతాల్లో మత చిహ్నాల మీద తీవ్ర చర్చను రేపింది.

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ నుంచి బయలుదేరి మేరీలాండ్ రాష్ట్రంలో అత్యంత రద్దీ అయిన అంతర్రాష్ట్ర రహదారి మీదుగా 30 నిమిషాలు ప్రయాణిస్తే ఒక కూడలి దగ్గర ఓ పెద్ద శిలువ నిట్టనిలువుగా కనిపిస్తుంది.

బ్లాడెన్స్‌బర్గ్ పట్టణం శివార్లలో కనిపించే ఈ గ్రానైట్ శిలువను పీస్ క్రాస్ - అంటే 'శాంతి శిలువ'గా వ్యవహరిస్తుంటారు. నలబై అడుగుల ఎత్తున్న ఈ శిలువను 96 సంవత్సరాల కిందట.. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అక్కడ స్థాపించారు.

ఈ శిలువ మీద ఒక వివాదం ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టుకు చేరింది. ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆ శిలువను తొలగించాలని మేరీలాండ్ వాసులు ముగ్గురితో పాటు, అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కోరుతోంది.

శాంతి శిలువ

ఫొటో సోర్స్, Getty Images

రాజ్యం నుంచి చర్చిని వేరు చేస్తూ అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణలో చేర్చిన ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాజ్‌కు ఈ శిలువ విరుద్ధంగా ఉందన్నది వారి వాదన. మతపరమైన ఎటువంటి వ్యవస్థనైనా గౌరవిస్తూ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) ఎటువంటి చట్టం చేయరాదని ఆ క్లాజ్ నిర్దేశిస్తోంది.

''ఆ పట్టణం వైపు వెళుతున్నపుడు ఈ శిలువను చూస్తే క్రైస్తవ మతం అధికంగా పాటించే పట్టణానికి వెళుతున్నట్లు అనిపిస్తుంది. అది ఎంత పెద్దగా ఉంటుందంటే అర కిలోమీటరు నుంచే కనిపిస్తుంది. ధైర్యం చేసి రోడ్డు దిగి వెళ్లి పరిశీలిస్తే కానీ అది ఒక యుద్ధ స్మారకం అని తెలియదు'' అని అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ స్పెకార్డట్ వ్యాఖ్యానించారు.

ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాజ్ ప్రకారం.. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ వంటి ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే చర్చిలు నిషిద్ధం. అలాగే, ఏదైనా ఒక మతానికి అనుకూలంగా చట్టాలు చేయకూడదు.

కానీ ఈ శిలువ మీద వివాదంతో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు జూన్‌లో తీసుకున్న నిర్ణయం.. ఈ ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాజ్‌కు భవిష్యత్తులో న్యాయపరమైన భాష్యాల మీద ప్రభావం చూపగలదు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాను మరింతగా మతం, ఛాందసవాదం దిశగా తీసుకెళుతున్నారని కొందరు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆరోగ్య పరిరక్షణ కార్మికులు తమ మత విశ్వాసాలకు విరుద్ధమైన సేవలు అందించటానికి తిరస్కరించటానికి వీలుకల్పించేలా నిబంధనలు చేరుస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ అమెరికా జాతీయ ప్రార్థనా దినోత్సవమైన మే 2వ తేదీన ప్రకటించారు. దీనిని కొందరు హర్షించగా ఇంకొందరు ఖండించారు.

''మత స్వేచ్ఛను ఆయుధంగా మార్చుకోవటానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న మరో అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నమిది'' అని అమెరికన్స్ యునైటెడ్ ఫర్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్, సీఈఓ రాచెల్ లేసర్ అభివర్ణించారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఈ శాంతి శిలువ.. మేరీలాండ్ రహదారి కూడలిలో వివాదానికి మూల కారణంగానే కాదు.. మత స్వాతంత్ర్యం సూత్రం మీద సామాజిక, సాంస్కృతిక ప్రగతిశీల లౌకిక ఉద్యమాలకు - సంప్రదాయ మతానికి మధ్య పెరుగుతూ ఉన్న సంఘర్షణకు కూడా ఒక ప్రతీకగా కూడా నిలిచింది.

అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని దశబ్దాలుగా ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాజ్ న్యాయపరిధిని సుప్రీంకోర్టు గతంలో ఒక కేసులో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పాటించేవారు.

'లెమన్ టెస్ట్' అని వ్యవహరించే ఆ మార్గదర్శకాల ప్రకారం.. ప్రాధమిక లక్ష్యం లౌకికమైనదైనపుడు, అందించే సాయం మతాన్ని ప్రోత్సహించటం కానీ, నిరుత్సాహపరచటం కానీ చేయనపుడు, రాజ్యానికి - చర్చికి మధ్య అతి జోక్యం లేనపుడు మాత్రమే ప్రభుత్వం ఏదైనా మతానికి సాయం చేయవచ్చు.

అయితే, ఈ మార్గదర్శకాలు చాలా గందరగోళంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన న్యాయమూర్తి గోర్షుష్‌తో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాజ్ ప్రస్తుత న్యాయపరిధిని గణనీయంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సూచించినట్లు.. ఈ కేసులో సహాయం అందిస్తున్న బెకెట్ ఫండ్ ఫర్ రెలిజయస్ లిబర్టీ అనే సంస్థ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు.

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

ఫొటో సోర్స్, Getty Images

అంటే, మొత్తం తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మెజారిటీ సభ్యులు ఆ క్లాజ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను మార్చాలని భావిస్తున్నారు.

కానీ.. ప్రత్నామ్యాయ మార్గదర్శకాలు ఎలా ఉండాలన్న దాని మీద ఈ న్యాయమూర్తులకు ఏకీభావం ఉన్నట్లు కనిపించటం లేదు. అమెరికాలో మతానికి సంబంధించిన దృశ్యం మారుతుండటంతో న్యాయమూర్తులున్న అసందిగ్ధ పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు.

''మతంతో అనుబంధం ఉన్నట్లు చెప్తున్న వారి సంఖ్య, పూజలకు హాజరవుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు పరిశోధన చెప్తోంది. అంటే లౌకికీకరణ ఒక స్థాయిలో కొనసాగుతున్నదన్నది నిశ్చయం'' అని గుడ్‌రిచ్ పేర్కొన్నారు.

''కానీ అదే సమయంలో మత వైవిధ్యం కూడా పెరుగుతోంది. ఎక్కువమంది తమను హిందువులు, బౌద్ధులు, సిక్కులు వంటి మత మైనారిటీలుగా చెప్తున్నారు. దీనంతటివల్ల మత స్వాతంత్ర్యాలను కాపాడటం మరింత సంక్లిష్టంగా మారుతుంది. సంఘర్షణకు మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

చాలా ఏళ్లుగా మత స్వాతంత్ర్యాల మీద వివాదాలు తరచుగా కోర్టులకు చేరుతున్నాయి. ఈ కేసులు, వాటిపై తీర్పులను పరిశీలిస్తే.. ''సంప్రదాయ విశ్వాసాల పట్ల సామాజికంగా, సాంస్కృతికంగా వ్యతిరేకత పెరుగుతోంది’’ అని గుడ్‌రిచ్ చెప్పారు.

''మత స్వాతంత్ర్యం అంతకంతకూ సున్నితంగా మారుతోంది. న్యాయపరంగా చూస్తే.. మత స్వేచ్ఛకు అనుకూలంగా కోర్టులు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది'' అని తెలిపారు.

అయితే, రాజ్యానికి - చర్చికి సంబంధం ఉండరాదన్న అంశాన్ని ఇంతకుముందు ఎక్కువగా గౌరవించటం జరిగేదని, అకస్మాత్తుగా (2016 ఎన్నికల ఫలితాల అనంతరం) ఇప్పటి పరిస్థితులు తలెత్తాయని పీస్ క్రాస్ కేసులో న్యాయవాది ఒకరు ఫ్రెడ్ ఎడ్వర్డ్స్ పేర్కొన్నారు.

''ఈ శాంతి శిలువ గురించి ఎవరూ వెంటనే ఫిర్యాదు చేయలేదంటే దానర్థం అది ఎటువంటి హానీ చేయటం లేదని కాదు. చాలా మందికి అది బాగానే ఉండొచ్చు. కానీ, కొంత మంది దానివల్ల ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు'' అని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లాలో న్యాయశాస్త్రం ప్రొఫెసర్ డగ్లస్ లేకాక్ పేర్కొన్నారు.

శాంతి శిలువ

ఫొటో సోర్స్, Getty Images

''వాళ్లు మౌనంగా బాధను అనుభవిస్తారు. అందుకు కొంత కారణం.. కోర్టు కేసులు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవైతే.. చంపేస్తామనే బెదిరింపులు అది కూడా తమ పొరుగున ఉన్న మంచి క్రైస్తవుల నుంచే ఎదుర్కోవాల్సి రావచ్చుననే భయం మరో కారణం'' అని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో, చాలా మంది క్రైస్తవులు తమను తాము అణచివేతకు గురవుతున్న మైనారిటీలుగా భావిస్తున్నారని డ్రెహర్ వాదిస్తున్నారు.

ఈ శాంతి శిలువ కేసులో మౌఖిక వాదనలు ముగిసిన తర్వాత కేసులోని ఇరుపక్షాలూ తమకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్న భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ.. వైరిపక్షాలు రెంటినీ సంతృప్తపరిచే నిర్ణయానికి రావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. అంతేకాదు, ఇంతకన్నా పెద్దదైన ఎస్టాబ్లిష్‌మెంట్ క్లాజ్ అంశం ఈ కేసుతో మరింత సంక్లిష్టం కావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)