దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది

దారా షికోహ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొఘల్ యువరాజు దారా షికోహ్
    • రచయిత, షకీల్ అఖ్తర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత ప్రభుత్వం ఈమధ్య 17వ శతాబ్దం నాటి మొఘల్ యువరాజు దారా షికోహ్ సమాధి కోసం వెతుకుతోంది.

దారా షికోహ్‌ మృతదేహాన్ని దిల్లీలోని హుమయూన్ సమాధికి దగ్గరలో ఎక్కడో ఖననం చేసినట్లు మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలం నాటి చరిత్రకారుల రచనలు, కొన్ని పత్రాల్లో ఉన్న వివరాలను బట్టి తెలుస్తోంది.

దారా సమాధిని గుర్తించడానికి మోదీ ప్రభుత్వం పురాతత్వ వేత్తలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సాహిత్యం, కళ, వాస్తుకళను బట్టి వారు ఆయన సమాధిని గుర్తించే పనిలో ఉన్నారు.

దారా షికోహ్ షాజహాన్ కొడుకులందరిలో పెద్దవాడు. మొఘల్ సంప్రదాయం ప్రకారం తండ్రి తర్వాత సింహాసనానికి వారసుడు.

కానీ, షాజహాన్‌ అనారోగ్యానికి గురవడంతో ఆయన రెండో కొడుకు ఔరంగజేబ్ తన తండ్రిని గద్దె దించి, ఆగ్రా జైలులో బంధించాడు.

తర్వాత ఔరంగజేబ్ తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. సింహాసనం కోసం జరిగిన యుద్దంలో దారా షికోహ్‌ను ఓడించి కారాగారంలో పడేశాడు.

అప్పుడు దారా షికోహ్ ఏ పరిస్థితిలో ఉన్నారో షాజహాన్ పాలనలోని చరిత్రకారుడు మొహమ్మద్ సాలెహ్ కంబోహ్ లాహౌరీ తన 'షాజహాన్ నామా' పుస్తకంలో వివరించారు.

"యువరాజు దారా షికోహ్‌ను బంధించి, దిల్లీకి తీసుకువచ్చినపుడు, ఆయన శరీరంపై నలిగి, మాసిన బట్టలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన్ను చాలా దారుణమైన పరిస్థితుల్లో, ఒక తిరుగుబాటుదారుడులా ఏనుగుపై ఎక్కించి ఖిజ్రాబాద్ తరలించారు. కొంతకాలం వరకూ ఆయన్ను ఒక ఇరుకైన, చీకటిగదిలో ఉంచారు. తర్వాత ఆయనను చంపేయాలని ఆదేశించారు" అని చెప్పారు.

"దారాను చంపడానికి కారాగారంలోకి వెళ్లిన కొందరు క్షణంలో ఆయన తల నరికి హత్య చేశారు. తర్వాత మాసిపోయి, రక్తంతో తడిచిన అవే బట్టలతో దారా మృతదేహాన్ని హుమయూన్ సమాధిలో ఖననం చేశారు" అని రాశారు.

అదే కాలంలో ఉన్న మరో చరిత్రకారుడు మొహమ్మద్ కాజిమ్ ఇబ్నే మొహమ్మద్ అమీన్ మున్షీ కూడా తన 'ఆలంగీర్ నామా' పుస్తకంలో దారా షికోహ్ సమాధి గురించి రాశారు.

"హుమయూన్ సమాధిలో అక్బర్ చక్రవర్తి కొడుకులు డానియాల్, మురాద్‌ను ఖననం చేసిన గుమ్మటం కిందే దారాను కూడా సమధి చేశారు. తర్వాత అక్కడ తైమూర్ వంశంలోని మిగతా యువరాజులు, యువరాణుల మృతదేహాలను కూడా ఖననం చేశారు" అని తెలిపారు.

పాకిస్తాన్‌ విద్యావేత్త అహ్మద్ నబీ ఖాన్ 1969లో దీవాన్-ఎ-దారా షికోహ్ పేరుతో లాహోర్‌లో ఒక పరిశోధనా పత్రం సమర్పించారు. అందులో దారా సమాధికి సంబంధించిన ఒక ఫొటో ప్రచురించారు. అందులోని వివరాల ప్రకారం, అక్కడ వాయవ్యంలో ఉన్న మూడు సమాధులు పురుషులవి, వాటిలో తలుపు వైపు ఉన్న సమాధి దారా షికోహ్‌ది.

హుమయూన్ టూంబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని హుమయూన్ సమాధి

దారా షికోహ్ సమాధి గుర్తించడం కష్టమా

విశాలంగా ఉండే హుమయూన్ టూంబ్ ప్రాంతంలో హుమయూన్ సమాధితోపాటూ ఎన్నో సమాధులు ఉన్నాయి. అన్ని సమాధుల మధ్య హుమయూన్‌కు సంబంధించిన ఒక్క సమాధిని మాత్రమే ఇప్పటివరకూ గుర్తించగలిగారు.

"ఎందుకంటే, హుమయూన్ సమాధి దగ్గర వేరే ఏ సమాధికీ, ఎలాంటి శిలాశాసనాలూ లేవు. అందుకే ఎవరిని ఎక్కడ ఖననం చేశారో తెలీడం లేదు" అని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం చరిత్రకారులు, ప్రొపెసర్ షిరీన్ మౌసవీ చెప్పారు.

దారా సమాధిని గుర్తించడానికి ప్రభుత్వం పురాతత్వ వేత్తలతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో పురాతత్వ శాఖ మాజీ చీఫ్ డాక్టర్ సయ్యద్ జమాల్ హసన్ కూడా ఉన్నారు.

"అక్కడ ఇప్పటివరకూ గుర్తించని దాదాపు 150 సమాధులు ఉన్నాయి. వాటిని గుర్తించడానికి ఇది మా మొదటి ప్రయత్నం" అని ఆయన అన్నారు.

"హుమయూన్ సమాధిలో ప్రధాన గుమ్మటం కింద నిర్మించిన గదిలో ఉన్న సమాధులను మేం పరిశీలిస్తాం. వాటి డిజైన్ చూస్తాం. ఎక్కడైనా ఏదైనా రాశారేమో గమనిస్తాం. వాటి కళ, వాస్తుకళను బట్టి దారా సమాధిని గుర్తించడానికి ప్రయత్నిస్తాం" అని హసన్ చెప్పారు.

కానీ, అది చాలా కష్టమైన పని అని ఆయన భావిస్తున్నారు.

దారా షికోహ్

ఫొటో సోర్స్, DARA SHUKOH THE MAN WHO WOULD BE KING

మోదీ ప్రభుత్వం దారా సమాధి ఎందుకు వెతుకుతోంది

దారా షికోహ్ షాజహాన్ వారసుడు. చక్రవర్తి కావడంతోపాటూ తత్వశాస్త్రం, సూఫీయిజం, ఆధ్యాత్మిక విషయాల్లో పాండిత్యం సంపాదించిన ఒక భారత చక్రవర్తిగా నిలిచిపోవాలని ఆయన కలలు కన్నారు.

దారా గురించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆయన తన కాలంలో ప్రముఖ హిందూ, బౌద్ధ, జైన, క్రైస్తవ, ముస్లిం సన్యాసులతో మతపరమైన అంశాలపై చర్చలు జరిపేవారు.

ఇస్లాంతోపాటూ ఆయనకు హిందూ మతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు.

బనారస్ పండితులను దిల్లీ పిలిపించిన దారా వారి సాయంతో హిందూ ఉపనిషత్తులను పారశీ భాషలోకి అనువదించారు.

ఉపనిషత్తుల ఈ పారశీ అనువాదం యూరప్ వరకూ చేరింది. అక్కడ వాటిని లాటిన్ భాషలోకి అనువదించారు. అలా, హిందూ ఉనిషత్తులకు దారా అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు.

షిరీన్ మౌసవీ
ఫొటో క్యాప్షన్, చరిత్రకారులు, ప్రొఫెసర్ షిరీన్ మౌసవీ

భారత్‌లో దారా షికోహ్‌ను ఒక ఉదారవాదిగా భావిస్తారు.

ఔరంగజేబ్ స్థానంలో దారా షికోహ్ మొఘల్ సింహాసనంపై కూర్చుని ఉంటే దేశం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని భారత్‌లోని హిందూ అనుకూల చరిత్రకారులు, మేధావులు భావిస్తున్నారు.

చాలామంది చరిత్రకారులు ఔరంగజేబును ఒక కఠిన, మత ఛాందసవాదిగా, వివక్షాపూరిత ముస్లిం పాలకుడుగా భావిస్తారు.

వీరి వివరాల ప్రకారం ఔరంగజేబు హిందువులను ద్వేషించేవారు. ఎన్నో హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఈ అభిప్రాయం మరింత బలంగా మారింది.

బీబీసీ దీనిపై కొందరు చరిత్రకారులతో మాట్లాడింది. వారంతా ఔరంగజేబుకు భిన్నంగా దారా షికోహ్ హిందూ మతం పట్ల ప్రభావితం అయ్యారని చెప్పారు. ఆయన హిందువుల మత విశ్వాసాలను గౌరవించేవారని తెలిపారు.

భారత ముస్లిం పాలకుల దాదాపు 700 ఏళ్ల పాలనను హిందూ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ బీజేపీ 'హిందువుల బానిసత్వ కాలం'గా వర్ణించింది.

ఆధునిక కాలంలో ముస్లిం పాలకుల కాలాన్ని, ముఖ్యంగా మొఘల్ పాలనలో జరిగిన ఘటనలను తరచూ భారత్‌లో ముస్లింల పట్ల ద్వేషం పుట్టించేందుకు ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుత ముస్లింలతో పోలిస్తే, మొఘల్ యువరాజు దారా షికోహ్ భారత మత సంప్రదాయాల్లో ఎక్కువగా కలగలిసిపోయారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

హుమయూన్ సమాధి

మోదీ ప్రభుత్వం దారా సమాధిని ఏం చేస్తుంది

మోదీ ప్రభుత్వం దారా షికోహ్‌ను ఒక ఆదర్శ, ఉదారవాద ముస్లింగా భావిస్తోంది. అందుకే దారాను అది ముస్లింలకు ఆదర్శంగా నిలిపాలని చూస్తోంది.

మొఘల్ యువరాజు సమాధిని గుర్తించిన తర్వాత ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి, మత సద్భావన కోసం ఏదైనా వార్షికోత్సవం లేదా కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉంది.

"దారా షికోహ్ అన్ని మతాల గురించి అధ్యయనం చేసి, శాంతి ప్రచారం చేశారు. అన్ని మతాలనూ ఒక్కటిగా తీసుకెళ్లడాన్ని ఆయన విశ్వసించేవారు. దానికి దారా ఫలితం అనుభవించాల్సి వచ్చింది. ఇప్పటి ముస్లిం సమాజాల్లో కూడా దారా లాంటి ఆలోచన, అవగాహన చాలా అవసరం" అని అధికార బీజేపీ నేత సయ్యద్ జఫర్ ఇస్లామ్ చెప్పారు.

"ఉదారవాదం, పరమత సహనం ప్రదర్శించిన దారా షికోహ్‌ను కేవలం ముస్లింలకు మాత్రమ కాకుండా, మొత్తం దేశానికే రోల్ మోడల్‌గా ఎందుకు చేయకూడదు" అని కొంతమంది విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)