తనకు గర్భం రావడానికి కజిన్ భర్తే కారణమంటూ మైనర్ బాలిక ఫిర్యాదు, డీఎన్ఏ రిపోర్టులతో అందరూ షాక్

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు మలుపులు తిరుగుతోంది.
వరుసకు బావ అయిన వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని, అతని వల్లే గర్భం దాల్చానని ఔరంగాబాద్‌కు చెందిన మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది.
దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
బాలిక పిండానికి డీఎన్ఏ పరీక్ష చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది.
ఆ గర్భానికి కారణం ఆమె 'కజిన్ భర్త' కాదని తేలింది.
డీఎన్‌ఏ రిపోర్టు అనంతరం ఈ కేసులో అతడికి బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
పిండానికి జరిపిన డీఎన్‌ఏ పరీక్షలో తేలిన విషయం తెలిశాక అంతా దిగ్భ్రాంతి చెందారు.
బాలికకు గర్భం రావడానికి కారణం ఆమె సోదరుడేనని డీఎన్‌ఏ నివేదికలో వెల్లడైంది.
డీఎన్‌ఏ నివేదిక వచ్చాక బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె సోదరుడిపై, ఆమె కజిన్ భర్తపై పోలీసులు కేసు మోదు చేశారు.
భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్లతోపాటు లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద వీరిద్దరిపై కేసు నమోదైంది.
డీఎన్‌ఏ పరీక్షకు ముందు ఫిర్యాదులో ఏముంది?
ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 'కజిన్ భర్త' అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో తొలుత ఎఫ్ఐఆర్ నమోదైంది.
“నేను ఇంట్లో ఉన్నప్పుడు మా 'కజిన్ భర్త' నా ఇష్టం లేకుండా నాతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. భయంతో ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. తర్వాత నాకు పీరియడ్స్ రావడం లేదని మా అమ్మ, అమ్మమ్మలకు చెప్పాను. మేం మూడు నెలలు రుతుస్రావం కోసం వేచి చూశాం. కజిన్ భర్త నాతో రెండు సార్లు బలవంతంగా సెక్స్ చేశాడని తర్వాత మా అమ్మతో చెప్పాను. మా అమ్మ సూచించడంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇంటికి తీసుకొచ్చి చూడగా నేను గర్భవతినని తెలిసింది. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాను'' అని ఆమె చెప్పింది.
“ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా 'కజిన్ భర్త' ఐ లవ్ యూ అని చెప్పాడు. తనతో సెక్స్ చేయకపోతే పొడిచి చంపేస్తానని బెదిరించాడు. నా ఇష్టానికి విరుద్ధంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు'' అని బాలిక తన ఫిర్యాదులో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
బాధితురాలి సోదరుడికీ డీఎన్‌ఏ పరీక్ష
బాలిక మైనర్ కావడంతో కుటుంబ సభ్యుల వినతి మేరకు వైద్యులు బాధితురాలికి అబార్షన్ చేశారు. ఆ తర్వాత డీఎన్‌ఏ పరీక్షలు జరిపారు.
బాధితురాలి 'కజిన్ భర్త'కు, ఆమె గర్భానికి సంబంధం లేనట్లు వాటిలో తేలింది.
దీంతో కొన్నిరోజుల తర్వాత 2023 మార్చి18న బాధితురాలు కోర్టులో ‘సప్లిమెంటరీ స్టేట్‌మెంట్’ దాఖలు చేసింది. తన సోదరుడే తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఆమె అందులో చెప్పింది.
‘‘క్రిస్మస్ సెలవులు రావడంతో మా అన్నయ్యతో కలిసి ఇంటికి వచ్చాను. ఆ సమయంలో సెక్స్‌లో పాల్గొనాలంటూ మా సోదరుడు బలవంతం చేశాడు. 10 రోజులు ఇంట్లో ఉన్నాం. ఆ సమయంలో తనతో అప్పుడప్పుడూ సెక్స్‌లో పాల్గొన్నా.
ఆ తర్వాత మా అన్నయ్య నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ నాకు సోనోగ్రఫీ చేయించి, నేను 4 నెలల గర్భవతినని చెప్పాడు. ఇదంతా నీ వల్లే జరిగిందని ఇంటికి వచ్చి మా అన్నయ్యతో గొడవ పడ్డాను. అప్పుడు ఇంకొకరి పేరు చెప్పాలంటూ సూచించాడు.
తన పేరు ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. కాబట్టి నేను ఇప్పటివరకు అతని పేరు ఎవరికీ చెప్పలేదు'' అని ఆ బాలిక చెప్పింది.
ఆమె అన్నయ్యకు డీఎన్‌ఏ పరీక్ష జరపగా, గర్భం రావడానికి కారణం అతడేనని తేలింది.
కజిన్ భర్తపై ఆరోపణలు అనుమానాస్పదమన్న హైకోర్టు
ఈ కేసులో తన బెయిల్ దరఖాస్తును స్థానిక కోర్టు తిరస్కరించడంతో బాధితురాలి కజిన్ భర్త హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌ను ఆశ్రయించారు.
2023 జులై 5న జస్టిస్ ఎస్‌జీ మెహ్రే నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది.
"బాధితురాలి 'కజిన్ భర్త'పై ఎలాంటి ఆరోపణా రుజువు కాలేదు. అతడిపై వచ్చిన ఆరోపణలు అనుమానాస్పదంగా ఉన్నాయి. అందువల్ల అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం'' అని హైకోర్టు చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- స్వార్మ్ డ్రోన్స్: చైనా, పాకిస్తాన్ బలగాలకు భారత సైన్యం వీటితో చెక్ పెట్టగలదా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














