శ్రీలంక: కొలంబో తీరంలో కాలిపోతూ మునుగుతున్న నౌక....రసాయనాల కారణంగా చేపలన్నీ చచ్చిపోతాయా?- Newsreel

ఫొటో సోర్స్, Sri Lanka Air Force
రసాయనాలతో నిండిన సింగపూర్ కి చెందిన ఎక్స్ ప్రెస్ పెర్ల్ నౌక శ్రీలంక తీరంలో కొలంబో ఓడరేవు దగ్గర మునిగిపోతోంది. ఇది పర్యావరణ హానికి దారి తీస్తుందేమోననే భయాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండు వారాల నుంచి ఈ నౌకలో మంటలు చెలరేగుతున్నాయి.
ఈ నౌక 1,486 కంటెయినర్లతో మే 15న గుజరాత్‌లోని హజీరా నౌకాశ్రయం నుంచి బయల్దేరింది. 186 మీటర్ల పొడవైన ఈ నౌకలో చమురు, నైట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలు, సౌందర్య ఉత్పత్తులు తరలిస్తున్నారు.
నైట్రిక్ యాసిడ్ లీక్ అవ్వడం వల్ల మంటలు చెలరేగి ప్రమాదం సంభవించి ఉంటుందని శ్రీలంక అధికారులు భావిస్తున్నారు.
ఈ నౌక నీటిలో మునిగితే కొన్ని వందల టన్నుల చమురు ట్యాంకులు నీటిలో కలిసే ప్రమాదం ఉంది. ఇది సముద్ర జీవుల వినాశనానికి దారి తీయవచ్చని నిపుణులు అంటున్నారు.
గత పది రోజులుగా ఈ నౌకలో చెలరేగుతున్న మంటలను ఆర్పి, నౌక మునిగిపోకుండా చూసేందుకు శ్రీలంక, భారత నౌకా దళాలు చాలా ప్రయత్నించాయి.
కానీ, అల్లకల్లోలంగా ఉన్న సముద్రం, రుతుపవనాలు ఈ పనికి ఆటంకం కలిగించాయి.
"ఈ నౌక మునిగిపోతోంది. అయితే, సముద్ర జలాల్లో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేందుకు నౌకను సముద్ర గర్భం లోపలికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, షిప్ వెనుక భాగం నీటిలోకి వెళ్ళిపోయింది" అని శ్రీ లంక నేవీ ప్రతినిధి కెప్టెన్ ఇండికా సిల్వా బీబీసీకి చెప్పారు.
ఈ నౌక మునగడం అతి దారుణమైన పర్యావరణ సమస్యలకు దారి తీస్తుందని పర్యావరణ నిపుణులు డాక్టర్ అజంతా పెరీరా బీబీసీ కి చెప్పారు. "ఆ నౌకలో ఉన్న నైట్రిక్ ఆమ్లాలు, చమురుతో పాటు ఉన్న ఇతర ప్రమాదకరమైన వస్తువులు సముద్ర గర్భాన్ని నాశనం చేస్తాయి" అని అన్నారు.
అది సముద్రం లోపలికి పంపే ముందు ఆ నౌకను పరిశీలించేందుకు డైవర్లను పంపి ఉండాల్సిందని అజంతా పెరీరా అభిప్రాయపడ్డారు.
నెగొంబో తీరంలో ఇప్పటికే కొన్ని రోజులుగా చమురు వ్యర్ధాల కాలుష్యం చోటు చేసుకుంటోంది. అయితే, నెగొంబో పరిసర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించి అత్యవసర చర్యలు చేపట్టినట్లు శ్రీలంక ఫిషరీస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
బర్డ్ ఫ్లూ: మనుషులకు H10N3 స్ట్రెయిన్, చైనా తొలి కేసు నమోదు
చైనాలో ఒక 41 ఏళ్ల వ్యక్తికి అరుదైన బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. ఈ స్ట్రెయిన్‌కు సంబంధించిన తొలికేసుగా దీనిని ధ్రువీకరించారు.
ఈ వైరస్ ఆయనకు ఎలా వచ్చిందనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. కానీ, H10N3 స్ట్రెయిన్ ఒకరి నుంచి ఇతరులకు అంత సులభంగా వ్యాపించదని భావిస్తున్నారు.
జియాంగ్సూ ప్రావిన్సులో ఉండే బాధితుడికి గత వారం చేసిన పరీక్షల్లో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం కోలుకున్న ఆయన త్వరలో డిశ్చార్జ్ కాబోతున్నారు.
కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఆయనకు వచ్చిన స్ట్రెయిన్ వైరస్ వేరే ఎవరికీ వ్యాపించలేదని అధికారులు గుర్తించారు.
"ఝెంజియాంగ్ నగరంలో ఉంటున్న ఆయన ఏప్రిల్ 28న ఆస్పత్రిలో చేరారు. ఒక నెల తర్వాత ఆయనకు పరీక్షల్లో H10N3 ఉన్నట్లు బయటపడింది" అని బీజింగ్ నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం చెప్పింది.
"మనుషులకు H10N3 సోకిన కేసులు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాలేదు. కోళ్ల నుంచి మనుషులకు వ్యాపించిన ఇది ఒక అరుదైన కేసు. ఇది భారీగా వ్యాపించే ప్రమాదం చాలా తక్కువే" అని ఎన్‌హెచ్‌సీ చెప్పిందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
H10N3 స్ట్రెయిన్ కోళ్లలో తీవ్ర వ్యాధులకు కారణం కాదని, అది వేగంగా కూడా వ్యాపించదని కమిషన్ చెప్పింది.
ప్రస్తుతానికి ఇది మనుషుల్లో ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తున్నట్లు ఎలాంటి సూచనలు కనిపించలేదని డబ్ల్యుహెచ్ఓ రాయిటర్స్‌కు చెప్పింది.
ప్రస్తుతం H5N8 వేరియంట్ వల్ల కోళ్లలో వైరస్ వ్యాపిస్తోంది. దీంతో యూరోపియన్ దేశాల్లో కొన్ని లక్షల కోళ్లను గుంతలు తీసి పూడ్చిపెట్టారు.

ఫొటో సోర్స్, SAIRA BANO
రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న పాక్ ప్రభుత్వం
బాలీవుడ్ అలనాటి నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఈ ఇళ్లున్నాయి.
ఈ భవనాలను ఇంతకు ముందు ఎలా ఉండేవో అలాగే ఉంచి సంరక్షించనున్నారు.
రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇద్దరూ ఆయా భవనాల్లోనే జన్మించారు. ఇప్పుడు వాటికి మరమ్మతులు జరుగుతున్నాయి.
రెండు భవనాలను స్వాధీనం చేసుకుని సీల్ వేశామని, వాటిని పురాతత్వ శాఖకు అప్పగిస్తామని పెషావర్ డిప్యూటీ కమిషనర్ చెప్పారని ఖైబర్ పంఖ్తుంఖ్వా పురాతత్వ, మ్యూజియం శాఖ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ సమద్ బీబీసీకి చెప్పారు.
రెండు భవనాల పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.

ఖైబర్ పంఖ్తుంఖ్వా పురాతత్వ శాఖ 2020 సెప్టెంబర్‌లో ఈ భవనాలకు సంబంధించి పెషావర్ కమిషనర్‌కు ఒక లేఖ రాసింది. తమ విభాగం వాటిని రక్షిత భవనాలుగా ప్రకటించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ భవనాలు రెండింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ప్రస్తుతం మూతపడి ఉన్న ఆ ఇళ్లను పునరుద్ధరించి మ్యూజియంలుగా మారుస్తారని, వాటితోపాటూ, మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌కు సంబంధించిన వస్తువులను కూడా భద్రపరుస్తామని అధికారులు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ భవనాల పునరుద్ధరణతో సాంస్కృతిక పర్యటకానికి ప్రోత్సాహం లభిస్తుందని పురాతత్వ శాఖ ఆశిస్తోంది.
పెషావర్‌లో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న 188 భవనాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ యువరాజు దీపేంద్ర రెండు చేతుల్లో తుపాకులు నిప్పులు కక్కినప్పుడు ఏం జరిగింది
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా
- కోవిడ్ సోకితే గర్భిణులు ఏం చేయాలి.. తల్లి నుంచి బిడ్డకు వస్తుందా..
- భారతదేశంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరిందా...కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సూచిక
- బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమా.. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది..
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








