అరుణాచలం పేరుపై వివాదమెందుకు?

- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులోని అరుణాచల క్షేత్రం పేరుపై ఇప్పుడు వివాదం నెలకొంది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరువణ్ణామలై నగరంలో అరుణాచలేశ్వరుని దేవాలయం ఉంది. శివుణ్ణి ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా, అణ్ణామలైయార్‌గా పిలుస్తారు భక్తులు.
కొన్నేళ్లుగా తెలుగునాట అరుణాచల క్షేత్రంపై ఆసక్తి పెరిగింది.
ప్రవచనాలు, సోషల్ మీడియా ప్రభావంతో అంతకుముందు కన్నా ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి, గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నారు.
అయితే ఇక్కడి నుంచి వెళ్లే భక్తులు ఆ ఆలయం ఉన్న ఊరిని ఏమని పిలుస్తున్నారు, అసలు ఆ దేవుడి పేరేంటి అనే అంశాలపై ఇటీవల వివాదం రేగింది. ఇటీవల కర్ణాటక నుంచి తిరువణ్ణామలై వెళ్తున్న ఒక తమిళనాడు ఆర్టీసీ బస్సు బోర్డులో తిరువణ్ణామలై బదులు అరుణాచలం అని పెట్టారు.
ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు ఆ బోర్డు పెట్టిన కండక్టర్‌ను తమిళనాడు ఆర్టీసీ సస్పెండ్ చేసింది.


అరుణాచలేశ్వరుడు అనే దేవుడి గుడి ఉన్న ఊరి పేరు తిరువణ్ణామలై.
అక్కడి మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కూడా తిరువణ్ణామలై పేరుతోనే ఉన్నాయి.
ఆ ఊరిలోని అరుణాచలేశ్వరుడినే తమిళులు అణ్ణామలైగా పిలుస్తారు.
తెలుగులో అన్న అనే పదానికి ఉన్న అర్థంతో పాటు, తమిళంలో పెద్ద, గొప్పవారు అనే అర్థంలో కూడా అణ్ణా అనే పదాన్ని వాడతారు.
మలై అంటే కొండ అని అర్థం.
అణ్ణామలై పదానికి ముందు గౌరవవాచకమైన తిరు చేరిస్తే తిరువణ్ణామలై అయింది.
అంటే తమిళులు అణ్ణామలై అని పిలిచే దేవుడినే తెలుగు వారు, సంస్కృత గ్రంథాలు అరుణాచలేశ్వరుడిగా పిలిచాయి.


అయితే ఈ అరుణాచలం పదం తెలుగువారికి ఎంత దగ్గరైందంటే... ఆ దేవుడితో పాటు, ఆ క్షేత్రం మొత్తాన్ని అరుణాచల క్షేత్రం అనే చాలామంది పిలుస్తారు.
దీంతో చాలా మంది తెలుగు, కన్నడ భక్తులకు తిరువణ్ణామలై అనే పదం తెలియదు.
అక్కడకు యాత్రలు నిర్వహించే ఆపరేటర్లు, ఇతరత్రా అన్ని లావాదేవీలు, బోర్డులు అన్నింటా అరుణాచలం అనే పదాన్నే వాడతారు. గుడిలో దేవుడి పేరు, అక్కడి కొండ పేరు, ఆ ఊరి పేరు మూడూ తెలుగువారికి అరుణాచలమే.
అయితే, ఈ అరుణాచలేశ్వరుడి ఆలయం ఉన్న ఊరిని కూడా తెలుగువారు అరుణాచలం అని పిలుస్తారని చాలా మంది తమిళులకు తెలియదు.
తమిళనాట ఎక్కువ శాతం అణ్ణామలైగానే ఆ దేవుడిని కీర్తిస్తారు.
ఇక అరుణాచలం లేదా అణ్ణామలైయార్ దేవుడు ఉన్న ఊరి పేరు తిరువణ్ణామలైగా మాత్రమే వారికి తెలుసు.
"తిరువణ్ణామలై కాకుండా అరుణాచలం అని ఆ ఊరిని పిలుస్తారన్న విషయం ఇక్కడ చాలా మందికి తెలియదు" అని ఆ నగరానికి చెందిన పాత్రికేయులు, అధికారులు కొందరు బీబీసీతో చెప్పారు.


ఈ రెండు పేర్లలో అణ్ణామలై అనే పేరే పాతదని చెబుతున్నారు చరిత్రకారులు. తమిళంలో శివుని మీద భక్తి గీతాలు రాసిన తిరుజ్ఞాన సంబంధర్, మాణిక్య వాచకర్, అప్పర్ అనే నాయనార్లు దేవుణ్ని అణ్ణామలైగానే కీర్తించారని వారు చెబుతున్నారు.
''తిరుజ్ఞాన సంబంధర్ 7వ శతాబ్ది ద్వితీయార్థానికి చెందిన వారు. ఆయన అణ్ణామలైయార్ అనే రాశారు. ఇక శాసనాల పరంగా చూసినా 9వ శతాబ్దానికి చెందిన శాసనాల్లో అణ్ణామలైనాథర్ అనే రాసి ఉంది. నాకు తెలిసినంత వరకూ అరుణాచలం అనే పదం 17వ శతాబ్ది నుంచే తెలుగు, సంస్కృతాల్లో వాడుకలోకి వచ్చింది. తెలుగు, సంస్కృత శాసనాల్లో మాత్రం ఈ అరుణాచలం పదం కనిపిస్తుంది'' అని బీబీసీకి చెప్పారు తిరువణ్ణామలైకు చెందిన చరిత్ర అధ్యయనకారులు బాలమురుగన్.
‘తమిళనాట చాలా మంది అరుణాచలం అనే పేరు పెట్టుకుంటారు. అరుణాచలంతో పాటు అరుణగిరి అనే పేరు కూడా ఉంది. కాకపోతే ఊరి పేరు మాత్రం తిరువణ్ణామలైగానే స్థానికులకు తెలుసు’ అని చెప్పారు బాలమురుగన్.
పాత తమిళపేరు స్థానంలో అరుణాచలం అనే సంస్కృత పేరును ఊరికి వాడడంపై కొందరు తమిళులకు అసంతృప్తి ఉంది అని ఆయన చెప్పారు. అయితే సోషల్ మీడియా కేంద్రంగానే దీనిపై మరింత చర్చ, ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు బాలమురుగన్.


ఫొటో సోర్స్, TN Endowments
కేవలం బస్సు బోర్డు గురించి మాత్రమే కాదు... తెలుగువారు అణ్ణామలై దేవుణ్ణి అరుణాచల దేవుడిగా పిలవడాన్ని కూడా తప్పుపడుతూ చాలామంది తమిళులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఏదైనా భక్తి పోస్టు ఉంటే, కింద చాలా మంది తెలుగువారు అరుణాచల శివ అని కామెంట్ చేస్తుంటారు.
దానికి ప్రతిగా, తమ దేవుడి పేరు మార్చేస్తున్నారంటూ తమిళులు ఆగ్రహం వ్యక్తం చేసే పోస్టులు కనిపిస్తుంటాయి.
''దేవుడిని ఏ పేరుతో అయినా పిలవవచ్చు. కానీ ఊరిని మాత్రం తిరువణ్ణామలైగా పిలిస్తేనే స్థానికులకు అర్థం అవుతుంది. ఇతర రాష్ట్రాల బస్సులు, ప్రైవేటు వాహనాల వారు ఏమని పిలుస్తారన్నది సమస్య కాదు కానీ, తమిళనాడు ఆర్టీసీ కూడా ఆ పేరు మార్చడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అసలు అరుణాచలం అనే పేరు తెలియని చాలా మంది తమిళులు, ఆ బస్సు మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడు సరిహద్దుల్లోకి వచ్చిన తరువాత కూడా ఆ బస్సు చాలా దూరం ప్రయాణించాలి. ఆ క్రమంలో తిరువణ్ణామలైకి వెళ్లాల్సిన తమిళులు, ఆ బస్సు అరుణాచలం అనే వేరే ఊరు వెళ్తోందని భావించి మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కనీసం తమిళనాడు ఆర్టీసీ బస్సుల వరకైనా తిరువణ్ణామలై పేరు తప్పనిసరి'' అని బీబీసీతో చెప్పారు పేరు వెల్లడించడానికి ఇష్టపడని తమిళనాడుకు చెందిన పాత్రికేయులు ఒకరు.
అయితే చాలా మంది తమిళులు వ్యతిరేకించే అరుణాచలం అనే పదమే, తమిళనాడు దేవాదాయ శాఖ అధికారికంగా ఆ దేవాలయానికి పెట్టింది. దేవాదాయ శాఖ రికార్డుల ప్రకారం, ఆ ఆలయం పేరు అరుల్మిగు అరుణాచలేశ్వర దేవస్థానం అనే రాసి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీలు, ఇతర ప్రైవేటు సంస్థలు మాత్రం అరుణాచలం పేరును కొనసాగిస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














