సిరాజుద్దౌలా: ఈయనను దారుణంగా చంపాకే భారతదేశంలో బ్రిటీష్‌వాళ్లకు ఎదురు లేకుండా పోయింది

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1757, జూన్ 23. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన సిరాజుద్దౌలా యుద్దభూమి నుంచి తప్పించుకుని, తెల్లవారేసరికి ముర్షిదాబాద్ చేరుకున్నారు. మరుసటి రోజు రాబర్ట్ క్లైవ్.. మీర్ జాఫర్‌కు ఒక సందేశం పంపారు "ఈ విజయానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ విజయం నాది కాదు. మిమ్మల్ని నవాబుగా ప్రకటించడం నా గౌరవంగా భావిస్తాను'' అని ఆ సందేశంలో పేర్కొన్నారు క్లైవ్.
ఉదయాన్నే అలసటతో బ్రిటిష్ శిబిరానికి వచ్చిన మీర్ జాఫర్‌ను ఆంగ్లేయ సైనికులు కల్నల్ రాబర్ట్ క్లైవ్ గుడారానికి తీసుకువెళ్లారు. వెంటనే రాజధాని ముర్షిదాబాద్ వెళ్లి, దాన్ని కంట్రోల్‌లోకి తీసుకోవాలని మీర్ జాఫర్‌కు రాబర్ట్ క్లైవ్ సూచించారు. కల్నల్ వాట్స్ కూడా మీతోపాటు వస్తారని మీర్ జాఫర్‌తో చెప్పారు క్లైవ్.
క్లైవ్ తన సైన్యంతో ఆయన్ను అనుసరించారు. 50 మైళ్ళ దూరంలో ఉన్న ముర్షిదాబాద్ చేరుకోడానికి మూడు రోజులు పట్టింది. దారిలో రోడ్లపై ఫిరంగులు, విరిగిన వాహనాలు, సిరాజుద్దౌలా సైనికులు, వారి గుర్రాల మృతదేహాలు పడి ఉన్నాయి.
సర్ పెండెరల్ మూన్ తన "ది బ్రిటిష్ కాంక్వెస్ట్ అండ్ డొమినియన్ ఇన్ ఇండియా'' పుస్తకంలో "క్లైవ్ జూన్ 27న ముర్షిదాబాద్ చేరుకోవలసి ఉన్నప్పటికీ, హత్య కుట్ర జరుగుతోందన్న జగత్ సేథ్ హెచ్చరికలతో జూన్ 29న ముర్షిదాబాద్ నగరంలోకి ప్రవేశించారు. మీర్ జాఫర్ ఆయన్ను నగరపు ప్రధాన ద్వారం వద్ద స్వాగతించారు. ఆయనతో కలిసి నగరంలోకి వచ్చిన క్లైవ్.. మీర్ జాఫర్‌ను సింహాసనంపై కూర్చోబెట్టి, ఆయనకు నమస్కరించారు. మీర్ జాఫర్ పాలనలో కంపెనీ ఏ విధంగానూ జోక్యం చేసుకోదని, వ్యాపార విషయాలు మాత్రమే చూసుకుంటుందని ప్రకటించారు. ఈ యుద్ధం తర్వాత దాదాపు 180 సంవత్సరాలపాటు బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఏకపక్షంగా పాలించారు.

రాత్రికి రాత్రే యూరప్‌లోనే ధనవంతుడిగా మారిన రాబర్ట్ క్లైవ్
సిరాజుద్దౌలా ఖజానా నుంచి రాబర్ట్ క్లైవ్ ఐదు కోట్ల రూపాయలు అందుకున్నారు. అయితే ఇది ఆయన ఊహించినదానికంటే చాలా తక్కువ.
ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం డాల్ రింపిల్ తన పుస్తకం 'ది అనార్కి'లో "ఈ విజయానికిగాను రాబర్ట్ క్లైవ్ 234,000 పౌండ్ల మొత్తాన్ని వ్యక్తిగతంగా పొందబోతున్నారు. ఇది కాకుండా ఆయన సంవత్సరానికి 27వేల పౌండ్లను సంపాదించి పెట్టే జాగీర్‌కు యజమాని కానున్నారు. ఈ డబ్బంతా ఒక్కసారిగా లభిస్తే , రాబర్ట్ క్లైవ్ కేవలం 33సంవత్సరాల వయసులోనే యూరప్‌లోని అత్యంత ధనవంతులలో ఒకరు అవుతారు. అయితే కొద్దిరోజులపాటు ఆయన ఒత్తిడికి గురయ్యారు. మీర్ జాఫర్ తన వాగ్దానంపై వెనక్కి వెళతారేమోనని క్లైవ్ భయపడ్డారు. వారిద్దరు దోపిడి చేసిన సొమ్ము దగ్గర కాపలా కూర్చుని ఒకరినొకరు మోసం చేసుకునే ఇద్దరు గూండాల్లా కనిపించారు'' అని రాశారు.

ఫొటో సోర్స్, Francis Hayman
తెల్లవారుజామున 3గంటలకు మాయమైన సిరాజుద్దౌలా
దోచుకున్న సొమ్ములో తన వాటా పొందడానికి రాబర్ట్ క్లైవ్ ఎదురు చూస్తుండగా, మీర్ జాఫర్ కుమారుడు మీరాన్ పారిపోయిన సిరాజుద్దౌలా కోసం బెంగాల్ అంతటా గాలించడం మొదలు పెట్టారు.
ప్రఖ్యాత చరిత్రకారుడు సయ్యద్ గులాం హుస్సేన్ ఖాన్ తన పుస్తకం 'సియారుల్ ముతాఖిరిన్'లో "సిరాజుద్దౌలా సామాన్యుల దుస్తులు ధరించి కోట నుంచి మాయమయ్యారు. ఆయనతోపాటు దగ్గరి బంధువులు, కొందరు నపుంసకులు కూడా ఉన్నారు. తెల్లవారు జామున మూడు గంటలకు సిరాజుద్దౌలా తన భార్య లుఫ్తున్నీసాను, మరికొంతమందితోపాటు పెద్ద ఎత్తున బంగారాన్ని, ఆభరణాలను తీసుకుని ప్యాలెస్‌ను వదిలి పారిపోయారు'' అని రాశారు.
మొదట భగవాన్‌గోలా ప్రాంతానికి వెళ్లిన సిరాజుద్దౌలా రెండు రోజులపాటు అనేక పడవలు మారుతూ రాజ్‌మహల్‌కు చేరుకున్నారు. అక్కడ వంటలు చేయించారు. అప్పటికి ఆయనతోపాటు వచ్చిన వాళ్లు అన్నం తిని మూడు రోజులైంది.

ఫొటో సోర్స్, Alamy
సిరాజుద్దౌలాను పట్టించిన ఫకీర్
సిరాజుద్దౌలా రాజ్‌మహల్ ప్రాంతంలో ఉండగా, ఆయన సమాచారాన్ని ఒక ఫకీర్ మీర్ జాఫర్ సైన్యానికి అందించారు. ఈ వార్త అందిన వెంటనే మీర్ జాఫర్ సైన్యం నదిని దాటి సిరాజుద్దౌలాను చుట్టుముట్టింది. 1757 జూలై 2న సిరాజుద్దౌలాను అరెస్టు చేసి ముర్షిదాబాద్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో రాబర్ట్ క్లైవ్ కూడా ముర్షిదాబాద్‌లోనే ఉన్నారు. ఆయన ఇక్కడకు రాక ముందే ఫోర్ట్ విలియంలో ఉన్న తన సహచరులకు లేఖలు రాశారు. "సింహాసనం నుండి తొలగించబడిన నవాబుకు మీర్ జాఫర్ ప్రతి మర్యాద చూపిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ పరిస్థితులలో ఇది సాధ్యమే" అని అందులో రాశారు.
రెండు రోజుల తరువాత రాబర్ట్ క్లైవ్ మరొక లేఖ రాశారు. అందులో "సిరాజుద్దౌలా ఈ ప్రపంచంలో లేరు. నవాబ్ మీర్ జాఫర్ అతన్ని చావు నుంచి తప్పించాలని అనుకున్నా ఆయన కుమారుడు మీరాన్ దేశంలో శాంతి కోసం సిరాజుద్దౌలా మరణించాలని కోరుకున్నారు. నిన్న ఉదయం ఆయన్ను ఖోష్‌బాగ్‌లో ఖననం చేశారు'' అని రాశారు.
దీనికి రుజువుగా రాబర్ట్ ఓర్మ్ తన "ఎ హిస్టరీ ఆఫ్ ది మిలిటరీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది బ్రిటిష్ నేషన్ ఇన్ ఇండియా'' పుస్తకంలో ఆ సంఘటన గురించి రాశారు. " అంతకు కొద్ది రోజుల ముందే నవాబ్‌ను అర్ధరాత్రి అదే ప్యాలెస్‌లోని మీర్ జాఫర్ ముందు నిలబెట్టారు. మీర్ జాఫర్ ముందు సిరాజుద్దౌలా వణుకుతూ నిలబడి, ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. తరువాత సైనికులు ఆయన్ను ప్యాలెస్‌లోని మరో మూలకు తీసుకెళ్లారు. సిరాజుద్దౌలాను ఏం చేయాలో తన సభికులు, అధికారులను మీర్‌జాపర్ సంప్రదిస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన ముందు మూడు ఆప్షన్లున్నాయి. ఒకటి సిరాజుద్దౌలాను ముర్షిదాబాద్‌లోనే ఖైదు చేయడం, రెండు దేశం అవతల ఖైదు చేయడం, మూడోది మరణశిక్ష విధించడం. సిరాజుద్దౌలాను జైలులో సజీవంగా ఉంచాలని కొందరు సూచించగా, మీర్ జాఫర్ 17 ఏళ్ల కుమారుడు మీరాన్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మీర్‌జాఫర్‌కు దీని మీద ఎలాంటి అభిప్రాయం లేదు'' అని రాశారు.
"మీరాన్ తన తండ్రి సమ్మతి తీసుకున్నారు. ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు విశ్రాంతి తీసుకోండని ఆయన తన తండ్రికి చెప్పారు. తన కొడుకు హింసాత్మక నిర్ణయం తీసుకుంటారని మీర్‌జాఫర్ ఊహించలేదు. అర్ధరాత్రి తన కొలువును ముగించి మీర్ జాఫర్ నిద్రపోయారు'' అని "ప్లాసీ ది బ్యాటిల్ దట్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ'' అనే పుస్తకంలో రచయిత సుదీప్ చక్రవర్తి రాశారు.

ఫొటో సోర్స్, Battle that Changed the Course of Indian History
కత్తులు, బాకులతో సిరాజుద్దౌలా హత్య
"మీరాన్ తన సహచరులలో ఒకరైన మొహమ్మది బేగ్‌కు సిరాజుద్దౌలాను అంతం చేసే బాధ్యత అప్పగించారు. మీరాన్ తన సహచరులతో కలిసి తన వద్దకు వచ్చినప్పుడే ఏం జరగబోతోందో సిరాజుద్దౌలాకు అర్ధమైంది. తనను చంపడానికి ముందు ఖురాన్ పఠనం, నమాజ్‌లకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ పనిని పూర్తి చేయడానికి హంతకులు సిరాజుద్దౌలా తలపై నీళ్లుపోశారు. ధ్యానం చేయడానికి అనుమతి లేదని చెప్పడంతో తాగడానికి కాసిని మంచినీళ్లు ఇవ్వాల్సిందిగా సిరాజ్ కోరారు'' అని సయ్యద్ గులాం హుస్సేన్ ఖాన్ రాశారు.
"అప్పుడు మొహమ్మద్ బేగ్ సిరాజుద్దౌలాపై బాకుతో దాడి చేశాడు. ఆయన తన పని చేసిన వెంటనే పక్కనున్న వారు కత్తులు తీసుకొని సిరాజుద్దౌలాపై పడ్డారు. కొద్ది నిమిషాల్లోనే వారి పని పూర్తయింది. సిరాజుద్దౌలా తల నేలరాలింది '' అని రాబర్ట్ ఓర్మీ రాశారు.

ఫొటో సోర్స్, Wikimedia Commons
ఏనుగుపై సిరాజుద్దౌలా మృతదేహం ఊరేగింపు
మరుసటి రోజు సిరాజుద్దౌలా మృతదేహాన్ని ఏనుగుపై ఎక్కించి, ముర్షిదాబాద్ వీధుల్లో, మార్కెట్లలో తిప్పారు. అతని ఓటమికి ఇది అతిపెద్ద రుజువవని వారి ఉద్దేశం. "ఈ ఘోరమైన ఊరేగింపు కార్యక్రమంలో, మావటి ఉద్దేశపూర్వకంగా హుస్సేన్ కులీ ఖాన్ ఇంటి ముందు ఏనుగును కాసేపు ఆపారు. రెండేళ్ల క్రితం అదే హుస్సేన్ కులీఖాన్‌ను సిరాజుద్దౌలా హత్య చేశారు. కులీఖాన్ హత్యకు గురైన స్థలంలో సిరాజుద్దౌలా మృతదేహం నుండి కొన్ని చుక్కల రక్తం పడింది'' అని ఈ అనాగరిక చర్య గురించి సయ్యద్ గులాం హుస్సేన్ ఖాన్ రాశారు.
చనిపోయేనాటికి సిరాజుద్దౌలా వయసు కేవలం 25 సంవత్సరాలు. మీరాన్ క్రూరత్వం ఇక్కడితో ఆగలేదు. కొద్ది రోజుల తరువాత, అతను ఆలీవర్ది ఖాన్ వంశంలోని మహిళలందరినీ హత్య చేయించారు.

ఫొటో సోర్స్, Sudeep Chakrvarti
లుఫ్తున్నీసాను పెళ్లాడాలనుకున్న మీర్ జాఫర్
'ది ముజఫర్ నామ్ ఆఫ్ కరం అలీ ' అనే పుస్తకంలో "సుమారు 70 మంది అమాయక మహిళలను పడవలో హూగ్లీ నది మధ్యకు తీసుకెళ్లారు. అక్కడ పడవ మునిగిపోయింది. సిరాజుద్దౌలా వంశంలోని మిగిలిన మహిళలకు విషమిచ్చి చంపారు. నీట మునిగి చనిపోయిన ఆ మహిళలను హుగ్లీ నది పక్కన ఖోష్‌బాగ్ అనే తోటలో ఖననం చేశారు'' అని కరంఅలీ రాశారు. అయితే ఒక మహిళ ప్రాణాన్ని మాత్రం కాపాడారు. ఆమె ఎవరో కాదు సిరాజుద్దౌల అందమైన భార్య లుఫ్తున్నీసా. మీరాన్, అతని తండ్రి మీర్ జాఫర్ ఇద్దరూ ఆమెను వివాహమాడతామని సందేశాలు పంపారు.

ఫొటో సోర్స్, Sudeep Chakravarti
మీర్ జాఫర్ పతనం
ప్లాసీ యుద్ధంలో గెలిచిన ఏడాదిలోనే మీర్ జాఫర్ వేడి చల్లారడం మొదలైంది. అప్పటికి కొంతకాలం కిందటి వరకు మీర్ జాఫర్‌కు మద్దతుగా నిలిచిన రాబర్ట్ క్లైవ్ ఆయన్ను 'ది ఓల్డ్ ఫూల్' అని, అతని కొడుకు మీరాన్‌ను 'ఎ వర్త్ లెస్ యంగ్ డాగ్' అని అభివర్ణించడం మొదలు పెట్టారు. సోమరితనం, అసమర్థత, నల్లమందు మీర్‌జాఫర్‌ను పూర్తిగా దిగజార్చాయి.
1758 నవంబర్ 11న రాబర్ట్ క్లైవ్ జాన్ పెన్‌కు ఒక లేఖ రాశారు. "సింహాసనం మీద మేము కూర్చోబెట్టిన వ్యక్తి అహంకారం, అత్యాశకు లోనయ్యారు. తన ప్రవర్తనతో ప్రజలకు దూరం అవుతున్నారు'' అని అందులో పేర్కొన్నారు.
క్లైవ్ ఇంగ్లాండ్‌కు తిరిగి రావడానికి ముందు, ఆయన సైన్యానికి 13 నెలల బకాయిల్లో మీర్ జాఫర్ మూడు విడతలు మాత్రమే చెల్లించగలిగారు. జీతాలు అందకపోవడంతో సైనికులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
సర్ పెండెరల్ మూన్ తన "వారెన్ హేస్టింగ్స్ అండ్ బ్రిటీష్ ఇండియా'' పుస్తకంలో " మీర్ జాఫర్ సైనికుల గుర్రాలలో ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని నడిపించేవారే కొంచెం మెరుగ్గా ఉన్నారు. జమేదార్(ఆఫీసర్) కూడా చిరిగిన దుస్తులు ధరించారు'' అని రాశారు. భారతదేశంలో అత్యంత ధనిక నగరాల్లో ఒకటైన ముర్షిదాబాద్, ప్లాసీ యుద్ధం జరిగిన మూడు సంవత్సరాల తర్వాత నిరుపేద రాజ్యంగా మారింది.

ఫొటో సోర్స్, Sudeep Chakrvarty
బెంగాల్‌ను నాశనం చేసిన మీర్ జాఫర్
"మీర్ జాఫర్ ఎప్పుడూ ఖరీదైన రత్నాలను ధరించడానికి ఇష్టపడేవారు. నవాబ్ అయిన వెంటనే ఒకే మణికట్టులో వివిధ రత్నాలతో చేసిన ఆరు లేదా ఏడు కంకణాలు ధరించడం ప్రారంభించారు. ఆయన మెడలో మూడు నాలుగు వరుసల పూసల దండ ఉంది. సంగీతం వినడం, మహిళల నాట్యాన్ని చూడటంతోనే సమయమంతా గడిపేవారు'' అని గులాం హుస్సేన్ ఖాన్ రాశారు.
మీర్ జాఫర్‌కు బెంగాల్‌ను పాలించే సామర్థ్యంలేదని కొద్దిరోజుల్లోనే ప్రజలకు అర్ధమైంది. అతను ఆస్థానంతో సంబంధం లేని, చదువురాని అరబ్ సైనికుడిలా ఉండేవారు.
"ది బ్రిటిష్ కాంక్వెస్ట్ అండ్ డొమినియన్ ఆఫ్ ఇండియా'' పుస్తకంలో "మీర్ జాఫర్‌కు పాలించే అధికారం లేదు. ప్రజల ప్రేమ, నమ్మకాన్ని గెలుచుకునే సామర్థ్యం ఆయనకు లేదు. అతని దుశ్చర్యలతో బెంగాల్‌ను అరాచకంలోకి నెట్టేశారు'' అని ఇంగ్లండ్ వెళ్ళే ఓడ ఎక్కే ముందు రాబర్ట్ క్లైవ్ వ్యాఖ్యానించినట్లు సర్ పెండెలర్ రాశారు.

ఫొటో సోర్స్, Sudeep Chakrvarti
వందలాది మందిని చంపిన మీరాన్
మరోవైపు మీర్ జాఫర్ కుమారుడు మీరాన్ శత్రువులపట్ల ఏమాత్రం దాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించారు. భవిష్యత్తులో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నందున ఆలీవర్ధిఖాన్ వంశంలో మిగిలిన వారిని ఎలా అడ్డు తొలగించుకోవాలా అని ఆయన మదనపడ్డారు. "ఆలీవర్ధి ఖాన్ అంతఃపురంలో మహిళలందరినీ నదిలో ముంచి చంపిన తర్వాత మీరాన్ దృష్టి సిరాజుద్దౌలా దగ్గరి బంధువులైన ఐదుగురి మీదకు మళ్లింది. సిరాజుద్దౌలా తమ్ముడు మీర్జా మెహ్దిని రెండు చెక్క పలకల మధ్య పెట్టి నలిపి చంపేశాడు. ఈ హత్యను సమర్ధించుకున్న మీరాన్ "పామును చంపిన తర్వాత, దాని పిల్లను వదిలేయడం తెలివైన పనికాదు'' అని వ్యాఖ్యానించారు.
సిరాజుద్దౌలా ఆస్థానంలోని ఆధ్యాత్మిక సలహాదారులు, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులపై దొంగతనం నేరాలను మోపి విషమిచ్చి చంపించారు.

ఫొటో సోర్స్, Sudeep Chakravarti
తాను చంపాల్సిన సిరాజుద్దౌలా కుటుంబీకుల జాబితాను మీరాన్ తన జేబులో ఉంచుకునేవారని గులాం హుస్సేన్ ఖాన్ రాశారు. ఈ జాబితాలో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సిరాజుద్దౌలా కుటుంబీకుల సామూహిక హత్యల గురించి తెలుసుకుని "ఈ క్రూరమైన విలన్ చర్యలను ఏ విధంగానూ మన్నించలేం. అలాంటి వ్యక్తికి మా మద్దతును ఏ విధంగానూ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించండి '' అని కలకత్తాకు పంపిన తన నివేదికలో వారెన్ హేస్టింగ్స్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- భారత్‌ను ఆక్రమించుకోవాలని రష్యా, కాపాడుకోవాలని బ్రిటన్... చివరికి ఏమైంది?
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- బంగ్లాదేశ్ యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు?
- ఒత్తిడిలో ఆలోచించడం ఎలా? పేకాటలో నైపుణ్యం జీవితానికి ఎలా సహాయపడుతుంది?
- చైనా - తైవాన్ దేశాలు ఎందుకు విడిపోయాయి...
- జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు
- ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








