కాకినాడలో బయటపడిన బ్రిటిష్ కాలంనాటి తుపాకులు...

ఫొటో సోర్స్, M laxman
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత నగరాల్లో కాకినాడ ఒకటి. ఇటీవల పారిశ్రామికంగా ఎదుగుతున్న ఈ నగరం స్మార్ట్ సిటీగా కూడా ఎంపికైంది. కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని అశోక్ నగర్‌లో 1940ల కాలం నాటివిగా అంచనా వేస్తున్న తుపాకులు బయటపడ్డాయి.
ప్రస్తుతం పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో మిలటరీ కార్యకలాపాలకు కాకినాడ కేంద్రంగా ఉండేది. తీరప్రాంతం కావడం, సమీపంలో హాప్ ఐలాండ్ ఉండడంతో రవాణా సులువయిన కారణంగా అప్పట్లోనే పోర్ట్ ప్రారంభించారు. అంతేగాకుండా కాకినాడ నగరంలో మిలటరీ రోడ్డు పేరుతో ఓ ప్రధాన రహదారి కూడా ఉంది.
తాజాగా ఈ మిలటరీ రోడ్డుకు సమీపంలోనే తుపాకులు బయటపడ్డాయి. కెఎస్ ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా తుపాకులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాకినాడ టూ టౌన్ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటి వివరాలను సీఐ నాగ మురళి బీబీసీకి తెలిపారు. అశోక్‌నగర్‌లో రెసిడెన్షియల్ అపార్టుమెంట్‌ను నిర్మిస్తున్నారు.

ఫొటో సోర్స్, M laxman
ఏ కాలం నాటివి?
భవన నిర్మాణ పనుల నేపథ్యంలో గొయ్యి తీస్తుండగా సుమారు 10 అడుగుల లోతులో 10 తుపాకులు బయటపడ్డాయి. ఇదే విషయాన్ని భవన యజమానులు సమాచారం అందించారు. గతంలో ఈ ప్రదేశంలో బ్రిటిష్ వారు స్థావరాలు ఏర్పరచుకొని ఉన్నట్టుగా కొందరు చెబుతున్నారు.
మొదటి, రెండో ప్రపంచ యుద్ధం మధ్యకాలంలో 1939 -1944 సంవత్సరంలో ఇటువంటి తుపాకీలు ఉపయోగించే వారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. తుపాకీ మోడల్ పేరు మార్న్-1303. రెవెన్యూ అధికారులతో కలిసి వెళ్లి వీటిని స్వాధీనపరచుకున్నాం. సీఆర్పీసీ సెక్షన్ 102 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగమురళి వివరించారు.

ఫొటో సోర్స్, M laxman
'బ్రిటిష్ అధికారిక వ్యవహారాలకు కేంద్రం ఇది'
బ్రిటిష్‌కాలం నాటి తుపాకులు వెలుగులోకి రావడంపై చరిత్ర పరిశోధకులు హెచ్. రామకృష్ణ బీబీసీ తో మాట్లాడుతూ, 'కాకినాడ ఒకప్పుడు బ్రిటిష్ వారి అధికారిక వ్యవహారాలకు కేంద్రస్థానంగా ఉండేదని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో పోరాడిన బ్రిటిష్ మిత్రపక్షాల కూటమికి ఇండియాలో పలు కేంద్రాలను స్థావరాలుగా వినియోగించారు. వాటిలో కాకినాడ ఒకటి. అప్పట్లో యుద్ధ అవసరాలకు సరిపడని అనేక రకాల యుద్ధ సామగ్రి ని వదిలేసి వెళ్లిన అనుభవాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. కొన్ని పలు చోట్ల తవ్వకాల సందర్భంగా బయటపడుతున్నాయి' అని తెలిపారు.
కాకినాడ లో భవన నిర్మాణాల తవ్వకాల్లో వెలుగు చూసిన తుపాకులు కూడా అప్పటికే కాలం తీరినవని రికార్డులు చెబుతున్నాయని, వాటిని వినియోగానికి అనుగుణంగా లేకపోవడంతో వదిలివేసినవిగా కనిపిస్తున్నాయని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
'తూర్పు,విశాఖ మన్యంలో జరిగిన తిరుగుబాట్లు అణచివేసేందుకు కూడా ఇలాంటి ఆయుధాలు వాడిన అనుభవం ఉంది. ఈ తుపాకుల కాలం పై పూర్తి స్థాయిలో నిర్దారణ వస్తే బ్రిటిష్ రికార్డుల ప్రకారం అవి రెండో ప్రపంచ యుద్ధంలో వాడినవా, లేక స్వదేశంలో వినియోగించారా అనే స్పష్టత వస్తుంది. కానీ అప్పటికే పనికిరాని వాటినే పాతిపెట్టినట్టుగా స్పష్టంగా ఉంది' అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- భారత్-చైనా 'క్లబ్' పెట్రోల్ ధరలను తగ్గించగలుగుతుందా...
- వివేక్ ఓబెరాయ్: ఐశ్వర్యారాయ్‌పై ట్వీట్ వివాదం.. ‘మోదీ చిత్రంలో నటించి నువ్వే మోదీ అనుకుంటున్నావా?’
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- ప్రధాని మోదీ మేకప్ కోసం నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారనే వార్తల్లో నిజమెంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








