అమిత్ షా మా ఇంటికొచ్చి భోంచేశారు.. కానీ నాతో మాట్లాడలేదు: గాయకుడు బాసుదేవ్ దాస్

అమిత్ షా భోజనం

ఫొటో సోర్స్, @AMITSHAH

    • రచయిత, ప్రభాకర్ మణి తివారీ
    • హోదా, బీబీసీ కోసం, కోల్‌కతా నుంచి

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటామని చెబుతున్న బీజేపీ కష్టాలకు తెరపడేలా కనిపించడం లేదు.

అమిత్ షా బెంగాల్ పర్యటన నుంచి తిరిగి రాగానే విష్ణుపూర్ బీజేపీ ఎంపీ, సౌమిత్ర ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.

అంతకు ముందు ఆసన్‌సోల్ కార్పొరేషన్ అధ్యక్షుడు, జిల్లా టీఎంసీ చీఫ్ జితేంద్ర తివారీ బీజేపీలో చేరుతానని ప్రకటించాక రాత్రికిరాత్రే మాటమార్చి తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత, బీర్భమ్ జిల్లా శాంతినికేతన్‌లోని బావుల్ కళాకారుడు బాసుదేవ్ దాస్ ఇప్పుడు బీజేపీకి తాజా షాక్ ఇచ్చారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, NURPHOTO

గత ఆదివారం బీర్భమ్‌లో పర్యటించిన అమిత్ షా, మరికొంతమంది బీజేపీ అగ్రనేతలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి, పాటలు కూడా వినిపించిన బాసుదేవ్ దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచారు.

కానీ ఇప్పుడు షా తిరిగి దిల్లీ వెళ్లగానే, బీజేపీని విమర్శించిన ఆయన, డిసెంబర్ 29న జరిగే టీఎంసీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ ర్యాలీలో పాల్గొంటానని ప్రకటించారు.

టీఎంసీ, బీజేపీ మధ్య ఇప్పుడు దీనిపై మాటల యుద్ధం రాజుకుంది.

బాసుదేవ్ హఠాత్తుగా అలా ఎందుకు చెబుతున్నారో బీజేపీ నేతలకు అర్థ కావడం లేదు. టీఎంసీ ఆయనతో అలా మాట్లాడిస్తోందని ఆరోపిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మేం రేషన్ బియ్యమే తింటాం, అమిత్ షా కోసం ఖరీదైన బియ్యం తెచ్చాం

ఇంట్లో రేషన్ బియ్యమే తింటామని చెప్పే బాసుదేవ్ తమ ఇంటికి భోజనానికి వస్తున్న అమిత్ షా, మిగతా అగ్ర నేతల కోసం బెంగాల్లో సాగుచేసే మెరుగైన రకం మనీకాటీ బియ్యం కొనుక్కొచ్చారు.

కానీ, ఇక్కడ విచిత్రం ఏంటంటే అమిత్ షాకు భోజనం పెట్టిన బాసుదేవ్‌, ఆయనకు తన సమస్యలు చెప్పుకునే విషయం పక్కనపెడితే, అసలు హోంమంత్రితో మాట్లాడలేకపోయారు..

బీర్‌భుమ్ జిల్లా టీఎంసీ చీఫ్ అనుబ్రద్ మొండల్ సమక్షంలో మీడియాతో మాట్లాడిన బాసుదేవ్ దాని గురించి చెప్పారు.

"నేను హోంమంత్రికి బావుల్ కళాకారుల పరిస్థితి గురించి చెప్పి, వారి జీవితాలు మెరుగుపడేలా ఏదైనా చేయాలని అడగాలనుకున్నాను. ఎంఏ పాసైన నా కూతురు పైచదువుల కోసం సాయం కోరాలని భావించాను.

అంత పెద్ద నేత కచ్చితంగా నాకు సాయం చేస్తారని అనుకున్నాను.

కానీ, ఆయన నాతో అసలు మాట్లాడనేలేదు. ఆయన పర్యటన తర్వాత ఏ బీజేపీ నేతా నన్ను సంప్రదించలేదు" అన్నారు.

తాను మమతా బెనర్జీ ర్యాలీలో పాల్గొనబోతున్నట్లు దాస్ చెప్పారు.

"దీదీ ఇక్కడకు వస్తున్నారు. ఆమె, మాకు ఆహ్వానం పంపించారు. మా కళాకారులకు పార్టీ ఉండదు. ఎవరు గౌరవంగా పిలిచినా మేం వారి దగ్గరకు వెళ్తాం" అన్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, NURPHOTO

కానీ, కేంద్ర హోంమంత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నారని మీకు ఎలా తెలిసింది?

"కొంతమంది యువకులు మోటార్ సైకిళ్లలో ఇంటికొచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మీ ఇంట్లో భోజనం పెట్టాలి అన్నారు. నేను, మొదట భయపడ్డా. కానీ తర్వాత అతిథికి సేవ చేయడం మన సంప్రదాయం. అందుకే, సరే అన్నాను" అని సమాధానం ఇచ్చారు బాసుదేవ్.

"నేను నా సొంత డబ్బు ఖర్చు చేసి అన్ని వస్తువులూ కొనుక్కొచ్చాను. కానీ, అమిత్ షా భోజనం తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత, నేను మమతా దీదీకి లేఖ రాశాను. మీ పాదయాత్ర సమయంలో బావుల్ గీతం వినిపించాలనుకుంటున్నానని అడిగాను" అన్నారు.

బాసుదేవ్

ఫొటో సోర్స్, SANJAY DAS

సాయం చేస్తామన్న టీఎంసీ, చూపులకే అంటున్న బీజేపీ

దాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని టీఎంసీ జిల్లా అధ్యక్షుడు అణుబ్రత్ మండల్ హామీ ఇచ్చారు. ఆయన కూతురు పైచదువులకు కూడా సాయం చేస్తామన్నారు.

"బాసుదేవ్ ఇంట్లో అమిత్ షా భోజనం చేయడం ఒక డ్రామా. బీజేపీ అలాంటి డ్రామాల్లో ఆరితేరిపోయింది. మేం దాస్ కూతురు పైచదువులకు అయ్యే మొత్తం ఖర్చు భరించాలని నిర్ణయించాం. బాసుదేవ్‌ను బీజేపీ ఆ రోజు తర్వాత మర్చిపోయుండచ్చు. మేం ఏడాదిలో 365 రోజులూ ఆయనకు అండగా నిలుస్తాం" అన్నారు.

బాసుదేవ్ విషయంలో వివాదం రాజుకుంటుండడంతో బీజేపీ టీఎంసీకి ప్రశ్నలు సంధించింది.

బీజేపీ నేత అనుపమ్ హాజ్రా పార్టీకి పదేళ్ల వరకూ బాసుదేవ్ కుటుంబం గుర్తుకురాలేదా అని అడిగారు.

"ఇప్పుడు అమిత్ షా ఆయన ఇంట్లో భోజనం చేసిన తర్వాతే టీఎంసీ బాసుదేవ్‌కు సాయం చేయాలని నిర్ణయించింది. బీజేపీ వల్ల ఎవరికో ఒకరికి మంచి జరిగింది. కానీ, ఇదే బాసుదేవ్ వచ్చే ఏడాది బీజేపీ అధికారంలోకి వచ్చాక వాస్తవాలు మన ముందుకు తీసుకొస్తారు" అన్నారు.

బాసుదేవ్

ఫొటో సోర్స్, SANJAY DA

బాసుదేవ్‌తో టీఎంసీ మాట్లాడిస్తోంది

ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, రాజకీయ ప్రేరేపితం అని బీజేపీ బీర్‌భూమ్ జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ మండల్ అన్నారు.

"నేను సోమవారం కూడా బాసుదేవ్‌తో మాట్లాడాను. కానీ, ఆయన అప్పుడు కోపంగా ఉన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు ఆరోపణలు ఆయనవే అయినా, ఆ మాటలు టీఎంసీవి. అలా మాట్లాడేలా ఆయనపై వారు ఒత్తిడి తెస్తున్నారు. టీఎంసీ చెత్త రాజకీయాలకు ఇది నిదర్శనం" అన్నారు.

వివాదం ముదురుతుండడంతో పెరగడంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా ఈ అంశంపై స్పందించారు.

"ఇది చాలా రోజుల నుంచీ నడుస్తోంది. సాయం పేరుతో టీఎంసీ జనాలను బెదిరిస్తోంది. ఝాడ్‌గ్రామ్‌లో లోధా, షబర్ సమాజం వారు పస్తులతో ఉంటున్నారు. కానీ, అక్కడ ఇప్పటివరకూ ఎవరూ పిడికెడు బియ్యం కూడా తీసుకెళ్లి ఇవ్వలేదు. సాయం అడిగితే లాఠీలతో కొడుతున్నారు. కానీ, ఇలాంటి వాటితో జనాలను ఎక్కువ కాలం భయపెట్టలేరు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)