మైనార్టీ తీరని స్నేహితుడి కుమార్తెను రేప్ చేశారనే ఆరోపణలపై దిల్లీ ఉన్నతాధికారి అరెస్టు.. అసలేమిటీ కేసు?

ఫొటో సోర్స్, Getty Images
మైనార్టీ తీరని 17 ఏళ్ల తన స్నేహితుడి కుమార్తెను రేప్ చేశారనే ఆరోపణలపై దిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో అధికారి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఆ అధికారి స్నేహితుడు మూడేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆయన కుమార్తె బాగోగులు చూసుకుంటానని చెప్పి ఆ అధికారి తన ఇంటికి తీసుకెళ్లారు.
ఆ అధికారి నెలలపాటు తనపై లైంగిక దాడి చేశారని, దీనివల్ల తాను గర్భం దాల్చానని, అయితే ఆయన, ఆయన భార్య కలిసి గర్భస్రావం చేశారని బాలిక ఆరోపిస్తోంది.
సోమవారం ఉదయం ఆ అధికారిని దిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు ద టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఆ అధికారిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విధుల నుంచి తొలగించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఆ అధికారి దిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసేవారని దిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
కేసు ఎలా బయటకు వచ్చింది?
ఈ కేసులో ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్ఐఆర్)ను నమోదు చేశామని, దర్యాప్తు పూర్తయిన అనంతరం చర్యలు తీసుకుంటామని దిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.
ఈ లైంగిక దాడి మూడేళ్ల నాటిదని, అయితే, గత వారం బాధిత బాలికను ఆసుపత్రిలో చేర్పించడంతో ఇది వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
యాంగ్జైటీ సమస్యతో బాలిక ఆస్పత్రికి వెళ్లినట్టు ద క్వింట్ తెలిపింది.
కౌన్సెలింగ్ తర్వాత తను ఎప్పటి నుంచో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఆ బాలిక వైద్యులకు చెప్పింది.
‘‘మా అమ్మానాన్నలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. నేను వారితో కలిసి స్థానిక చర్చ్‌కు వెళ్లేదాణ్ని. అక్కడకు నిందితుడి కుటుంబం కూడా వచ్చేది. అలా మా రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది’’ అని ఆ బాలిక తెలిపింది.
అయితే, 2020లో ఆ బాలిక తండ్రి మరణించారు. అనంతరం తల్లి అనుమతితో ఆ అధికారి ఇంట్లో ఉండేందుకు ఆ బాలికను తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కేసు వివరాలను దిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సాగర్ సింగ్ కల్‌సీ మీడియాకు వెల్లడించారు.
‘‘ఆ అధికారి సంరక్షణలో అక్టోబరు 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకూ ఆ బాలిక ఉంది. ఆ సమయంలో తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె చెబుతోంది. పదేపదే తనను రేప్ చేశారని, అబార్షన్ కూడా చేయించారని తెలిపింది. ఆ అధికారి భార్య అబార్షన్ పిల్ ఇచ్చారా అనే విషయాన్ని కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాం’’ అని ఆయన చెప్పారు.
‘‘2021లో ఆ బాలిక మళ్లీ తల్లి దగ్గరకు వచ్చేసింది. కానీ, ఈ లైంగిక వేధింపుల గురించి తల్లికి చెప్పలేదు. అయితే, తాజాగా ఆ బాలికకు వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పుడు వారికి ఆ బాలిక అన్ని విషయాలను వెల్లడించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని ఆయన వివరించారు.
‘‘వేధింపులకు గురయ్యేటప్పుడు ఆ బాలిక తొమ్మిదో తరగతి చదివేది. తనను నిందితుడి భార్య తీవ్రంగా బెదిరించినట్లు ఆ బాలిక చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఆ ఆసుపత్రి మాకు సమాచారం అందించింది. దీంతో వెంటనే కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. కొన్ని రోజుల్లో ఆమె వాంగ్మూలాన్ని నమోదుచేస్తాం’’ అని డీసీపీ సాగర్ సింగ్ చెప్పారు.
ఈ విషయంపై దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతీ మాలీవాల్ కూడా స్పందించారు. ఈ కేసులో ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని పోలీసులకు నోటీసులు పంపినట్లు ఆమె తెలిపారు.
‘‘దిల్లీలోని శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిపై బాలిక తీవ్రమైన ఆరోపణలు చేసింది. అందుకే దిల్లీ పోలీసులకు నోటీసులు పంపించాం. అమ్మాయిని కాపాడాల్సిన వ్యక్తే ఇలాచేస్తే మనం ఎక్కడికి పోవాలి? అతడిపై వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గదర్ 2: సన్నీ దేవోల్ మూవీకి ఎందుకింత క్రేజ్? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది?
- తాడిపత్రి బిర్యానీ: దీని రుచి ఎందుకంత స్పెషల్?
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- లూనా-25: చంద్రుడి మీద కూలిపోయిన రష్యా స్పేస్‌క్రాఫ్ట్
- ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులకు బీఎడ్ చదివినవారు అనర్హులా... సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















