భారత రక్షణ బడ్జెట్: చైనా, పాకిస్తాన్‌లతో పోల్చినప్పుడు ఎక్కడున్నాం

యుద్ధ విమానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మీర్జా బేగ్
    • హోదా, బీబీసీ ఉర్దూ, దిల్లీ

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) తాజా నివేదిక ప్రకారం రక్షణ రంగానికి అత్యధికంగా ఖర్చు చేసే దేశాలలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది.

గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక పరికరాలను కొనుగోలు చేసిన దేశం భారత్.

ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వెల్లడించింది.

2024-25 సంవత్సరానికి గాను భారత పార్లమెంటులో సమర్పించిన రూ. 48 లక్షల కోట్ల బడ్జెట్‌లో, రక్షణ రంగానికి అత్యధికంగా రూ. 6 లక్షల 22 వేల కోట్ల రూపాయలు, అంటే సుమారు 13 శాతం కేటాయించారు.

గత ఏడాది మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లోనూ చైనా, పాకిస్తాన్‌లను దృష్టిలో ఉంచుకుని రక్షణ రంగ కేటాయింపులు చేసినట్లు విశ్లేషకులు చెప్తున్నారు.

పొరుగు దేశాలను దృష్టిలో ఉంచుకునే భారతదేశం తన మిలటరీ ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇస్తోందని జర్నలిస్ట్ ప్రతీక్ ముకానే అన్నారు.

2024లో రూ. 6 లక్షల కోట్ల భారత రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే చైనా ఇదే ఏడాదిలో రక్షణ రంగానికి సుమారు రూ. 19 లక్షల కోట్లు (భారతీయ కరెన్సీలో పోల్చాం) కేటాయించింది.

అదే సమయంలో భారత్ రక్షణ బడ్జెట్, పాకిస్తాన్ కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

రక్షణ బడ్జెట్‌ను ఎలా ఖర్చు చేస్తారు?

రక్షణ బడ్జెట్‌ను ఎలా ఉపయోగిస్తారనేది ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వెల్లడించారు.

రక్షణ బడ్జెట్‌లో లక్ష 72 వేల కోట్ల రూపాయల మూలధన పెట్టుబడి సాయుధ బలగాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని ఆయన రాశారు.

“గత బడ్జెట్‌లో సరిహద్దు రోడ్ల కోసం కేటాయించిన మొత్తాన్ని 30 శాతం పెంచడం సంతోషంగా ఉంది. బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ)కు 6500 కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల మన సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి" అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ సమాచార సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం, రక్షణ దళాల ఆధునికీకరణకు భారతదేశం ప్రాధాన్యం ఇస్తోంది.

ఇందుకోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖర్చుచేసిన వాస్తవ వ్యయం కంటే క్యాపిటల్ హెడ్ పద్దు కింద బడ్జెట్‌లో 20.33 శాతం ఎక్కువ కేటాయించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన అదనపు నిధులు ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో ప్రధాన కొనుగోళ్లలో అంతరాన్ని తగ్గించడానికి ఉద్దేశించారు.

ఆధునిక సాంకేతికత, మారణాయుధాలు, యుద్ధ విమానాలు, ఓడలు, జలాంతర్గాములు, ప్లాట్‌ఫామ్‌లు, పైలట్‌లెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డ్రోన్‌లు, ప్రత్యేక వాహనాలను సాయుధ దళాలకు అందించడం దీని లక్ష్యం.

పుతిన్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

కాలం చెల్లిన రష్యా ఆయుధాలు

పాకిస్తాన్, చైనాలను దృష్టిలో ఉంచుకుని దేశ రక్షణ బడ్జెట్‌ను పెంచడం వల్ల సైనిక ఆధునికీకరణ జరుగుతుందనే సాధారణ జనాభిప్రాయం ఉన్నప్పటికీ భారత రక్షణ బడ్జెట్ ఇప్పటికీ తగినంత లేదని విశ్లేషకులు అంటున్నారు.

రక్షణ రంగ నిపుణుడు రాహుల్ బేడీతో బీబీసీ ఉర్దూ మాట్లాడినప్పుడు ఆయన.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి రక్షణ బడ్జెట్ దాదాపు 5 శాతం పెరగడం పెద్ద విషయం కాదన్నారు. "ఇంకా చెప్పాలంటే ఈ పెరుగుదల 4.79 శాతం మాత్రమే" అన్నారు రాహుల్ బేడీ.

రక్షణ బడ్జెట్‌లో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయని.. ఒకటి రెవెన్యూ కాగా రెండోది కేపిటల్ అని రాహుల్ వివరించారు.

"ఆహారం, రవాణా, సైన్యం జీతాలు మొదలైనవి రెవెన్యూ కిందకు వస్తాయి. బడ్జెట్‌లో మూడింట రెండు వంతుల ఖర్చులు దీని కిందే ఉన్నాయి. అయితే పెన్షన్‌ల కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంది" అని రాహుల్ తెలిపారు.

సైన్యాన్ని ఆధునికీకరించడానికి, రక్షణ పరికరాల కొనుగోలుకు, దిగుమతులకు మొత్తంగా మూడింట ఒక వంతు కంటే కొంచెం ఎక్కువ కేటాయింపులు చేశారని ఆయన వివరించారు. సైన్యం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది పెద్ద మొత్తమేమీ కాదనేది ఆయన అభిప్రాయం.

భారత్‌లో ఇప్పటికీ 60 శాతం మిలటరీ పరికరాలు సోవియట్ రష్యా కాలం నాటివని, వాటి నిర్వహణకు చాలా ఖర్చవుతుందని రాహుల్ బేడీ తెలిపారు.

గత 20 ఏళ్లుగా దీనిపై భయాలున్నా, యుక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత, అవి వినియోగానికి అనుకూలమా కాదా అనే ఆందోళన మరింత పెరిగింది.

యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యన్ ఆయుధాలు అంత ప్రభావం చూపకపోవడమే దానికి కారణం.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్, చైనాతో పోల్చితే..

పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లతో పోలిస్తే మన రక్షణ బడ్జెట్ ఎలా ఉందని బీబీసీ రాహుల్‌ను ప్రశ్నించింది.

దీనిపై స్పందిస్తూ ఆయన, చైనా రక్షణ బడ్జెట్ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం లెక్కేస్తే 19 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉందని, ఇది భారత్ రక్షణ బడ్జెట్ 6 లక్షల కోట్ల రూపాయలతో పోల్చినప్పుడు చాలా ఎక్కువని.. చైనా ఏటా తన రక్షణ బడ్జెట్ పెంచుకుంటూ పోతోందని అన్నారు.

‘పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ సుమారు 59 వేల కోట్ల రూపాయలు. కానీ అణ్వాయుధాలపై తమ బడ్జెట్ కేటాయింపులను ఆ దేశం బయటికి చెప్పదు. అందువల్ల, దీనిపై వ్యాఖ్యానించలేం. కానీ ఇటీవలి పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌ చూస్తే గత ఆరేళ్లలో రెండోసారి ఎక్కువ మొత్తం కేటాయించినట్లు అర్థమవుతోంది’ అన్నారాయన.

చైనా, పాకిస్తాన్‌లను దృష్టిలో ఉంచుకుని భారత్ తన బడ్జెట్‌ను రూపొందించింది అనడానికి తాజా బడ్జెట్‌లో కొన్ని సూచనలు ఉన్నాయని, బీఆర్‌ఓ కేటాయింపులు దీనికి ఉదాహరణ అని ఆయన చెప్పారు.

బీఆర్‌వోకు కేటాయించిన మొత్తాన్ని సరిహద్దు ప్రాంతాలలో రోడ్ల మరమ్మతులు, ఇతర అంశాలపై ఖర్చు చేస్తారు. దీని వల్ల సరిహద్దు భద్రత పెరిగి, మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం సులభం అవుతుంది.

బడ్జెట్‌లో ఆధునికీకరణకు పెద్ద పీట వేయడం వల్ల రక్షణ సామర్థ్యం పెరుగుతుందని, ఇది సైనిక సామగ్రిని తయారు చేసే స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని రాహుల్ బేడీ చెప్పారు.

"భారతదేశానికి ఆధునిక ఆయుధాలు చాలా అవసరం. పాత పరికరాలను కొత్త వాటితో భర్తీ చేయడానికి చాలా డబ్బు అవసరం" అని తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో దాదాపు 13 లక్షల మంది సైనికులు ఉన్నారని, ప్రభుత్వం వారి సంఖ్యను ఎనిమిది లక్షలకు తగ్గించే యోచనలో ఉందని రాహుల్ బేడీ తెలిపారు.

"ఈ నిర్ణయం సైనికుల జీతాలు, ఇతర ఖర్చులను తగ్గిస్తుంది. అలా మిగిలే మొత్తాన్ని రక్షణ రంగంలోనే మరెక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చు"

ఐదు లక్షల మంది సైనికులను తగ్గిస్తే పెన్షన్, జీతాలు, వైద్యం, ఇతర సదుపాయాల ఖర్చూ తగ్గుతుందని బేడీ అన్నారు.

‘‘భారత్‌కు చైనా, పాకి‌స్తాన్‌లతో సుదీర్ఘమైన సరిహద్దు ఉందని, అందులో ఎక్కువ భాగం కొండలు, దుర్గమ ప్రాంతాలే’’ అని రాహుల్ బేడీ అన్నారు.

ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో క్లిష్టమైన ఆ సరిహద్దులను పర్యవేక్షించడం భారత సైన్యానికి అంత సులభం కాదు.

“సైనికులు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. కానీ దానిని పొందడానికి చాలా డబ్బు అవసరం" అని తెలిపారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)