తాజుద్దీన్ అహ్మద్: ఈ బంగ్లాదేశ్ తొలి తాత్కాలిక ప్రధానిని జైల్లో ఎందుకు హత్య చేశారు, హత్యకు ముందు ఆయన జైలర్‌ని ఏమడిగారు?

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ సైన్యం 1971 మార్చి 25న ఢాకాలో ఆపరేషన్ సెర్చ్‌లైట్ ప్రారంభించిన వెంటనే, అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ తాజుద్దీన్ అహ్మద్, ఢాకాలో ప్రసిద్ధ న్యాయవాది అమీరుల్ ఇస్లాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వారిద్దరూ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు. తరువాతి రెండు రోజులు ఇద్దరూ ఢాకాలోని లాల్మాతియా ప్రాంతంలో తలదాచుకున్నారు.
ఈ ప్రదేశం ధన్మొండీలోని షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం నుంచి అంత దూరమేమీ కాదు.
ఆ తర్వాత, వారు భారత సరిహద్దు వైపు నడవడం ప్రారంభించారు. మూడు రోజులపాటు నిరంతరాయంగా కాలినడకన, ఎడ్ల బండ్లపై ప్రయాణించి భారత సరిహద్దుకు ఆనుకుని ఉన్న కుష్టియా జిల్లా ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ ముందుగా అనుకున్న ప్రదేశంలో బెంగాలీ అధికారి తౌఫిక్ ఇలాహి చౌధరిని వారు కలిశారు.
మార్చి 30న, సరిహద్దు భద్రతా దళాధికారులకు చౌధరి ఒక సందేశాన్ని పంపారు: 'ముజిబ్ సన్నిహితులైన ఇద్దరు సీనియర్ అవామీ లీగ్ నాయకులు సరిహద్దుకు చేరుకున్నారు. వారిని ప్రభుత్వఅతిథులుగా స్వాగతిస్తే, భారత ప్రధానమంత్రిని కలవాలనుకుంటున్నారు.'
బీఎస్ఎఫ్ అధికారులు వారి ఐజీ గోలక్ మజుందార్‌కు ఈ సమాచారం చేరవేశారు. మజుందార్ వెంటనే తన సీనియర్ అధికారి కేఎఫ్ రుస్తుమ్‌జీకి ఈ విషయాన్ని తెలియజేశారు.


ఫొటో సోర్స్, Police
కొత్త బట్టలు వేసుకొని..
వారు అక్కడికి చేరుకునేసరికి, రాత్రి ఒంటి గంట అయింది. ఆ సమయానికి కోల్‌కతా (అప్పటి కలకత్తా) లోని అన్ని హోటళ్లు, దుకాణాలు మూసివేశారు. రుస్తమ్‌జీ ఎప్పుడూ అత్యవసర ప్రయాణానికి బట్టల కిట్‌ను సిద్ధంగా ఉంచుకునేవారు. అందులో నుంచి పైజామా తీసి తన అతిథులు ధరించడానికి ఇచ్చారు.
మజుందార్ అందరికీ స్టవ్‌పై ఆమ్లెట్‌లు వేశారు. మరుసటి రోజు కలకత్తాలోని న్యూ మార్కెట్‌కు ఒక వ్యక్తిని పంపారు. అక్కడ తాజుద్దీన్ అహ్మద్, అతని సహచరుడికి రెడీమేడ్ బట్టలు తీసుకున్నారు.
దేశ ప్రతినిధులుగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలవబోతున్నందున, వారికి మంచి బట్టలు కొనాలని రుస్తమ్‌జీ భావించారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
ఇందిరా గాంధీతో సమావేశం
మరుసటి రోజు తాజుద్దీన్ అహ్మద్ ప్రత్యేక విమానంలో రుస్తమ్‌జీతో కలిసి దిల్లీ చేరుకున్నారు.
స్టేట్స్‌మన్ మాజీ కరస్పాండెంట్ మానశ్ ఘోష్ తన 'బంగ్లాదేశ్ వార్ రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో' పుస్తకంలో "అంతర్జాతీయ ఆమోదం పొందాలంటే, బంగ్లాదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ మీడియా ముందు ప్రమాణ స్వీకారం చేయడం అవసరమని తాజుద్దీన్ అహ్మద్‌కు ఇందిరాగాంధీ సలహా ఇచ్చారు" అని రాశారు.
"అంతేకాదు, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల నియంత్రణలో ఉన్న ప్రదేశంలో జరగాలి" అని ఇందిర చెప్పినట్లు పుస్తకంలో రాశారు.
తాజుద్దీన్ అహ్మద్, ఆయన ప్రతిపాదిత ప్రభుత్వానికి అవసరమైన సౌకర్యాలను అందించాలని అక్కడి భారత అధికారులను, ముఖ్యంగా రుస్తమ్‌జీని ఇందిరాగాంధీ ఆదేశించారు.
ప్రధానిగా ప్రమాణ స్వీకారం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేదికగా నాడియా జిల్లాకు ఆనుకుని ఉన్న బైద్యనాథ్తల్‌ను ఎంపిక చేశారు. 1971 ఏప్రిల్ 17న, కలకత్తాలోని అందరు విదేశీ జర్నలిస్టులను సమావేశపరిచి, ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రిపోర్టు చేయడానికి వారిని తెలియని ప్రదేశానికి తీసుకెళ్తామని చెప్పారు.
కలకత్తా నుంచి బైద్యనాథ్తల్ వైపు దాదాపు 60 కార్ల కాన్వాయ్ బయలుదేరింది. బంగ్లాదేశ్ ఇప్పుడు స్వతంత్ర, సార్వభౌమ గణతంత్ర రాజ్యమని మీనాజ్‌పూర్ అవామీ లీగ్ ఎంపీ, ప్రొఫెసర్ యూసుఫ్ అలీ మైక్‌లో ప్రకటించారు.
సయ్యద్ నజ్రుల్ ఇస్లాం తాత్కాలిక అధ్యక్షుడిగా, తాజుద్దీన్ అహ్మద్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు, ఈ వార్త ప్రపంచంలోని ప్రముఖ వార్తాపత్రికలలో ప్రచురితమైంది.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
అవామీ లీగ్ నాయకుల ఆగ్రహం
ఢాకాకు 62 కి.మీ దూరంలో ఉన్న దర్దారియాలో 1925 జూలై 23న తాజుద్దీన్ అహ్మద్ జన్మించారు. ఆయన అవామీ లీగ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. తాజుద్దీన్ అహ్మద్‌ను అవామీ లీగ్ 'మేథో శక్తి కేంద్రం' గా అభివర్ణిస్తుంటారు.
ఆర్థిక శాస్త్రంలో పట్టున్న తాజుద్దీన్ అహ్మద్ అరవైలలో తరచుగా సైకిల్‌పై నగరంలో తిరుగుతూ సామాన్య ప్రజలను కలుస్తూ కనిపించేవారు. ఆరు సూత్రాల ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన మూడేళ్లు పాకిస్తాన్ జైలులో ఉన్నారు.
కాగా, ఇందిరాగాంధీతో తాజుద్దీన్ సమావేశం అవామీ లీగ్‌లోని కొన్ని వర్గాలకు నచ్చలేదు.
మానశ్ ఘోష్ తన పుస్తకం ముజిబ్స్ బ్లండర్స్‌లో "ముజిబ్ మేనల్లుడు, ముజిబ్ బాహిని చీఫ్ షేక్ ఫజ్లుల్ హక్ మోని, తాజుద్దీన్ అహ్మద్ నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. అవామీ లీగ్ నాయకులుగా ఇందిరాగాంధీని కలవడానికి ఆయన ఏ అధికారంపై వెళ్లారని ప్రశ్నించారు" అని రాశారు.
"తాజుద్దీన్ ప్రతిష్టను దిగజార్చడానికి, పార్టీలో తాజుద్దీన్ ప్రత్యర్థి అయిన ముష్తాక్ అహ్మద్‌తో ఫజ్లుల్ హక్ చేతులు కలిపారు, అప్పటికీ వారిద్దరి మధ్య ఎలాంటి సైద్ధాంతిక సారూప్యత లేదు" అని మానశ్ పుస్తకంలో తెలిపారు.
1971 సెప్టెంబర్‌లో ముష్తాక్ అహ్మద్ ఐక్యరాజ్యసమితిలో బంగ్లాదేశ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించబోతున్నప్పుడు, తాజుద్దీన్ అహ్మద్ ఆయనను పదవి నుంచి తొలగించారు. దీంతో, ముష్తాక్ ఆయనను ఎప్పుడూ క్షమించలేదు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
తప్పుడు ప్రచారం
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందిన ఆరు రోజుల తర్వాత, 1971 డిసెంబర్ 22న, తాజుద్దీన్ అహ్మద్ తన మంత్రివర్గంతో కలిసి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లలో ఢాకా చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఢాకాలోని ప్రభుత్వ గృహానికి వెళ్లారాయన.
తాజుద్దీన్ లేనప్పుడు, ధన్మొండిలోని ఆయన రెండంతస్తుల ఇంటిని పాకిస్తాన్ సైన్యం ధ్వంసం చేసింది. దీంతో, ప్రారంభ రోజుల్లో ప్రభుత్వ గృహం నుంచే ఆయన బంగ్లాదేశ్‌ను పాలించారు. షేక్ ముజిబుర్ మాదిరి ఆకర్షణ, ప్రజా మద్దతు తనకు లేదని తాజుద్దీన్‌కు తెలుసు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్రం తర్వాత తాజుద్దీన్‌కు ఆశలు ఎక్కువయ్యాయయని, పాకిస్తాన్ జైలు నుంచి షేక్ ముజిబుర్ తిరిగి రావాలని ఆయన కోరుకోలేదని షేక్ మోని, ముష్తాక్ అహ్మద్ వంటి పార్టీలోని అతని ప్రత్యర్థులు పుకార్లు వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు.
"ఈ ప్రచారంతో తాజుద్దీన్ చాలా బాధపడ్డారు, ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. తన సన్నిహితుడైన నూరుల్ ఖాదర్‌తో, 'బంగ్లాదేశ్ స్వాతంత్య్రం తర్వాత నేను చనిపోయి ఉంటే బాగుండేది, తద్వారా ముజీబ్ భాయ్ పట్ల నా విధేయతను ప్రశ్నించే ఈ తప్పుడు కథనాలను వినాల్సిన అవసరం ఉండేది కాదు' అన్నారు" అని మానశ్ ఘోష్ 'బంగ్లాదేశ్ వార్ రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో' పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
పదవి నుంచి దిగిపోవాలని కోరిన ముజీబ్
షేక్ ముజిబుర్ 1972 జనవరి 9న పాకిస్తాన్ జైలు నుంచి విడుదలై ఢాకా చేరుకున్నప్పుడు, తాజుద్దీన్ అహ్మద్‌తో పాటు లక్షలాది మంది విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. ముజిబుర్‌ను చూసిన వెంటనే, ఆయనను కౌగిలించుకున్నారు తాజుద్దీన్.
అయితే, షేక్ ముజిబుర్ వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని కోరుకున్నారు.
"షేక్ ముజిబుర్‌ను పూలతో నిండిన ట్రక్కులో విమానాశ్రయం నుంచి ఢాకా నగరానికి తీసుకెళ్తున్నప్పుడు, తాను ప్రధానమంత్రి కావాలని తాజుద్దీన్ చెవిలో చెప్పారు" అని మానశ్ ఘోష్ రాశారు.
"మరుసటి రోజు ఉదయం, ఆయన లుంగీ, కుర్తా ధరించి తాజుద్దీన్ ఇంటికి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ మార్పుపై ఢాకా అంతటా సందేహ వాతావరణం నెలకొంది. దేశ ప్రధానిని మార్చడంలో ఇంత తొందరెందుకు? అని ప్రజలు నిశ్శబ్ద స్వరంతో అడుగుతున్నారు" అని పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
ఆర్థిక మంత్రిగా తాజుద్దీన్
రాజీనామాకు తాజుద్దీన్ సమయం తీసుకోలేదు. షేక్ ముజిబ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తాజుద్దీన్ అహ్మద్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆయనను ఉప ప్రధానమంత్రి చేస్తారని చాలామంది ఆశించినప్పటికీ, అది జరగలేదు.
1974లో తాజుద్దీన్ అమెరికా పర్యటన చర్చనీయాంశమైంది.
సయ్యద్ బద్రుల్ అహ్సాన్ తన 'గ్లోరీ అండ్ డిస్పేర్ ది పాలిటిక్స్ ఆఫ్ తాజుద్దీన్ అహ్మద్' పుస్తకంలో "బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ఏ అవసరాలను తీర్చగలదని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ మెక్‌నమారా అడిగినప్పుడు, వ్యవసాయం చేయడానికి ఎద్దులు, వాటిని నాగలికి కట్టేందుకు తాళ్లు అవసరమని ఆయన సంకోచం లేకుండా సమాధానం ఇచ్చారు" అని రాశారు.
మరోవైపు, షేక్ ముజిబుర్, తాజుద్దీన్ మధ్య దూరం పెరుగుతూనే ఉంది. 1974 అక్టోబర్ 26న, బంగ్లాదేశ్ క్యాబినెట్ కార్యదర్శి తౌఫిక్ ఇమామ్ రెండు ఎన్వలప్‌లతో తాజుద్దీన్ అహ్మద్ కార్యాలయానికి వచ్చారు.
"ఒక కవరులో ముజీబ్ నుంచి వచ్చిన లేఖ ఉంది, అందులో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, మీరు తక్షణమే రాజీనామా చేయాలి. టైప్ చేసిన రాజీనామా లేఖను మరొక కవరులో పంపుతున్నాను. దయచేసి దానిపై సంతకం చేసి ఈ లేఖ ఇచ్చిన వ్యక్తికి ఇవ్వండి అని రాసి ఉంది" అని మానశ్ ఘోష్ తన పుస్తకంలో తెలిపారు.
తాజుద్దీన్ అహ్మద్ రాజీనామా లేఖపై సంతకం చేసి క్యాబినెట్ కార్యదర్శికి అందజేశారు. తాజుద్దీన్ అహ్మద్ బలవంతంగా రాజీనామా చేయడం రాబోయే ఇబ్బందులకు సంకేతంగా బంగ్లాదేశ్‌లో భావించారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
తాజుద్దీన్ అరెస్ట్
షేక్ ముజిబుర్ రెహమాన్ తన కుటుంబంతో సహా 1975 ఆగస్టు 15న హత్యకు గురైనపుడు, ఖోండ్కర్ ముష్తాక్ అహ్మద్ బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడయ్యారు. ఆ సమయంలో తాజుద్దీన్ అహ్మద్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు.
ఖోండ్కర్ ముష్తాక్ అహ్మద్ మంత్రివర్గంలో చేరడానికి తాజుద్దీన్ అహ్మద్, సయ్యద్ నజ్రుల్ ఇస్లాం, కెప్టెన్ మన్సూర్ అలీ, ఎ.హెచ్. కమరుజ్జామాన్ నిరాకరించడంతో వారిని ఢాకా సెంట్రల్ జైలుకు తరలించారు.
సలీల్ త్రిపాఠి తన 'ది కల్నల్ హూ వుడ్ నాట్ రిపెంట్' పుస్తకంలో "1975 నవంబర్ 2-3వ తేదీ రాత్రి, బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు, జైలు ఐజీ మొహమ్మద్ నురుజ్జామాన్‌కు బంగా భవన్ నుంచి ఒక కాల్ వచ్చింది. మిలటరీ యూనిఫాంలో కొంతమంది ఢాకా జైలుకు వస్తారు, వారిని జైలులో ఉంచిన రాజకీయ ఖైదీల వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు" అని రాశారు.

ఫొటో సోర్స్, TAJUDDINAHMAD.ORG
తాజుద్దీన్ హత్య
కొద్దిసేపటికే, మొస్లేవుద్దీన్ నాయకత్వంలో నల్లని దుస్తులు ధరించిన సైనికులు ఢాకా జైలుకు చేరుకున్నారు.
సలీల్ త్రిపాఠి తన పుస్తకంలో "నలుగురు ఖైదీలను నిద్రలేపి, మిగతావారి నుంచి వేరు చేశారు. తాజుద్దీన్, నజ్రుల్, మన్సూర్ అలీ, కమరుజ్జామన్‌లను మరొక గదికి తీసుకెళ్లారు. ఈ ఖైదీలను గుర్తించమని జైలర్ అమీనూర్ రెహమాన్‌ను అడిగారు. తాజుద్దీన్ విషయాన్ని అర్థం చేసుకున్నారు. నమాజ్ చదవడానికి జైలర్ అనుమతి అడిగారు. దీనికి జైలర్ అనుమతించారు. నమాజ్ ముగిసిన వెంటనే, కెప్టెన్, అతని సహచరులు ఆ నలుగురిపై కాల్పులు జరిపారు" అని తెలిపారు.
నలుగురు అవామీ లీగ్ నాయకులు నేలపై పడిపోయారు. ఇదంతా జైలు అధికారుల ముందు, జైలు లోపలే జరిగింది.
ఈ నలుగురిని కాల్చిన తర్వాత సైనికులు తిరిగి వెళ్లారు. కొద్దిసేపటికి జైలు సిబ్బంది బంగా భవన్‌కు ఫోన్ చేసి, తాజుద్దీన్ అహ్మద్, మన్సూర్ అలీ బతికే ఉన్నారని, నీరు అడుగుతున్నారని చెప్పారు.
"సైనికులను జైలుకు తిరిగి పంపాలని, వారు బతికి లేరని నిర్ధరించుకోవాలని ముష్తాక్ ఆదేశించారు. సైనికులు జైలుకు తిరిగి వెళ్లి తాజుద్దీన్, మన్సూర్ అలీని చంపారు" అని మానశ్ ఘోష్ తన 'బంగ్లాదేశ్ వార్ రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో' పుస్తకంలో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














