జునాగఢ్‌పై ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను వదులుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?

ఫొటో సోర్స్, FACEBOOK \ JUNAGADH STATE MUSLIM FEDERATION
- రచయిత, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చెబుతూ ఒక కొత్త మ్యాప్ విడుదల చేశారు. అది కొన్ని రోజులుగా వివాదాల్లో ఉంది.
జునాగఢ్ భారత్‌లో ఆగస్టు 15న కాకుండా 1947 నవంబర్ 9న విలీనం అయ్యింది. అందుకే జునాగఢ్ స్వాతంత్ర్య దినోత్సవం నవంబర్ 9న జరుపుకుంటారు.
భారత్, పాకిస్తాన్ మధ్య వేలాడుతున్న జునాగఢ్‌కు స్వేచ్ఛ అందించడానికి అక్కడ ఆర్జీ హుకుమత్ (తాత్కాలిక ప్రభుత్వం) ఏర్పాటు చేశారు. ఆర్జీ హుకుమత్ పోరాటం తర్వాత జునాగఢ్ భారత్‌లో భాగం కాగలిగింది.
ఇటీవల జారీ చేసిన పాకిస్తాన్ కొత్త మ్యాప్‌లో జునాగఢ్, మాణావదర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వాటిని పాకిస్తాన్ వృథా ప్రయాసలుగా వర్ణించింది.
భారత్, పాకిస్తాన్ రాజకీయ చరిత్ర గురించి ఎప్పుడు చర్చ జరిగినా జునాగఢ్ స్వతంత్ర పోరాటం గురించి కూడా చర్చ మొదలవుతుంది.
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక, సంస్థానాలు విలీనం అయిన సమయంలో జునాగఢ్‌ను నవాబ్ మహాబత్ ఖాన్-3 పాలిస్తున్నారు.
1947 ఆగస్టు 15న భారత్ స్వతంత్ర సంబరాల్లో మునిగి ఉన్నప్పుడు జునాగఢ్ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే, అదే రోజు జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో కలపాలని నవాబ్ నిర్ణయం తీసుకున్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సమయంలో ఆంగ్లేయ పాలకులు భారత స్వాతంత్ర్యతా చట్టం 1947ను అమలు చేశారు. దీని ప్రకారం ‘లాప్స్ ఆఫ్ పారామౌంట్’ ప్రత్యామ్నాయం ఇచ్చారు. దీని ద్వారా రాజు తన సంస్థానాన్ని భారత్ లేదా పాకిస్తాన్‌లో విలీనం చేయవచ్చు. లేదా తమ స్వతంత్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు.
లాప్స్ ఆఫ్ పారామౌంట్‌ను దృష్టిలో ఉంచుకున్న జునాగఢ్ నవాబ్ మహాబత్ ఖాన్ తాము పాకిస్తాన్‌తో వెళ్లాలనుకుంటున్నట్టు ప్రకటించారు.
జునాగఢ్ పాకిస్తాన్‌తో కలపడంలో జునాగఢ్ దీవాన్ షానవాజ్ భుట్టో కీలక పాత్ర పోషించారు. జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో కలపాలనే సలహా ఇచ్చింది కూడా ఆయనే.
దీని వెనుక మహమ్మద్ అలీ జిన్నా కూడా ఉన్నారని చరిత్రకారులు, గాంధీజీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ చెబుతున్నారు. ఆయన తన ‘పటేల్ ఎ లైఫ్’లో జునాగఢ్ స్వతంత్ర పోరాటం గురించి రాశారు.
“జునాగఢ్‌లో అప్పుడు ఏడు లక్షల మంది ఉండేవారు. వారిలో 80 శాతం మంది హిందువులే. జునాగఢ్ నవాబ్ యూరప్‌లో ఉన్నప్పుడు, రాజమహల్లో విభేదాలు వచ్చాయి. 1947 మేలో సింధ్ ముస్లిం లీగ్ నేత షానవాజ్ భుట్టోను జునాగఢ్ దీవాన్‌గా నియమించారు. భుట్టో, జిన్నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన టూ స్టేట్స్ సిద్ధాంతానికి నీళ్లొదిలిన జిన్నా, హిందూ మెజారిటీ రాజ్యాలను తమలో కలుపుకోడానికి సిద్ధమయ్యారు. జిన్నా సలహా ప్రకారం భుట్టో ఆగస్టు 15 వరకూ ఏం చేయలేదు. పాకిస్తాన్ ఏర్పడగానే, అదే రోజు జునాగఢ్ పాక్‌తో కలుస్తుందని ప్రకటించింది” అన్నారు.
జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో కలిపే సమయంలో స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయం ప్రస్తావన ఎక్కడా కనిపించదు.

ఫొటో సోర్స్, Getty Images
కాఠియావాడ్ నేతల సలహా పట్టించుకోని భుట్టో
సౌరాష్ట్ర యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్‌గా రిటైరై, సౌరాష్ట్ర కఛ్ చరిత్ర పరిషత్ చీఫ్‌గా పనిచేసిన ఎస్‌వీ జానీ తన ‘జునాగఢ్ నా నవాబీ శాసన్‌నో అంత్’(జునాగడ్‌లో నవాబ్ పాలనకు అంతం)లో దాని గురించి రాశారు.
“ఆగస్టు 13న భుట్టో జునాగఢ్‌లోని కొంతమంది ముఖ్య వ్యాపారులను ఒక దగ్గరకు చేర్చాడు. వారిలో దయా శంకర్ దవే అనే ఒక నేత కూడా ఉన్నారు. ఆయన స్థానికుల తరఫున జునాగఢ్‌ను భారత్‌లో కలపాలని చెప్పారు. ఆయనతోపాటూ కాఠియావాడ్ రాజకీయ పరిషత్‌కు చెందిన ఉచ్ఛరంగరాయ్ డేబర్ కూడా భుట్టోకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి 1947 ఆగస్ట్ 15న పాకిస్తాన్‌తో కలవాలనుకుంటున్నట్లు జునాగఢ్ ప్రకటించింది”.
పాకిస్తాన్ దాదాపు నెల వరకూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సెప్టెంబర్ 13న ఒక టెలిగ్రాం పంపించి పాకిస్తాన్ జునాగఢ్‌ను అంగీకరించిందని చెప్పారు.
సెప్టెంబర్ 19న సర్దార్ పటేల్ అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి వీపీ మీనన్‌ను జునాగఢ్ పంపించారు.
కానీ, ఆయనను నవాబ్‌తో కలవనివ్వలేదు. నవాబ్ తరఫున ఆయనకు అన్ని సమాధానాలూ భుట్టో నుంచే అందాయి.
రాజమోహన్ గాంధీ తన పుస్తకంలో “భుట్టో ఏవేవో సమాధానాలు చెప్పారు. పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. కాఠియావాడ్ నేతలు, ముంబయిలో ఉన్న కొంతమంది కాఠియావాడీ ప్రజలు ఆందోళనలో ఉన్నారు” అని రాశారు.
సర్దార్ పటేల్ నేరుగా జునాగఢ్ యుద్ధంలో ఎందుకు దిగలేదు
వీపీ మీనన్ జునాగఢ్ నుంచి రాజకోట్, అక్కడి నుంచి ముంబయి మీదుగా దిల్లీ చేరుకున్నారు. మీనన్ ముంబయిలో కాఠియావాడ్ స్థానిక రాజ్యాల ప్రతినిధులను కలిశారు. తన ‘జునాగడ్‌నా నవాబీ శాసన్‌నో అంత్’ పుస్తకంలో ఎస్‌వీ జానీ దాని గురించి రాశారు.
“ఉచ్ఛరంగరాయ్ దేబర్ పరిస్థితులు సరిగా లేవన్నారు. అక్కడి ప్రజలను ఎక్కువ సేపు అదుపు చేయలేమని తెలిపారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని జునాగఢ్ సంగ్రామం నుంచీ ఉన్న వందే పత్రిక ఎడిటర్ శామలదాస్ గాంధీ చెప్పారు. వీపీ మీనన్ సర్దార్ పటేల్‌కు అదంతా చెప్పారు. జునాగఢ్ ప్రజలు స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది తెలిసి సర్దార్ పటేల్ సంతోషంగా లేరు. అలా ముందు ముందు సమస్యలు తలెత్తవచ్చు అనుకున్నారు”,
“అదే సమయంలో ముంబయిలోని కొంతమంది ముఖ్య కార్యకర్తలు ఈ సమస్యను సత్యాగ్రహం ద్వారా పరిష్కరించవచ్చని చెప్పారు. డేబర్ భాయీ 1938లో జరిగిన రాజకోట్ సత్యాగ్రహంతో కాఠియావాడీ జాతీయ సంగ్రామంలో తనదైన పాత్ర పోషించారని చెబుతారు. సర్దార్ పటేల్, గాంధీజీ కూడా ఆయన పట్ల ప్రభావితం అయ్యారు. డేబర్ భాయీ పక్కా గాంధేయవాది. ఆయుధం పట్టాలనే విషయాన్ని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు. సర్దార్ పటేల్ ఆయనతో సత్యాగ్రహం లాంటివి ఏవైనా చేయండి. తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అన్నారు.
జునాగఢ్ విషయంలో భారత్ ప్రభుత్వం నేరుగా ఏదైనా చేయగలిగే పరిస్థితిలో లేదు. ఎందుకంటే లాప్స్ ఆఫ్ పారామౌంట్ నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం సంస్థానాలు ఎవరితో కావాలంటే వారితో కలవవచ్చు లేదా తమ దారి తాము చూసుకోవచ్చు.
ఇలంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వ హోంమంత్రి సర్దార్ పటేల్ నేరుగా జోక్యం చేసుకుంటే, చట్టపరమైన అడ్డంకులు వచ్చేవి.
ఆ తర్వాత ఆర్జీ హుకుమత్ ఏర్పాటుచేశారు. జునాగఢ్ ప్రజలే ఆ యుద్ధంలో పోరాడాలని సర్దార్ పటేల్ భావించారని ప్రజాసేనకు చెందిన రతుభాయ్ అదాణీ చెప్పారు. అంటే, జునాగఢ్ ప్రజలు, వారి ప్రతినిధులు గళమెత్తినపుడే జునాగఢ్ భారత్‌లో ఉండగలుగుతుంది అని పటేల్ భావించారు. స్థానిక ప్రతినిధులందరూ ఆయన మాటలు అర్థం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK \ JUNAGADH STATE MUSLIM FEDERATION
ఆర్జీ హుకుమత్ నిర్మాణం
వీపీ మీనన్ ముంబయిలోని కాఠియావాడీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ప్రజాకీయం అంటే ప్రజలు ఒక యుద్ధం చేయాలనే నిర్ణయానికి ప్రతినిధులందరూ అంగీకరించారు. అదే సంగ్రామంతో జునాగఢ్‌లో ‘ఆర్జీ హుకుమత్’ అనే ఆలోచనతో సమాంతర ప్రభుత్వం స్థాపించారు.
మొదట్లో ఉచ్ఛరంగరాయ్ డేబర్ కాస్త గందరగోళంలో పడ్డారు. అయితే తర్వాత ఆయన ఆ ఆలోచనకు అంగీకరించారు.
జునాగఢ్ నవాబ్‌తో జరిగిన మూడు సమావేశాలు ఏ ఫలితం లేకుండా ముగియడంతో డేబర్ భాయీ ఒక సభలో ఆర్జీ హుకుమత్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దానికోసం పది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్‌వీ జానీ ఆ వివరాలను తన పుస్తకంలో రాశారు.
1947 సెప్టెంబర్ 23న ఆర్జీ హుకుమత్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ దానిని ప్రకటించలేదు.
1947 సెప్టెంబర్ 24న గాంధీజీ తన సంధ్యా ప్రార్థనలో “కాఠియావాడ్‌లోని వెరావల్ రేవు దగ్గర జునాగఢ్ రేవు కూడా ఉంది. జునాగఢ్ పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయింది, కానీ, జునాగఢ్‌లో పాకిస్తాన్ ఎలా ఉండగలదు. అదే నాకు అర్థం కావడం లేదు. చుట్టుపక్కల రాజ్యాలన్నీ హిందువులవి, జనాభాలో కూడా పెద్ద భాగం హిందువులే ఉన్నారు. అయినా జునాగఢ్ పాకిస్తాన్‌లో భాగం అయ్యింది. అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇలాంటి ఘటనలు భారత్‌లో ప్రతి చోటా జరుగుతున్నాయి. జునాగఢ్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలి” అన్నారు.
ఆర్జీ హుకుమత్ ఏర్పాటు చేసిన నేతలకు గాంధీజీ మాటలు ఆశీర్వాదంలా అనిపించాయి.

శామల్ దాస్ గాంధీ ఆర్జీ హుకుమత్ ప్రధాన్ అయ్యారు. 1947 సెప్టెంబర్ 25న ఆర్జీ హుకుమత్ అధికారిక స్థాపన జరిగింది. ఒక ప్రధానమండలి కూడా ఏర్పాటుచేశారు, అందులో పుష్పా బేన్ మెహతా, దుర్లభ్ జీ ఖెతానీ, భవానీ శంకర్ ఓఝా, మణిలాల్ దోషీ, సురగ్ భాయీ వరూ, నరేంద్ర నథవాణీ ఉన్నారు.
ఆర్జీ హుకుమత్ ఒక మేనిఫెస్టోను రూపొందించింది. దానికి జునాగఢ్ ప్రజల స్వతంత్ర ప్రకటనా పత్రం అనే పేరు పెట్టారు. దానిని కన్హయ్యా లాల్ మున్షీ రాశారు.
1947లో ముంబయిలో స్థిరపడిన కాఠియావాడీలు మాధవబాగ్‌లో ఒక సమావేశానికి పిలుపునిచ్చారు. అక్కడ సాయంత్రం 6.17కు ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఎస్‌వీ జానీ తన పుస్తకంలో ఆ వివరాలు రాశారు.
“ఆ మేనిఫెస్టోలో హిందూ మెజారిటీ ప్రజలున్న జునాగఢ్‌ను భారత్‌లో కలపాలన్న వినతిని నవాబ్ పట్టించుకోవడం లేదు. దానిని పాకిస్తాన్‌లో కలిపి తప్పు చేశారు. ప్రజలు చివరికి ఈ నిర్ణయానికి సిద్ధమయ్యేలా క్లిష్ట పరిస్థితులు సృష్టించారు. అందుకే నవాబ్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. పాకిస్తాన్ కూడా స్వీయ నిర్ణయ సిద్ధాంతాన్ని ఉల్లంఘించింది. అందుకే జునాగఢ్ పాకిస్తాన్‌లో కలవడం అనర్హం, చట్టవిరుద్ధం కూడా” అన్నారు.
ఈ మేనిఫెస్టోలో తాము భారత్‌లో కలవాలనే విషయం కూడా చెప్పారు. జునాగఢ్ నవాబ్ దగ్గర ఉన్న పాలనాధికారాలను ఆర్జీ హుకుమత్‌కు అప్పగించాలని కూడా రాశారు. మన ప్రభుత్వాన్ని అంగీకరించాలని ప్రజలను కోరారు. మేనిఫెస్టో ద్వారా జునాగఢ్ ప్రజలు ఆర్జీ హుకుమత్ స్థాపనను ప్రకటించారు.
ఆర్జీ ప్రభుత్వం ప్రధాన కార్యాలయం రాజ్‌కోట్‌లో ఏర్పాటుచేశారు. నాలుగు వారాల వరకూ అంతా ప్రశాంతంగానే ఉంది. పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు వల్లభ్ భాయ్ పటేల్ సమయం ఇచ్చారు.
ఆర్జీ హుకుమత్‌లో అమరాపూర్, నవాగఢ్, గాధ్‌కడా లాంటి గ్రామాలపై నియంత్రణ సాధించారు. ఆర్జీ హుకుమత్ స్వయంసేవకులు జునాగఢ్ సరిహద్దుల్లో ప్రవేశించగానే, నవాబ్ మహాబత్ ఖాన్ అక్కటి నుంచి కరాచీ పారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
కాఠియావాడ్ ముస్లింలకు పాకిస్తాన్‌పై ఆసక్తి లేదు
శంభూ ప్రసాద్ దేశాయ్ సౌరాష్ట్రలో ప్రముఖ చరిత్రకారులు. ఆయన జునాగఢ్, సోమనాథ్‌పై పరిశోధనలు చేసి కొన్ని పుస్తకాలు కూడా రాశారు. వాటిలో ‘జునాగఢ్ సర్వసంగ్రహ్’ అనే ఒక కథనంలో ఆయన చాలా చెప్పారు.
“జునాగఢ్ పూర్తిగా సర్వనాశనం అయ్యింది. అన్ని దారుల్లో నిశ్శబ్దం వ్యాపించింది. దీవాన్ షానవాజ్ భుట్టో, పోలీస్ కమిషనర్ మొహమ్మద్ హుస్సేన్ నక్వీ బలప్రయోగంతో ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చాలని, ఆర్జీ హుకుమత్‌తో పోరాడాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్జీ హుకుమత్ సైన్యం ముందుకు వెళ్తోంది. షానవాజ్ హుస్సేన్ దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండాపోయింది”
రాజమోహన్ గాంధీ తన పుస్తకంలో.. అక్టోబర్ 27న జిన్నాకు దీవాన్ భుట్టో ఒక లేఖ రాశారని చెప్పారు.
అందులో “మా దగ్గర డబ్బేం మిగల్లేదు. ధాన్యం కూడా లేకపోవడంతో ఆందోళనగా ఉంది. నవాబ్ సాహెబ్, ఆయన కుటుంబం వెళ్లిపోవాల్సి వచ్చింది. కాఠియావాడ్ ముస్లింలకు పాకిస్తాన్‌లో ఏం కనిపించడం లేదు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. మంత్రిమండలిలో నా సీనియర్ సహచరుడు కెప్టెన్ హార్వే జాన్స్ మీకు పరిస్థితి తీవ్రత గురించి చెప్పుంటారు అని రాశార”ని తెలిపారు.
నవంబర్ 2న ఆర్జీ హుకుమత్ నవాగఢ్‌ను కూడా తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఐదు రోజుల తర్వాత భుట్టో హార్వే జాన్స్ ను రాజ్‌కోట్‌లో ఉన్న శామల్ దాస్ దగ్గరికి పంపించారు. అక్కడ హార్వే ఆయనతో జునాగఢ్‌ను మీ నియంత్రణలోకి తీసుకోవాలని అపీల్ చేశారు.
నవంబర్ 8న భుట్టో మాట మార్చాడు. ఆర్జీ హుకుమత్ కాదు, భారత ప్రభుత్వమే జునాగడ్‌ను స్వాధీనం చేసుకోవాలని కోరారు. శామల్ దాస్ గాంధీ దానిని ఏమాత్రం వ్యతిరేకించలేదు. ఆ అభ్యర్థనను నీలం భాయి బుచ్ ముందు ఉంచారు.
నీలం భాయి బుచ్‌ను దిల్లీ నుంచి పశ్చిమ భారత్, గుజరాత్‌లోని సంస్థానాల కోసం కమిషనర్‌గా ఎంచుకున్నారు. 1947 నవంబర్ 9న ఆయన జునాగఢ్‌ను నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అందుకే జునాగఢ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నవంబర్ 9న జరుపుకుంటారు.

ఫొటో సోర్స్, FACEBOOK \ JUNAGADH STATE MUSLIM FEDERATION
ప్రజాభిప్రాయ సేకరణలో పాకిస్తాన్‌కు 91 ఓట్లు
భుట్టో అభ్యర్థనకు భారత్ అంగీకరించింది. మౌంట్‌బాటన్ చెప్పడంతో మీనన్, నెహ్రూ పాకిస్తాన్‌కు పంపించడానికి సందేశం కూడా సిద్ధం చేశారు.
“మేం భుట్టో అభ్యర్థనకు అంగీకరించాం. కానీ చట్టపరంగా జునాగఢ్‌ను విలీనం చేసుకునే ముందు అక్కడి ప్రజల అభిప్రాయం కచ్చితంగా తెలుసుకుంటాం” అని అందులో రాశారు.
అలా రాయడం సర్దార్ పటేల్‌కు చికాకు తెప్పించింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని, జునాగఢ్ ప్రజలకు కూడా అలాంటి డిమాండ్లు లేవని చెప్పారు.
1948 ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 2,01,457 మంది రిజిస్టర్డ్ ఓటర్లలో 1,90,870 మంది తమ ఓటు వేశారు. అందులో పాకిస్తాన్‌కు కేవలం 91 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కశ్మీర్, జునాగఢ్ అంటే మంత్రి, బంటు ఆటలాంటిదే
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మూడు సంస్థానాల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. అవే జునాగఢ్, కశ్మీర్, హైదరాబాద్.
అప్పుడు హైదరాబాద్ 82 వేల చదరపు మైళ్లతో అతిపెద్ద సంస్థానంగా ఉండేది. ఆ సమయంలో అక్కడ కోటీ 60 లక్షలమంది ఉండేవారు. వారిలో 85 శాతం హిందువులే. అయితే వారి సైన్యం, పాలకుల్లో ముస్లింల హవా నడిచేది. హైదరాబాద్ రాజు కూడా ముస్లిమే.
జునాగఢ్‌లో కూడా 80 శాతం ప్రజలు హిందువులే, కానీ పాలకుడు ముస్లిం. కానీ కశ్మీర్ పరిస్థితి భిన్నంగా ఉండేది. అక్కడ రాజు హిందువు, కానీ అక్కడ నివసించే వారిలో మూడు వంతులు కశ్మీరీ ముస్లింలు ఉండేవారు.
కశ్మీర్ సరిహద్దు చైనా, అఫ్గానిస్తాన్‌తో కలిసుండేది.
రాజమోహన్ గాంధీ తన పుస్తకం ‘పటేల్ ఎ లైఫ్’లో సర్దార్‌కు కశ్మీర్‌ను విలీనం చేసుకోవడంలో ఎలాంటి ఆసక్తి లేదు. భౌగోళికంగా అది చాలా కీలకం. కానీ, అక్కడ ఎక్కువమంది ముస్లింలు. మొహమ్మద్ అలీ జిన్నా జునాగఢ్ ముసుగులో కశ్మీర్ లాక్కోవాలని అనుకున్నారు. నవాబ్ జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో కలిపే సమయానికే, జునాగఢ్‌లో ముస్లిం వ్యతిరేక వాతావరణం ప్రారంభమైంది.
జునాగఢ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే, అక్కడి ప్రజలు భారత్‌తో కలిసేందుకే ఇష్టపడతారని, ముస్లిం మెజారిటీ కశ్మీర్‌లో ప్రజాభిప్రాయం తీసుకుంటే అక్కడి వారు పాకిస్తాన్‌తో కలవాలని కోరుకుంటారని జిన్నా భావించేవారు. జునాగఢ్ పాకిస్తాన్‌లో కలవడం వల్ల ఒక పెద్ద సవాలు ఎదురైంది. నవాబ్, దీవాన్ జునాగఢ్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేయగలిగితే, నిజాం కూడా హైదరాబాద్‌ను కలుపుతారు. అందుకే జునాగఢ్ లాంటి బంటును ఉపయోగించి మంత్రి లాంటి కశ్మీర్‌ను ఎత్తేయాలని జిన్నా ఆలోచించాడు. జునాగఢ్ నవాబ్‌ను కాకుండా, అక్కడి ప్రజలే ఈ నిర్ణయం తీసుకోవాలని భారత్ స్వయంగా కోరుతుందని జిన్నా చాలా నమ్మకంతో ఉన్నారు.
భారత్ అలా అనగానే, కశ్మీర్ మహారాజు భారత్‌లో కలవాలని కోరుకుంటే, జిన్నా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరేవాడు. కశ్మీర్‌లో అదే జరిగితే ఇస్లాం అనుకూల, ఇస్లాం వ్యతిరేక లాంటి అంశాలతో రంగంలోకి దిగవచ్చు. సెప్టెంబర్ 30న నెహ్రూ మౌంట్‌బాటన్ సమక్షంలో లియాకత్‌కు జునాగఢ్ నవాబ్ ఏ నిర్ణయం తీసుకున్నాదీ చెప్పారు. దానిపై జునాగఢ్ ప్రజాభిప్రాయం తీసుకుంటే, వారి నిర్ణయాన్ని భారత్ అంగీకరించాలని చెప్పారు. అప్పుడు కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే, హైదరాబాద్‌లో కూడా అది జరగాలని పటేల్ పట్టుబట్టారు. జిన్నా దానికి ఒప్పుకోలేదు. అందుకే ఆయన జునాగఢ్‌లో కూడా ప్రజాభిప్రాయ సేకరణకు ఒప్పుకోలేదు.

ఫొటో సోర్స్, facebook
హైదరాబాద్.. చదరంగంలో రాజు
సర్దార్ పటేల్‌కు తొలుత కశ్మీర్ విలీనంపై ఎలాంటి ఆసక్తి లేదు. కానీ జునాగఢ్ తర్వాత పటేల్‌కు కశ్మీర్‌పై ఆసక్తి మొదలైంది. రాజమోహన్ గాంధీ ఆ వివరాలను తన పుస్తకంలో రాశారు.
ముస్లిం రాజు, హిందువులు ఎక్కువగా ఉన్న సంస్థానాలను జిన్నా అంగీకరించినపుడు, హిందూ రాజు, ముస్లిం మెజారిటీ ఉన్న సంస్థానంపై సర్దార్‌కు ఆసక్తి ఎందుకు ఉండకూడదు. ఆ తర్వాత సర్దార్ పటేల్ కశ్మీర్, జునాగఢ్‌ను సమానంగా చూడ్డం ప్రారంభించారు.
జునాగఢ్‌ను తీసుకున్న తర్వాత కశ్మీర్‌ను కూడా కాపాడాలని అనుకున్నారు. హైదరాబాద్ ఆయనకు చదరంగంలో రాజు లాంటిది. అందుకే దానిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. జునాగఢ్, హైదరాబాద్‌ను పాక్ భారత్‌లో కలవనివ్వకపోతే, బహుశా మంత్రి లాంటి కశ్మీర్‌ను పటేల్ పాకిస్తాన్‌కు ఇచ్చేసుండేవారు.
కానీ జిన్నా ఆ ఒప్పందాన్ని కాలదన్నుకున్నారు. జునాగఢ్‌కు స్వతంత్రం వచ్చిన నాలుగు రోజుల తర్వాత సర్దార్ పటేల్ జునాగఢ్ వచ్చారు. అక్కడ ఆయన బహావుద్దీన్ కాలేజీ గ్రౌండ్‌లో ఒక భారీ బహిరంగసభలో మాట్లాడారు.
ఆ ప్రసంగంలో ఆయన భుట్టో, జాన్స్ వాస్తవిక దృష్టితో చూడాలన్నారు. భారత సైన్యం సంయమనంతో ఉన్నందుకు ప్రశంసించారు. ఆయన కశ్మీర్, హైదరాబాద్ గురించి కూడా ప్రస్తావించారు.
“హైదరాబాద్‌లో వాస్తవాలను తెలుసుకోకపోతే, దాని పరిస్థితి కూడా జునాగఢ్ లాగే అవుతుంది. పాకిస్తాన్ కశ్మీర్ ముందు జునాగఢ్‌ను నిలబెట్టింది. మేం ఈ సమస్యను ప్రజాస్వామిక పద్ధతిలో పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటే, వారు(పాకిస్తాన్) మాత్రం ఇదే నియమం కశ్మీర్‌లో అమలు చేయాలంటున్నారు. దీనికి మన సమాధానం ఒక్కటే. ఇదే నియమాన్ని మీరు హైదరాబాద్ విషయంలో అంగీకరిస్తే, కశ్మీర్ విషయంలో మేం కూడా దానిని అంగీకరిస్తాం” అన్నారు పటేల్.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- కశ్మీర్: భారతదేశంలో ఇలా కలిసింది
- కశ్మీర్‌లో 'ఇజ్రాయెల్ మోడల్'.. అసలు ఆ మోడల్ ఏంటి? ఎలా ఉంటుంది?
- భారత్‌ను ఆక్రమించుకోవాలని రష్యా, కాపాడుకోవాలని బ్రిటన్... చివరికి ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











