బంగ్లాదేశ్‌లో నిరసనకారులు ఆ రెండు పత్రికలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ‘దిల్లీ పెట్స్’ అంటూ ఆ సంస్థలపై ఎందుకు ఆరోపణలు చేశారు?

ప్రథమ్ ఆలో

ఫొటో సోర్స్, Getty Images

ఇంక్విలాబ్ మంచ్‌కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యకు గురైన తర్వాత బంగ్లాదేశ్‌లో మళ్లీ పెద్ద ఎత్తున హింస, విధ్వంసం చెలరేగాయి.

గత ఏడాది జులైలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని దించేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒకరు హాదీ.

ఉస్మాన్ హాదీ మరణ వార్తను ప్రకటించిన తర్వాత బంగ్లాదేశ్ మీడియాను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.

ప్రథమ్ ఆలో, ది డైలీ స్టార్‌ పత్రికా కార్యాలయాలపై నిరసనకారులు విరుచుకుపడి, ఆ కార్యాలయాలకు నిప్పంటించారు.

గురువారం రాత్రి 11:20 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్, ప్రజలు ఓపికగా ఉండాలని, ఎలాంటి 'ప్రచారాలు, వదంతులు'ను నమ్మవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు యూనస్.

''డైలీ స్టార్, ప్రథమ్ ఆలో, న్యూస్‌ఏజ్ జర్నలిస్టులకు... మేం మీతో ఉన్నాం. మీరు ఎదుర్కొన్న హింసకు, భయాందోళనకు క్షమాపణ చెబుతున్నా. భయం నీడలో మీరు ప్రదర్శించిన ధైర్యానికి, పట్టుదలకు దేశం సాక్ష్యంగా నిలిచింది. జర్నలిస్టులపై జరిగే దాడులు నిజం మీద జరిగే దాడులే. మీకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాం" అని సోషల్ మీడియాలో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హాదీ ఎలా మరణించారు?

కాగా హాదీ మృతదేహాన్ని శుక్రవారం ఆయన బంధువులు సింగపూర్ నుంచి బంగ్లాదేశ్ తీసుకొస్తారని 'ఇంక్విలాబ్ మంచ్' ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించింది.

గత శుక్రవారం (డిసెంబర్ 12న) ఢాకాలోని ఒక మసీదు నుంచి బయటకు వెళ్తున్న సమయంలో హాదీపై కాల్పులు జరిగాయి. బుల్లెట్ అతని తలలోకి దూసుకెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 15న ఆయన్ను విమానంలో సింగపూర్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించారు.

ప్రథమ్ ఆలో ఆఫీసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దాడి తర్వాత ప్రథమ్ ఆలో వెబ్‌సైట్, వార్తాపత్రిక కార్యకలాపాలు నిలిచిపోయాయి.

‘మొత్తం ధ్వంసమైంది’

ఢాకాలోని కార్వాన్ బజార్‌లో ఉన్న ప్రథమ్ ఆలో నాలుగు అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. డైలీ స్టార్‌ ఆఫీసుకు చెందిన రెండు అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి.

దాడుల ప్రభావంతో ఈ రెండు వార్తా పత్రికలు శుక్రవారం ప్రచురితం కాలేదు.

''మా రెండు ఆఫీసుల్లో ఒకదానిపై దాడి జరిగింది. గేటు ముందు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. గేటు మూసేశాం. కానీ, వారు గేటును పగలగొట్టి లోపలకి వచ్చారు. ఆ సమయంలో చాలామంది ఉద్యోగులు ఆఫీసులోనే ఉన్నారు. ఎలాగోలా వారు సురక్షితంగా తప్పించుకున్నారు'' అని ప్రథమ్ ఆలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సజ్జాద్ షరీఫ్ బీబీసీ ప్రతినిధి మానసి దాష్‌కు చెప్పారు.

''27 ఏళ్లలో ఈరోజు(శుక్రవారం) తొలిసారి మా వార్తాపత్రిక ప్రచురితం కాలేదు. మా వెబ్‌సైట్‌పై కూడా మేం పనిచేయలేకపోయాం. మా వ్యాపార కార్యాలయం ధ్వంసమైంది. అన్నీ దెబ్బతిన్నాయి'' అని తెలిపారు.

దీనిపై ప్రథమ్ ఆలో వార్తా పత్రిక తన పాఠకుల కోసం వెబ్‌సైట్‌లో ఓ సందేశం ఉంచింది.

''గత రాత్రి ప్రథమ్ ఆలో ఆఫీసుపై జరిగిన అతిపెద్ద దాడి, విధ్వంసంతో పాటు నిప్పంటించడంతో సాధారణ కార్యకలాపాలకు సాధ్యపడలేదు. అందువల్ల ప్రథమ్ ఆలో ప్రింట్ ఎడిషన్ నేడు (శుక్రవారం) ప్రచురితం కాలేకపోయింది. మా ఆన్‌లైన్ పోర్టల్ కూడా తాత్కాలికంగా అందుబాటులో లేదు'' అని వెబ్‌సైట్‌పై కనిపించింది.

తన పాఠకులకు క్షమాపణ చెప్పిన ఈ వార్తా పత్రిక, తమకు సహకరించాల్సిందిగా కోరింది. వీలైనంత త్వరగా ప్రచురణను పునరుద్ధరిస్తామని తెలిపింది.

డైలీ స్టార్ ఆఫీసు

ఫొటో సోర్స్, Getty Images

‘బీబీసీ బంగ్లా’ అందించిన వివరాల ప్రకారం.. కార్వాన్ బజార్‌లో ఉన్న దేశంలోని రెండు టాప్ మీడియా సంస్థలకు చెందిన కార్యాలయాలపై అతిపెద్ద దాడి జరిగింది. గురువారం అర్థరాత్రి ఈ కార్యాలయాలకు నిప్పంటించారు. ఆ సమయంలో రెండు వార్తాపత్రికలకు చెందిన చాలా మంది జర్నలిస్టులు లోపల చిక్కుకుపోయారు.

అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసి భవనం లోపల చిక్కుకున్నవారిని రక్షించారు.

నిరసనకారులు మీడియా ఆఫీసు లోపల దోపిడీకి పాల్పడ్డారు.

ఎడిటర్స్ కౌన్సిల్ చైర్మన్ నురుల్ కబీర్ ఘటనా ప్రాంతానికి వెళ్లినప్పుడు, నిరసనకారులు ఆయనపై కూడా వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆర్మీ ఘటనా ప్రాంతానికి చేరుకుంది.

గురువారం రాత్రి జరిగిన దాడి తమకు భారీ నష్టాన్ని కలిగించిందని, తమ ఆఫీసుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ప్రథమ్ ఆలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సజ్జాద్ షరీఫ్ చెప్పారు.

''ఈ మొత్తం ఘటన మమ్మల్ని తీవ్ర షాకింగ్‌కు గురి చేసింది. జర్నలిజానికి ఇది ఎదురుదెబ్బ'' అని తెలిపారు.

'' మాట్లాడే స్థితిలో లేము''

డైలీ స్టార్‌కు చెందిన పలువురు ఉద్యోగులతో బీబీసీ బంగ్లా మాట్లాడింది.. భవనంలోని ప్రతి అంతస్తుపై అటాకర్లు దాడి చేశారని, విధ్వంసం సృష్టించి, విలువైన వస్తువులను దొంగలించారని వారు తెలిపారు.

విధ్వంసకారులు తన కెమెరాను, వీసీఆర్‌ను, హార్డ్ డ్రైవ్‌ను దొంగలించినట్లు డైలీ స్టార్‌కు చెందిన ఓ ఉద్యోగి బీబీసీ బంగ్లాతో చెప్పారు. మాట్లాడేటప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. జీవితాంతం తాను చేసిన పని, పలు జ్ఞాపకాలు ఈ డివైజ్‌ల్లోనే స్టోర్ అయి ఉన్నాయని చెప్పారు.

గత రాత్రి తాము ఎదుర్కొన్న భయం, ఆందోళనతో సాధారణ స్థితిలో మాట్లాడలేకపోతున్నామని కొందరు ఉద్యోగులు తెలిపారు.

''ఊపిరి తీసుకోలేకపోతున్నాను. చాలా పొగ కమ్ముకుంది. నేను లోపల ఉన్నాను. మీరు నన్ను చంపేస్తున్నారు'' అని గురువారం రాత్రి డైలీ స్టార్‌కు చెందిన ఓ సీనియర్ రిపోర్టర్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

డైలీ స్టార్

ఫొటో సోర్స్, Getty Images

'28 మంది జర్నలిస్టులు నాలుగు గంటల పాటు చిక్కుకుపోయారు'

డైలీ స్టార్ గురువారం జరిగిన ఘటనను తన వెబ్‌సైట్‌‌లో వివరించింది.

అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ''గురువారం రాత్రి 9 అంతస్తుల భవనంలోని రెండు అంతస్తులకు నిరసనకారులు నిప్పంటించారు. 28 మంది జర్నలిస్టులు లోపల చిక్కుకుపోయారు. మంటలు వ్యాపించడంతో, ఈ జర్నలిస్టులు రూఫ్‌టాప్ ఎక్కి తప్పించుకోవాల్సి వచ్చింది. నాలుగు గంటల తర్వాత వారిని ఆర్మీ, అగ్నిమాపక దళం రక్షించింది. తెల్లవారుజామున 4.30 వరకు ఆందోళనకారులు వార్తాపత్రిక కార్యాలయంలోనే ఉన్నారు'' అని తెలిపింది.

గురువారం అర్ధరాత్రి వంద నుంచి రెండొందల మంది వరకు వచ్చి తమ ఆఫీసు మెయిన్ గేటును బద్దలు కొట్టారని, భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆఫీసులోకి ప్రవేశించారని ఈ వార్తాపత్రిక తెలిపింది.

విధ్వంసం సృష్టించిన తర్వాత, కొందరు పైన అంతస్తుల్లో ఉన్న కంప్యూటర్లను ఇతర పరికరాలను ధ్వంసం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వార్తాపత్రికలకు, ఫర్నీచర్‌కు నిప్పంటించారు. ఈ మంటలు మూడో అంతస్తు వరకు వ్యాపించాయి.

''హాదీ హత్యకు డైలీ స్టార్, ప్రథమ్ ఆలో కారణమయ్యాయని నిరసనకారులు ఆరోపించారు. ఈ రెండు వార్తాపత్రికలను ''దిల్లీ పెట్స్'', ''షేక్ హసీనా సహాయకులు'' అంటూ నిరసనకారులు ఆరోపించారు. ఈ ఆరోపణలను డైలీ స్టార్ తిరస్కరిస్తోంది’’ అని డైలీ స్టార్ పేర్కొంది.

''దిల్లీ లేదా ఢాకా... ఢాకా, ఢాకా, ఢాకా. భజనా లేదా ఆందోళన... ఆందోళన, ఆందోళన, ఆందోళన. మేం రక్తం చిందించాం, ఇంకా చిందిస్తాం" అని నినాదాలు చేస్తూ.. హదీ హంతకులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

డైలీ స్టార్ వెబ్‌సైట్ ప్రచురించిన ఒక కథనంలో.. అందులో ఈ దాడిని 'ఇండిపెండెంట్ జర్నలిజానికి ఒక చీకటి రోజు'గా అభివర్ణించింది. "వారు మా కార్యాలయాలను తగలబెట్టగలరు కానీ, మా సంకల్పాన్ని కాదు" అని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)