15 ఏళ్లు వచ్చినా పీరియడ్స్ రాకపోతే ఏంచేయాలి?

పీరియడ్స్ ఆలస్యంగా మొదలు కావడం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, డాక్టర్ శిల్పా చిట్నీస్ జోషి
    • హోదా, గైనకాలజిస్ట్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, బీబీసీ మరాఠి కోసం

‘‘నా కూతురికి ఇంకా పీరియడ్స్ మొదలు కాలేదు. రెండు నెలల్లో ఆమెకు 16 ఏళ్లు రాబోతున్నాయి’’ అని చెబుతూ ఒక తల్లి నా వద్ద ఆందోళన చెందారు.

వాస్తవంగా, ఇలాంటి కేసులు చాలా అరుదు. కానీ, ఎవరికైనా ఇలా జరిగితే, తప్పక వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

ఇలాంటి కేసుల్లో తొలుత పీరియడ్స్‌‌కు బదులు వారి శారీరక పెరుగుదలను పరీక్షించాలి.

అమ్మాయిలు యవ్వన దశలోకి మారుతున్నప్పుడు, వారి రొమ్ములు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి.

ఆ తర్వాత వారికి ప్రైవేట్ భాగాల్లో వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇది యుక్తవయసు రెండో దశలో జరుగుతుంది. ఈ మార్పులన్నీ సరిగా ఉంటే, స్త్రీ శరీరంలో హార్మోన్ల స్థాయి సాధారణంగా ఉందని అర్థం. ఆ తర్వాత, పునరుత్పత్తి వ్యవస్థలో ఏమైనా సమస్య ఉందా అనేది వైద్యులు పరిశీలిస్తారు.

పైన ప్రస్తావించిన అమ్మాయికి సోనోగ్రఫీ చేస్తే, ఆమె‌కు పుట్టుకతోనే గర్భాశ్రయం లేదని తెలిసింది.

ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో దిగులు చెందారు. కానీ, ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం ఈ సమస్యలకు పరిష్కారాలు అందిస్తోంది.

ఆమె‌కు పెళ్లి వయసు వచ్చినప్పుడు లైంగిక ప్రక్రియలో పాల్గొనేలా ఆమెకు చికిత్స అందిస్తారు. ఈ సర్జరీలో అండాశయాన్ని, జననేంద్రియానికి దగ్గరగా చేస్తారు. అలా, అండంలోకి వెళ్లే స్పెర్మ్‌ను వేరుగా చేసి, ఈ టెక్నాలజీ వాడుతూ టెస్ట్ ట్యూబ్ బేబీని క్రియేట్ చేస్తారు.

స్త్రీ అండాన్ని, ఆమె భర్త స్పెర్మ్‌ను బయటకు తీసి, మరో మహిళ గర్భంలోకి ఎక్కిస్తారు. ఇలా ఆ మహిళ తన సొంత బిడ్డలకు తల్లి అవ్వొచ్చు. మెడికల్ టెక్నాలజీ ద్వారా ఈ విధానాన్ని చేపట్టవచ్చు.

పీరియడ్స్ విషయంలో సాధారణంగా మహిళలు వైద్యుల దగ్గర రెండు రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఒకటి- "నాకెందుకు పీరియడ్స్ రావడం లేదు." రెండోది- "నేను గర్భవతిని కాలేనప్పుడు నాకెందుకు పీరియడ్స్ వస్తున్నాయి."

పీరియడ్స్ ఆలస్యంగా మొదలు కావడం

ఫొటో సోర్స్, Getty Images

యవ్వన దశలో శరీరంలో ఎన్నో మార్పులు

స్త్రీ శరీరం, మనసు రెండూ హార్మోన్ల విడుదలకు అనుగుణంగా ఉంటాయి. పీరియడ్స్ సరైన సమయంలో రావాలంటే, శరీరం, మనసు రెండూ కూడా సమతౌల్యంగా ఉంచుకోవడం అవసరం.

అమ్మాయిలు యవ్వన దశలోకి వచ్చినప్పుడు, వారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. పీరియడ్స్ రావాల్సిన వయసు వచ్చాక, 15 ఏళ్లకు కూడా రుతుక్రమం మొదలుకాకపోతే, ఏదో సమస్య ఉన్నట్లు భావించాలి.

ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు అన్ని వైద్య పరీక్షలు చేయించుకుని, ఎందుకు పీరియడ్స్ రావడం లేదో గుర్తించాలి.

స్త్రీ శరీరంలో పునరుత్పత్తి వ్యవస్థలో ఏవైనా సమస్యలుంటే, అబార్షన్ అయ్యే అవకాశాలుంటాయి.

కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా పీరియడ్స్ రావు. అలాంటి పరిస్థితుల్లో వైద్య చికిత్సల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి.

అమ్మాయిలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ సరైన సమయంలో రావాలంటే, శరీరం, మనసు రెండూ కూడా సమతౌల్యంగా ఉండాలి.

కొందరికి కన్నెపొర సరిగ్గా లేకపోవడం కూడా సమస్యగా ఉంటుంది. ఈ సమస్యను పీరియడ్స్ సమయంలో చాలా మంది స్త్రీలు గుర్తించలేకపోవచ్చు.

కానీ, పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు.

సోనోగ్రఫీ, జననేంద్రియాల పరీక్ష ద్వారా ఈ సమస్యను వెంటనే గుర్తించవచ్చు.

నిలిచిపోయిన రక్తం బయటకు వెళ్లిపోయిన తర్వాత, మహిళల జననేంద్రియాలు సాధారణం అవుతాయి. అయితే, సరైన సమయంలో దీన్ని గుర్తించి, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

పీరియడ్స్ రాకపోవడానికి మరో కారణం టర్నర్ సిండ్రోమ్. సాధారణంగా స్త్రీలలో XX అనే రెండు రకాల క్రోమోజోమ్‌లు ఉంటాయి.

కానీ, టర్నర్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల‌కు ఒకే ఒక్క X క్రోమోజోమ్ ఉంటుంది.

దీనివల్ల అమ్మాయిల శారీరక పెరుగుదల కూడా సరిగ్గా జరగదు. హార్మోనల్ గ్రంథుల్లో మార్పులతో పీరియడ్స్ ఆలస్యమవుతాయి.

ఈ సమస్య ఉన్న అమ్మాయిలకు ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం, మెడ వెడల్పుగా ఉండటం, చిన్న చెవులుండటం, చెస్ట్ పెద్దదిగా ఉండటం, తల భిన్న ఆకారంలో ఉండటాన్ని మనం వీరిలో చూడొచ్చు.

ఈ సమస్యతో బాధపడే చాలా మంది మహిళలకు ఫెర్టిలిటీలో సమస్యలుంటాయి. సరైన సమయంలో సమస్యను గుర్తిస్తే, చికిత్స ద్వారా పీరియడ్స్ సకాలంలో వచ్చేలా చేయొచ్చు. వారు కూడా తల్లులు అయ్యేలా చేయొచ్చు.

పీరియడ్స్ ఆలస్యంగా మొదలు కావడం

ఫొటో సోర్స్, Getty Images

పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణమేంటి?

రుతుక్రమం ప్రారంభమైన తర్వాత కొన్నేళ్ల పాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల పెద్దగా సమస్యమీ ఉండదు. కానీ, అసలు పీరియడ్స్ అనేవి సరైన వయసులో ప్రారంభం కాకపోతే లేదా మహిళలు బరువు పెరిగితే.. గైనకాలజిస్ట్‌ను కలవాలి. ఇది పీసీవోడీ సమస్య మొదలుకు కారణమవ్వొచ్చు.

పెళ్లైన మహిళలకు అయితే, పీరియడ్స్ ఆలస్యమైతే దాన్ని గర్భం దాల్చినదిగా పరిగణించవచ్చు. కానీ, ఆధునీక జీవన విధానంలో కొందరికి రుతుక్రమం ఆలస్యమవుతుంది.

ఒకవేళ ఒత్తిడి అధికంగా ఉన్నా రుతుక్రమం ఆలస్యమవుతుంది. ఇది తరచుగా జరుగుతూ ఉంటే, అది అంత మంచిది కాదు.

రుతుక్రమం ఆలస్యమై, దీన్ని సోనోగ్రామ్‌లో గుర్తిస్తే టాబ్లెట్లను ఇవ్వడం ద్వారా హార్మోన్లను సమతౌల్యం చేయొచ్చు. ఇది గర్భాశయంలో సిస్ట్‌లను తగ్గిస్తుంది.

శారీరక కార్యకలాపాలు తక్కువగా ఉండటం, డైట్ విషయంలో సరిగ్గా లేకపోవడంతో బరువు విపరీతంగా పెరిగిపోతారు. రుతుక్రమం కూడా సరిగ్గా ఉండదు.

రుతుక్రమం సరిగ్గా లేనప్పుడు, బరువు పెరిగిపోతారు. ఇలా అవ్వడాన్ని ఆపేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించుకోవాలి.

థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి రెండు హార్మోన్ల అసమతౌల్యం కూడా పీరియడ్స్ సమస్యల‌కు కారణమవుతుంది.

హైపో థైరాయిడిజం ఉంటే సరైన చికిత్స లేకుండా మీరెంత ప్రయత్నించినప్పటికీ, బరువు తగ్గడం, పీరియడ్స్ సమస్యలను నిర్మూలించడం సాధ్యం కాదు.

థైరాయిడ్ పిల్ తీసుకోవడానికి ఎక్కువ ఆలోచించకుండా ఉంటే మంచిది.

మహిళలు తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహిస్తే మంచిది. వారి పిల్లల ఆరోగ్యంపై కూడా జాగ్రత్త అవసరం. సరైన సమయానికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ఆహార అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.

(గమనిక: వ్యాస రచయిత వైద్యులు. ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే.)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)