కరోనావైరస్: మహమ్మారి వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, రేచల్ ష్రీర్
- హోదా, హెల్త్ రిపోర్టర్
కరోనావైరస్ చిన్నారుల ముక్కుల్లో దాదాపు మూడు వారాల వారకూ ఉంటుందని దక్షిణ కొరియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు.
గతంలో నిర్వహించిన అధ్యయనాలు.. కరోనావైరస్ సోకిన చిన్నారుల్లో దానికి సంబంధించిన లక్షణాలు స్వల్పంగా ఉండటమో అసలు లేకపోవటమో జరుగుతోందని చెప్పాయి.
అయితే.. చిన్నారుల నుంచి ఈ వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఎంత ఉంటుందనే అపరిష్కృత ప్రశ్నకు సమాధానం లభించటానికి తాజా అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు.
పిల్లలు తిరిగి స్కూళ్లకు వెళుతున్న పరిస్థితుల్లో సామాజిక దూరం, పరిశుభ్రత అంశాలు ఎంత ముఖ్యమో ఈ అధ్యయనం బలంగా చెప్తోంది.
చిన్నారులు - కోవిడ్-19 అంశానికి సంబంధించి పరస్పర సంబంధమున్న మూడు వేర్వేరు ప్రశ్నలు ఉన్నాయని రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రసెల్ వీనర్ పేర్కొన్నారు.
పిల్లలకు కూడా వైరస్ సోకగలదనే విషయం కచ్చితంగా తెలిసినప్పటికీ.. వారికి - ప్రత్యేకించి 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు వైరస్ సోకే అవకాశం పెద్దవాళ్లకన్నా తక్కువేనని యాంటీబాడీ బ్లడ్ టెస్టుల గణాంకాలు సూచిస్తున్నట్లు ప్రొఫెసర్ వీనర్ వివరించారు.
ఒకవేళ వైరస్ సోకినా కూడా పెద్దవాళ్ల కన్నా పిల్లలు జబ్బుపడే అవకాశం తక్కువని శాస్త్రవేత్తలు చాలా ధీమాగా ఉన్నారు. చాలా మంది పిల్లల్లో అసలు వ్యాధి లక్షణాలు ఏమాత్రం కనిపించకపోవటం దీనికి కారణం. శుక్రవారం నాడు ప్రచురించిన బ్రిటిష్ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది.
ఇక మూడో ప్రశ్నకు సమాధానం మనకు పెద్దగా తెలియదు. ఈ ప్రశ్నకు జవాబు కనుగొనటానికి దక్షిణ కొరియా అధ్యయనం ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా అధ్యయనం ఏం చెప్తోంది?
ఈ అధ్యయనాన్ని 91 మంది చిన్నారుల మీద నిర్వహించారు. స్వల్ప లక్షణాలు ఉన్న చిన్నారులతో పాటు.. అసలు ఏ లక్షణాలూ కనిపించని చిన్నారుల్లో సైతం స్వాబ్ పరీక్షలు చేస్తే మూడు వారాల తర్వాత కూడా వైరస్ కనిపిస్తుంది.
వైరస్ సోకిన చిన్నారుల ముక్కుల్లో గుర్తించగలిగిన వైరస్ ఉందన్న వాస్తవం.. వారి ద్వారా ఆ వైరస్ మరొకరికి సోకే అవకాశముందని సూచిస్తోంది.
అంటే.. చిన్నారుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందనే కొత్త విషయం ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
అయితే.. చిన్నారుల్లో వైరస్‌కు సంబంధించి కొన్ని అంతుచిక్కని విషయాలు ఇతర అధ్యయనాల తరహాలోనే ఇందులో కూడా పరిష్కారం కాలేదు.
చిన్నారుల ముక్కుల్లో వైరస్ కనిపించినంత మాత్రాన.. వారు కూడా పెద్దవాళ్ల స్థాయిలోనే వైరస్‌ను వ్యాపిస్తున్నారని ఖచ్చితంగా నిరూపణ కాదు.
అలాగని.. పిల్లల్లో వైరస్ ఉందని కనిపిస్తున్నపుడు దాని వ్యాప్తిలో పిల్లల పాత్ర లేదనుకోవటం అహేతుకమని వాషింగ్టన్ డీసీలోని చిల్డ్రన్స్ నేషనల్ హాస్పిటల్‌లో పిల్లల వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ రాబర్టా డేబియాసి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PA Media
''ముక్కు, శ్వాస కోశంలోని స్రావాల్లో వైరస్ జన్యుపదార్థం ఉన్నంతమాత్రాన.. వారి నుంచి వైరస్ వ్యాపిస్తుందని అర్థం కాదు. ప్రత్యేకించి పిల్లల్లో దగ్గు, తుమ్ము వంటి లక్షణాలేవీ లేనపుడు వారు వ్యాప్తి చేస్తున్నారనేది సరికాదు'' అని యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌లో చిన్నారుల ఆరోగ్యంపై బోధించే ప్రొఫెసర్ కాలమ్ సింపుల్ అభిప్రాయపడ్డారు.
పిల్లలైనా, పెద్దవాళ్లయినా.. లక్షణాలు తక్కువగా ఉన్నవారు కానీ అసలే లక్షణాలూ లేని వారు కానీ -వైరస్‌ను గాలిలోకి పంపే దగ్గు లక్షణాలు లేని వారి నుంచి వైరస్ సోకే అవకాశం తక్కువని హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు తెలుస్తుంది.
కానీ.. వైరస్ సోకినా లక్షణాలు లేని వారిలో గణనీయమైన సంఖ్యలో జనం వైరస్ వ్యాప్తి మీద పెద్ద ప్రభావమే చూపుతున్నారు.
అదేసమయంలో.. స్కూళ్ల మూసివేత కొనసాగించటం కూడా పరిష్కారం కాదని.. దానివల్ల పిల్లల అభివృద్ధి, చదువు, మానసిక ఆరోగ్యం అంశాలకు ముప్పు ఉంటుందని ప్రొఫెసర్ వీనర్ ఉటంకిస్తున్నారు.
వైరస్ వ్యాప్తి విషయంలో పిల్లల నుంచి ముప్పు ఎంత ఉంటుందనే ప్రశ్న ప్రస్తుతానికి అపరిష్కృతంగానే ఉన్నా.. భవిష్యత్తులో మహమ్మారి విజృంభణను నియంత్రించటంలో ఈ ప్రశ్నకు సమాధానం చాలా కీలకమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









