స్టాండప్ కమెడియన్: వేయని జోకులకు జైలు శిక్ష అనుభవించిన మునావర్ ఫారూఖీ

ఫొటో సోర్స్, Munawar Faruqui/Facebook
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ఒక షోలో తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 2002లో జరిగిన హింసాత్మక మత ఘర్షణల గురించి ఒక జోక్ చేశారు.
"జునాగఢ్ చాలా బద్ధకంగా ఉండే నగరం. ఇక్కడ ప్రజలు పగలు నిద్ర పోతారు, దుకాణాలు మూసేస్తారు. ఇక్డ అసలేమీ జరగదు" అని ఒకప్పుడు రాజుల పాలనలో ఉన్న తన స్వస్థలం. జునాగఢ్ గురించి వ్యాఖ్యానించారు.
ఫారుఖీ ముస్లిం మతస్థుడు. ఆయన చిన్నప్పుడు నగరంలో విధించిన కర్ఫ్యూ కారణంగా 12 రోజులు ఇంట్లోనే బందీగా ఉండిపోయారు.
ఆ సమయంలో ఆయన అమ్మకు ఉన్న ఒకే ఒక్క హిందూ స్నేహితురాలు మాత్రమే అప్పుడప్పుడూ వాళ్లకు తోడుగా ఉండేవారు.
"మేము ఇంట్లో 8 మందిమి పిల్లలం ఉండేవాళ్ళం. నేను స్కూలుకు వెళ్లనక్కరలేదని సంతోషంగా ఉండేవాడిని. కరెంటు పోతూ ఉండేది. ఫోనులు ఆగిపోతూ ఉండేవి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వాళ్ళ భద్రత కోసం ఆందోళన చెందుతూ ఉండేవారు. కానీ, ఘర్షణలు ముగిసేసరికి జునాగఢ్ లో ఎవరూ మరణించలేదని మాకు అర్ధం అయింది."
"ఎందుకో తెలుసా? ఘర్షణల్లో పాల్గొనడానికి కూడా ఇక్కడ ప్రజలకు బద్ధకమే" అని ఆయన అన్నారు.
కానీ, ఇదే పరిస్థితి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో లేదు. రైలులో చెలరేగిన మంటల్లో 60 మంది హిందువులు మరణించిన తర్వాత తలెత్తిన ఘర్షణల్లో 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. అందులో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు.
ఫారుఖీకి ఇప్పుడు 30 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు భారతదేశంలో కొత్తగా అవతరిస్తున్న హాస్య రంగంలో భాగమవుతున్నారు. రెండు వైపులా పదనైన ఈ కత్తి అంచులు ఇంకా కరకుగానే ఉన్నాయి. కానీ, అదొక కొత్త శక్తితో, ఆశయంతో మెరుస్తోంది. హాస్యంతో ఛలోక్తులు విసరడానికి ఈ రంగం భయపడటం లేదు. ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ఫారుఖీ లాంటి వాళ్ళ ప్రదర్శనలకు డబ్బులు చెల్లించి వెళ్ళడానికి కూడా ఎవరూ వెనుకాడడం లేదు.
అయితే, భారతదేశంలో ప్రతి ఒక్కరూ హాస్యాన్ని ప్రశంసించరు.

ఫొటో సోర్స్, Munawar Faruqui/Twitter
అందుకే, ఈ కమెడియన్ తాను వేయని జోకులకు కూడా 28 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది.
ఫారుఖీ 14 నగరాలలో ప్రదర్శనలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జనవరి1న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక కెఫెలో ప్రదర్శన మొదలు పెట్టారు. అంతలోనే ఒక హిందూ గ్రూపుకు చెందిన నాయకుడు వచ్చి హిందూ మత భావాలను గాయపరుస్తున్నారనే నెపంతో ఆ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. ఈ నగరం బీజేపీ అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్‌లో ఉంది.
ప్రేక్షకులలో కూర్చున్న ఒక వ్యక్తి జరుగుతున్నదంతా మొబైల్ ఫోనులో రికార్డు చేశారు అందులో ఫారుఖీ పాలక పార్టీ బీజేపీ నేత కుమారుడు ఏకలవ్య గౌడ్‌ను బతిమాలుతూ కనిపించారు. ఆయన ముస్లింల పై కూడా ఛలోక్తులు విసురుతానని ప్రదర్శనను కొనసాగనివ్వమని అభ్యర్థిస్తూ కనిపించారు.
"నేను ప్రజలను నవ్వించడం కోసమే ఈ పని చేస్తున్నాను. దీనికి ఎవరి మనోభావాలైనా గాయపడితే నేను మళ్ళీ అదే పనిని చేయను" అని గౌడ్ తో చెబుతూ ఉన్నారు.
ప్రదర్శనను మొదలుపెట్టండి అంటూ అసహనంతో ఉన్న ప్రేక్షకులు అరుస్తూ కనిపించారు.
"హిందూ ముస్లిం భాయ్ భాయ్ ( హిందు ముస్లింలు సోదరులు) అంటూ ప్రేక్షకుల్లో ఉన్న ఒక మహిళ గౌడ్ తో చెబుతూ కనిపించారు.
గౌడ్ అక్కడ నుంచి కొన్ని నిమిషాలలోనే వెళ్ళిపోయి పోలీసులను పిలిచినట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
ఆ రాత్రి మునావర్ ఫారుఖీతో పాటు మరో నలుగురు హాస్య కళాకారులను అరెస్టు చేసి వారిపై మతపరమైన భావాలను రెచ్చగొట్టుతున్నట్లు, కోవిడ్ కారణంగా ప్రాణానికి ప్రమాదకరమైన అంటురోగాలను వ్యాప్తి చెందిస్తున్నట్లు అభియోగాలు నమోదు చేశారు.
"ఇతను వరస నేరాలు చేసిన వ్యక్తి. ఆయన గతంలో హిందూ దేవతలు, దేవుళ్ళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు" అని గౌడ్ విలేకరులతో చెప్పారు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేయడంతో పాటు వివిధ వీడియోలలో హిందువుల మతపరమైన భావాలను గాయపరిచిన అభియోగం పై గత సంవత్సరం జులైలో ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక న్యాయవాది ఫారుఖీ పై కేసు ఫైల్ చేశారు.
అయితే, ఆయనను అరెస్టు చేసే సమయానికి ఆయన మతానికి సంబంధించిన ఎటువంటి ఛలోక్తులు విసరలేదని ప్రత్యక్ష సాక్షులు విలేకరులతో చెప్పారు. గౌడ్ ప్రదర్శన ఆపే సమయానికి ఆయన అసలు ప్రదర్శనే మొదలుపెట్టలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Munawar Faruqui/Twitter
ఈయన మతపరమైన జోకులు వేశారనేందుకు తమ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు.
అయితే, ప్రదర్శనకు సిద్ధం కావడానికి ముందు ఆ కళాకారుడు రిహార్సల్ చేస్తున్న కొన్ని ఛలోక్తులను ఫిర్యాదుదారుడు విన్నట్లు గౌడ్ తెలిపారని పోలీసులు తెలిపారు.
"వేయని జోకులకు ఆయన అరెస్టు అయ్యారు. ఆయన ప్రదర్శన ఆపే సమయానికి అసలైన ప్రదర్శనే మొదలు పెట్టలేదు.
ఆయన ఏదైనా నేరం చేస్తారేమోనని ఊహించడం నేరం కాదు. పోలీసులు నిజానిజాలు పరిశీలించకుండా ఆయనను అరెస్టు చేశారు" అని ఫారుఖీ తరుపున వాదిస్తున్న న్యాయవాది అంశుమన్ శ్రీ వాస్తవ చెప్పారు.
జనవరిలో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి రెండు కోర్టులు నిరాకరించాయి. మధ్యప్రదేశ్ హై కోర్టు గత గురువారం ఆయన బెయిల్ అభ్యర్ధనను తోసి పుచ్చింది. ఇప్పుడు ఈ కళాకారుడిని విడుదల చేస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని పోలీసులు అంటున్నారు. ఇతని విడుదల శాంతి భద్రతలకు ఎలా భంగం కలిగిస్తుందనే అంశం పై స్పష్టత లేదు.
"ఇది హాస్య కళాకారులందరినీ వణికిస్తోంది. వాళ్ళ పై వాళ్ళు స్వీయ నిఘా పెట్టుకోవలసిన ఒత్తిడిని తెస్తోంది" అని అమిత్ వర్మ అనే రచయత, పోడ్ కాస్టర్ అన్నారు.
దీంతో స్టాండప్ హాస్య కళాకారులంతా ఇక రాజకీయ ఛలోక్తులు వేయడానికి భయపడే పరిస్థితి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ఉన్న పరిస్థితులకు ఆయన హాస్యాన్ని జోడించి జోకులు విసురుతారు. ఆయన అన్ని మతాల పైనా ఛలోక్తులు విసురుతారు.
ఆయన రాపర్ కూడా. ఆయన ముంబయిలో ఉండే ముస్లిం ఘెట్టో పై కూడా జోకులు వేశారు.
ఆయన యూ ట్యూబ్ ఛానల్లో 5 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది.
స్టేజి పై ఆయన పరిశీలనాత్మక జోకులను వేస్తారు అందులో కొన్ని మధ్యలోనే ఆపేసినట్లుగా అనిపిస్తాయి. కానీ, ఆయన ఆత్మ విశ్వాసం లోపించినట్లు ఎక్కడా కనపడరు.
ఆయన పంజాబీ పాప్ సంగీతంలో మహిళలను బంగారం సంపాదించే వ్యక్తులుగా అభివర్ణించడంపై జోకులు వేస్తారు. భారతదేశంలో ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ డేటింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా మారిపోయిందని అంటారు.
"మీ గర్ల్ ఫ్రెండ్ మీ నుంచి ఏమైనా కోరుకుంటున్నట్లయితే అది వారికి వెంటనే ఇచ్చేయండి. దాని గురించి పాటలు పాడాలని ప్రయత్నించకండి" అని ఆయన ఒక షో లో అన్నారు.
ఆయన ప్రభుత్వం పై కూడా బాణాలు విసురుతారు. నిరసనలు చేస్తున్న రైతుల పై వాటర్ క్యానన్లు ప్రయోగించి ప్రభుత్వం నీటిని వృధా చేస్తోందని విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫారుఖీ చేసే వ్యాఖ్యలు కొన్ని సార్లు విచిత్రంగా, వింతగా ఉంటాయి. ఒక సారి ఆయన బాంబు ఎలా తయారు చేసుకోవాలని రాసుకున్న నోట్స్ వాళ్ళ నాన్నగారి కంట ఎలా పడిందో వివరిస్తూ జోకు చెప్పారు.
"ఆ నోటు పుస్తకం చూడగానే మా నాన్న దాన్ని నా పైకి విసిరి 'ఇవన్నీ నీకెవరు నేర్పుతున్నార'ని అడిగారు. ఇందులో బాంబు తయారు చేయడానికి రాజకీయ మద్దతు ఉండాలన్న ముఖ్యమైన అంశం లేదని కోప్పడ్డారు" అని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఆనందించారు.
"నాకు ఫారుఖీ అంటే చాలా ఇష్టం. అంత చిన్న వయసులో అంత పరిపూర్ణమైన కామెడీ చేయడం అతని గొప్పతనం. ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవ్వాలో అతనికి తెలుసు ఆయన అందరి గురించీ ఛలోక్తులు విసురుతారు. ఆయన నిజాయితీతో, కొత్తగా కనిపిస్తారు" అని అమిత్ వర్మ అన్నారు.
ఇతర హాస్య కళాకారులు ఫారుఖీకి మద్దతు పలికారు. అతని అనుచరులు యూట్యూబ్ లో సంఘీభావం పలుకుతూ సందేశాలు పోస్టు చేశారు.
"మీకు నచ్చకపోతే చూడటం మానేయండి" అని ఒకరు అన్నారు.
ఇతని అరెస్టును ఇటీవల కాలంలో వాక్స్వాతంత్య్రం పై జరిగిన దాడిగా చూస్తున్నారు. కొంత మంది హిందూ మూకల అతి పర్యవేక్షణ సోషల్ మీడియాలో ఆన్ లైన్ సేనల ట్రోలింగ్ ఈ అరెస్టును ప్రోత్సహించింది.
గత సంవత్సరం మతపరమైన భావాలను గాయపరిచినందుకు కనీసం ఆరుగురు హాస్య కళాకారులు క్షమాపణ చెప్పారు.
స్టాండప్ కామెడీలో రెచ్చగొట్టడం ఒక భాగం. దానికి ఫారుఖీ ఏమి మినహాయింపు కాదు. కానీ, వారిని నియంత్రించలేనంత వరకు మాత్రమే వారు ఉత్తమంగా కళను ప్రదర్శించగలరు. ప్రజలు ఏ విషయానికి గాయపడుతున్నారో చెప్పే అంశాలు తక్కువగానే ఉన్నాయి.
అలాంటి అంశాలను తమ ప్రదర్శనల నుంచి తొలగించి వేరే అంశాలను చేర్చుకోవడం ఉత్తమం అని "ఐ ఆమ్ అఫన్దెడ్" అనే డాక్యుమెంటరీ చిత్రీకరించిన జయ్ దీప్ వర్మ అన్నారు.
ఫారుఖీని జైలులో పెట్టడం భారతీయులందరూ విచారించాల్సిన విషయమని స్టాండప్ కళాకారుడు సంజయ్ రజౌరా అన్నారు.
ఒక నాగరిక సమాజంలో అలాంటి చర్యలకు చోటుండకూడదని, ఎవరికైనా నచ్చకపోతే చూడటం మానేయవచ్చని అంటున్న సంజయ్, "ఇప్పటికైతే భారతదేశంలో హాస్యం జైలులో బందీగా మారింది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19: సింగిల్ డోస్ వ్యాక్సీన్ ఎలా పని చేస్తుంది ? రెండో డోస్ తీసుకోకపోతే ఏమవుతుంది?
- ‘వాయిదా కాదు.. రద్దు చేయాలి.. ఉద్యమం అప్పుడే అయిపోలేదు’.. వ్యవసాయ చట్టాలపై రైతు నాయకులు
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








