ఆంధ్రప్రదేశ్: వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి రిమాండ్, స్పందించిన జగన్‌.. ఆయన ఏమన్నారంటే

ఎంపీ మిథున్ రెడ్డి, మద్యం కుంభకోణం కేసు, వైఎస్ జగన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఏసీబీ కోర్టు ప్రాంగణంలో ఎంపీ మిథున్ రెడ్డి(కుడి వైపు వ్యక్తి)
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్ట్ 1 వరకూ రిమాండ్ విధించింది.

లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా పేర్కొన్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జూలై 19 శనివారం రాత్రి అరెస్టు చేసింది. జూలై 20న (ఆదివారం) వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది.

కోర్టు ఆయనకు ఆగస్ట్ 1వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. దీంతో మిథున్‌ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు.

ఎంపీ మిథున్ రెడ్డి, మద్యం కుంభకోణం కేసు, వైఎస్ జగన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రిమాండ్ రిపోర్ట్ (మొదటి పేజీ)

రిమాండ్‌ రిపోర్టులో ఏముందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్న 2019 – 24 మధ్య కాలంలో తీసుకొచ్చిన మద్యం విధానంలో, మిథున్‌రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సిట్‌ పేర్కొంది.

మిథున్‌రెడ్డిని కుట్రదారుగా అభివర్ణించిన సిట్.. మద్యం విధానంలో మార్పులు, అమలు, ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు చేసింది.

పక్కా ప్లాన్ ప్రకారం, అనుచిత లబ్ది పొందేందుకు 2019 - 2024 మధ్య రాష్ట్రంలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి, తద్వారా డిస్టలరీల నుంచి ముడుపులు అందుకున్నారని ఆరోపించింది సిట్.

కేవలం వ్యక్తులకు అనుచిత లాభం చేకూర్చే అప్పటి మద్యం విధానంతో రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించారని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఈ క్రమంలోనే, మిథున్ ‌రెడ్డి పలుమార్లు అప్పటి సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌ రెడ్డి, ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డితో చర్చలు జరిపారని కోర్టుకు తెలిపింది.

మొత్తంగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం ద్వారా, లోతైన కుట్రకు తెరలేపారని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సిట్‌ ఆరోపణలు చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎంపీ మిథున్ రెడ్డి, మద్యం కుంభకోణం కేసు, వైఎస్ జగన్

ఫొటో సోర్స్, APCMO/FB

మాజీ సీఎం జగన్ ఏమన్నారు?

మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

''మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది ప్రజల పక్షాన నిలబడే వారి నోరునొక్కే రాజకీయ కుట్ర మినహా మరోటి కాదు. మిథున్ రెడ్డిని బలవంతంగా ఈ కేసులో ఇరికించారు. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య'' అని జగన్ ఎక్స్‌లో రాశారు.

మద్యం కుంభకోణం జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు కేవలం మీడియా నాటకాల కోసం, అసలు సమస్యల నుంచి దృష్టిని మళ్లించే కల్పిత కథనమని ఆయన విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: పెద్దిరెడ్డి

తన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి, ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

''గతంలో కూడా ఇలానే మిథున్ రెడ్డిపై కేసు పెట్టారు. కానీ ఆఖరికి అది తప్పుడు కేసని ప్రూవ్ అయ్యింది. వైఎస్ జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించారు'' ఆయన అన్నారు.

ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర

మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ కేసులో ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదని, సాక్ష్యాలు, ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలు ఉంటాయి'' అని అన్నారు.

కేసు విచారణలో ఉన్నందున ఇంతకుమించి మాట్లాడలేమని ఆయన బీబీసీతో చెప్పారు.

ఎంపీ మిథున్ రెడ్డి, మద్యం కుంభకోణం కేసు, వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/Peddireddy Midhun Reddy

ఫొటో క్యాప్షన్, ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేశారు.

ఇప్పటి వరకూ ఏం జరిగింది?

ఏపీ మద్యం కుంభకోణం కేసు(ఏపీ లిక్కర్ స్కాం)లో వైసీపీకి చెందిన రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌ రెడ్డి‌ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) శనివారం (జూలై 19) రాత్రి అరెస్టు చేసింది.

ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.

మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్టు చేశారు.

ఈ విషయమై.. సిట్ చీఫ్‌, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర బాబును సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.

ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

లిక్కర్ స్కాం కేసులో అరెస్టు కాకుండా, ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జూలై 17న సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈనెల 15న ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

దీంతో ఈనెల 17న మిథున్ రెడ్డి‌పై అరెస్ట్ వారెంట్‌ జారీ కోసం సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.

మిథున్ రెడ్డి

ఫొటో సోర్స్, Peddireddy Midhun Reddy/facebook

మిథున్‌రెడ్డిపై ఆరోపణలు ఇవీ..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం సిట్‌‌ను‌ ఏర్పాటు చేసింది.

ఈ స్కాంలో మిథున్‌ రెడ్డి కీలకపాత్ర పోషించారని, ఆయనే మాస్టర్‌ మైండ్‌ అని సిట్‌ ఆరోపిస్తోంది.

వైసీపీ హయాంలో, వివిధ మార్గాల ద్వారా మిథున్‌ రెడ్డికి సంబంధమున్న కంపెనీకి ఐదు కోట్ల రూపాయలు చేరినట్లు దర్యాప్తులో తేలిందని, అందువల్ల ఆయనను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సిన అవసరం ఉందని ముందస్తు బెయిల్‌ రద్దు వాదనల సందర్భంగా పేర్కొంది.

మిథున్‌రెడ్డి గతంలో ఓసారి విచారణకు హాజరైనప్పటికీ దర్యాప్తునకు సహకరించలేదని, అందుకే కస్టోడియల్‌ ఇంటరాగేషన్ అవసరమని సిట్‌ వాదించింది.

మద్యం కేసు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే 11 మంది అరెస్ట్

లిక్కర్‌ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కడప మాజీ ఆర్డీవో కృష్ణమోహన్‌రెడ్డి సహా ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు.

అరెస్టైన వారి నుంచి రాబట్టిన వివరాలు, ఆధారాలతో విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మాజీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామికి నోటీసులు

కాగా, వైసీపీ హయాంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన కళత్తూరు నారాయణ స్వామిని ఈనెల 21న విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ నోటీసులు జారీ చేసింది.

మిథున్‌రెడ్డి అరెస్ట్ కక్షపూరితం: వైసీపీ

మిథున్ రెడ్డి అరెస్టు పూర్తిగా కక్షపూరితమని వైసీపీ ఆరోపించింది. ఆయన అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎంపీ వెంకటరామిరెడ్డి సోషల్‌ మీడియా ద్వారా ప్రకటనలు చేశారు. మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

విడదల రజనీ

ఫొటో సోర్స్, X/Screenshot

ఫొటో క్యాప్షన్, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి విడదల రజనీ ఎక్స్‌లో తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)