కోవిడ్ వ్యాక్సీన్: ఇప్పుడిక ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కొత్తల్లో వ్యాక్సీన్ ఎప్పుడొస్తుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని అంతా కంగారుపడ్డారు. కానీ 10 నెలల్లో వ్యాక్సీన్ ఇవ్వడం కూడా ప్రారంభమైంది. టీకా తయారు చేస్తున్న కంపెనీల పేర్లు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాయి.
వ్యాక్సీన్ తయారు చేస్తున్న రెండు ప్రధాన సంస్థలు, అమెరికాకు చెందిన మోడెర్నా, బయోఎన్‌టెక్-ఫైజర్‌లు వచ్చే ఏడాదికల్లా బిలియన్ల కొద్దీ లాభాలను సాధిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే వారు ఏ మేరకు లాభాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో తెలియదు.
ఈ వ్యాక్సీన్ తయారీ కోసం అనేక సంస్థలు పోటీపడ్డాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అతి కొద్ది కాలంలోనే ఆ పెట్టుబడులకు తగినట్లుగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.
నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
కోవిడ్‌కు వ్యాక్సీన్ అతి వేగంగా తయారు చేయాలసిన అవసరం ఉండటంతో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు టీకా ప్రాజెక్టుల కోసం బిలియన్ డాలర్ల డబ్బును కుమ్మరించాయి.
గేట్స్ ఫౌండేషన్ లాంటి దాతృత్వ సంస్థలు, ఆలీబాబా వ్యవస్థపకుడు జాక్‌మా, మ్యూజిక్ స్టార్ డాలీ పార్టన్ లాంటి వ్యక్తులు తెర వెనక నుంచి ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేశారు.
సైన్స్ డేటా అనలిస్టిక్స్ కంపెనీ ‘ఎయిర్‌ఫినిటీ’ అంచనా ప్రకారం ప్రభుత్వాల పెట్టుబడి 650 కోట్ల యూరోలు కాగా, స్వచ్ఛంద సంస్థలు దాదాపు 150 కోట్ల డాలర్ల డబ్బును పెట్టుబడిగా సమకూర్చాయి.
ఇక వ్యాక్సీన్ తయారీ సంస్థలు ఇందుకోసం 260 కోట్ల యూరోలను మాత్రమే సేకరించాయి. వీటిలో ఎక్కువ సంస్థలు బయట సంస్థల నుంచే డబ్బును సేకరించాయి.
వాస్తవానికి వ్యాక్సీన్ తయారీ సంస్థలు పెట్టుబడుల కోసం పరుగులు తీయలేదు. ఎందుకంటే గతంలో చేసిన ఇలాంటి ప్రయత్నాల వల్ల వాటికి లాభాలు రాలేదు. గతానుభవాల దృష్ట్యా అవి తొందరపడలేదు.
అందుకే వ్యాక్సీన్ ఆవిష్కరణకు సమయం పట్టింది. అయితే పేద దేశాలకు పెద్ద మొత్తంలో వ్యాక్సీన్ కావాల్సి ఉండగా, అవి ఖర్చును భరించే స్థితిలో లేవు.
గతంలో సార్స్, జికా లాంటి వ్యాధులకు వ్యాక్సీన్ కోసం పెట్టుబడులు పెట్టిన తయారీ సంస్థలు చేతులు కాల్చుకున్నాయి. ఫ్లూ లాంటి వ్యాధులకయితే ప్రతి యేటా ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. అది లాభాదాయకమైన వ్యవహారం కూడా.
కోవిడ్ వ్యాక్సీన్ కూడా అలాగే ప్రతి యేటా తీసుకోవాల్సిన వ్యాక్సీన్ అయితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇది అలా కనిపించడం లేదు.

ఏ సంస్థ టీకాకు ఎంత ఖరీదు ?
కొన్ని వ్యాక్సీన్ తయారీ సంస్థలు లాభాల మీద దృష్టి పెట్టడం లేదు. బయటి నుంచి నిధులు అందాయి కాబట్టి కేవలం ఖర్చుల మొత్తాన్ని మాత్రమే రాబట్టుకోవాలని భావిస్తున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పని చేస్తున్న బ్రిటన్ కంపెనీ ఆస్ట్రాజెనెకా, అమెరికా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌లాంటి సంస్థలు లాభాల గురించి మాట్లాడటం లేదు. ఆస్ట్రాజెనెకా ఒక్కో డోసును కేవలం 4 డాలర్లు (సుమారు రూ. 300)కే అందించాలని భావిస్తోంది. అందుకు భిన్నంగా మోడెర్నా కంపెనీ ఒక్కో డోసుకు 37 డాలర్లు ( సుమారు రూ. 2,800) వసూలు చేయాలని నిర్ణయించింది.
తన షేర్ హోల్డర్లకు, సంస్థలకు లాభాలను పంచడంతో పాటు ఈ వ్యాక్సీన్‌ను నిల్వచేయడానికి అవసరమైన ఉష్ణోగ్రతల నిర్వహణ భారం కూడా తన మీదే ఉందని ఆ కంపెనీ చెబుతోంది. అలాగని ఈ ధరలు ఖచ్చితంగా ఇవే ఉంటాయని కూడా చెప్పలేము.
ఆయా దేశాల ప్రభుత్వాలు ఎంత ఖర్చును భరించగలుగుతాయి అన్న దానిని బట్టి ఫార్మా కంపెనీలు ఒక్కో దేశంలో ఒక్కో ధరను నిర్ణయిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కాలంలోనే తాము వ్యాక్సీన్ ధర తక్కువగా ఉండేలా ప్రయత్నిస్తామని, వచ్చే ఏడాది నుంచి ధరలు పెంచుతామని ఆస్ట్రాజెనెకా తెలింది.
“ధనిక దేశాల ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడవు” అని బార్క్‌లేస్‌లో యూరోపియన్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్‌కు నాయకత్వం వహిస్తున్న ఎమిలీ ఫీల్డ్ అన్నారు.
అయితే వచ్చే ఏడాది కల్లా మరిన్ని వ్యాక్సీన్‌లు వస్తే, పోటీ పెరిగి ధరలు తగ్గవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
“కోవిడ్ టీకా తప్ప వేరే ప్రొడక్ట్ ఏదీ లేని చిన్నచిన్న ప్రైవేట్ కంపెనీలు ఎంతకో ఒకంతకు వ్యాక్సీన్‌ను ఇచ్చేస్తాయని అనుకోవడం పొరపాటు’’ అన్నారు ఎయిర్‌ఫినిటీ సీఈవో రాస్మస్ బెక్ హాన్సెన్.
“వాటికైన ఖర్చును, అవి తీసుకున్న రిస్కును కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’ అన్నారాయన. ఒకవేళ చిన్న సంస్థల నుంచి వ్యాక్సీన్‌ను ఆశించాలంటే వాటికి నిధులు కూడా బాగానే అందించాలని రాస్మస్ వ్యాఖ్యానించారు.
అయితే మానవ మనుగడకే ప్రమాదంగా మారిన ఈ సందర్భంలో వ్యాపార కోణంలో ఆలోచించడం మంచిది కాదని కొందరు వాదిస్తున్నారు.
కంపెనీలు టెక్నాలజీని ఇచ్చి పుచ్చుకుంటాయా ?
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల టీకాలను ఎలా సేకరించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందుకు సమాధానంగా ఇండియా, దక్షిణాఫ్రికాలాంటి కొన్నిదేశాలు ఈ వ్యాక్సీన్‌ను తమ దేశంలోనే తయారు చేసేందుకు, అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
అయితే కంపెనీలకు ప్రజల సొమ్మును నిధులుగా అందించే విషయంలో నిబంధనలు కూడా ఉండాలని ఎల్లెన్ హోన్ అన్నారు. “ఎలాంటి కండీషన్లు లేకుండా ప్రభుత్వాలు నిధులివ్వడం తెలివైన పనికాదు’’ అని ఆమె పేర్కొన్నారు.
వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు వ్యాక్సీన్ తయారీకి ముందుకురాలేదని, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగిన తర్వాతనే పని మొదలుపెట్టాయని, అలాంటప్పుడు వారికి లాభాల మీద ప్రత్యేక హక్కులు ఎలా ఉంటాయని ఎల్లెన్ హోన్ ప్రశ్నించారు.
“ఈ ఆవిష్కరణలన్నీ ప్రైవేట్ సొత్తుగా మారిపోతున్నాయి. వాటి మీద కంట్రోల్ పూర్తిగా ప్రైవేటు సంస్థలకే ఉంటోంది’’ అని చెప్పారు. కొన్ని సంస్థలు టెక్నాలజీని షేర్ చేస్తున్నా అది తగినంతగా లేదన్నారు.

ఫార్మా కంపెనీలకు లాభాల పంట పండుతుందా ?
బిలియన్ల డోసుల వ్యాక్సీన్‌ను ముందే నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రకటించాయి. రాబోయే నెలల్లో ఆర్డర్ల ప్రకారం వ్యాక్సీన్ తయారీలో ఫార్మా సంస్థలు బిజీగా ఉంటాయి.
కొన్ని కంపెనీలు ధనిక దేశాలకు పెద్ద ఎత్తున టీకా సప్లై చేయడం ద్వారా లాభాలు పొందుతాయి. కానీ లాభాపేక్ష లేని ఆస్ట్రాజెనెకా లాంటి సంస్థలు పెద్ద ఆర్డర్లు ఉన్నా ఖర్చులను మాత్రమే పూడ్చుకోగలుగుతాయి.
అయితే టీకా కార్యక్రమం పూర్తయ్యాక వ్యాక్సీన్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.
వ్యాక్సీన్ ద్వారా వచ్చిన వ్యాధి నిరోధక ఎన్నాళ్లు ఉంటుంది, ఎంత వరకు సక్సెస్ అవుతుంది, సరఫరా ఎలా సాగుతుంది అన్నదానిపై వ్యాక్సీన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ముందుగా వ్యాక్సీన్ తయారు చేసిన సంస్థలు తమ సాంకేతికతను ఇతరులకు ఇవ్వకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా 50కి పైగా కంపెనీలు వ్యాక్సీన్ తయారు చేసే పనిలో ఉన్నాయి.
“రాబోయే రెండేళ్లలో 20 దాకా వ్యాక్సీన్‌లు మార్కెట్‌లో ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కువ ధరకు అమ్మడం సాధ్యం కాదు. ఎలా చూసినా ఈ లాభాలు కొంత కాలమే’’ అన్నారు ఎమిలీ.

ఫొటో సోర్స్, Reuters
ఆ రెండు కంపెనీలే ఎందుకు ?
ఇప్పటి వరకు వచ్చిన వ్యాక్సీన్‌లలో బయెఎన్‌టెక్, మోడెర్నాల పేరు మారిమోగిపోవడానికి వారు ఉపయోగించిన ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీయే కారణం. “వారి వ్యాక్సీన్‌ల పనితీరు అందరినీ సంతృప్తి పరిచింది. టీకా కార్యక్రమంలో ఇదొక కీలక పరిణామం’’ అన్నారు ఎమిలీ.
కోవిడ్ వ్యాక్సీన్‌కు ముందు బయోఎన్‌టెక్ సంస్థ స్కిన్ క్యాన్సర్ మీదా, మోడెర్నా సంస్థ అండాశయ క్యాన్సర్ మీద వ్యాక్సీన్ తయారు చేసే పనిలో ఉన్నాయి. వాటిలో ఏది సక్సెస్ అయినా, వాటి లాభాలు భారీగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- సూడాన్ ఖల్వాస్: విద్యార్థులకు జంతువులకు వేసినట్లు సంకెళ్లు వేసే బడిలో బీబీసీ రహస్యం చిత్రీకరణ
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- నల్లగా ఉన్నావంటూ భర్త చేసే వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- లాక్డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








