బంగ్లాదేశ్: మొహమ్మద్ యూనస్‌ను జై శంకర్ కలవకపోవడం దేనికి సంకేతం?

బంగ్లాదేశ్, జైశంకర్

ఫొటో సోర్స్, @hamidullah_riaz

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్‌ను జై శంకర్ కలిశారు.
    • రచయిత, సజల్ దాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీఎన్‌పీ అధ్యక్షురాలు ఖలీదా జియాకు నివాళులర్పించడానికి బంగ్లాదేశ్‌కు వచ్చిన భారత విదేశాంగ మంత్రి ,తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మధ్య ఎటువంటి అధికారిక సమావేశం జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది.

భారత ప్రభుత్వం పంపిన సంతాప సందేశం భాషపైనా చర్చ సాగుతోంది.

ఖలీదాజియా మరణం తరువాత, ఆమెకు నివాళులర్పించడానికి అనేక దేశాల ప్రభుత్వాల ప్రతినిధులు బంగ్లాదేశ్‌లో స్పల్పకాలిక పర్యటనలు చేశారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు, పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్, భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్పో డి.ఎన్. ధుంగెల్, నేపాల్ విదేశాంగ మంత్రి బాలానంద శర్మ, శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్, మాల్దీవుల విద్యాశాఖా మంత్రి అలీ హైదర్ అహ్మద్ కూడా బంగ్లాదేశ్ చేరుకున్నారు.

ప్రధాన సలహాదారు మీడియా విభాగం, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపిన సమాచారం మేరకు బంగ్లాదేశ్‌ను సందర్శించిన నేతలలో కేవలం పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్, నేపాల్ విదేశాంగ మంత్రితో బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ అధికారికంగా సమావేశమయ్యారు.

భారతదేశం, భూటాన్, శ్రీలంక మాల్దీవుల ప్రతినిధులతో ఎటువంటి సమావేశం జరగలేదు.వీటిలో ఇతర దేశాల గురించి పెద్దగా చర్చ జరగడం లేదు కానీ, భారత విదేశాంగ మంత్రితో సమావేశం కాకపోవడంపై అనేక వివరణలు విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ స్వల్పకాలిక పర్యటనలో భారత విదేశాంగ మంత్రి ప్రధాన సలహాదారుని కలవకపోయినా, న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశాలు జరిగాయని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహబూబుల్ ఆలం తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత విదేశాంగ మంత్రి పర్యటన, తౌహీద్ హుస్సేన్, తారిక్ రెహమాన్

ఫొటో సోర్స్, @hamidullah_riaz

ఫొటో క్యాప్షన్, ఢాకాలో ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్‌ను భారత విదేశాంగ శాఖామంత్రి కలిశారు.

"సానుకూల సంకేతం"

భారత విదేశాంగ మంత్రి పర్యటనను ద్వైపాక్షిక సంబంధాలు,రాజకీయ కోణం నుంచి చూడకపోవడం ఉత్తమమని తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్ అన్నారు.

ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి హాజరు కావడాన్ని "సానుకూల సంకేతం"గా అభివర్ణించారు, అయితే ఈ పర్యటన రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలకు ఎంత ఉపశమనం కలిగిస్తుందో "కాలమే చెబుతుంది" అన్నారు.

దీనితో పాటు ఖలీదా జియా మరణంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపిన సంతాప సందేశాన్ని బీఎన్‌పీ యాక్టింగ్ చైర్మన్ తారిఖ్ రెహమాన్ కోణంలో రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు.

బీఎన్‌పీ చైర్‌పర్సన్‌కు నివాళులర్పించేందుకు భారతప్రభుత్వంలో ఉన్నతస్థాయి వ్యక్తి రావడం, భారతప్రభుత్వం సంతాపసందేశం పంపడాన్ని భారత్, బంగ్లా భావి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో స్పష్టమైన భారత వైఖరికి నిదర్శనమని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు.

అదే సమయంలో ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం నుంచి భారతదేశ దౌత్యపరమైన దూరాన్ని మరింత స్పష్టం చేసిందని కూడా వారు నమ్ముతున్నారు.

ఖలీదా జియా అంత్యక్రియలు జరిగిన బుధవారం నాడు, భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ భూటాన్ ప్రతినిధులు తమ తమ ప్రభుత్వాల తరపున తారిఖ్ రెహమాన్‌కు సంతాప సందేశాలను అందచేశారు.

ఆ సమయంలో, న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, జాతీయ భద్రతా సలహాదారు ఖలీలుర్ రెహమాన్ కూడా భారత విదేశాంగ మంత్రితో మాట్లాడుతున్నట్లు కనిపించారు.

మరోవైపు, పాకిస్తాన్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో సమావేశమయ్యారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బంగ్లాదేశ్, విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాదారు తౌహీద్

ఫొటో సోర్స్, @DrSJaishankar

ఫొటో క్యాప్షన్,

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

అసలు ఎస్ జైశంకర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుని ఎందుకు కలవలేదనే ప్రశ్న తలెత్తుతోంది.

గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్ సమాధానమిచ్చారు.

భారత విదేశాంగ మంత్రి పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణం, లేదా రాజకీయ దృక్పథం నుంచి నుంచి చూడటం సముచితం కాదన్నారు.

"భారత విదేశాంగ మంత్రి వచ్చారు, ఆయన పర్యటన క్లుప్తమే. ఆయన మొత్తం కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత వెళ్లిపోయారు" అన్నారు.

జైశంకర్‌తో ఎలాంటి ప్రైవేట్ సమావేశం జరగకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ , "మేము ఎటువంటి ముఖాముఖి సంభాషణా జరపలేదు. అలాంటి అవకాశం రాలేదు. పాకిస్తాన్ స్పీకర్‌తో సహా ఇతర విదేశీ అతిథులు కూడా ఉన్నారు. ఆయన వారితో కరచాలనం చేశారు. ఇది అందరూ పాటించే మర్యాద."

"నేను ఆయనతో జరిపిన సంభాషణ రాజకీయపరమైనది కాదు. అది పూర్తిగా మర్యాదపూర్వకంగా, అందరి ముందు జరిగింది. అందువల్ల, ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం లేదు" అని ఆయన అన్నారు.

ఖలీదా జియాకు నివాళులు అర్పించడం ద్వారా అనేక దేశాలు బంగ్లాదేశ్‌తో భవిష్యత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి దౌత్య సందేశాన్ని పంపాయని అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు.

పొరుగు దేశమైన భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బంగ్లాదేశ్ పర్యటనకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది.

ఖలీదా జియా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాప సందేశం, భారత విదేశాంగ మంత్రి పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తున్నాయని ఢాకా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ లైలుఫర్ యాస్మిన్ అభిప్రాయపడ్డారు.

"గత ఏడాదిన్నరగా అర్థం చేసుకోవడంలో విఫలమైన బంగ్లాదేశ్ అంతర్గత భావాలను భారతదేశం చివరకు అర్థం చేసుకుందనడానికి ఇదో సంకేతం" అని ఆయన బీబీసీ బంగ్లాతో అన్నారు.

అయితే, చీఫ్ అడ్వైజర్‌ను కలవకపోవడాన్ని ప్రతికూలంగా చూడాల్సిన పనిలేదని యాస్మిన్ అభిప్రాయపడ్డారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఢాకా, ఖలీదా జియా, తారిఖ్ రెహమాన్‌, ప్రధాని మోదీ, లేఖ

ఫొటో సోర్స్, @hamidullah_riaz

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఢాకాలో ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్‌ను కలిసి ప్రధాని మోదీ లేఖను అందజేశారు.

సమావేశం ఎందుకు జరగలేదు?

"సమావేశం ఎందుకు జరగలేదనే దానిపై ఊహాగానాలు చేయవచ్చు. కానీ ఇది సమయానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇది కాకుండా, జైశంకర్ ఎవరిని కలిశారు? ఆయనకు సమయం ఉందా లేదా అనేది రెండు వైపుల నుంచి చూడాలి" అన్నారు.

మరోపక్క ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారతదేశానికి మంచి సంబంధాలు లేవని ఈ సందర్శన మరింత స్పష్టం చేసిందని మాజీ రాయబారి మున్షీ ఫయాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.

ఈ పర్యటన ద్వారా, భారతదేశం బంగ్లాదేశ్‌తో మంచి సంబంధాలను కోరుకుంటుందనే సందేశాన్ని న్యూదిల్లీ కూడా ఇవ్వాలనుకుందన్నారు. భారతదేశం భవిష్యత్తు వైపు చూస్తుండటమే ప్రధాన సలహాదారుని కలవకపోవడానికి కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారు.

గత అనుభవాల ఆధారంగా, ఏ దేశమూ ద్వైపాక్షిక సంబంధాలలో అదనపు చర్చలను కోరుకోవడం లేదని మున్షీ ఫయాజ్ అహ్మద్ చెబుతున్నారు.

"జైశంకర్ కూడా సమావేశానికి ఇష్టపడకపోవచ్చు. బంగ్లాదేశ్ కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఆయన ఏ పనిపైన వచ్చారో ఆ పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు . చింతించాల్సిన పని లేదు" అని ఆయన బీబీసీ బంగ్లాతో అన్నారు.

బీఎన్‌పీ చైర్‌పర్సన్ ఖలీదా జియా మరణం తర్వాత అనేక దక్షిణాసియా దేశాల నాయకులు ఇక్కడకు రావడం ప్రాంతీయ రాజకీయాల్లో బంగ్లాదేశ్ ప్రాముఖ్యాన్ని మరోసారి ప్రస్ఫుటం చేస్తోందని మాజీ రాయబారులు, అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ పొరుగున ఉన్న భారతదేశం మధ్య అపనమ్మకంగా మారిన సంబంధాలు వెంటనే సాధారణ స్థితికి తిరిగి రాకపోవచ్చని చెబుతున్నారు. .

ఖలీదా జియా మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాప సందేశం పంపడం భౌగోళిక రాజకీయ దౌత్య కోణం నుంచి చాలా ముఖ్యమైనదని విశ్లేషకులు అంటున్నారు.

ఈ సందేశం ద్వారా భారతదేశం ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు.

తారిఖ్ రెహమాన్‌తో జైశంకర్ సమావేశం కావడం, ప్రధాన సలహాదారుతో నేరుగా సమావేశం కాకపోవడం "భవిష్యత్ రాజకీయాలకు సన్నాహాలు"గా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.

పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ సాదిక్ అయాజ్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌

ఫొటో సోర్స్, @ChiefAdviserGoB

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్ సాదిక్ అయాజ్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్‌తో సమావేశమయ్యారు.

భారత్‌కు బీఎన్‌పీనే ప్రత్యామ్నాయమా?

"రాబోయే ఎన్నికల్లో బీఎన్‌పీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాతోనే భారత్ బీఎన్‌పీతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది" అని మాజీ రాయబారి మున్షీ ఫయాజ్ అహ్మద్ చెప్పారు.

"ఇప్పుడు భారత్‌కు మరే ప్రత్యామ్నాయం లేదు. బీఎన్‌పీనే నంబర్ వన్ ఎంపిక" అని ఆయన చెప్పారు.

భారత్, బీఎన్‌పీ మధ్య చాలా కాలంగా ఒకరకమైన 'దూరం' లేదా 'అనమ్మకం' కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఖలీదా జియా మరణం సందర్భంగా నరేంద్ర మోదీ తరఫున వచ్చిన అధికారిక, వ్యక్తిగత సంతాప సందేశాలు, భారత్ ఇప్పుడు బీఎన్‌పీతో సంబంధాలను సాధారణీకరించడానికి, రాజకీయ సంప్రదింపులను పెంచడానికి ఆసక్తి చూపుతోందని సూచిస్తున్నాయి.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తాత్కాలిక ప్రభుత్వంతో ఉన్న అసౌకర్యాన్ని కొంతవరకు తగ్గించేందుకు భారత్ ప్రయత్నించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్, భారత్‌ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను భారత ప్రభుత్వ సంతాప సందేశంలో ప్రస్తావించాారు.

ఆ సందేశంలో బంగ్లాదేశ్ స్థిరత్వం, ప్రజాస్వామ్య కొనసాగింపు గురించి కూడా నొక్కి చెప్పారు.

ఖలీదా జియా వంటి సీనియర్ నాయకురాలికి గౌరవం చూపడం ద్వారా, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో భారత్ తన భాగస్వామ్యం, స్నేహహస్తాన్ని ముందుకు చాస్తోందనే సంకేతాన్ని కూడా ఇచ్చింది.

"మీ (తారిఖ్ రెహమాన్) సామర్థ్యవంతమైన నాయకత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇది భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న లోతైన, చారిత్రక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గదర్శకం అవుతుంది, ఒక కొత్త ఆరంభాన్ని నిర్ధరిస్తుంది" అని ఆ సందేశంలో ఉంది.

అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు దీన్ని కీలకమైందిగా భావిస్తున్నారు. వారిలో కొందరు, మోదీ ఇచ్చిన ఈ సందేశం మూలంగా "గతాన్ని పక్కనపెట్టి భవిష్యత్తు వైపు చూడాలి" అనే భావనను, అలాగే బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన రాజకీయ శక్తులతో కలిసి పనిచేయాలన్న భారత ఆకాంక్షను సూచిస్తోందని అంటున్నారు.

అయితే, ఢాకా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన ప్రొఫెసర్ లైలుఫర్ యాస్మీన్ ఈ సందేశాన్ని దౌత్యపరంగా అంతగా భిన్నమైనదిగా చూడడం లేదు.

"ఏ పార్టీ నాయకుడికైనా సందేశం ఇచ్చినప్పుడు 'నాయకత్వం' అనే పదాన్ని ఉపయోగించడం సాధారణమే. కానీ దాని అర్థం బీఎన్‌పీ ఎన్నికల్లో గెలుస్తుందని నరేంద్ర మోదీ చెప్పారని కాదు. దీనికి అంత సులభమైన అర్థం తీసుకోవడం సరైనది కాదు" అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)