కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం వాడుతున్నారా? వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శృతి మేనన్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
భారత్‌లో జనవరి 16న కోవిడ్ వ్యాక్సీన్‌లు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. అయితే, అంతకుముందు నుంచే వ్యాక్సీన్లకు సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మొద్దని, ఏ చింతా లేకుండా వ్యాక్సీన్లు తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలపై ఫ్యాక్ట్ చెక్ ఇదీ.

వ్యాక్సీన్లతో నపుంసకత్వం వస్తుందా?
వ్యాక్సీన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించారు. అయితే, ఆయన ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు.
''మనకు హాని చేసే చాలా పదార్థాలు వ్యాక్సీన్‌లో ఉండొచ్చు. వాటి వల్ల మనం నపుంసకులం కావొచ్చు. ఏదైనా జరగొచ్చు''అని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఆశుతోష్ సిన్హా వ్యాఖ్యానించారు.
ఎస్పీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఇదివరకు వ్యాక్సీన్లపై సందేహాలు వ్యక్తంచేశారు. వ్యాక్సీన్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యాక్సీన్లుగా ఆయన అభివర్ణించారు.
అయితే, వ్యాక్సీన్లతో నపుంసకత్వం వస్తుందన్న వార్తల వెనుక ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ వదంతులేనని, వీటిలో అసలు నిజంలేదని భారత ఔషధ ప్రాధికార సంస్థ తెలిపింది.
వ్యాక్సీన్లు చాలా సురక్షితమైనవని సంస్థ తెలిపింది. అయితే కొంచెం జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి స్పల్పకాలిక దుష్ప్రభావాలు వచ్చే అవకాశముందని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వ్యాక్సీన్లతో నపుంసకత్వం వస్తుందన్న వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా కొట్టిపారేశారు.
వ్యాక్సీన్లతో నపుంసకత్వం వస్తుందని భారత్‌లో వందంతులు, అసత్య వార్తలు చక్కర్లు కొట్టడం ఇదేమీ తొలిసారి కాదు.
కొన్ని దశాబ్దాల క్రితం పోలియో వ్యాక్సీన్ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు కూడా.. వీటితో నపుంసకత్వం వచ్చే ముప్పుందని కొందరు వీటిని తీసుకునేందుకు నిరాకరించారు.
అప్పుడు కూడా ఈ వదంతుల్లో ఎలాంటి నిజంలేదని తేల్చారు. ఇప్పుడు కూడా అంతే.

అమెరికా, యూకేల్లో వ్యాక్సీన్ల ధర చాలా ఎక్కువ?
వ్యాక్సీన్ల ధర గురించి మరో వార్త వైరల్ అవుతోంది. భారత్‌లో ఉచితంగా టీకాలు వేస్తారని, అదే అమెరికా, బ్రిటన్‌లలో అయితే మీరు డబ్బులు చెల్లించి టీకాలు కొనుక్కోవాలని దీనిలో రాశారు.
అమెరికాలో అయితే టీకా ధర రూ.5,000 (50 యూరోలు), బ్రిటన్‌లో ఇది రూ.3,000 అని ఓ ట్విటర్ వినియోగదారుడు పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్‌లతో పోలిస్తే వ్యాక్సీన్లు ఇవ్వడంలో భారత్ మేలని ఆయన పేర్కొన్నారు.
ఈ ట్వీట్‌ను హిందీ వార్త ఛానెల్ ఏబీపీ న్యూస్ తమ వార్తల్లో ఉటంకించింది. అయితే ఆ తర్వాత దీన్ని తొలగించింది. ఎందుకంటే ఈ గణాంకాల్లో ఎలాంటి నిజమూ లేదు.
అమెరికాలో చాలా మందికి ఆరోగ్య బీమా ఉంటుంది. టీకా ఖర్చులను ఈ బీమా సంస్థలే భరిస్తాయి. బీమా పాలసీ లేని వారి కోసం కోవిడ్ ఉపశమన నిధిని ఏర్పాటుచేశారు. దీంతో ఎవరూ ఇక్కడ టీకా కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు.
బ్రిటన్ విషయంలో వచ్చిన గణాంకాల్లోనూ నిజంలేదు. ఎందుకంటే బ్రిటన్‌లో వ్యాక్సీన్లను నేషనల్ హెల్త్ సర్వీస్ కింద ఉచితంగా ఇస్తున్నారు. పన్నులు, ఆరోగ్య సంరక్షణ సుంకాల సాయంతో దీనికి కావాల్సిన నిధులు వసూలు చేస్తారు.
భారత్‌లో తొలి దశలో భాగంగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు ఇస్తున్నారు. వీరందరికీ ఉచితంగానే టీకాలు వేస్తున్నారు.
అయితే, తర్వాత దశల్లోనూ ఉచితంగానే టీకాలు ఇస్తారా? అనే అంశంపై భారత ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్‌లో పంది మాంసం కలుపుతున్నారా?
వ్యాక్సీన్లలో పంది మాంసానికి సంబంధించిన పదార్థాలు వాడారని, ముస్లింలు వీటిని తీసుకోకూడదని ఒక ఇస్లామిక్ గురువు చెబుతున్నట్లు కనిపిస్తున్న వార్తలు ఇటీవల టీవీల్లో ప్రసారం అయ్యాయి.
కొన్ని వ్యాక్సీన్ల తయారీలో పంది మాంసం నుంచి సేకరించిన జెలాటిన్‌ను స్టెబిలైజర్‌గా ఉపయోగిస్తారు. ఇస్లాంలో పంది మాంసం తినడం నిషిద్ధం.
ఇస్లామిక్ చట్టం ప్రకారం మనుషులు తినొచ్చని చెప్పే హలాల్ కిందకు ఈ వ్యాక్సీన్లు వస్తాయని, ముస్లింలు ఈ వ్యాక్సీన్లు వేసుకోవద్దని ట్విటర్ వేదికగా కొందరు అభ్యర్థిస్తున్నారు. అయితే వారు ఏ వ్యాక్సీన్ తీసుకోకూడదో స్పష్టంగా చెప్పడంలేదు.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌లకు భారత్ ఆమోదం తెలిపింది.
ఈ రెండింటిలోనూ పోర్క్ జెలాటిన్‌ను ఉపయోగించలేదు.
ఫైజర్, మోడెర్నా తయారుచేసిన వ్యాక్సీన్లలోనూ పంది మాంసాన్ని ఉపయోగించలేదు.
చైనాలో తయారుచేసిన ఓ వ్యాక్సీన్లో పంది మాంసాన్ని ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటికి భారత్ ఇంకా అనుమతులు జారీచేయలేదు.
ఇతర దేశాల్లో చైనా వ్యాక్సీన్ల గురించి ఇలాంటి ఆందోళనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింలు ఆధిక్యంగా ఉండే ఇండోనేసియాలో చైనా వ్యాక్సీన్ సినోవాక్‌కు అనుమతి ఇవ్వడంపై వివాదం చెలరేగింది.

వ్యాక్సీన్లలో మైక్రోచిప్‌లు ఉన్నాయా?
కొన్ని దేశాల్లో వ్యాక్సీన్లలో మైక్రోచిప్‌లు పెడుతున్నారంటూ వస్తున్న వార్తలు భారత్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి.
మన మెదడును కంట్రోల్ చేసే మైక్రోచిప్‌లను వ్యాక్సీన్ల సాయంతో శరీరంలోకి చొప్పిస్తున్నారని ఓ ముస్లిం మతగురువు చెబుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది.
ట్విటర్‌తోపాటు ఫేస్‌బుక్‌లోనూ విస్తృతంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇప్పటివరకు అభివృద్ధి చేసిన ఏ వ్యాక్సీన్లలోనూ మైక్రోచిప్‌లు అమర్చడం లేదు.

ఇవి కూడా చదవండి:
- అయోధ్య మసీదులో అహ్మదుల్లా రీసెర్చ్ సెంటర్ నిర్మాణం.. ఇంతకీ ఆయన ఎవరు?
- మంజురాణి: బాక్సింగ్ గ్లవ్స్ కొనే శక్తి లేదు.. కానీ భారత ఒలింపిక్స్ ఆశాకిరణంగా మారారు
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- స్టాండప్ కమెడియన్: వేయని జోకులకు జైలు శిక్ష అనుభవించిన మునావర్ ఫారూఖీ
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఎంత తెలుసు? భారతదేశంలో ఇది ఎక్కడెక్కడ పండుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









