కరోనావైరస్: ఫైజర్ కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కిన మహిళ

బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సీన్‌ను తీసుకున్న తొలివ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆమెకు టీకా ఇవ్వడం ద్వారా బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది.
ఉదయం 6.31 గం.లకు తాను ఇంజెక్షన్ తీసుకున్నానని వచ్చేవారం 91వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న మార్గరెట్ కీనన్ వెల్లడించారు. ఇది తన పుట్టిన రోజుకు ముందస్తు కానుక అన్నారామె.
రాబోయే కొద్దివారాల్లో తొలి 8 లక్షల డోసుల వ్యాక్సీనేషన్‌లో భాగంగా ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఈ టీకాను బ్రిటన్‌లో ఇవ్వడం ప్రారంభించారు.
ఈ నెలాఖరుకల్లా బ్రిటన్‌లో 40లక్షలమందికి టీకా అందించేందుకు నిర్ణయించారు. ముందుగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులతోపాటు, కొందరు ఆరోగ్య సిబ్బందికి కూడా టీకాలు ఇస్తున్నారు.
మంగళవారం నాడే కొన్నివేలమందికి టీకాలు ఇచ్చినట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ అధికారులు బీబీసీకి వెల్లడించారు.

ఫొటో సోర్స్, PA Media
ప్రభుత్వం ఏమంటోంది?
తొలి వ్యాక్సీన్ ఇచ్చిన రోజును వి-డే (విక్టరీ డే)గా ప్రకటించిన యూకే ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్, ఇది సైన్స్ విజయానికి, వేలమంది శాస్త్రవేత్తల కృషికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. “అందరి శత్రువైన కరోనా వైరస్‌పై పోరాటానికి ఇది ఆరంభం” అన్నారు హాంకాక్
“వ్యాక్సీన్ తీసుకోవడం మనకు, మన తోటివారందరికీ మంచిది’’ అని వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు లండన్‌లోని ఓ హాస్పిటల్‌కు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు
“ఈ రోజు నుంచి అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపించాలి. అలాగని మనం అజాగ్రత్తగా ఉండకూడదు” అన్నారు స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జియాన్ అన్నారు.
మంగళవారంనాడు యూకేవ్యాప్తంగా 618మంది కరోనాతో మరణించారని అధికారులు ప్రకటించారు. దీంతో యూకేలో కోవిడ్ మృతుల సంఖ్య 62,033కు చేరుకుంది. తాజాగా 12,282మందికి కరోనా సోకినట్లు తేలింది.
కొవెంట్రీలోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో నర్స్ మే పార్సన్ తొలి టీకాను మార్గరెట్ కీనన్‌కు వేశారు.“కోవిడ్-19కు తొలి టీకా తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను” అని కీనన్ అన్నారు.
“కొత్త సంవత్సరంలో నా కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలనుకుంటున్నాను. ఎవరికైనా వ్యాక్సీన్ వేయించుకునే అవకాశం వస్తే తప్పకుండా వేయించుకోండి. 90 ఏళ్ల వయసులో నేనే వేయించుకున్నాను. ఎవరూ భయపడాల్సిన పనిలేదు’’ అని మార్గరెట్ కీనన్ అన్నారు.
“ఆమెను ఆలింగనం చేసుకోలేకపోవచ్చు. అందుకే అంతా చప్పట్లుకొట్టి పరస్పరం మా సంతోషాన్ని తెలుపుకున్నాం’’ అన్నారు నేషనల్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీఫెన్ పావిస్.

ఫొటో సోర్స్, Getty Images
టీకా మొదట ఇచ్చేది ఎవరికి?
గత వారమే ఫైజర్ కంపెనీ వ్యాక్సీన్‌కు అనుమతులు రాగా, ప్రపంచంలో ఆ టీకాను వాడుతున్న తొలి దేశంగా యూకే నిలిచింది. దేశవ్యాప్తంగా 50 ఆసుపత్రులలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది.
ఈ వ్యాక్సీన్ 95శాతం ప్రభావవంతమైనది అమెరికాకు చెందిన డ్రగ్స్ నియంత్రణ సంస్థ వెల్లడించడంతో మంగళవారం నుంచి బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టారు.
ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రా-జెనెకా సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్న టీకా కూడా సురక్షితమైనదేనని స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం మంగళవారం వెల్లడించింది.
వ్యాక్సినేషన్ కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని, అవసరమైన వారందరికీ టీకా ఇస్తామని ఆరోగ్యమంత్రి హాంకాక్ కామన్స్ సభలో ప్రకటించారు. యూకేలో వ్యాక్సినేషన్ అందరికీ తప్పనిసరి కాదు.
వేలమంది శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా ఇవాళ వ్యాక్సీన్ సాధ్యమైందని ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.
బ్రిటన్ ఫైజర్ కంపెనీ నుంచి ఇప్పటికే 8 లక్షల డోసుల వ్యాక్సీన్ ప్రభుత్వానికి చేరింది. 2 కోట్లమంది ప్రజలకు మొత్తం 4 కోట్ల డోసులకు ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వగా వీటి కోసం వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాల్సి ఉంది.
80 సంవత్సరాలు దాటిన వారికి, ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి టీకా ఇచ్చేందుకు కొన్నివారాలు పడుతుందని ఆరోగ్య శాఖా మంత్రి హాంకాక్ తెలిపారు.

చరిత్రాత్మక క్షణాలు, ఎదురు చూస్తున్న సవాళ్లు -విశ్లేషణ:
నిక్ ట్రిగిల్- బీబీసీ హెల్త్ కరస్పాండెంట్
ఇది నిజంగా చరిత్రాత్మక క్షణమే. కానీ నేషనల్ హెల్త్ సర్వీస్ ముందు ఇంకా అనేక బాధ్యతలు, సవాళ్లు ఉన్నాయి.
టీకాను అందించే విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవాలి. ఫైజర్ కంపెనీ నుంచి రావాల్సిన ఒక కోటి డోసుల్లో ఈ ఏడాది చివరికి సగం డోసులను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇప్పటికే టీకా ఉత్పత్తిలో సమస్యలు కనిపిస్తున్నాయి.
వీటిని అల్ట్రా-కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేయాల్సి రావడం మరో పెద్ద సమస్య. వీటిని ఇప్పటికీ కేర్ హోమ్‌లకుగానీ, జనరల్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో నడిచే క్లినిక్‌లకుగానీ ఇంకా తరలించ లేదు. కేర్ హోమ్‌లలో ఉండే వారికి ప్రథమ ప్రాధాన్యంగా టీకా ఇవ్వాల్సి ఉంది.
ఈ సమస్యను ఎలా సరిదిద్దాలన్న దానిపై నియంత్రణ సంస్థల సలహా కోసం నేషనల్ హెల్త్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎదురు చూస్తున్నారు.
ఆక్స్‌ఫర్డ్ టీకాను సాధారణ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చు. పంపిణీ చేయడం కూడా సులభమే. దానిని నిల్వ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలు బ్రిటన్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. దీన్నిబట్టి ఆక్స్‌ఫర్డ్ టీకా కోసం బ్రిటన్ ఎందుకు ఎదురు చూస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
డ్రగ్స్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చిందంటే 2021 సంవత్సరం తొలి మాసాలు పూర్తయ్యేనాటికి చాలామందికి వ్యాక్సీన్‌ను అందించేందుకు, యూకేలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









