ఎయిరిండియా విమాన ప్రమాదం: ఎయిర్‌హోస్టెస్ మైథిలీ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదా, ఆ కుటుంబం ఏం చెబుతోంది?

మైథిలీ పాటిల్

ఫొటో సోర్స్, Maithili Patil

    • రచయిత, అల్పేశ్ కర్కరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి నెల రోజులు గడిచాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది.

ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 23 ఏళ్ల మైథిలీ పాటిల్ ఒకరు. ఆమె ఆ విమానంలో క్రూ మెంబర్‌గా ఉన్నారు.

మైథిలీది మహారాష్ట్రలోని పన్వేల్‌ సమీపంలోని షేవా గ్రామం.

ఈ ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నప్పటికీ అధికారుల నుంచి మైథిలీ కుటుంబానికి ఎలాంటి సహాయం అందలేదు. దీంతో వారు నిరాశ చెందారు. తాజాగా బయటికొచ్చిన నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని మైథిలీ కుటుంబం డిమాండ్ చేస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రమీలా

ఫొటో సోర్స్, BBC/Shahid Shaikh

ఫొటో క్యాప్షన్, మైథిలీ పాటిల్ తల్లి ప్రమీల

మైథిలీ తల్లి ఏం చెప్పారు?

ఈ నివేదిక వెలువడిన తర్వాత బీబీసీతో మైథిలీ తల్లి ప్రమీలా పాటిల్ మాట్లాడారు.

''ఇప్పడు రిపోర్టు బయటకు వచ్చింది. దాని ఆధారంగా తగు చర్యలు తీసుకోవడం వారి బాధ్యత. ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు అధికార యంత్రాంగం బాధిత కుటుంబాలకు సహాయం చేసినట్లే ఈ విషయంలో వారు మాకు కూడా సహాయం చేయాలి. నెల రోజులు అవుతోంది. కానీ, ఇప్పటివరకు మాకు ఎలాంటి సహాయం అందలేదు. ప్రమాదం తర్వాత, అందరూ మాకు హామీలు ఇచ్చారు. కానీ, వాస్తవానికి ఒక్కరూ సహాయం చేయలేదు'' అని ప్రమీలా పాటిల్ అన్నారు.

మైథిలీ పాటిల్ కుటుంబం

ఫొటో సోర్స్, BBC/Shahid Shaikh

ఫొటో క్యాప్షన్, మైథిలీ పాటిల్ కుటుంబం

తమ కుటుంబానికి ఆర్థిక ఆధారం మైథిలీ మాత్రమేనని ప్రమీలా పాటిల్ చెప్పారు.

''మా కుటుంబంలో సంపాదిస్తున్నది మైథిలీ మాత్రమే. ఆమె నాన్నకు 52 ఏళ్లు. దినసరి కూలీగా పనిచేస్తారు. మాకు ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె తండ్రి పనికి వెళ్లలేకపోయారు. దీంతో జీతం రాలేదు. పనికి రాకపోతే పనిలో నుంచి తీసేస్తామంటూ వాళ్లు అంటున్నారు. ప్రస్తుతానికి మాకు ఆదాయం వచ్చే మార్గమేదీ లేదు. మేం ఎలా బతకాలి? ఏం తినాలి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఈ స్థితిలో మా కూతుర్ని తలుచుకొని బాధపడాలా? లేక పనికి వెళ్లాలా? ప్రమాదం జరిగిన తర్వాత మమ్మల్ని పరామర్శించడానికి చాలా మంది వచ్చారు. కానీ, అంతిమ సంస్కారాల తర్వాత, మేం ఎలా ఉన్నామని అడిగేందుకు కూడా ఎవరూ రాలేదు'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మైథిలీ బామ్మ ఇందిరా భోయిర్

ఫొటో సోర్స్, BBC/Shahid Shaikh

ఫొటో క్యాప్షన్, మైథిలీ బామ్మ ఇందిరా భోయిర్

‘మైథిలీ కోసం పొదుపుగా జీవించాం’

మైథిలీని చదివించడానికి తాము చాలా పొదుపుగా జీవించామని బీబీసీతో మైథిలీ బామ్మ ఇందిరా భోయిర్ అన్నారు.

''మేం ఎవరిని ఏం అడగాలి? మాకేం కావాలో? ఏం వద్దో వారికి అర్థం కాలేదా? మేం వారిని యాచించాలా? ఆమెను చదివించడానికి మేం పొదుపుగా జీవించాం. విమానాన్ని నడిపిన పైలట్లు అనుభవజ్ఞులు. దర్యాప్తు జరుగుతోంది. మా తరహాలోనే చాలా కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి. మాకేం న్యాయం చేస్తారో అధికారులకే తెలియాలి'' అని ఇందిరా భోయిర్ అన్నారు.

మైథిలీ ఎయిర్‌హోస్టెస్ అయినప్పుడు తాము చాలా గర్వించామని ఇందిర గుర్తు చేసుకున్నారు.

''మా జిల్లాలో, మా తాలూకాలో ఎవరూ ఇలాంటి ఉద్యోగాన్ని సంపాదించలేదు. మాకు చాలా గర్వంగా ఉండేది. ఆమె వయస్సు 23 ఏళ్లు మాత్రమే. 25 ఏళ్లు వచ్చాక పెళ్లి చేయాలని మేం అనుకున్నాం'' అని ఇందిర గుర్తు చేసుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)