ఒడిశా: పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి ఆర్మీ అధికారిని, ఆయనకు కాబోయే భార్యను వేధించారంటూ ఆరోపణలు, అసలేం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సందీప్ సాహు
    • హోదా, బీబీసీ కోసం, భువనేశ్వర్ నుంచి

ఆర్మీ అధికారిపై, ఆయన కాబోయే భార్యపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెప్టెంబర్ 14 అర్ధరాత్రి (తెల్లవారితే 15) ఆ ఘటన జరిగింది. సెప్టెంబర్ 20న కేసు నమోదు చేశారు.

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని విషయాలు మీ మనసును కలచివేయవచ్చు.

భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐదుగురు పోలీసులపై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే, ఆర్మీ అధికారి, ఆయన కాబోయే భార్య చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన పోలీసులు, ఆ రోజు జరిగిన ఘటనపై తమ వర్షన్‌ను చెప్పారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసులు, స్టేషన్ ఇన్‌ఛార్జ్ దీనకృష్ణ మిశ్రా, సబ్‌ ఇన్‌స్పెక్టర్ వైశాలిని పాండా, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ శైలమయీ సాహూ, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హంసదాలు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఆరోపణల మధ్యలోనే సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.

ఇది రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలని ఆ రాష్ట్ర విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది.

ఎవరు తప్పు చేసినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ చెప్పారు.

ఆరోపణలేంటి?

సెప్టెంబర్ 14 అర్ధరాత్రి (తెల్లవారితే ఆదివారం) ఆర్మీ అధికారి, ఆయన కాబోయే భార్య తమతో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసేందుకు భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లారు.

అయితే, పోలీసులు ఫిర్యాదును నమోదు చేసి, వారికి సాయం చేయడానికి బదులు, వారిని దారుణంగా కొట్టి, యువతిని లైంగికంగా వేధించారన్నది ఆరోపణ.

సెప్టెంబర్ 19న తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆ యువతి, పోలీస్ స్టేషన్‌లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వివరించారు.

పోలీస్ స్టేషన్‌లో తమను దారుణంగా కొట్టడమే కాకుండా, తనను లైంగికంగా వేధించారని ఆమె చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు ఆ ఆర్మీ అధికారిని లాకప్‌లో బంధించారని, ఆయన కాబోయే భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆమెను అరెస్ట్ చేశారని ఆరోపణలు వచ్చాయి.

అయితే, ఆర్మీ అధికారి, ఆయన కాబోయే భార్య భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు మద్యం తాగి ఉన్నారని, పోలీస్ స్టేషన్‌లో రచ్చ చేశారని, అక్కడున్న అధికారులతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఆరోపించారు.

సీనియర్ ఆర్మీ అధికారులు జోక్యం చేసుకోవడంతో, తమ అదుపులో ఉన్న ఆర్మీ అధికారిని 10 గంటల తర్వాత పోలీసులు విడుదల చేశారు.

కానీ, ఆయనకు కాబోయే భార్యను మాత్రం పోలీసులు తమ కస్టడీలోనే ఉంచుకుని, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆమె బెయిల్ పిటిషన్ కూడా రిజక్ట్ అయింది.

కానీ, సెప్టెంబర్ 18న స్థానిక కోర్టు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒడిశా హైకోర్టు తక్షణమే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ఆమెకు చికిత్స అందివ్వాలని ఆదేశించింది.

బాధితురాలి ఆరోపణలేంటి?

సెప్టెంబర్ 14న అర్ధరాత్రి (తెల్లవారితే 15) ఒంటి గంట సమయంలో, తన రెస్టారెంట్ మూసివేసి, కాబోయే భర్తతో కలిసి వెళ్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు తమను వెంబడించి, తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె చెప్పారు.

దానిపై ఫిర్యాదు చేసేందుకు తాము భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడున్న పోలీసు అధికారులు ఫిర్యాదు నమోదు చేయకుండా తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు.

మీడియా ముందుకు వచ్చి ఆమె ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించారు.

‘‘తొలుత నాకు కాబోయే భర్తను లాకప్‌లో వేశారు. నేను ఆందోళన చేయడం ప్రారంభించినప్పుడు, మహిళా పోలీసు అధికారి నన్ను దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని లాగారు. ఆత్మ రక్షణ కోసం ఒక అధికారి చేయిని కొరికాను. ఆ తర్వాత, అక్కడున్న అధికారులందరూ కోపంతో నాపై దాడి చేశారు. ముగ్గురు మహిళా అధికారులు కలిసి నన్ను గట్టిగా కొట్టడం ప్రారంభించారు.’’

‘‘ఒక మహిళా అధికారి నా చేతులు పట్టుకుంటే, ఇద్దరు మగ అధికారులు నా చేతులపై కాళ్లు పెట్టారు. మరో మహిళా అధికారి నా ఛాతిపై, పొట్టపై గట్టిగా తన్నారు. వారిలో ఒకరు నా గొంతు నులిమేందుకు ప్రయత్నించారు. కాసేపటి తర్వాత, ఒక మగ అధికారి నా జాకెట్‌తో చేతులు కట్టేసి, మహిళా అధికారి స్క్రాప్‌తో నా కాళ్లను కట్టేశారు. ఆ తర్వాత నన్ను ఒక గదిలోకి లాకెళ్లి, అక్కడ బంధించి నన్ను లైంగికంగా వేధించారు’’ అని ఆమె చెప్పారు.

ఆమె శరీరమంతా దాడి జరిగిన గుర్తులు ఉన్నాయని ఎయిమ్స్ వైద్య నివేదిక పేర్కొంది. ఆమె పళ్లల్లో ఒకటి విరిగిపోయిందని, దవడకు కూడా గాయమైందని ఆ రిపోర్టులో ఉంది. ఆమె ఒక చేతి ఎముక కూడా విరిగిపోయింది.

‘‘ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటలకు పోలీసు అధికారి వచ్చినప్పుడు, నన్ను వదిలేస్తారేమోనన్న ఆశ కలిగింది. కానీ, నా బాధ వినకుండా, ఆ అధికారి కూడా నా ముఖంపై గట్టిగా కొట్టారు. నన్ను లైంగికంగా వేధించారు. నేను గట్టిగా అరిచాను. కానీ, ఎవరూ పట్టించుకోలేదు’’ అని బాధిత యువతి చెప్పారు.

స్టేషన్ ఇన్‌ఛార్జ్ దీన్‌కృష్ణ మిశ్రా

ఫొటో సోర్స్, BISWRANJAN MISHRA

ఫొటో క్యాప్షన్, సస్పెండ్ అయిన పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దీనకృష్ణ మిశ్రా

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఆ రోజు భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఆర్మీ అధికారి, ఆయన కాబోయే భార్య ఇద్దరూ మద్యం తాగి ఉన్నారని భువనేశ్వర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రతీక్ సింగ్ సెప్టెంబర్ 17న చెప్పారు.

‘‘పోలీస్ స్టేషన్‌లో వారు రచ్చ చేశారు. అక్కడున్న అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. వారిని ఆపేందుకు ఒక మహిళా అధికారి ప్రయత్నించగా, ఆమె చేయిని కొరికారు. పోలీస్ స్టేషన్‌ను, కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు. వారిపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నాం’’ అని ఆయన తెలిపారు.

ఆర్మీ అధికారి కారు నుంచి రెండు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు వారిద్దరూ అంగీకరించలేదని ప్రతీక్ సింగ్ చెప్పారు.

వీడియో వైరల్

పోలీస్ స్టేషన్‌లో ఆ రోజు రాత్రి రికార్డయిన వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఆర్మీ అధికారి పేపర్‌పై ఫిర్యాదు రాస్తున్నారు. ఆయనకు కాబోయే భార్య పక్కనే ఉన్నారు.

‘‘ఒక ఆర్మీ అధికారిని ఇలా బంధించకూడదు’’ అంటూ మరో వీడియోలో బాధితురాలు అంటున్నారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఒడిశా డీజీపీ వైబీ ఖురానియాకు లేఖ రాసింది. ఈ కేసులో ఏం చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

పదవీ విరమణ పొందిన ఆర్మీ అధికారుల నిరసన

ఫొటో సోర్స్, BISWRANJAN MISHRA

ఆర్మీ జోక్యం

ఈ ఘటన తర్వాత ఆర్మీ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన జారీ చేసింది.

ఆర్మీ ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుందని, తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోనేలా రాష్ట్ర అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పింది.

మరోవైపు, ఈ కేసులో బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ సైనిక అధికారులు నిరసన తెలిపారు.

ఆ తర్వాత, ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఐదుగురు పోలీసులపై కేసు నమోదైంది.

ఈ విషయంలో జోక్యం చేసుకుని, బాధిత ఆర్మీ అధికారికి, ఆయన కాబోయే భార్యకు న్యాయం చేయాలని కోరుతూ ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ సింగ్‌కు ఆర్మీ సెంట్రల్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీఎస్ షేకావత్ లేఖ రాశారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

‘మోడల్ పోలీస్ స్టేషన్’

ఈ ఘటన జరిగిన భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించినప్పుడు ఇది ‘మోడల్ పోలీస్ స్టేషన్’ అని కమిషనర్ సంజీవ్ పాండా చెప్పారు.

సీసీ కెమెరాలతో సహా అన్ని రకాల అధునాతన సౌకర్యాలు ఆ స్టేషన్‌లో ఉన్నాయని చెప్పారు.

అయితే, ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన క్రైమ్ బ్రాంచ్ టీమ్‌కు మాత్రం, అక్కడ ఒక్క సీసీ కెమెరా కనిపించలేదు.

పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలను ముందు నుంచే అమర్చలేదా? లేక ఈ ఘటన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను రక్షించేందుకు ఆ కెమెరాలను తొలగించారా? అన్నది తెలియాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)