చైనాతో యుద్ధం: 120మంది భారత సైనికులు వెనక్కి తగ్గడానికి నిరాకరించిన వేళ, ఆ రోజు ఏం జరిగిందంటే..

బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ‘120 బహదూర్’ చిత్రంలో మేజర్ శైతాన్ సింగ్ పాత్రను పోషించారు

ఫొటో సోర్స్, 120 Brave team

ఫొటో క్యాప్షన్, '120 బహదూర్' చిత్రంలో ఓ దృశ్యం
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల విడుదలైన ఒక బాలీవుడ్ చిత్రం 1962లో భారత్, చైనా మధ్య జరిగిన యుద్ధంలో మరుగున పడిపోయిన ఒక పోరాటానికి సంబంధించిన స్మృతులను మళ్లీ గుర్తుకు తెచ్చింది.

'120 బహదూర్' టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా, లద్ధాఖ్‌లోని గడ్డకట్టే హిమాలయ పర్వతాల్లో 'రెజాంగ్ లా' కనుమను రక్షించడానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయని భారతీయ సైనికుల కథను వివరిస్తుంది.

ఈ చిత్రంలో మేజర్ శైతాన్ సింగ్ పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించారు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ, 1962 యుద్ధంలో భారతదేశం ఓడిపోయిన సమయంలో జరిగిన ఒక ఘటన భారత సైనికుల వీరత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.

ఈ యుద్ధంలో భారతదేశం 7 వేల మంది సైనికులను, అలాగే 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సినిమా మాటల రచయిత సుమిత్ అరోరా బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ కథ చెప్పడం చాలా అవసరమని భావించాం. ఈ కథను నిజంగా అనుభవించిన వారికి అంకితం ఇవ్వాలనుకున్నాం. సినిమా కోసం కొన్ని మార్పులు చేసినప్పటికీ, మా చిత్రం చాలావరకూ చరిత్రను నిజాయితీగా ప్రతిబింబిస్తుంది'' అని చెప్పారు.

సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్, చైనా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో, వివాదాన్ని పరిష్కరించడానికి జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వని తరుణంలో ఈ యుద్ధం జరిగింది.

1959లో టిబెట్ తిరుగుబాటు తర్వాత, దలైలామాకు భారతదేశం ఆశ్రయం కల్పించడం కూడా చైనా ఆగ్రహానికి కారణమైంది. 1962 అక్టోబర్ 20న భారతదేశంపై చైనా దాడి చేసింది. నెల రోజులపాటు ఈ యుద్ధం కొనసాగింది.

ఇది 'ఆత్మరక్షణ కోసం చేసిన ఎదురుదాడి' అని చైనా పేర్కొంది. అంతేకాకుండా, భారతదేశం తమ భూభాగాలను ఆక్రమిస్తోందని, గగనతలాన్ని ఉల్లంఘిస్తోందని భారతదేశంపై ఆరోపణలు చేసింది.

ఒక నెల తర్వాత, చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించింది. తన సైనికులను వెనక్కి తీసుకుంది. యుద్ధ ఖైదీలను విడుదల చేసింది.

తరువాత, రెండు దేశాల మధ్య 3,440 కిలోమీటర్ల పొడవైన 'వాస్తవ నియంత్రణ రేఖ' (ఎల్ఏసీ) నిర్ణయించారు. ఇది నదులు, సరస్సులు, మంచు పర్వత శిఖరాల గుండా సాగుతుంది.

1962లో నెల రోజుల పాటు కొనసాగిన ఘర్షణలో భారతదేశం కనీసం 7 వేల మంది సైనికులను కోల్పోయింది

ఫొటో సోర్స్, Radloff/Three Lions/Getty Images

ఫొటో క్యాప్షన్, 1962నాటి ఘర్షణలో భారతదేశం కనీసం 7 వేల మంది సైనికులను కోల్పోయింది

‘ఎవరూ నమ్మలేకపోయిన ఘటన’

చైనా ఈ 1962 యుద్ధం గురించి అధికారికంగా చాలా తక్కువ సమాచారాన్ని మాత్రమే వెల్లడించింది. ఘర్షణ జరిగిన ప్రాంతాల్లోని భారత్‌కు చెందిన అన్ని సైనిక అవుట్‌పోస్టులను తమ సైనికులు తుడిచిపెట్టేశారని మాత్రమే అది పేర్కొంది.

అయితే, రెజాంగ్ లా యుద్ధంపై చైనా ఎప్పుడూ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఇది 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో జరిగింది.

భారతదేశంలో మాత్రం దీన్ని ఒక 'చారిత్రక యుద్ధం'గా, 'చివరి శ్వాస వరకు పోరాడిన అత్యంత గొప్ప యుద్ధాలలో ఒకటి'గా గుర్తుంచుకుంటారు.

ఈ యుద్ధంపై పుస్తకాలు, సినిమాలు కూడా వచ్చాయి.

ఇది 1962 నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 8:15 గంటల వరకు జరిగింది.

2021లో వెలువడిన 'బ్యాటిల్ ఆఫ్ రెజాంగ్ లా' పుస్తక రచయిత, మాజీ నౌకాదళ అధికారి కుల్‌ప్రీత్ యాదవ్ ఇలా అంటారు: 'ఈ కనుమ చుషుల్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండేది. ఆ సమయంలో అదొక 'వ్యూహాత్మక కేంద్రం'. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని దేశంలోని మిగిలిన భాగాలతో కలిపే రహదారి వ్యవస్థ అప్పట్లో దాదాపు శూన్యం'

ఆ 120 మంది సైనికులలో కేవలం ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ యుద్ధంలో మరణించిన మేజర్ శైతాన్ సింగ్‌కు, ఆయన చూపిన సాహసానికి, నాయకత్వానికిగానూ మరణానంతరం భారతదేశపు అత్యున్నత సైనిక పురస్కారం 'పరమ వీర చక్ర' లభించింది.

ఇతర 12 మంది సైనికులకు గ్యాలంట్రీ మెడల్స్ దక్కాయి.

ప్రాణాలతో మిగిలిన సైనికులు తమ ఉన్నతాధికారులకు మరణించిన 120 మంది సాగించిన వీరోచిత పోరాటం గురించి వివరించినప్పుడు, 'దురదృష్టవశాత్తు ఎవరూ వారి మాటలను నమ్మలేదు' అని కుల్‌ప్రీత్ యాదవ్ చెప్పారు.

"అప్పట్లో మన సైన్యం నైతిక స్థైర్యం చాలా పడిపోయింది. మనం యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాం. ఒక బ్రిగేడియర్‌ సహా వేలమంది సైనికులను చైనా యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. అందుకే, అటువంటి వీరోచితమైన పోరాటం సాధ్యమవుతుందని ఎవరూ నమ్మలేకపోయారు" అని ఆయన అన్నారు.

రెజాంగ్ లాలో మరణించిన సైనికుల భార్యలను 2007లో దిల్లీలో ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెజాంగ్ లా లో మరణించిన సైనికుల భార్యలను 2007లో దిల్లీలో ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు

అమర వీరుల కుటుంబాలకు గౌరవం...

చైనాతో 1962 యుద్ధ సమయంలో, రెజాంగ్ లా వద్ద మోహరించిన సైనికులు యుద్ధం నుంచి పారిపోయారని లేదా వారిని చైనా యుద్ధ ఖైదీలుగా పట్టుకుందని అందరూ భావించారు.

సుమారు మూడు నెలల తర్వాత, యుద్ధం ముగిసిన తరుణంలో ఒక గొర్రెల కాపరికి ధ్వంసమైన బంకర్లు, ఖాళీగా ఉన్న ఫిరంగి గుండ్లు, వాడిన బుల్లెట్ కేసింగ్‌లు, మంచులో గడ్డకట్టిన సైనికుల మృతదేహాలు కనిపించాయి.

అప్పుడే మొదటిసారిగా ఈ యుద్ధం తాలూకా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సైనికులు మేజర్ శైతాన్ సింగ్ నాయకత్వంలోని '13 కుమావూ బెటాలియన్'కు చెందిన 'సి' కంపెనీకి చెందినవారు. ఆ కనుమను రక్షించే బాధ్యత వారికి అప్పగించారు.

కుల్‌ప్రీత్ యాదవ్ చెప్పిన వివరాల ప్రకారం, ఒకవేళ మందుగుండు సామాగ్రి అయిపోతే వెనక్కి తగ్గాలని ఉన్నతాధికారులు మేజర్ సింగ్‌కు సలహా ఇచ్చారు. కానీ మేజర్ సింగ్ ఇదే విషయాన్ని తన జవాన్ల ముందు ఉంచినప్పుడు, వారు ''మేము మా చివరి మనిషి, చివరి బుల్లెట్ వరకు పోరాడుతాం'' అని శపథం చేశారు.

చైనా సైనికులు కనుమపై దాడి చేసినప్పుడు, 'సి' కంపెనీ యుద్ధానికి సిద్ధంగా ఉంది. కానీ కొంత వ్యవధిలోనే భారతీయ సైనిక పోస్టుపై ఒత్తిడి పెరిగిపోయింది.

అది ఒక అసమాన పోరాటం. 120 మంది భారతీయ సైనికుల ముందు వేల సంఖ్యలో చైనా సైనికులు ఉన్నారు.

చైనా 1962 యుద్ధానికి సంబంధించిన పత్రాలను ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. కానీ భారతీయ అంచనాల ప్రకారం కనీసం 3,000 మంది చైనా సైనికులు ఆ కనుమపై దాడి చేశారు.

చైనా సైనికుల వద్ద మెరుగైన ఆయుధాలు ఉన్నాయి. వారు పూర్తి సన్నాహాలతో వచ్చారు. కానీ భారతీయ సైనికుల వద్ద సెమీ-ఆటోమేటిక్ రైఫిళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి జవానుకు కేవలం 600 బుల్లెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మేజర్ శైతాన్ సింగ్‌పై 2014లో రాసిన తన పుస్తకంలో జర్నలిస్ట్ రచనా బిష్త్ ఇలా రాశారు:

‘‘మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన సి కంపెనీ సైనికులు అంతకుముందు ఎప్పుడూ మంచును చూడలేదు. అక్కడ ఉన్న కఠినమైన పరిస్థితులకు అలవాటు పడటానికి కూడా వారికి తగినంత సమయం దొరకలేదు’’

రెజాంగ్ లా యుద్ధంలో బుల్లెట్లు తగిలిన ఈ వాటర్ బాటిల్, హీరో గులాబ్ సింగ్‌కు చెందినది

ఫొటో సోర్స్, Kulpreet Yadav

ఆ యుద్ధం జరిగిన రోజు రాత్రి ఏమైంది?

యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన సుబేదార్ రామ్‌చందర్ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ, ''వాతావరణం చాలా దారుణంగా ఉంది. మా వద్ద సరైన శీతాకాలపు దుస్తులు లేదా బూట్లు లేవు'' అని చెప్పారు.

''మాకు ఇచ్చిన జెర్సీలు, కాటన్ ప్యాంట్లు, తేలికపాటి కోట్లు ఆ గడ్డకట్టే గాలుల నుంచి మమ్మల్ని రక్షించలేకపోయాయి. సైనికులు తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు. నర్సింగ్ అసిస్టెంట్ మందులు ఇస్తూ ఒక పోస్ట్ నుంచి మరో పోస్ట్‌కు నిరంతరం పరిగెడుతూనే ఉండేవారు'' అని ఆయన వెల్లడించారు.

ఆ యుద్ధం జరిగిన రోజు రాత్రి ఉష్ణోగ్రత మైనస్ 24 డిగ్రీలు ఉంది. ఆనాటి ఘటనలపై సుబేదార్ రామ్‌చందర్ గతంలో బీబీసీతో మాట్లాడారు. ''మనం ఎదురు చూస్తున్న రోజు వచ్చిందని నా అధికారులతో చెప్పాను'' అని ఆయన వెల్లడంచారు.

బిష్త్ తన పుస్తకంలో, ''సి' కంపెనీ శత్రువుల మొదటి దాడిని అడ్డుకుంది. కానీ చైనా మోర్టార్ దాడుల వల్ల బంకర్లు, టెంట్‌లు ధ్వంసమై భారీ నష్టం జరిగింది.

మూడోది, అత్యంత భయంకరమైన దాడిలో ఆ కంపెనీలోని మెజారిటీ సైనికులు చనిపోయారు.

మేజర్ శైతాన్ సింగ్ ధైర్యసాహసాల గురించి సుబేదార్ రామ్‌చందర్ ఇచ్చిన వివరణ ఎంతో కదిలించేలా ఉంది:

‘‘ఆయన కడుపులోకి అనేక బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తపు మడుగులో ఉండి, భరించలేనంత నొప్పితో పదే పదే స్పృహ కోల్పోతున్నారు. అయినప్పటికీ, యుద్ధాన్ని ఎలా కొనసాగించాలో ఆయన నాకు వివరిస్తూనే ఉన్నారు’’

‘‘తర్వాత ఆయన నన్ను బెటాలియన్ వద్దకు వెళ్లిపోవాలని చెప్పారు. నేను మిమ్మల్ని వదిలి వెళ్లలేను అని చెప్పాను. కానీ ఆయన నువ్వు వెళ్లాల్సిందే ఇది నా ఆజ్ఞ అని చెప్పారు’’

జమదార్ సూరజ్‌కు చెందిన ఈ శిరస్త్రాణం యుద్ధభూమిలో దొరికింది

ఫొటో సోర్స్, Kulpreet Yadav

ఫొటో క్యాప్షన్, జమదార్ సూరజ్‌కు చెందిన ఈ శిరస్త్రాణం యుద్ధభూమిలో దొరికింది

మంచులో అలాగే ఉండిపోయిన యుద్ధక్షేత్రం...

1963 ఫిబ్రవరిలో, మృతదేహాలు, బంకర్ల ఆచూకీ లభించినప్పుడు, ఒక సీనియర్ సైనిక అధికారి రెడ్ క్రాస్ సిబ్బందిని, మీడియాను రెజాంగ్ లాకు తీసుకువెళ్లారు. అక్కడ మంచులో గడ్డకట్టిన ఆ యుద్ధభూమి 'అప్పట్లో ఎలా ఉందో అలాగే' కనిపించింది.

ఈ అన్వేషణ గురించి బిష్త్ తన పుస్తకంలో, ''వారు కనుగొన్న ప్రతి సైనికుడు కూడా అనేక బుల్లెట్ గాయాల వల్లనో, ఫిరంగి గుండ్ల ముక్కల వల్లనో లేదా షెల్ దాడుల వల్లనో మరణించారు. కొందరు తమ బంకర్లలోనే మరణించి ఉన్నారు. మరికొందరు రాళ్ల కింద కూరుకుపోయారు. ఇంకొందరు అప్పటికీ తమ రైఫిళ్లను గట్టిగా పట్టుకునే ఉన్నారు'' అని రాశారు.

నర్స్ అసిస్టెంట్ చేతిలో ఇంజక్షన్, కట్టు కట్టే పట్టీల రోల్ ఉంది. మోర్టార్ ఆపరేట్ చేసే సైనికుడు ఒక ఫిరంగి గుండును పట్టుకుని ఉన్నారు. మేజర్ శైతాన్ సింగ్ ఒక బండరాయి దగ్గర పడి ఉన్నారు. ఆయన ఎడమ చేతికి రక్తంతో తడిసిన పట్టీ కట్టి ఉంది, మెషిన్ గన్ దాడుల వల్ల ఆయన పొట్ట భాగం ఛిన్నాభిన్నమైపోయింది.

ఆ తర్వాత 'సి కంపెనీ' పేరును 'రెజాంగ్ లా కంపెనీ'గా మార్చారు.

ఈ సైనికుల స్వస్థలమైన రేవారీలో వారి జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు.

కాల్పుల విరమణ తర్వాత ఈ కనుమ 'నో మ్యాన్స్ ల్యాండ్'గా మారింది. ప్రస్తుతం ఇది వివాదాస్పద ప్రాంతంలో భాగంగా ఉంది.

కుల్‌ప్రీత్ యాదవ్ మాటల ప్రకారం, ఒకవేళ సి కంపెనీ అంత ధైర్యంగా పోరాడి ఉండకపోతే, ఈరోజు భారతదేశ మ్యాప్ చాలా భిన్నంగా ఉండేది.

''ఈ సైనికులే లేకపోతే, భారత్ లద్దాఖ్‌లో సగం భాగాన్ని కోల్పోయేదని నేను నమ్ముతున్నా. చైనా ఆ విమానాశ్రయాన్ని, చుషుల్‌ను ఆక్రమించుకునేది. 1962 యుద్ధంలో భారతదేశానికి ఈ పోరాటం ఒక్కటే ఒక పాజిటివ్ అంశం'' అని కుల్‌ప్రీత్ యాదవ్ పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)