పాక్-సౌది-తుర్కియే మధ్య డిఫెన్స్ డీల్.. భారత్ కంగారు పడాల్సిన అవసరం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియేలు సుమారు ఏడాది పాటు చర్చించిన తర్వాత రక్షణ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను (డ్రాఫ్ట్‌ను) సిద్ధం చేశాయని పాకిస్తాన్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్టర్ రజా హయత్ హరాజ్ బుధవారం చెప్పారు.
గత రెండేళ్లుగా ప్రాంతీయంగా హింసాత్మక వాతావరణం పెరుగుతుందనే భయాల నేపథ్యంలో.. ఉమ్మడి భద్రతా వ్యవస్థ కోసం ఈ మూడు దేశాలు చూస్తున్నాయని అనడానికి ఇదొక నిదర్శనం కావొచ్చు.
గతేడాది సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంతో పోలిస్తే.. ఈ మూడు ప్రాంతీయ శక్తుల మధ్య కుదిరే ఒప్పందం భిన్నమైందని రజా హయత్ హరాజ్ చెప్పారు.
ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఈ మూడు దేశాల మధ్య తుది ఏకాభిప్రాయం రావాల్సి ఉందని తెలిపారు.
పాకిస్తాన్-సౌదీ అరేబియా-తుర్కియేల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఇప్పటికే ఖరారయ్యే దశలో ఉందని వార్తా సంస్థ రాయిటర్స్‌కు చెప్పారు హరాజ్.

మూడు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు వస్తోన్న మీడియా కథనాలపై గురువారం ఇస్తాంబుల్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్‌ను ప్రశ్నించగా.. చర్చలు జరిగాయని, కానీ, ఇంకెలాంటి ఒప్పందంపై సంతకం చేయలేదని అన్నారు.
''మా వద్ద ముసాయిదా ఒప్పందం ఉంది. సౌదీ అరేబియా, తుర్కియే వద్ద కూడా ముసాయిదా ఒప్పందం ఉంది. మూడు దేశాలు దీనిపై చర్చిస్తున్నాయి'' అని హరాజ్ కూడా వెల్లడించారు.
ఈ ప్రాంతంలో అపనమ్మకం వల్ల పెరుగుతోన్న సమస్యలను, విభేదాలను పరిష్కరించేందుకు అత్యంత ఎక్కువ ప్రాంతీయ సహకారం, నమ్మకం కావాల్సిన ఉందని ఫిదాన్ నొక్కి చెప్పారు.
ఈ కారణాల వల్లే, బాహ్య శక్తుల ఆధిపత్యం లేదా ఉగ్రవాదంతో యుద్ధం, అస్థిరత వంటి పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
''చివరగా.. ప్రాంతీయ దేశాలన్నీ ఏకమై భద్రతా సమస్యలపై ఒక సహకార వేదికను ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదన మావద్ద ఉంది'' అని ఫిదాన్ అన్నారు.
ప్రాంతీయ దేశాలు ఒకదానికొకటి నమ్మితే.. ఈ సమస్యలన్ని పరిష్కారమవుతాయని తెలిపారు.
''చర్చలు, సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. మేం ఎలాంటి ఒప్పందాలపై సంతకం పెట్టలేదు. అందర్ని కలుపుకుపోయే వేదిక కావాలన్నది మా అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ ఉద్దేశ్యం'' అని చెప్పారు.
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన భద్రతా ఒప్పందంలో తుర్కియే కూడా చేరాలనుకుంటున్నట్లు జనవరి 9న అమెరికా మీడియా అవుట్‌లెట్ బ్లూమ్‌బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం
అణ్వాయుధ దేశం పాకిస్తాన్‌కు, సౌదీ అరేబియాకు మధ్య గతేడాది సెప్టెంబర్‌లో ఒక రక్షణ ఒప్పందం కుదిరింది.
''పాకిస్తాన్ ప్రధానమంత్రి, సౌదీ అరేబియా యువరాజు వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. ఎలాంటి దురాక్రమణనైనా ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి. ఏ దేశంపై ఎలాంటి దురాక్రమణ జరిగినా దాన్ని రెండు దేశాలపై జరిగిందిగా భావిస్తాం'' అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
ఇది అచ్చం నాటోలోని ఆర్టికల్ 5 మాదిరే. నాటోలో తుర్కియే కూడా సభ్యదేశమే. అమెరికా తర్వాత అతిపెద్ద సైన్యం ఉన్నది దీనికే.
''తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం చాలా ఎక్కువ అని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పారు. దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో కూడా తుర్కియే ప్రయోజనాలు, సౌదీ అరేబియా, పాకిస్తాన్ ప్రయోజనాలతో సమానంగా ఉన్నాయి, అందుకే ఈ కూటమి విస్తరణ లాజికల్‌గానే ఉంది'' అని బ్లూమ్‌బర్గ్ రాసింది.
ముఖ్యంగా అమెరికా విశ్వసనీయత, నాటో విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిబద్ధత విషయంలో పలు ప్రశ్నలు రేకెత్తుతున్న సమయంలో.. ఈ ఒప్పందాన్ని తుర్కియే తన భద్రతను, సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు ఒక మార్గంగా చూస్తోంది.
అమెరికాకు ఈ మూడు దేశాలతో బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయి.
''సౌదీ అరేబియా ఆర్థికంగా బలమైనది. పాకిస్తాన్ వద్ద అణ్వాస్త్ర సామర్థ్యాలు, బాలిస్టిక్ క్షిపణులు, మానవ వనరులు ఉన్నాయి. తుర్కియేకు మిలటరీ విషయంలో అపారమైన అనుభవం, అభివృద్ధి చెందిన రక్షణ పరిశ్రమ ఉంది'' అని అంకారాకు చెందిన థింక్ ట్యాంక్ టీఈపీఏవీ స్ట్రాటజిస్ట్ నిహాత్ అలి ఓజ్కాన్ బ్లూమ్‌బర్గ్‌కు చెప్పారు.
''ఈ ప్రాంతంలో అమెరికా తన, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో... ప్రాంతీయ సంఘర్షణలతో మారుతున్న పరిణామాలు, పర్యవసనాల వల్ల స్నేహితుణ్ని, శత్రువుని గుర్తించేందుకు దేశాలు సరికొత్త మెకానిజాలను అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది'' అని ఓజ్కాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తుర్కియే ఈ ఒప్పందంలో చేరడంతో ప్రభావమెంత?
ఒకవేళ ఈ కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే సంతకాలు పెడితే.. తుర్కియే, సౌదీ అరేబియా మధ్య సంబంధాల్లో సరికొత్త దశకు స్వీకారం చుట్టనుంది. ఎందుకంటే, సున్నీ ముస్లిం ప్రపంచంలో ఆధిపత్యం కోసం ఈ రెండు ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉండేవి.
ఎన్నో ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి.. ఈ రెండు దేశాలు తమ ఆర్థిక, రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు పనిచేస్తున్నాయి.
తుర్కియే, పాకిస్తాన్‌ల మధ్య సుదీర్ఘకాలంగా బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయి.
పాక్ నౌకాదళం కోసం కొర్వెట్ యుద్ధనౌకలను తయారు చేస్తోంది తుర్కియే. డజన్ల కొద్ది పాకిస్తాన్ ఎఫ్-16లను అప్‌గ్రేడ్ చేసింది. ఇరు దేశాలతో తుర్కియే ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని పంచుకుంటోంది.
మే నెలలో పాకిస్తాన్, భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఈ మూడు దేశాల మధ్య రక్షణ చర్చలు మొదలయ్యాయి. అణ్వాయుధాలున్న రెండు దేశాల మధ్య నాలుగు రోజుల సైనిక సంఘర్షణ కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది.
పాకిస్తాన్, దాని పక్కన ఉన్న అఫ్గానిస్తాన్ మధ్య ఘర్షణలు చెలరేగాయి.
తాలిబాన్లు శత్రు మిలిటెంట్ గ్రూప్‌లకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ ఆరోపించిన తర్వాత, పలుమార్లు ఈ ఘర్షణలు రేగాయి.
ఈ ఘర్షణలను నిలిపివేసేందుకు తుర్కియే, ఖతార్‌లు మధ్యవర్తిత్వం వహించాయి. అయితే, ఇవి ఎటువంటి కచ్చితమైన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత ఆందోళనలు మరింత పెరుగుతాయా?
తుర్కియే బహిరంగంగానే భారత్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తోంది.
గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణలు జరిగినప్పుడు.. పలు భారత ప్రాంతాలపై చేసిన దాడుల్లో 300 నుంచి 400 తుర్కియే డ్రోన్లను వాడినట్లు భారత సైన్యం ఆరోపించింది.
పాకిస్తాన్ ప్రజలు తమకు సోదరుల్లాంటి వారని, వారి కోసం అల్లాను ప్రార్థిస్తానని తుర్కియే అధ్యక్షుడు ఎర్దోవాన్ ఆ సమయంలో అన్నారు. కశ్మీర్ విషయంలో తుర్కియే పాకిస్తాన్ వైపుకే నిలబడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలోకి తుర్కియే ప్రవేశించడం వల్ల భారత్‌కు ఆందోళన మరింత పెరుగుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
''తుర్కియే ఈ ఒప్పందంలోకి ప్రవేశించడం భారత ఆందోళనలను పెంచుతుంది. పాకిస్తాన్, తుర్కియేలు ఇప్పటికే బహిరంగంగానే భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాయి. భారత్‌తో లోతైన సంబంధాలున్న దేశం సౌదీ అరేబియా. అయితే, సౌదీ అరేబియా ఎంత వరకు భారత్‌కు వ్యతిరేకంగా ఉండటానికి ఒప్పుకుంటుందనేది ఇక్కడ ప్రశ్న'' అని దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ అశ్విని మహాపాత్ర అన్నారు.
''ఇది పాకిస్తాన్‌కు అనుకూలం. గతేడాది మాదిరి సైనిక చర్యలు చేపట్టే వీలు లేకుండా భారత్‌ను అడ్డుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కూటమి ఏర్పడుతోంది'' అని ప్రొఫెసర్ మహాపాత్ర చెప్పారు.
''భారత్ వ్యతిరేక శక్తులను అంతకుముందు లాగానే పెంచి పోషించగలనని, కానీ ఈ కూటమి భయంతో భారత్ ఎటువంటి సైనిక చర్య తీసుకోదని పాకిస్తాన్ భావిస్తోంది. దీని నుంచి పాకిస్తాన్ లాభపడుతుందని నేను భావిస్తున్నా. మరోవైపు, అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియా అన్నది దృష్టిలో పెట్టుకోవాలి. తుర్కియే నాటో సభ్యదేశం. అయితే, వారు ఎంత వరకు భారత్‌కు వ్యతిరేకిగా ఉంటారో చూడాల్సి ఉంది'' అని అన్నారు.
ఈ గ్రూప్‌లో ఈజిప్ట్ కూడా చేరుతుందని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
'సౌదీ-పాకిస్తాన్-తుర్కియే-ఈజిప్ట్ డిఫెన్స్ పాక్ట్, క్రైసిస్ ఇన్ వెస్ట్ ఏషియా' అనే పేరుతో 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్'లో భౌగోళిక రాజకీయ నిపుణులు సెర్గియో రెస్టెల్లి ఒక కథనం రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏర్పడబోయే ఈ కూటమి గురించి సెర్గియో రెస్టెల్లి రాస్తూ..... ''దీని పర్యవసనాలు కేవలం మధ్య ప్రాచ్యానికే పరిమితం కావు. పాకిస్తాన్ దీనిలో భాగం కావడం దక్షిణాసియా ప్రత్యర్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది'' అని అన్నారు.
‘‘మధ్యప్రాచ్య రక్షణ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ వ్యూహాత్మక స్థానాన్ని పెంచుకోవడం అనేది తప్పనిసరిగా భారత-పాకిస్తాన్ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను బలహీనపరుస్తుంది'' అని అన్నారు.
''ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టిన భారత్.. తన పశ్చిమ సముద్ర మార్గాల చుట్టూ మరింత ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది'' సెర్గియో రాశారు.
''వాణిజ్యం, చమురు సరఫరాల ద్వారా అనుసంధానమై ఉన్న హిందూ మహా సముద్రం, ఎర్ర సముద్రం, తూర్పు మధ్యధరా ప్రాంతాలు దేశాల మధ్య పోటీతో సైనిక ఘర్షణలకు వేదికలుగా మారవచ్చు. ప్రపంచ సప్లై చైన్‌లు, ఇంధన కారిడార్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఈ సమయంలో ఇది మరింత ప్రమాదకరం'' అని తెలిపారు.
'' ఈ నాలుగు దేశాలు సిద్ధాంతాలు ఒకేలా ఉండకపోవచ్చు. వాటి కలయిక పశ్చిమ, ఇజ్రాయెల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా 'నాగరికత సంఘీభావం' (వివిధ సంస్కృతులు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు కలిసిమెలసి, పరస్పర సహకారంతో ముందుకు సాగడం) అనే వాదనకు బలం చేకూరుస్తుంది. దీన్ని అందరూ అంగీకరించకపోయినా.. ప్రభుత్వేతర వ్యవస్థలకు ఊతమిచ్చి, ప్రాంతీయంగా మితవాద స్వరాలను బలహీనపరుస్తుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో సహకారాన్ని మరింత క్లిష్టతరం చేయనుంది'' అని రాశారు.
పాకిస్తాన్, భారత్ రెండింటికీ సౌదీ అరేబియా చాలా ముఖ్యమైన దేశం. గతంలో పలుమార్లు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్న పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా ఒడ్డునేసింది.
సౌదీ అరేబియా మాదిరి తుర్కియే ఎప్పుడూ పాకిస్తాన్‌కు సహాయం చేయడానికి ముందుకు వెళ్లలేదు. పాకిస్తాన్‌కు అదెంత ముఖ్యమో సౌదీ అరేబియాకు కూడా తెలుసు.
అలాగే, సౌదీ అరేబియాకు భారత్‌తో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ మాదిరి భద్రతా హామీలను సౌదీ అరేబియాకు భారత్ ఇవ్వదు.
ఆశ్చర్యకరంగా, మధ్య ప్రాచ్యంలో రెండు ముఖ్య శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. దానిలో తుర్కియే పూర్తిగా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇజ్రాయెల్ భారత్‌తో ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














