గర్భనిరోధక మాత్రలు వాడితే మొటిమలు వస్తాయా? వీటితో ప్రయోజనాలేంటి? నష్టాలేంటి

గర్భ నిరోధక మాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీల సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలో మహిళలు ఇప్పుడు డాక్టర్ చీటీ లేకుండా గర్భనిరోధక మాత్రలు కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించి ఇటీవలే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఓపిల్ అనే గర్భనిరోధక ఔషధాన్ని అన్ని వయసుల మహిళలు తీసుకోవచ్చని ప్రకటించింది.

ఓపిల్ 2024 ప్రారంభంలో మందుల దుకాణాలలో అందుబాటులోకి వస్తుందని తయారీ సంస్థ చెప్పింది.

అమెరికా సహా ప్రపంచంలోని 100 దేశాలలో గర్భ నిరోధక మందులు మెడికల్ షాపులలో దొరుకుతాయి. లాటిన్ అమెరికాతో పాటు చైనా, బ్రిటన్, భారత్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ గర్భనిరోధక మందులు తీసుకోవడంలో మహిళలకు ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకు సిగ్గు, అవమానాలు వంటి సమస్యలుండేవని, ఇప్పుడది తొలగిపోతుందని అమెరికాలోని నిపుణులు అంటున్నారు.

దీంతో పాటు సంతానోత్పత్తికి సంబంధించిన ఆరోగ్య సేవలను పొందడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేయడానికి సహాయం చేస్తుందని వారు నమ్ముతున్నారు.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన సమాచారం ప్రకారం వైద్య చరిత్రలో వేలాది మందులు అభివృద్ధి అయ్యాయి. అయితే 1950లో గర్భనిరోధక ఔషధాల అభివృద్ధి తర్వాత, పెద్ద మార్పు వచ్చింది.

ఇది మహిళలకు స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా సంతానోత్పత్తిలో నిర్ణయాధికారం కూడా ఇచ్చింది.

కుటుంబ నియంత్రణ

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో కుటుంబ నియంత్రణ

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో ప్రచురించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోనే జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఇండియా. 1952లో భారత్‌లో ఇది మొదలైంది.

ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అమలు చేశారు. దీని కింద గర్భనిరోధక మందులు, కండోమ్‌లు ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా అందజేశారు.

ఆశా కార్యకర్తలు వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు.

“భారతదేశంలో కుటుంబ నియంత్రణకు గర్భనిరోధక మందులు (కాంట్రాసెప్టివ్ డ్రగ్స్) ప్రభావవంతమైన పద్ధతి'' అని గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్ఎన్ బసు అన్నారు.

''సరైన పద్ధతిలో మందులు తీసుకుంటే వందశాతం నివారణ అందుతుంది. అదే సమయంలో ఒక బిడ్డ తర్వాత మరొక బిడ్డను పొందాలనుకున్నప్పుడు ఇది స్త్రీలకు స్వేచ్ఛనిచ్చింది.

ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు రెండూ ఉన్న గర్భనిరోధక మాత్రలను సీవోసీలు అని కూడా పిలుస్తారు. ప్రొజెస్టెరాన్ మాత్రమే ఉన్న వాటిని పీవోపీలు అంటారు'' అని బసు తెలిపారు.

ఇంతకుముందు ఓరల్ కాంట్రాసెప్టివ్‌లలో ఈస్ట్రోజెన్ అధిక మొత్తంలో ఉండేదని, దాని వల్ల దుష్ప్రభావాలు కూడా ఉండేవని, కానీ ఇప్పుడది చాలా తక్కువ మొత్తంలో ఉందని దిల్లీలోని అమృతా హాస్పిటల్‌ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ మిట్టల్ చెప్పారు.

మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు రెండూ ఉన్నాయని, ఈ హార్మోన్లను గర్భనిరోధక పక్రియలో ఉపయోగిస్తారని, ఇవి శరీరంపై భిన్నమైన ప్రభావాలను చూపుతాయని ముంబైలోని గైనకాలజిస్ట్ డాక్టర్ సుచిత్రా డెల్వి తెలిపారు.

మొటిమలు వస్తాయా?

గర్భనిరోధక మాత్రల వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అయితే సీవోసీ, పీవోపీ తీసుకుంటే స్త్రీల శరీరంపై కచ్చితంగా కొన్ని ప్రభావాలు ఉంటాయని ఈ ముగ్గురు వైద్యులు అంటున్నారు.

ఈస్ట్రోజెన్ హార్మోన్ గల మందులు రక్తం గడ్డకట్టే వ్యాధి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్న మహిళలకు సహాయపడతాయని ఈ వైద్యులు చెబుతున్నారు.

ప్రొజెస్టిరాన్‌తో కూడిన మందులు వాడే స్త్రీలు వికారం, తలనొప్పి, సక్రమంగా రుతుక్రమం, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

ఈ మందులు ఇచ్చే ముందు ఏ మహిళలోనూ కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి జబ్బులు లేవని తేలిందని వైద్యులు చెబుతున్నారు.

ఈ గర్భనిరోధక మందులను తీసుకోవడం వల్ల స్త్రీలపై భిన్నమైన ప్రభావాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

వీటిలో ప్రధానమైనవి..

  • శరీరంలో నీరు చేరడం
  • శరీరం‌పై భారంగా అనిపించడం
  • మొటిమలు వచ్చే అవకాశం
  • రొమ్ములో భారంగా ఉండటం
  • ఆలోచనలు మారుతుండటం.

గర్భనిరోధకం చాలాకాలం పాటు తీసుకోవచ్చని, దాని వల్ల ఎక్కువ దుష్ప్రభావాలు ఉండవని డాక్టర్ ప్రతిమా మిట్టల్ తెలిపారు.

“ఒక స్త్రీ ధూమపానం చేసి, ఈస్ట్రోజెన్‌ను కలిగి ఉన్న గర్భనిరోధక మందులను తీసుకుంటే, అది రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. అయితే ఔషధంలో ప్రొజెస్టెరాన్ ఉంటే అది ప్రభావం చూపించదు'' అని డాక్టర్. సుచిత్రా డెల్వి అంటున్నారు.

మెడిసిన్

ఫొటో సోర్స్, Getty Images

క్యాన్సర్ ముప్పు ఉంటుందా?

మరోవైపు వివిధ మహిళల ఆరోగ్య పరిస్థితిని బట్టి గర్భ నిరోధకం వినియోగం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

  • కుటుంబ నియంత్రణ.
  • రుతుక్రమాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడటం.
  • ఋతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం తగ్గించడంలో సహాయపడటం.
  • అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం.

ఈ ఔషధం తీసుకుంటే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనే అపోహ ఉందని, అయితే అలాంటిదేమీ లేదని డాక్టర్ ప్రతిమ మిట్టల్ చెప్పారు.

రోజూ ఈ మందులను తీసుకుంటే ఈ హార్మోన్లు శరీరంలో పేరుకుపోయి, కాలేయం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్తాయనడం సరికాదని డాక్టర్ సుచిత్రా డెల్వి చెప్పారు.

ఎటువంటి రక్షణ లేకుండా సంబంధాలు ఏర్పడితే 120 గంటలలోపు ఐ పిల్ తీసుకోవాలని, ఇది గర్భం దాల్చే అవకాశాలను తగ్గిస్తుందని డాక్టర్ తెలిపారు.

మరోవైపు ప్రొజెస్టెరాన్ కూడా ఐ పిల్‌లో ఉపయోగిస్తారు. దాని పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

మహిళలపై మాత్రమే భారం ఎందుకు?

గర్భనిరోధక మందులు మహిళలకు కుటుంబ నియంత్రణ స్వేచ్ఛ ఇచ్చాయని నిపుణులు విశ్వసిస్తారు.

అయితే దాని బాధ్యత కూడా వారిపై పడటం ప్రారంభించింది, దీన్ని చాలామంది మహిళలు ఎత్తిచూపుతున్నారు.

పురుషులకు గర్భనిరోధక పద్దతులు లేవని కాదు. అదే సమయంలో ప్రభుత్వ కుటుంబ నియంత్రణ పథకం కింద గర్భనిరోధక మాత్రలతో పాటు కండోమ్‌లు కూడా ఇస్తున్నారు.

కానీ డేటాను పరిశీలిస్తే దాని వినియోగం తక్కువ.

కండోమ్‌లు, వేసెక్టమీతో సహా పురుషులకు తక్కువ గర్భనిరోధక పద్ధతులున్నాయని వైద్యుల అభిప్రాయం.

మరోవైపు గర్భ నిరోధక పద్దతుల్లోనూ అపోహలూ ఉన్నాయి. కండోమ్‌లు లైంగిక ఆనందాన్ని తగ్గిస్తాయనే భావన ఉంది. కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) వల్ల శరీరంలో బలహీనత పెరుగుతుందని, ఇది స్త్రీలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని అనుకుంటారు.

ఈ అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం అనేక రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే, పురుషుల ఆలోచనలో మార్పు వచ్చినా దాని శాతం మాత్రం చాలా తక్కువేనని ఈ వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)