రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు? ఒకరు ఎందుకు తప్పుకున్నారు?

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాల అమలుపై సుప్రీం కోర్టు మంగళవారం స్టే విధించింది. రైతు సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ, ఆర్థిక నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ ఇరువైపుల వారితోనూ చర్చించి, సమస్య లోతుపాతులను పరిశీలిస్తుంది.

అయితే, ఈ కమిటీ ఏర్పాటుకు రైతు సంఘాలు అనుకూలంగా లేవనే అంశం సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా వెల్లడైంది.

సమస్యకు నిజమైన పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీ ముందు తమ వాదనలను వినిపించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఈ ప్రత్యేక కమిటీలో భారతీయ కిసాన్ యూనియన్‌కు చెందిన భూపిందర్ సింగ్ మాన్, షేత్కారీ సంఘటన్‌కు చెందిన అనిల్ ఘన్వత్, వ్యవసాయ ఆర్థికవేత్తలు అశోక్ గులాటి, డా. ప్రమోద్ కుమార్ జోషి ఉన్నారు.

Presentational grey line

కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన భూపిందర్ సింగ్ మాన్

కాగా, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నానని భూపిందర్ సింగ్ మాన్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తనకు పంజాబ్ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

తనను కమిటీలో వేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, తన నియామకంపై వచ్చిన ప్రతిస్పందనల నేపథ్యంలో తాను కమిటీ నుంచి తప్పుకుంటున్నానని ఆయన వెల్లడించారు.

Presentational grey line

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే సుప్రీం కోర్టు కోరుకుంటోందని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా తెలిపింది. అయితే, ఇరు పక్షాల మధ్య చర్చలు జరగకుండా, వారి వాదనలు వినకుండా చట్టాలను నిరవధికంగా రద్దు చేయలేమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టపరిచింది.

రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య గతంలో జరిగిన చర్చలు చాలా నిరాశాజనకంగా సాగాయని, అందుకే మధ్యవర్తుల కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సుప్రీం కోర్టు తెలిపింది.

ఈ కమిటీలో ఇద్దరు సభ్యులు రైతు సంఘాల నాయకులు కాగా, ఇద్దరు వ్యవసాయ ఆర్థిక నిపుణులు. వీరి గురించి వివరంగా తెలుసుకుందాం.

భూపిందర్ సింగ్ మాన్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, భూపిందర్ సింగ్ మాన్

భూపిందర్ సింగ్ మాన్

భారతీయ కిసాన్ యూనియన్‌తో అనుబంధం ఉన్న భూపిందర్ సింగ్ వ్యవసాయ రంగ నిపుణులే కాక, ‘అఖిల భారతీయ కిసాన్ సమన్వయ సమితి’ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఈయన మాజీ రాజ్యసభ సభ్యులు కూడా.

మాన్ 1939లో గుజ్రంవాలా (ప్రస్తుత పాకిస్తాన్)లో జన్మించారు. రైతు పోరాటంలో విశేష అనుభవం ఉన్న మాన్‌ను 1990లో రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసారు.

1996లో ఏర్పడిన ‘ఫార్మర్ ఫ్రెండ్స్ అసోసియేషన్’ వ్యవస్థాపక సభ్యుల్లో మాన్ ఒకరు. తరువాత ఈ సంస్థ ‘పంజాబ్ ఖేతీ-బారి యూనియన్‌’గా గుర్తింపు పొందింది.

పంజాబ్ ఫుడ్ కార్పొరేషన్‌లో అవినీతిని బయటపెట్టడం మొదలుకొని పంచదార మిల్లులకు చెరుకు సరఫరా, విద్యుత్ సుంకాలు పెంచడంలాంటి పలు అంశాలను లేవనెత్తారు.

అఖిల భారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోని వ్యవసాయ సంస్థలు డిసెంబర్ 14న కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిశాయి. మాన్ కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు.

ఆ సందర్భంలో మాన్ ‘ది హిందూ’ పత్రికతో మాట్లాడుతూ...వ్యవసాయ రంగంలో పోటీ పెరగాలంటే సంస్కరణలు అవసరమని, అయితే రైతులకు భద్రత కల్పించే విధంగా లోపాలను సరిచేస్తూ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అనిల్ ఘన్వత్

అనిల్ ఘన్వత్ మహరాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు సంస్థ షేత్కారీ సంఘటన అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సంస్థ వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిసి కొత్త వ్యవసాయ బిల్లులకు తమ మద్దతు తెలియజేసింది.

మహరాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు సంఘాల నాయకుడు శరద్ జోషి షేత్కారీ సంఘటన సంస్థను ప్రారంభించారు. ‘అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమితి’ని ఏర్పాటు చేసినది కూడా ఈయనే.

అశోక్ గులాటి

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, అశోక్ గులాటి

అశోక్ గులాటి

వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటికి 2015లో పద్మశ్రీ లభించింది. ‘కమీషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్‌’కు అశోక్ గులాటి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆహార సరఫరా, ధర నిర్ణయానికి సంబంధించిన విధానాలలో కేంద్రానికి ఈ కమీషన్ సలహాదారుగా వ్యవహరిస్తుంది.

ఆహార భద్రత, వ్యవసాయం-వ్యాపారం, గొలుసు వ్యవస్థలు, పంట భీమా, రాయితీలు, పేదరిక నిర్మూలన మొదలైన అనేక అంశాలపై గులాటి పరిశోధనలు చేసారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు గులాటి మద్దతు తెలిపారు. ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన తన వ్యాసంలో ఈ చట్టాలను ఉటంకిస్తూ...ఇవి రైతులకు మేలు చేస్తాయని, వీటి వల్ల పంటను విక్రయించడానికి రైతులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న కనీస మద్దతు ధర గురించి గులాటీ మాట్లాడుతూ...60లలో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నపుడు భారత ప్రభుత్వం ఎంఎస్‌పీని ప్రవేశపెట్టింది. అప్పటినుంచీ ఆహార ధాన్యాలు మిగులు స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌కు పెద్ద పాత్ర ఇవ్వకపోతే, డిమాండ్ ఆధారంగా వ్యవసాయం చేయకపోతే ఎంఎస్‌పీ వ్యవస్థ ఆర్థిక విపత్తును కొనితేగలదు అని అన్నారు.

డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి

వ్యవసాయ పరిశోధన రంగంలో నిపుణులైన జోషి హైదరాబాద్‌లోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్‌మెంట్’, దిల్లీలోని నే’షనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రిసెర్చ్‌’లకు అధ్యక్షులుగా వ్యవహరించారు.

అంతకుముందు ‘ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్‌’లో దక్షిణ ఆసియా కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)