ఎమ్మెల్సీ కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి, గన్‌మెన్ కాల్పులు

క్యూ న్యూస్ కార్యాలయం, దాడి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఉన్న క్యూ న్యూస్ కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు 'క్యూ న్యూస్' కార్యాలయంపై దాడి చేశారు.

ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఉన్న క్యూ న్యూస్ కార్యాలయాన్ని జాగృతి నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లి, అక్కడి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఘటనపై క్యూన్యూస్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేస్తున్నట్లుగా మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి చెప్పారు.

మరోవైపు, తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న శాసనమండలి సభ్యత్వం రద్దు చేయాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత ఫిర్యాదు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తీన్మార్ మల్లన్న, కవిత

ఫొటో సోర్స్, Q News

ఫొటో క్యాప్షన్, శనివారం సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగంలో బీసీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీల సదస్సు జరిగింది.

వివాదం ఎందుకు?

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గత కొంతకాలంగా బీసీ నినాదం‌తో బీసీలకు సంబంధించి సభలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇటీవల తెలంగాణ మంత్రివర్గం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంబురాలు చేసుకున్నారంటూ తీన్మార్ మల్లన్న కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని ఝరాసంగంలో బీసీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీల సదస్సు జరిగింది. దీనికి తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడుతూ ''42 శాతం కోసం ఆర్డినెన్స్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత రంగులు పూసుకుంటోంది. దున్నపోతు ఈనితే దూడను కట్టేసినట్లు ఉంది కథ. బీసీలకు 42 శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేమీ సంబంధం? నువ్వు బీసీవా?'' అన్నారు.

ఆ తర్వాత కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారాయన.

కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను నిరసిస్తూ, తెలంగాణ జాగృతి కండువాలు వేసుకున్న కొందరు ఆదివారం మల్లన్న ఆఫీసు కొనసాగుతున్న మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఈ ఘటనలో తలుపు అద్దంతో పాటు కుర్చీలు, టేబుళ్లు, స్టూడియోలోని పరికరాలు ధ్వంసమయ్యాయి.

క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, 'క్యూ న్యూస్' కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు.

''ఒక్కసారిగా 30 మంది దాడి చేశారు. గన్‌మెన్ వారిని నిలవరించేందుకు ఎంతో ప్రయత్నించారు. అయినా లోపలికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు'' అని క్యూ న్యూస్ ప్రతినిధి సుదర్శన్ చెప్పారు.

గన్‌మెన్‌పై దాడి చేసి కొట్టారని, ఆ క్రమంలోనే అతను ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపారని ఆయన వివరించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. గన్‌మెన్ ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఘటనలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

ఇరు వర్గాల ఫిర్యాదులు

క్యూ న్యూస్ ఛానెల్ కార్యాలయంపై దాడి కేసులో ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు, మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లుగా మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి చెప్పారు.

''తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేసి, సామగ్రి ధ్వంసం చేయడంతో పాటు, చంపేందుకు ప్రయత్నించారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేశాం'' అని ఆయన తెలిపారు.

అలాగే తీన్మార్ మల్లన్న సహా కొందరు తమపై దాడి చేశారని లింగమయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని ఏసీపీ తెలిపారు.

''ఎమ్మెల్సీ కవితపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లినప్పుడు తీన్మార్ మల్లన్న సహా మరికొందరు కత్తులు, అగ్నిమాపక పరికరాలతో దాడి చేసి చంపాలని ప్రయత్నించినట్లుగా లింగమయ్య ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా కేసు పెట్టాం'' అని ఏసీపీ చక్రపాణి చెప్పారు.

ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతోందని ఏసీపీ తెలిపారు.

గన్‌మెన్ కాల్పులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, క్యూ న్యూస్ ఆఫీసులో గన్‌మెన్

తీన్మార్ మల్లన్న ఏమన్నారంటే?

కవితపై తాను చేసిన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న సమర్థించుకున్నారు.

''నేను చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కురుమ, యాదవుల మధ్య సామెతగా వాడతారు. అది బూతు కాదు'' అని చెప్పారు.

ఘటనపై తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. ''జై కవిత, డౌన్‌డౌన్ మల్లన్న అంటూ కార్యాలయంపై దాడి చేశారు. గన్‌మెన్ ఎంత నిలువరించినా దాడి చేశారు. మరో గన్‌మెన్ నాకు రక్షణ ఉంటే, అతని వద్ద తుపాకీ లాక్కోని కాల్చడానికి ప్రయత్నించారు. మా గన్‌మెన్లు గాయపడ్డారు'' అని చెప్పారు.

ఆదివారం బీసీల రాజకీయ పార్టీ రాబోతోందని ప్రకటించిన తర్వాత దాడి జరిగిందని తీన్మార్ మల్లన్న చెప్పారు.

''తీన్మార్ మల్లన్నపై దాడి చేస్తే బీసీల ఉద్యమం ఆగిపోతుందని కవిత భావిస్తున్నారు. మీ ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఉంటే కేసీఆర్, కేటీఆర్‌పై చూపించుకోవాలి '' అని చెప్పారు.

ఎమ్మెల్సీగా ఉన్న తనపై దాడి చేసేందుకు ఉసి గొల్పినందుకు కల్వకుంట్ల కవిత సభ్యత్వం రద్దు చేయాలని తీన్మార్ మలన్న డిమాండ్ చేశారు.

కల్వకుంట్ల కవిత, జాగృతి

ఫొటో సోర్స్, kavitha office

ఫొటో క్యాప్షన్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు.

‘మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వం సస్పెండ్ చేయాలి’

తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆదివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత కలిసి ఫిర్యాదు చేశారు.

''వెంటనే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వం సస్పెండ్ చేయాలి'' అని ఆమె డిమాండ్ చేశారు.

ప్రస్తుతం శాసనమండలి సమావేశాలు లేనందున, నేరుగా ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని మండలి చైర్మన్ సూచించారు.

''తీన్మార్ మల్లన్నా... మీరు మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన వ్యక్తం చేయడానికి వెళితే అంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా? ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా!'' అని ప్రశ్నించారు కవిత.

అసలు తీన్మార్ మల్లన్న ఎవరని, ఆయనను ఎందుకు అడ్డుకుంటానని గోల చేస్తున్నారని కవిత ప్రశ్నించారు.

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

''ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే, మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అలాగే కాల్పుల ఘటనపై పూర్తి విచారణ చేయాలని సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నా'' అని కవిత అన్నారు.

తీన్మార్ మల్లన్న చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు.

మార్చిలోనే మల్లన్న సస్పెన్షన్

నిరుడు జూన్‌లో జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ బలపరచడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన తీరును నిరసిస్తూ పార్టీపై విమర్శలు చేశారాయన. కులగణన పత్రాలు తగులపెట్టారు.

ఈ క్రమంలో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఈ ఏడాది మార్చిలో మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)