మెడలో 9 కేజీల గొలుసుతో ఎంఆర్ఐ స్కానర్ దగ్గరకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాడలీన్ హాల్పెర్ట్
- హోదా, బీబీసీ న్యూస్, న్యూయార్క్
మెడలో భారీ మెటల్ చైన్ వేసుకున్న 61 ఏళ్ల ఓ వ్యక్తిని మాగ్నటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) మెషిన్ లాగేయడంతో ప్రాణాలు కోల్పోయారు.
న్యూయార్క్ లాంగ్ ఐలాండ్ ప్రాంతం వెస్ట్‌బరీలోని నసావ్‌లో ఉన్న ఒక ఎంఆర్ఐ కేంద్రంలోకి ప్రవేశించిన ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు.
ఎంఆర్ఐ మెషిన్ పనిచేస్తున్న సమయంలో ఆయన అనుమతి లేకుండా ఆ గదిలోకి ప్రవేశించారని నసావ్ పోలీసులు శాఖ చెప్పింది.
మృతుడు తన భర్తేనని ఆ ఎంఆర్ఐ కేంద్రంలో ఉన్న ఒక రోగి చెప్పారు. బుధవారం(జులై 16న) తనకు స్కానింగ్ జరిగిన సమయంలో తన భర్తను పిలిచానని.. ఆయన లోపలికి వచ్చిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ గురువారం ఆయన మరణించారని అధికారులు చెప్పారు.

ఎంఆర్ఐ మెషిన్ ఎందుకు లాగేసింది?
వైద్య అవసరాల కోసం సవివర చిత్రాలను తీసేందుకు ఎంఆర్ఐ మెషిన్లు శక్తిమంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్ (అయస్కాంత క్షేత్రాల)ను ఉపయోగిస్తాయి.
అందుకే ఎంఆర్ఐ స్కానింగ్‌కు వెళ్లినవారిని, ఆ మెషిన్ సమీపంలోకి వెళ్లేవారిని శరీరంపై ఏవైనా లోహ ఆభరణాలు ఉంటే తీసేయాలని సూచిస్తారు.
''మెడలో పెద్ద మెటాలిక్ చైన్ వేసుకున్న వ్యక్తిని మెషిన్ లాగేసింది. ఫలితంగా ప్రమాదం జరిగింది'' అని ఈ ఘటనపై విచారణ జరుపుతున్న నసావ్ కౌంటీ పోలీసులు చెప్పారు.
అయితే బాధితుడి పేరును పోలీసు శాఖ వెల్లడించలేదు. కానీ చనిపోయిన ఆ వ్యక్తి తన భర్త కెయిత్ అని అడ్రినా జోన్స్-మెక్ అలిస్టర్ అనే మహిళ స్థానిక టీవీ స్టేషన్ 'న్యూస్ 21 లాంగ్ ఐలాండ్'కి చెప్పారు.
తన మోకాలికి ఎంఆర్ఐ స్కాన్ కోసం వెళ్లానని.. అది పూర్తయిన తరువాత తన భర్తను సహాయం కోసం గదిలోకి పిలిచానని ఆమె వెల్లడించారు.
అప్పటికి ఆయన మెడలో 9 కేజీల చైన్ ఉందని.. వెయిట్ ట్రైనింగ్ కోసం దానిని ఆయన ఉపయోగించేవారని ఆమె చెప్పారు.
‘ఆ సమయంలో మెషిన్ ఆయన్ను లాగేసింది. దాంతో ఆయన ఎంఆర్ఐను బలంగా ఢీకొన్నారు’ అని జోన్స్ వివరించారు.
మెషిన్ నుంచి తన భర్తను లాగడానికి టెక్నిషియన్ ప్రయత్నించారని, మెషిన్‌ను స్విచ్ ఆఫ్ చేయగలవా అని తాను టెక్నిషియన్‌ను అడిగానని ఆమె చెప్పారు.
ఓపెన్ ఎంఆర్ఐ వివరణ కోసం బీబీసీ సంప్రదించింది.

ఫొటో సోర్స్, Getty Images
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏమంటోంది?
ఎంఆర్ఐ మెషిన్లకు అయస్కాంత క్షేత్రాలు ఉంటాయని.. తాళం చెవులు, మొబైల్ ఫోన్లు, చివరకు ఆక్సిజన్ ట్యాంకులు సహా అన్ని పరిమాణాల్లోని లోహపు వస్తువులను అవి ఆకర్షిస్తాయని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
అలాంటప్పుడు స్కానర్ ధ్వంసం కావచ్చు.. లేదంటే పేషెంట్‌కో, వైద్య నిపుణులకో గాయాలు కావొచ్చు అని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
2001లో న్యూయార్క్ సిటీ మెడికల్ సెంటర్‌లో ఆరేళ్ల బాలుడికి ఎంఆర్ఐ పరీక్ష చేస్తుండగా, ఎంఆర్ఐ మెషీన్ ఆక్సిజన్ ట్యాంక్‌ను ఆకర్షించడంతో అది గది అంతా విసిరికొట్టినట్లు తిరిగింది. ఈ ప్రమాదంలో తలకు గాయమైన ఆ బాలుడు చనిపోయాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














