పెర్ల్ హార్బర్: ‘‘నాకు ఆ ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తుంది. అదొక పీడకల’’ అంటూ జపాన్ దాడిని వర్ణించిన పాట్స్ కన్నుమూత

హోవర్డ్ కెంటన్ పాట్స్

ఫొటో సోర్స్, US MARINE CORPS PHOTO BY LANCE CPL. ROBERT SWEET

ఫొటో క్యాప్షన్, పెర్ల్ హార్బర్‌లో జపాన్ దాడి చేసినప్పుడు పాట్స్ వయస్సు 20 ఏళ్లు
    • రచయిత, బెర్నడ్ డేబుస్మన్ జూనియర్
    • హోదా, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

మునిగిపోయిన అమెరికా యుద్ధనౌక ‘యూఎస్‌ఎస్ అరిజోనా’ నుంచి ప్రాణాలతో బయటపడి జీవించి ఉన్న ఇద్దరిలో ఒకరు ఇప్పుడు మరణించారు. 1941లో పెర్ల్ హార్బర్‌లో జపాన్ చేసిన దాడిలో అమెరికా యుద్ధనౌక నీట మునిగింది.

అప్పుడు మరణాన్ని తప్పించుకున్న హోవర్డ్ కెంటన్ పాట్స్, 102 ఏళ్ల వయస్సులో ఇటీవల కన్నుమూశారు.

కెంటన్ పాట్స్, అమెరికాలోని యూటా రాష్ట్రానికి చెందినవారు.

1941 డిసెంబర్ 7న జపాన్ దాడి చేసినప్పుడు 20 ఏళ్ల పాట్స్, క్రేన్ ఆపరేటర్‌గా ఉన్నారు.

జపాన్ చేసిన దాడితో ఓడలోనే మొత్తం 1,177 మంది చనిపోయారు. దాడి సమయంలో మరణించిన అమెరికా పౌరుల్లో దాదాపు సగం సంఖ్య ఇది.

ఈ దాడి తర్వాత అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో చేరింది.

యుటాలోని స్వగృహంలో పాట్స్ మరణించినట్లు రాండీ స్ట్రాటన్ తెలిపారు. పాట్స్‌తో పాటు ఓడలో పనిచేసిన ఒక మిత్రుని కుమారుడు రాండీ స్ట్రాటన్. పాట్స్‌కు భార్య ఉన్నారు. ఆమె వయస్సు 66 ఏళ్లు.

పెర్ల్ హార్బర్ పై దాడి దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెర్ల్ హార్బర్ పై దాడి దృశ్యం

‘‘మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే శరీరం తనకు సహకరించట్లేదని పాట్స్ తెలుసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన ఆశించారు. కానీ, అనుకున్నట్లు జరుగలేదు’’ అని స్ట్రాటన్ వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.

ఇల్లినాయిస్‌కు చెందిన పాట్స్, 1939లో అమెరికా నౌకాదళంలో చేరారు.

1941 డిసెంబర్ 7 ఉదయాన, పెర్ల్ హార్బర్‌లో అమెరికా నౌక ‘యూఎస్‌ఎస్ అరిజోనా’పై జపాన్ దాడి మొదలుపెట్టినప్పుడు పాట్స్, అరిజోనాలోకి సరుకులను తీసుకువెళుతున్నారు.

దాడి ప్రారంభమయ్యాక పాట్స్ తన పడవను ఉపయోగించి నీటిలో పడిన సెయిలర్లను రక్షించారు. వారిని సమీపంలోని ద్వీపానికి తరలించారు.

అరిజోనా నౌక పేలిపోయినప్పుడు కూడా పాట్స్, హార్బర్‌లోనే ఉన్నారు. పేలుడు సంభవించిన తొమ్మిది నిమిషాల తర్వాత నౌక మునిగిపోయింది.

వీడియో క్యాప్షన్, సముద్రంలో మునిగిపోతున్న నౌక.. 300 మంది ఇలా ప్రాణాలు కాపాడుకున్నారు

‘‘నాకు ఆ ఘటన ఇంకా కళ్ల ముందు కనిపిస్తుంది. అదొక పీడకలగా నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. హార్బర్ అంతా మంటలు అంటుకున్నాయి. నీళ్లపై పడిన చమురు కారణంగా నీటిపై కూడా మంటలు వ్యాపించాయి ’’ అని 2021లో నేషనల్ గార్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్స్ చెప్పారు.

దాడి తర్వాత మునిగిపోయిన అరిజోనా నౌక నుంచి మృతదేహాలను వెలికితీసే పనిలో కూడా పాట్స్ పాల్గొన్నారు.

‘‘ఆ పని చేయడం నరకం లాంటిది’’ అని పాట్స్ అన్నారు.

900 మందికి పైగా నావికులు, అరిజోనాలోనే జలసమాధి అయ్యారు.

ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి కాలిఫోర్నియాకు చెందిన లూ కాంటర్. ఆయన వయస్సు 101 ఏళ్లు.

పెర్ల్ హార్బర్ దాడి తర్వాత అమెరికా, జపాన్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. అమెరికాపై డిసెంబర్ 11న జర్మనీ, ఇటలీ యుద్ధాన్ని ప్రకటించాయి. వారిపై కూడా అమెరికా యుద్ధానికి పూనుకుంది.

పెర్ల్ హార్బర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెర్ల్ హార్బర్

పెర్ల్ హార్బర్: ఆ రోజు ఏం జరిగింది?

1941 డిసెంబర్ 7వ తేదీన పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి చేసింది.రెండో ప్రపంచ యుద్ధంలో చోటుచేసుకున్న అత్యంత హింసాత్మక ఘటనల్లో ఇదీ ఒకటి.

1931లో జపాన్ ఉత్తర చైనాలోని మంచూరియాను ఆక్రమించినప్పటి నుంచి అమెరికాతో సంబంధాలు క్షీణించాయి. దశాబ్ద కాలంగా జపాన్ - చైనాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా ఈ వివాదం తీవ్రమైంది.

1940లో జపాన్‌పై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించింది.

1940 సెప్టెంబర్‌లో జపాన్.. జర్మనీ, ఇటలీతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసింది. తద్వారా ఐరోపా యుద్ధంలో పోరాడుతున్న యాక్సిస్ కూటమి అధికారిక సభ్యుడిగా మారింది.

మరోవైపు వాణిజ్య ఆంక్షలు ఎత్తివేయాలని, రాయితీలు ఇవ్వాలని అమెరికాతో జపాన్ చర్చలు జరుపుతోంది.

అయితే, అమెరికా అందుకు సుముఖంగా ఉన్నట్లు జపాన్ భావించలేదు. ఎందుకంటే.. చైనాకు అమెరికా మిత్ర రాజ్యాలు మద్దతు ప్రకటించాయి.

చైనాపై దూకుడు కొనసాగించినందుకు గాను జపాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై వాషింగ్టన్‌లో జపాన్ అధికారులు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కోర్డెల్ హల్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో పెర్ల్ హార్బర్‌పై జపాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

హవాయిలోని పెర్ల్ హార్బర్‌ అమెరికా వైమానిక స్థావరం. దీనిపై దాడి చేసిన జపాన్.. అమెరికా, బ్రిటన్‌లపై యుద్ధాన్ని ప్రకటించింది.

దాదాపు 150 యుద్ధ విమానాలతో జపాన్ రెండు దఫాలుగా పెర్ల్ హార్బర్‌పై దాడి చేసింది. గంటన్నరకు పైగా బాంబులు వేసింది.

ఈ దాడిలో అమెరికాకు చెందిన ఆరు యుద్ధ నౌకలు, 112 యుద్ధ పడవలు, 164 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి.

పెర్ల్ హార్బర్ దాడి, ప్రతి దాడుల్లో మొత్తం 2400 మంది అమెరికన్లు, 100 మంది జపనీయులు మృతి చెందారు.

దీంతో రెండో ప్రపంచ యుద్ధంలో తటస్థ వైఖరి అవలంభిస్తూ వచ్చిన అమెరికా.. జపాన్‌పై యుద్ధం ప్రకటించింది.

ఇవి కూడాచదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)