కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్: ‘ఆ నలుగురు వేధిస్తున్నారు’ అంటూ 50 మంది విద్యార్థినులు చేసిన ఫిర్యాదులో ఇంకా ఏం చెప్పారు?

మహిళలపై వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

కాకినాడ జిల్లా రంగగాయ మెడికల్‌ కళాశాలలో బీఎస్సీ డిప్లమో ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ విద్యార్థినుల పట్ల 'బ్యాడ్‌ టచ్‌' తో వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణపై నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్టు కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు.

ఆ నలుగురిపై కాకినాడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు ఆయన చెప్పారు.

ఈ ఘటనపై బీబీసీకి డాక్టర్‌ విష్ణు వర్దన్ వెల్లడించిన వివరాల ప్రకారం..

రంగరాయ మెడికల్‌ కళాశాలలో బీఎస్సీ–ఎంఎల్‌టి చదువుతున్న వారితో పాటు సమీపంలోని వివిధ ఒకేషనల్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులు ఇక్కడ ల్యాబ్‌లలో ట్రైనింగ్ కోసం వస్తుంటారు.

ఈ మేరకు నెలరోజులుగా 50మంది విద్యార్థినులు ఇక్కడికి ట్రైనింగ్‌ కోసం వస్తున్నారు. ఆ క్రమంలో బయో కెమిస్ట్రీ ల్యాబ్‌ అటెండెంట్‌గా పని చేస్తున్న వాడ్రేవు కల్యాణ చక్రవర్తి ఉద్దేశపూర్వకంగా విద్యార్థినులను తాకడం, ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదు అందిందని ప్రిన్సిపల్‌ తెలిపారు.

ఆయనకు మరో ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు గోపాలకృష్ణ, ప్రసాద్, జిమ్మీరాజు సహకరించినట్టు ఫిర్యాదు రావడంతో ఆ నలుగురినీ సస్పెండ్‌ చేసినట్టు ఆయన వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నలుగురు వేధిస్తున్నారంటూ 50మంది విద్యార్థినుల ఫిర్యాదు

ఫొటో సోర్స్, Getty Images

మెయిల్‌ ద్వారా ఫిర్యాదు

''విద్యార్థినులు తొలుత మెయిల్‌ ద్వారా ఈ నెల 9వ తేదీన కల్యాణచక్రవర్తిపై ఫిర్యాదు పంపారు. నేను వెంటనే ఆ ఫిర్యాదును ఇంటర్‌నల్ కంప్లయింట్స్‌ కమిటీకి విచారణ నిమిత్తం పంపాను. ఒక హెచ్‌ఓడీ, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లతో కూడిన ఆ కమిటీ దాదాపు 50మంది విద్యార్ధినులతో మాట్లాడింది. విద్యార్థినులు ఆరోగ్యపరీక్షల్లో నిమగ్నమై ఉండగా, వారికి తెలియకుండా వారి శరీరభాగాలను కల్యాణచక్రవర్తి ఫోటోలు తీసి వారికే పంపేవాడనీ, అవి మరెవరికీ పంపే వీలు (షేర్‌ చేసే అవకాశం) లేకుండా వన్‌టైం వ్యూ ద్వారా పంపేవాడని విద్యార్థినులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము చెప్పినట్లు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరించే వాడని విద్యార్థినులు ఆరోపించారు'' అని విష్ణువర్దన్‌ తెలిపారు.

ఫిర్యాదు కాపీని నిశితంగా పరిశీలించిన తర్వాతే తగిన సెక్షన్లు నమోదు చేసి విచారణ మొదలుపెడతామని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ దుర్గారావు తెలిపారు.

సీఎం చంద్రబాబు సీరియస్‌

కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించగా, సమగ్ర నివేదికను సీఎంకి అందించినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్

ఫొటో సోర్స్, kakinada.ap.gov.in

విద్యార్థినుల నుంచి ఫిర్యాదు రాగానే వెంటనే కళాశాల అధికారులు స్పందించి, చర్యలు తీసుకున్నారని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ బీబీసీకి తెలిపారు. నలుగురు నిందితులపై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సస్పెండ్ అయిన నలుగురు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.

ఈ విషయమై పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాకినాడ జీజీహెచ్ యూనియన్ నేత బీబీసీతో మాట్లాడారు.

‘‘నిజంగా వాళ్ళు అలా ప్రవర్తిస్తే చాలా దుర్మార్గం. ఆడపిల్లల పట్ల అలా ప్రవర్తించడం క్షమించరాని నేరం. కానీ ఆ నలుగురిలో ఏ ఒక్కరిది తప్పులేదని చివరిలో తేలినా..ఇప్పుడు వాళ్లుపడే క్షోభను ఎవ్వరూ తొలగించలేరు’’ అని వ్యాఖ్యానించారు.

గోప్యతను కాపాడేందుకు బాధితుల వివరాలను బీబీసీ ప్రచురించడం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)