నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లొచ్చా? వీధిలో కూర్చోబెట్టి లాఠీలతో కొట్టొచ్చా? పోలీసులు ఏమంటున్నారు? లాయర్లు, హక్కుల కార్యకర్తలు ఏం చెప్తున్నారు?

నిందితులు, పోలీసులు, నేరాలు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కనిపించాయి.

ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, ఇలా చేయడం మాత్రమే కాదు నిందితులను మీడియా ముందు హాజరుపరిచే విషయంలోనూ న్యాయస్థానాలు వివిధ సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.

నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం, వారిని బహిరంగంగా ప్రదర్శించడం మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణించాయి.

‘2014 ఆగస్ట్‌లో ఓ కేసు సందర్భంగా.. నిందితులను బహిరంగంగా ప్రదర్శించడం వారి గౌరవానికి భంగం కలిగించడమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. కోర్టులో నేరం నిరూపితమయ్యే వరకు ఎవరినీ దోషిగా పరిగణించరాదని తీర్పు చెప్పింది.. నిందితుడిని రోడ్లపై నడిపించడం, మీడియా ముందు ప్రదర్శించడం వంటి చర్యలకు పోలీసులు పాల్పడకూడదని స్పష్టం చేసింది. ఎందుకంటే నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించే నిందితుడి వ్యక్తిత్వానికి అలాంటి చర్యలు అవమానకరమని సుప్రీంకోర్టు పేర్కొంది'' అని న్యాయవాది జి.శివనాగేశ్వరరావు బీబీసీతో తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తెనాలిలో ముగ్గురు యువకులకు అందరూ చూస్తుండగా అరికాలిపై లాఠీ దెబ్బలు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఘటనలు తరచూ వార్తల్లో ఉంటున్నాయి.

తెనాలిలో బాబూలాల్, చేబ్రోలు జాన్‌ విక్టర్, డోమా రాకేష్‌ అనే ముగ్గురు యువకులు పోలీస్‌ కానిస్టేబుల్‌ చిరంజీవిపై దాడి చేశారన్న ఆరోపణలపై పోలీసులు వారిని నడిరోడ్డుపై కూర్చోపెట్టి అరికాళ్లపై లాఠీలతో కొట్టిన ఘటన 2025 మేలో కలకలం రేపింది.

అందరి ముందు దూషిస్తూ, కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది.

ఏలూరులో, నెల్లూరులో, చిత్తూరులో, గుంటూరులో..

తెనాలి ఘటన అనంతరం కూడా నిందితులను పోలీసులు ఇలా వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఉదంతాలు ఏపీలోని వివిధ జిల్లాల్లో జరిగాయి.

  • ఇటీవల నెల్లూరు నగరంలో ప్రైవేటు బస్సు డ్రైవర్‌, కండక్టర్‌పై బ్లేడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను సంతపేట పోలీసులు రాత్రిపూట నగరంలోని వీధుల్లో నడిపిస్తూ న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్లారు.
  • సత్య సాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన కేసులో నిందితుడిని కదిరి పట్టణంలోని రోడ్ల మీదుగా నడిపించుకుంటూ పోలీస్‌ స్టేషన్‌‌కు తీసుకెళ్లారు.
  • నవంబర్‌‌లో చిత్తూరు జిల్లాలో ఓ యువతిపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, సంకెళ్లు వేసి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
  • గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులను నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు.
  • పొన్నూరులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌ నుంచి రోడ్లపై నడిపిస్తూ పొన్నూరులోని కోర్టుకు తీసుకువెళ్లారు.
  • డిసెంబర్‌ 21న రాష్ట్రంలో విపక్షనేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పుచోడవరంలో ‘రప్పా రప్పా’ అనే నినాదాలతో పొట్టేలు తలనరికి ఆ రక్తంతో జగన్‌ ఫొటోలు ఉన్న ఫ్లెక్సీకి అభిషేకం చేశారన్న ఆరోపణపై ఏడుగురు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు.

ఇలా రెండు నెలల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో నిందితులను రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్లడం చర్చకు తెరలేపింది.

నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన నిందితులను రోడ్లపై నడిపించుకుంటూ తీసుకువెళ్తే వారిలో మార్పు వస్తుందా అనేది చర్చనీయమైంది. ఇలా చేయడం వల్ల నేరాలు తగ్గుతాయా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిందితులు, పోలీసులు

పదిమంది చూస్తే తప్పు చేశామనే భావన వస్తుంది: డీఎస్పీ శ్రావణ్ కుమార్

"నేరస్తులకు శిక్ష పడుతుందనే భయం కంటే సమాజంలో పరువు పోతుందనే భయం రావాలి.. ఇక నేరస్వభావం ఉన్న వారికి ఇలాంటి ట్రీట్‌మెంట్ హెచ్చరికలా పని చేస్తుంది. ఇలాంటి పెరేడింగ్‌ చూసిన సాధారణ ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారనే భావన కలుగుతుంది" అని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ బీబీసీతో అన్నారు.

‘నిందితులను నడిపించుకుంటూ తీసుకువెళ్లడం తప్పేమీ కాదు’

"నిందితులను కోర్టుకు తీసుకువెళ్లేందుకు అందుబాటులో వాహనాలు లేకుంటే.. కోర్టు సమీపంలోనే ఉంటే.. నడిపించుకుంటూ తీసుకువెళ్లడం సాధారణమే. కోర్టులో హాజరుపరిచేందుకు రిమాండ్‌లో ఉన్న నిందితులను బస్సుల్లో తీసుకురావడం అనేది ఎప్పటి నుంచో వస్తోంది. ఇది పెద్ద విషయమేం కాదు.. పౌరహక్కులు, మానవహక్కులు గురించి నేనేం మాట్లాడను కానీ చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేసే వారిని, అకృత్యాలకు పాల్పడేవారిని అలా రోడ్డుపై నడిపించడం తప్పు ఎలా అవుతుంది"అని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

‘అలా పరేడ్‌ చేయించడం చట్టవిరుద్ధం’

మరోవైపు మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి గుత్తా రోహిత్‌ ... నిందితులను బహిరంగంగా రోడ్ల మీద పరేడ్‌ చేయించడం పూర్తిగా చట్ట విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అలా రోడ్లపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడం అనేది బహిరంగ అవమానం మనిషి ఆత్మ గౌరవానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు.

ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు అనేక సార్లు స్పష్టం చేసిందని చెప్పారు. నిందితులను అలా పరేడ్‌ చేయించాలనే నియమం ఏ చట్టంలోనూ లేదని రోహిత్‌ అన్నారు.

"కోర్టు దోషులుగా నిర్ధరించకముందే నిందితులను ఇలా పరేడ్‌ చేయించడం అంటే పోలీసులు కోర్టుకు సంబంధం లేకుండా నిందితులను దోషులుగా ప్రకటించడమే.. పోలీసులు ఇలా చేస్తే ఇక న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థలు ఎందుకు? ఈ అధికారం వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి. ఏపీలో ఇలాంటి చర్యలకు తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది" అని రోహిత్‌ అన్నారు.

‘కోర్టు అనుమతి లేకుండా బేడీలే వేయకూడదు’

''వాస్తవానికి మేజిస్ట్రేట్, జడ్జి అనుమతి లేకుండా నిందితులకు బేడీలే వేయకూడదు.. తెనాలిలో నడిరోడ్డుపై అరికాలిపై కొట్టిన ఘటనపై మానవహక్కుల సంఘాలు ఎంత ఆందోళన చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఒకరిని చూసి ఒకరు ఇలా నిందితులను రోడ్లపై పరేడ్‌ చేయిస్తున్నారు.. ఇది అన్యాయం,, చట్టవ్యతిరేక పనులు చేశారనే కదా.. నిందితులను అరెస్టు చేసేది.. మరి వారి పట్ల పోలీసులు చట్ట వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారు.. ఇలా చట్ట వ్యతిరేక శిక్షల కంటే సరైన కౌన్సిలింగ్‌ ద్వారా నిందితుల్లో మార్పులు తీసుకురావాలి'' అని న్యాయవాది శివనాగేశ్వరరావు బీబీసీతో అన్నారు.

‘ఆ హక్కు పోలీసులకు లేదు’

భారత రాజ్యాంగం ప్రకారం పోలీసులకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే హక్కు లేదు.. అలాంటిది రోడ్డుపై ఎలా పరేడ్‌ చేయిస్తారు.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ద్వారా వచ్చిన వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుంది' అని ఆంధ్రప్రదేశ్‌ జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి, లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు.

నిందితులను లేదా నిందితులుగా అనుమానించబడుతున్న వ్యక్తులను బహిరంగంగా వీధుల్లో ఊరేగించడం చట్టవిరుద్ధం.. కేవలం భద్రత కారణాల దృష్ట్యా లేదా నిందితుడు తప్పించుకోకుండా ఉండటానికి మాత్రమే అవసరమైన చర్యలు తీసుకోవాలే తప్ప బహిరంగంగా వారిని రోడ్లపై అవమానించే హక్కు పోలీసులకు లేదు అని ఆయన చెప్పారు.

ఇప్పుడు ఏపీలో పోలీసులు అలా చేయడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు.

బాధితులు దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని సూచించారాయన.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)