రెజా పహ్లావి: ‘రోడ్డెక్కి నిరసనలు చేయండి’ అంటూ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చిన ఈ నేత ఎవరు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, బీబీసీ న్యూస్ పర్షియన్
- హోదా, ..
ఇరాన్‌లో కరెన్సీ పతనం, ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో బహిష్కృత చివరి షా (రాజు) కుమారుడైన రెజా పహ్లావి గురువారం కొత్తగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించిన పహ్లావి ‘ఇటీవల నిరసనల్లో ప్రజలు పాల్గొనడం ‘గతంలో ఎన్నడూ లేనంతగా’ ఉందన్నారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం భయాందోళనలో ఉందని, నిరసనలను అడ్డుకోవడానికి ఇంటర్‌నెట్ నిలిపివేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని తెలిపారు.
ఇరాన్ చివరి రాజు పెద్ద కుమారుడే రెజా పహ్లావి. 1979 ఇస్లాం విప్లవం తరువాత ఆయన ప్రవాసంలో ఉంటున్నారు. మరి ఇరాన్ భవితను తీర్చిదిద్దే పాత్రను మరోసారి కోరుకుంటున్న ఈ మాజీ యువరాజు గురించి మనకేం తెలుసు?
ఇరాన్‌లోని ‘నెమలి సింహాసనాన్ని’ అధిష్ఠించడానికి రెజా పహ్లావిని చిన్నప్పటి నుంచే సిద్ధం చేశారు. 1979 విప్లవం తన తండ్రి రాచరికాన్ని తుడిచిపెట్టేసినప్పుడు ఆయన అమెరికాలో ఫైటర్ పైలట్ శిక్షణలో ఉన్నారు. విదేశాల నుంచే ఆయన తనతండ్రి మొహమ్మద్ రెజా షా పహ్లావిని చూశారు. ఒకనాడు పాశ్చాత్య దేశాల మద్దతు పొందిన షా, విప్లవం తరువాత ఆశ్రయం కోసం దేశదేశాలు తిరుగుతూ చివరకు ఈజిప్ట్‌లో క్యాన్సర్‌తో కన్నుమూశారు.
హఠాత్తుగా అధికారం పోవడం ఈ యువరాజుకు, ఆయన కుటుంబానికి సొంత దేశం లేకుండా చేసింది. కొంతమంది రాజవంశ శ్రేయోభిలాషుల సాయంపై వారు ఆధారపడాల్సి వచ్చింది.
తరువాత దశాబ్దాలలో ఆయన కుటుంబాన్ని విషాదాలు వెంటాడాయి. ఆయన తమ్ముడు, సోదరి ఆత్మహత్య చేసుకున్నారు. అలా అనేకమంది చరిత్రలో కలిసిపోయిందని భావించిన రాజవంశానికి ఆయన ఓ ప్రతీకగా నిలిచిపోయారు.
ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో ఉన్న రెజా పహ్లావి మరోసారి తన దేశ భవితను తీర్చిదిద్దే ఓ పాత్రను కోరుకుంటున్నారు.
వాషింగ్టన్ డీసీ శివార్లలో నివసిస్తున్న పహ్లావి సాధారణ జీవితం గడుపుతుంటారని, తరచూ తన భార్య యాస్మిన్‌తో కలిసి ఎటువంటి భద్రత లేకుండానే స్థానిక కేఫ్‌లకు వస్తుంటారని, ఆయన మద్దతు దారులు చెబుతుంటారు.
దారినపోయే వ్యక్తి ఒకరు 2022లో ‘‘మిమ్మల్ని మీరు ఇరాన్ నిరసనోద్యమ నేతగా భావిస్తున్నారా’’ అని ప్రశ్నించగా, పహ్లావి దంపతులిద్దరూ ‘‘మార్పు అనేది దేశం నుంచే రావాలి’’ అని ఒకేసారి బదులిచ్చారు.

కీలక మలుపు
ఇటీవలి సంవత్సరాలలో రెజా పహ్లావి సందేశం మరింత స్థిరంగా మారింది. 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలువురు సీనియర్ ఇరాన్ జనరల్స్ మరణించారు.
ఆ తర్వాత పారిస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రెజా పహ్లావి మాట్లాడుతూ, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కూలిపోతే తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపేందుకు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపడానికి 100 రోజుల ప్రణాళికనూ పంచుకున్నారాయన.
ప్రవాసంలో నేర్చుకున్న పాఠాలు, తన తండ్రి అసంపూర్ణ లక్ష్యం నుంచే తనలో ఈ కొత్త విశ్వాసం ఏర్పడిందని పహ్లావి చెప్పారు.
"ఇది గతం పునరుద్ధరణకు కాదు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రజస్వామ్య భవితను అందించడానికి సంబంధించినది’’ అని ఆయన పారిస్‌లో రిపోర్టర్లకు చెప్పారు.

ఫొటో సోర్స్, UPI/Bettmann Archive/Getty Images
రాచరిక పెంపకం
రెజా పహ్లావి 1960 అక్టోబర్‌లో టెహ్రాన్‌లో జన్మించారు. ఆయన తండ్రికి అంతకుముందున్న ఇద్దరు భార్యలకు మగ పిల్లలు పుట్టలేదు, రెజా పహ్లావినే షాకు ఏకైక కుమారుడు. ఆయన గొప్ప సౌకర్యాలతో పెరిగారు, ప్రైవేట్ మాస్టార్లు విద్య నేర్పించారు,చిన్నప్పటి నుంచే రాచరికాన్ని రక్షించడమెలాగో పహ్లావి శిక్షణ పొందారు.
ఫైటర్ పైలట్‌గా శిక్షణ పొందేందుకు 17 ఏళ్ల వయసులో ఆయనను టెక్సాస్‌కు పంపారు. కానీ ఆయన ఇరాన్‌కు తిరిగి రావడానికి ముందే విప్లవం ఆయన తండ్రి పాలనను ముగించింది.
అప్పటి నుంచి రెజా పహ్లావి అమెరికాలో నివసించారు. ఆయన పొలిటికల్ సైన్స్ చదివారు. న్యాయవాది, ఇరానియన్-అమెరికన్ అయిన యాస్మిన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నూర్, ఇమాన్, ఫరా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
‘విభజన’ వారసత్వం
ప్రవాసంలో రెజా పహ్లావి రాచరికాన్ని సమర్థించే ప్రజలకు ఒక ముఖ్యమైన చిహ్నంగా నిలిచారు.
కొంతమంది ఇరానియన్లు పహ్లావి కాలాన్ని వేగవంతమైన అభివృద్ధి, పాశ్చాత్య దేశాలతో బలమైన సంబంధాల కాలంగా గుర్తుంచుకుంటారు. మరికొందరు కఠినమైన నియంత్రణ, భయం పుట్టించే సమయంగా గుర్తుంచుకుంటారు, ముఖ్యంగా సావాక్ రహస్య పోలీసు వ్యవస్థ, ఇది ప్రతిపక్షాన్ని అణిచివేసింది. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కాలక్రమంలో రెజా పహ్లావి ప్రజాదరణ మారుతూ వచ్చింది. 1980లో, ఆయన తనను తాను షాగా ప్రకటించుకుంటూ కైరోలో ఓ ప్రతీకాత్మక పట్టాభిషేక వేడుకను నిర్వహించారు. ఇది ఆచరణాత్మక ప్రభావాన్ని చూపకపోయినా, ఆయన వర్తమాన ప్రజాస్వామ్య సంస్కరణ సందేశాన్ని బలహీనపరుస్తుందని కొంతమంది ప్రత్యర్థులు అంటున్నారు.
ఇరాన్‌లోని ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేయడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇరాన్ ఫర్ ఫ్రీ ఎలక్షన్స్‌ను 2013లో ఏర్పాటు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు అంతర్గత విభేదాలు, తక్కువ మద్దతు కారణంగా చాలావరకు విఫలమయ్యాయి.
ప్రవాసంలో ఉన్న కొన్ని ప్రతిపక్ష గ్రూపుల మాదిరిగా కాకుండా, రెజా పహ్లావి ఎప్పుడూ హింసను వ్యతిరేకించారు. మొజాహెదీన్-ఇ ఖల్క్ (ఎంఈకే) వంటి సాయుధ గ్రూపుల నుంచి కూడా ఆయన దూరంగా ఉన్నారు.
భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉండాలో ఇరానియన్లు నిర్ణయించుకోవడానికి జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ ఉండాలని, అధికార మార్పిడి శాంతియుతంగా జరగాలని రెజా పహ్లావి చాలాసార్లు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
విదేశీ వివాదం
ఇటీవలి సంవత్సరాలలో రెజా పహ్లావి ప్రాధాన్యం పొందడం పెరిగింది. 2017లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా, ‘‘రెజా షా మీ ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ప్రజలు ఆయన తాతను స్మరించారు.
పోలీసు కస్టడీలో 2022లో మహ్సా అమినీ మరణం ఇరాన్ అంతటా నిరసనలకు దారితీయడమే కాక, రెజా పహ్లావిని తిరిగి మీడియా దృష్టిలో పడ్డారు.
ఇరాన్‌లో ఎవరికివారే అన్నరీతిలో ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేయాలనే ఆయన ప్రయత్నానికి అంతర్జాతీయంగానూ ఆసక్తి వ్యక్తమైంది. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు.నాలుగు దశాబ్దాలుగా ప్రవాసంలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఆయన బలమైన సంస్థాగత వ్యవస్థను, స్వతంత్ర మీడియా వేదికను ఏర్పాటు చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు.
రెజా పహ్లావి 2023లో ఇజ్రాయెల్‌లో చేసిన వివాదాస్పద పర్యటన ప్రజాభిప్రాయాన్ని మరింతగా ధృవీకరించింది. ఆ సందర్భంగా ఆయన పహ్లావి హోలోకాస్ట్ స్మారక కార్యక్రమానికి హాజరై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. దీనిని కొంతమంది ఇరానియన్లు ఆచరణాత్మక దౌత్య ప్రయత్నంగా చూశారు. కానీ మరికొందరు దీనివల్ల ఇరాన్‌కు అరబ్, ముస్లిం మిత్రదేశాలు దూరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఇరాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత, రెజా పహ్లావి కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
పౌరులకు హాని కలిగించే దాడులకు మద్దతు ఇస్తున్నారా? అని బీబీసీ రెజా పహ్లావిని అడగగా, సాధారణ ఇరానియన్లు లక్ష్యం కాదని, ఇరాన్‌లోని చాలామంది ప్రస్తుత ప్రభుత్వాన్ని బలహీనపరిచే దేనినైనా స్వాగతిస్తారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ఫొటో సోర్స్, Getty Images
అలిఖిత భవిత
రెజా పహ్లావి తనను తాను రాజు కావడానికి ఎదురుచూస్తున్న వ్యక్తిగా కాకుండా, దేశ ఐక్యతకు చిహ్నంగా చూపుతున్నారు.
ఇరాన్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలు, చట్ట పాలన, మహిళలకు సమాన హక్కుల వైపు ముందుకు సాగడానికి సహాయం చేయడమే తన లక్ష్యమని ఆయన అంటున్నారు. ఇరాన్ భవిష్యత్తు రాచరికమా లేదా గణతంత్రమా అనేది ప్రజలు జాతీయస్థాయిలో ఓటు ద్వారా నిర్ణయించాలని కోరుతున్నారు రెజా పహ్లావి.
రెజా పహ్లావి అత్యంత ప్రసిద్ధ ప్రతిపక్ష నాయకుడని, శాంతియుత మార్పుకు కట్టుబడి ఉన్నారని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు, ఆయన విదేశీ మద్దతుపై ఎక్కువగా ఆధారపడుతున్నారని, ప్రవాసంలో నివసిస్తున్న నాయకుడిని విశ్వసించాలా అని ఇరాన్ ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శకులు అంటున్నారు.
కాగా, ఇరాన్ ప్రభుత్వం రెజా పహ్లావిని ముప్పుగా చిత్రీకరిస్తోంది. కానీ, స్వేచ్ఛాయుత ఎన్నికలు లేదా విశ్వసనీయ పోల్స్ లేనందున ఆయన నిజమైన మద్దతు స్థాయిని తెలుసుకోవడం కష్టం.
కొంతమంది ఇరానియన్లు ఇప్పటికీ పహ్లావి కుటుంబ పేరును గౌరవిస్తారు. మరికొందరేమో ప్రజాస్వామ్య ముసుగులో ఎన్నిక కాని ఒక పాలకుడి స్థానంలో మరొకరిని నియమించడానికి భయపడుతున్నారు.
రెజా పహ్లావి తండ్రి మృతదేహాన్ని కైరోలో ఖననం చేశారు. దాన్ని ఏదో ఒక రోజు ఇరాన్‌కు తిరిగి తీసుకొస్తారని మద్దతుదారులు ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రవాసంలోని యువరాజు ఆరోజును, స్వేచ్ఛాయుత ఇరాన్‌ను ఎప్పటికైనా చూస్తారా అనేవి తన గతంతో పెనుగలాడుతున్న ఓ దేశానికి సంబంధించిన సమాధానం లేని ప్రశ్నల్లో కొన్ని.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








