ఇరాన్‌లో ఏం జరుగుతోంది, పోలీసులు-నిరసనకారుల మధ్య ఘర్షణ దేనికి?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఘోంచే హబీబియాజాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- రచయిత, ఆలిస్ డేవిస్
ఇరాన్‌లో జీవనవ్యయం పెరగడంపై అసంతృప్తితో మొదలైన ఆందోళనలు ఐదవ రోజుకు చేరుకున్న వేళ నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
నైరుతి ఇరాన్‌లోని లోర్డెగాన్ నగరంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించారని ప్రభుత్వ అనుకూల ఫార్స్ వార్తా సంస్థ, హ్యూమన్ రైట్స్ గ్రూప్ హెంగావ్ తెలిపాయి.
అలాగే పశ్చిమ ప్రాంతంలోని అజ్నాలో ముగ్గురు,కుహ్‌దాస్త్‌లో మరో వ్యక్తి మృతి చెందినట్లు ఫార్స్ నివేదించింది.
గురువారంనాడు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియోలలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో మంటల్లో చిక్కుకున్న కార్లు కనిపించాయి.
చాలామంది నిరసనకారులు దేశ సుప్రీమ్ లీడర్ పాలనకు ముగింపు పలకాలంటుండగా, మరికొందరు మునుపటి రాచరిక పాలన తిరిగి రావాలని పిలుపునిస్తున్నారు.

ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడంతో చెలరేగిన నిరసనలు ఐదవ రోజూ కొనసాగుతూ, చాలాప్రాంతాల్లో కలకలం సృష్టిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
గురువారం ఇరాన్‌లోని సెంట్రల్ సిటీ లోర్డెగాన్, రాజధాని టెహ్రాన్, దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లోని మార్వ్‌దస్త్‌లో జరిగిన నిరసనల వీడియోలను బీబీసీ పర్షియన్ ధృవీకరించింది.
లోర్డెగాన్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారని ఒక అధికారిని ఉటంకిస్తూ ఫార్స్ నివేదించింది. మరణించిన వారు నిరసనకారులా లేదా భద్రతా దళాల సభ్యులా అన్నది పేర్కొనలేదు. పొరుగున ఉన్న లోరెస్తాన్ ప్రావిన్స్‌లోని అజ్నాలో జరిగిన మూడు మరణాలను కూడా నివేదించినప్పటికీ, నిరసనకారులు లేదా భద్రతా అధికారులు వారిలో ఉన్నారో లేదో తెలపలేదు.
లార్డెగాన్‌లో మరణించిన ఇద్దరూ నిరసనకారులని, వారి పేర్లు అహ్మద్ జలీల్, సజ్జాద్ వలమనేష్ అని హక్కుల సంస్థ హెంగావ్ తెలిపింది.
మరణాలను బీబీసీ పర్షియన్ స్వతంత్రంగా ధృవీకరించలేపోయింది.
పశ్చిమ లోరెస్తాన్ ప్రావిన్స్‌లోని కుహ్‌దాస్త్ నగరంలో బుధవారం రాత్రి నిరసనకారులతో జరిగిన ఘర్షణల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్(ఐఆర్‌జీసీ)తో పనిచేస్తున్న భద్రతా దళాల సభ్యుడొకరు మరణించారని ప్రభుత్వ మీడియా తెలిపింది. బీబీసీ దీనిని ధృవీకరించ లేకపోయింది.
భద్రతా దళాలు తమలో ఒకరిని కాల్చి చంపాయని నిరసనకారులంటున్నారు.
ఆ ప్రాంతంలో రాళ్లు రువ్వడంతో మరో 13 మంది పోలీసు అధికారులు, బసిజ్ సభ్యులు గాయపడ్డారని ప్రభుత్వ మీడియా చెప్పిందది.
బుధవారం దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రజాసంస్థలు మూతపడ్డాయి.
ఈ నిరసనలు మొదట టెహ్రాన్‌లో మొదలయ్యాయి. బహిరంగ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ మరోసారి గణనీయంగా తగ్గడంతో అక్కడి దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరువాత యూనివర్శిటీ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. ఈ ఆందోళనలు అనేక నగరాల్లో వ్యాప్తి చెందాయి. అక్కడి ప్రజలు దేశంలోని మతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
2022లో మహసా అమిని అనే యువతి బురఖా సరిగ్గా ధరించలేదని మొరాలిటీ పోలీసులు ఆరోపించి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆమె మరణించింది. దాంతో అప్పట్లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. కానీ ఈ నిరసనలన్నీ ఒకేస్థాయిలో జరగలేదు.
ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా నిరోధించడానికి, నిరసనలు మొదలైన టెహ్రాన్ ప్రాంతాల్లో ఇప్పుడు గట్టి భద్రతను ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
నిరసనకారుల "చట్టబద్ధమైన డిమాండ్లను" తమ ప్రభుత్వం వింటుందని అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.
మరోవైపు అస్థిరతను సృష్టించే ఏ ప్రయత్నానికైనా "కఠనమై ప్రతిస్పందన" ఎదుర్కోవాల్సి ఉంటుందని అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది-ఆజాద్ హెచ్చరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














