ఉస్మాన్ హాది హత్య కేసులో ప్రధాన నిందితులు భారత్‌కు పరారయ్యారంటున్న ఢాకా పోలీసులు

ఫొటో సోర్స్, DMP
బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు మైమెన్‌సింగ్‌లోని హలువాఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు పరారయ్యారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు చెబుతున్నారు.
ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్ భారతదేశానికి చేరుకున్న తర్వాత మొదట ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఆశ్రయం పొందారని పోలీసులు వెల్లడించినట్లు బీబీసీ బంగ్లా తెలిపింది. అయితే, ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం నుంచి గానీ, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు.
ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు కమిషనర్ ఎస్ఎన్ మొహమ్మద్ నజ్రుల్ ఇస్లాం ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అయితే, ఈ సంఘటనలో ప్రధాన నిందితులు ఎక్కడ ఉన్నారనేదీ తమ వద్ద కచ్చితమైన సమాచారమేదీ లేదని పోలీసు అధికారులు గతంలో వాదిస్తూ వచ్చారు.
"ఉస్మాన్ హాదీ హత్య ఒక పథకం ప్రకారమే జరిగింది. నిందితులు భారత్‌కు పారిపోవడానికి సహకరించిన వారితో సహా ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం 11 మందిని అరెస్టు చేశాం. వారిలో ఆరుగురు తమ నేరాన్ని అంగీకరించారు" అని పోలీసు అధికారులు విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఫైసల్ కరీం మసూద్‌ను, అతనికి సహకరించిన మోటార్ సైకిల్ డ్రైవర్ అలంగీర్ షేక్‌ను సంఘటన జరిగిన రోజే ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన సమాచారం, సీసీ టీవీ ఫుటేజ్‌ల విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించామని ఢాకా పోలీసు అదనపు కమిషనర్ ఇస్లాం తెలిపారు.
ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ, కరీం మసూద్ తండ్రి హుమాయున్ కబీర్, తల్లి హాసీ బేగం, భార్య షాహిదా పర్వీన్ సామియా, బావమరిది వాహిద్ అహ్మద్ సిపు, స్నేహితురాలు మరియా అక్తర్ లీమా, మహ్మద్ కబీర్, నురుజ్జామాన్ నోమానీ సహా 11 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సంఘటనలో ఉపయోగించిన రెండు విదేశీ పిస్టళ్లతో పాటు మ్యాగజైన్, 52 రౌండ్ల బుల్లెట్లు, ఖాళీ బుల్లెట్ షెల్స్, మోటార్ సైకిల్, దాని నకిలీ నంబర్ ప్లేట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో తేలిన అంశాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలు, అరెస్టు చేసిన వ్యక్తుల వాంగ్మూలాలను బట్టి ఈ సంఘటన తర్వాత కరీం మసూద్, అలంగీర్ ఢాకా నుంచి అమీన్ బజార్‌కు వెళ్లారని, అక్కడి నుంచి మాణిక్‌గంజ్‌లోని కలాంపూర్‌కు చేరుకున్నారని, తర్వాత ప్రైవేట్ కారులో మైమెన్‌సింగ్‌లోని హలువాఘాట్‌కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
హలువాఘాట్‌లోని ఒక ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఆ ఇద్దరు నిందితుల కోసం ఫిలిప్, సంజయ్ అనే ఇద్దరు వ్యక్తులు వేచి ఉన్నారని ఇస్లాం చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... ఫిలిప్ వారిని సరిహద్దు దాటించి, మేఘాలయలోని పుట్టి అనే వ్యక్తికి అప్పగించాడు. పుట్టి వారిని సామి అనే టాక్సీ డ్రైవర్‌కు అప్పగించాడు. సామి వారిని మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు.
"మేము అనధికారిక మార్గాల ద్వారా మేఘాలయ పోలీసులను సంప్రదించాం. వారు ఇప్పటికే పుట్టి, సామిలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మరో నలుగురు సెక్షన్ 164 కింద సాక్ష్యం చెప్పారు" అని అదనపు కమిషనర్ ఇస్లాం వెల్లడించారు.
వారం పదిరోజుల్లో ఈకేసులో చార్జిషీటు ఫైల్ చేస్తామని పోలీసులు చెప్పారు.


ఫొటో సోర్స్, Osman Hadi / Facebook
దర్యాప్తు అధికారులు గతంలో ఏంచెప్పారు?
అంతకుముందు డిసెంబర్ 22న, ఉస్మాన్ హాదీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్ బ్రాంచ్ (డీబీ)... ఈ హత్యలో ప్రధాన నిందితులు ఇంకా దేశంలోనే ఉన్నారా లేదా అనే విషయం తమకు తెలియదని పేర్కొంది.
డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్ షఫీకుల్ ఇస్లాం బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ, ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం మసూద్, అతని సహచరుడు అలంగీర్ షేక్ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వేరే దేశంలో ఆశ్రయం పొందారా లేదా అనే అంశంపై తమకు ఇంకా సమాచారం లేదని చెప్పారు.
అదే సమయంలో, హాదీ హంతకులను పట్టుకోవడానికి ఇంక్విలాబ్ మంచ్ బంగ్లా ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం ఇచ్చింది.
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత డిసెంబర్ 18న రాజధాని ఢాకాలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.
రెండు రోజుల తర్వాత, ''డిసెంబర్ 21 సాయంత్రంలోగా ఈ కేసులో స్పష్టత ఇవ్వడంలో విఫలమైతే హోం వ్యవహారాల సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి, ముఖ్య సలహాదారుని ప్రత్యేక సహాయకుడు ఖుదా బక్ష్ చౌదరి 24 గంటల్లోపు రాజీనామా చేయాలి'' అని నిరసనకారులు డిమాండు చేశారు.
"నేరానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. నేరానికి ఉపయోగించిన ఆయుధాలను, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాం. పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశాం. వారిని విచారించిన తర్వాత, మిగిలిన నిందితుల గురించి సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం" అని డీబీ చీఫ్ షఫీకుల్ ఇస్లాం చెప్పారు.

పోలీసులు ఏమంటున్నారు?
నిందితుడు ఫైసల్ కరీం మసూద్, అతని సహచరుడు అలంగీర్ షేక్ నిషేధిత ఛత్రా లీగ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని పోలీసు అధికారులు తెలిపారు.
హాదీ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశామని, వీరిలో ప్రధాన నిందితుడి కుటుంబసభ్యులు కూడా ఉన్నారని వెల్లడించారు.
నిందితుల పాస్‌పోర్ట్‌లను ఇప్పటికే బ్లాక్ చేసినందున, వారు చట్టబద్ధంగా దేశం దాటి పారిపోవడం సాధ్యం కాదని పోలీసులు గతంలో వాదించారు.
అయితే ప్రధాన నిందితుడు అక్రమంగా దేశం సరిహద్దు దాటి విదేశానికి వెళ్లారా లేదా అనే విషయంపై పోలీసుల వద్ద స్పష్టమైన సమాచారం లేదు.
ఎవరెవరు అరెస్ట్ అయ్యారు?
షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో ఇప్పటివరకూ 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం మసూద్ తల్లిదండ్రులు, భార్య, బావమరిది ఉన్నారు. మసూద్ స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు.
హాదీపై కాల్పులు జరపడానికి ముందు మసూద్ తన భార్య, స్నేహితురాలు, బావమరిదితో మొబైల్ ఫోన్‌లో పలుమార్లు మాట్లాడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంక్విలాబ్ మంచ్ హెచ్చరిక
ఢాకాలో డిసెంబర్ 12న జరిగిన కాల్పుల్లో షరీఫ్ ఉస్మాన్ హదీ తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను సింగపూర్‌కు తరలించారు. కానీ, డిసెంబర్ 18న ఆయన మరణించారు.
శనివారం, ఢాకా విశ్వవిద్యాలయంలోని జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కన హాదీ మృతదేహాన్ని ఖననం చేశారు.
మరోవైపు, హాదీ హంతకులను అరెస్టు చేయాలని ఇంక్విలాబ్ మంచ్ ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం ఇచ్చింది.
"రాజధానిలో పట్టపగలు ఉస్మాన్ హాదీని కాల్చి చంపిన తర్వాత హంతకులు ఎలా తప్పించుకున్నారు?" అని హాదీ సోదరుడు అబూ బకర్ సిద్ధిఖీ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ ఉస్మాన్ హాదీ
కిందటేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమ ప్రముఖులలో ఉస్మాన్ హాదీ ఒకరు.
ఆయన షేక్ హసీనా వ్యతిరేక ఇంక్విలాబ్ మంచ్ సభ్యుడు. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో ఢాకా-8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు సిద్ధమవుతున్నారు.
గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం సమయంలో ఇంక్విలాబ్ మంచ్ వెలుగులోకి వచ్చింది.
ఈ సమూహాన్ని రాడికల్ సంస్థగా పిలుస్తారు. అవామీ లీగ్ ను బలహీనపరిచే ప్రయత్నాలలో ఈ మంచ్ ముందంజలో ఉంది.
విద్యార్థి ఉద్యమంలో దాని పాత్ర ఉన్నప్పటికీ, ఈ సంస్థను యూనస్ ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించింది.
కానీ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలకు ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్, సలహా మండలి సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
"హాదీ మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేం. మీరు తరతరాలుగా మాతోనే ఉంటారు. మీరు దేని కోసం నిలబడ్డారో దానిని మేం నెరవేరుస్తామని వాగ్దానం చేయడానికే ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాం. ఈ బాధ్యతను మేమే కాదు , బంగ్లాదేశ్ ప్రజలూ తీసుకుంటారు’’ అని యూనస్ చెప్పారని బంగ్లాదేశ్ కు చెందిన దైనిక ట్రిబ్యూన్ వార్తాపత్రిక తెలిపింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














