చైనా ముప్పును త్రివిధ దళాల ‘థియేటర్ కమాండ్’ ఎలా ఎదుర్కొంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్రరావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో ఇండియా తన సైనిక సామర్థ్యాలను గరిష్ఠంగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా త్రివిధ దళాలను కలిపి ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది.
త్వరలో ఈ దిశగా అడుగులు వేసేందుకు సంబంధించిన చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.
కొన్ని మీడియా కథనాల ప్రకారం సాయుధ దళాలు ఈ ‘సమీకృత థియేటర్ కమాండ్’ ప్రాథమిక స్వరూపానికి తుది రూపు ఇచ్చాయని, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయని తెలుస్తోంది.
ఈ సమీకృత కమాండ్ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు? గత కొన్నేళ్ళుగా దీనికోసం ఎందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ థియేటర్ కమాండ్?
పొరుగు దేశాల నుంచి ముప్పు ఎదురైనప్పుడు త్రివిధ దళాలకు సంబంధించిన శక్తి సామర్థ్యాలను ఒకేచోట ఏకకాలంలో సమన్వయంతో ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి థియేటర్ కమాండ్‌కు ఓ స్థిరమైన ప్రదేశాన్ని కేటాయిస్తారు. భద్రతా పరిరక్షణే ఈ కమాండ్ బాధ్యతగా ఉంటుంది.
యుద్ధంలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాల శక్తి సామర్థ్యాలను ఉమ్మడిగా ఉపయోగించుకుని మెరుగైన ఫలితం సాధించడమే ఈ సమీకృత థియేటర్ కమాండ్ ఏర్పాటులోని అసలు లక్ష్యం.
ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మూడు లేదా నాలుగు కమాండ్ కేంద్రాలను ఏర్పాటుచేయాలని, వీటికి త్రీస్టార్ అధికారి నేతృత్వం వహించేలా ప్రతిపాదిస్తున్నారు.
ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌ను, వైమానికదళంలో ఎయిర్ మార్షల్‌ను, నౌకాదళంలో వైస్ అడ్మిరల్‌ను త్రీస్టార్ అధికారులుగా పరిగణిస్తారు.
వీరంతా తమ తమ కమాండ్‌ల శిక్షణ, దళాల సన్నద్ధత వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. అయితే ఈ కమాండ్‌లపై నియంత్రణ అంతిమంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వద్దే ఉంటుంది.
మరోపక్క థియేటర్ కమాండ్‌లు జాతీయ రక్షణ కమిటీ కింద పనిచేస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా రక్షణ మంత్రి ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటిదాకా ఏం జరిగింది?
1999లో కార్గిల్ యుద్ధం తరువాత రివ్యూ కమిటీలు, ఇతర కమిటీలన్నీ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళ దృష్ట్యా ఇండియాకు ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అవసరమని ముక్తకంఠంతో చెప్పాయి.
ఈ విషయంపై అనేక సంవత్సరాలుగా చర్చోపచర్చలు సాగుతున్నా, 2020లో జనరల్ బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా నియమితులయ్యాక ఈ థియేటర్ కమాండ్ ప్రతిపాదన ఊపందుకుంది.
2019 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో- ‘‘యుద్ధం స్వరూపస్వభావాలు మారుతున్నాయి. టెక్నాలజీ పాత్ర కీలకమవుతోంది. దీనిపై మన ఆలోచనా ధోరణి కూడా మారాలి. త్రివిధ దళాలన్నీ ఏకమై సమన్వయంతో పనిచేయాలి’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
సీడీఎస్ నియామకంతో మళ్లీ ఊపు
ప్రధాని ఇదే ప్రసంగంలో త్రివిధ దళాలనుద్దేశించి ఒక దళం ఒకడుగు ముందుకేస్తే, రెండో దళం రెండడుగులు వెనుకన, మూడోదళం మరో అడుగు వెనక ఉంటే ఉపయోగం లేదని, త్రివిధ దళాలు సమష్టిగా సమన్వయంతో పనిచేయాలని, ప్రపంచంలో యుద్ధరీతులు, రక్షణ వ్యవస్థల తీరుతెన్నులు మారుతున్నవేళ ఇది అత్యవసరమని వివరించారు.
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఈ సమీకృత థియేటర్ కమాండ్ ఏర్పాటుకు ఎంతో తీవ్రంగా శ్రమించారు.
కానీ ఆయన 2021 డిసెంబరులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తరువాత సమీకృత కమాండ్ ఏర్పాటు పనులు మందగించాయి.
జనరల్ బిపిన్ రావత్ మరణం తరువాత సీడీఎస్ పోస్టు చాలా కాలం ఖాళీగా ఉంది. ఆయన స్థానంలో జనరల్ అనిల్ చౌహాన్ 2021 సెప్టెంబరులో నియమితులయ్యారు. సీడీఎస్ నియామకం తరువాత మరోసారి కమాండ్ పనులు ఊపందుకున్నాయి.
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్ అండ్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్) బిల్లు 2023ను ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా ఉందని అర్థమైంది.
కొన్నినెలల కిందట మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ (భూతల దళం– 40 మంది, వైమానిక దళం – 32 మంది, నౌకా దళం 30 మంది)ని క్రాస్ పోస్టింగ్ చేశారు. ఆఫీసర్ల మధ్య సమష్టిగా పనిచేయడానికి కావాల్సిన ప్రేరణ పెంపొందించడానికి ఈ క్రాస్ పోస్టింగ్ చేశారు. అంటే ఆర్మీలో పనిచేసేవారిని, ఎయిర్ ఫోర్స్‌లోనూ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేవారిని నేవీలోనూ, ఇలా క్రాస్ పోస్టింగ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సమీకృత థియేటర్ కమాండ్ ఎక్కడ పెడతారు?
మొదటి ఇంటిగ్రేటెడ్ థియేర్ కమాండ్ జైపూర్‌లో ఏర్పాటు చేస్తారనే సమాచారం ఉంది. ఈ కమాండ్ పాకిస్తాన్ వైపునున్న పశ్చిమ సరిహద్దుపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
చైనాతో ఉన్న సరిహద్దును పర్యవేక్షించేందుకు లక్నోలో థియేటర్ కమాండ్ ఒకటి ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
అలాగే నౌకాదళ రక్షణకు, తీరప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు కర్నాటకలోని కార్వాడ్‌లో నౌకాదళ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ఇండియాలో 17 మిలటరీ కమాండ్‌లు ఉన్నాయి. వీటిలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందినవి ఏడేసి చొప్పున ఉండగా, నౌకాదళానికి మూడు కమాండ్‌లు ఉన్నాయి. అలాగే అండమాన్ నికోబార్ దీవులలో త్రివిధ దళాల కమాండ్‌లు పనిచేస్తున్నాయి. వీటికి త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు నేతృత్వం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏం చెపుతున్నారు?
సమీకృత థియేటర్ కమాండర్ వల్ల త్రివిధ దళాల వనరులను పుష్కలంగా ఉపయోగించుకోగలగడంతోపాటు వీటి మధ్య సమన్వయం సాధించవచ్చని నమ్ముతున్నారు.
రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల్లో రిటైర్డ్ భారత ఆర్మీ మేజర్ జనరల్ ఎస్.బి. ఆస్థానా నిపుణుడు.
‘‘భవిష్యత్తులో సమగ్ర సైనిక కార్యక్రమం జరగబోతోంది. ఇందుకోసం త్రివిధ దళాల నుంచి సైనికులను తీసుకుని, వారందరికీ ఒకే చోట ఒకే అధికారి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఓ నిర్దిష్ట ప్రాంతంలో థియేటర్ కమాండర్ ఆపరేషన్స్ చేపట్టినప్పుడు తగిన వనరులతో ఉండాలి. దేని కోసం వారు వెనక్కి తిరిగి చూసుకోకూడదు’ అని ఆస్థానా చెప్పారు.
‘‘వైమానిక వనరులే అతి పెద్ద సమస్య. యుద్ధ విమానాల కొరత కారణంగా వీటిని థియేటర్ కమాండర్‌తో పంచుకోవడానికి ఎయిర్‌ఫోర్స్ ఉత్సాహం చూపడంలేదు’’ అని ఆయన తెలిపారు.
ముందుగా వనరులను పెంచుకోవాలని, తరువాత థియేటర్ కమాండ్‌ను తయారుచేయాలంటారు ఆస్థానా.
‘‘థియేటర్ కమాండ్ కు వనరులు కేటాయించాకే వాటిని అభివృద్ధి చేయాలి. ఆర్మీ ఇందుకు సిద్ధపడినట్టుగా కనిపించడం లేదు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన యుద్ధ విమానాలు రావడానికి మరికొన్ని ఏళ్ళు పట్టడమే ఇందుకు కారణం’’ అని చెప్పారు.
థియేర్ కమాండర్‌కు అయ్యే వ్యయాన్ని ప్రయోజనాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మాజీ ఎయిర్ కమాండర్ ప్రశాంత్ దీక్షిత్ అన్నారు.
‘‘అమెరికా లాంటి అగ్రరాజ్యానికి పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల వ్యాప్తంగా థియేటర్ కమాండ్ ఉంది. అయితే మనకు ఏది అవసరమనేది చాలా ముఖ్యం. మన దగ్గర వనరులు పరిమితంగా ఉన్నప్పుడు వాటిని వివిధ ప్రాంతాలకు పంచాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దగ్గర థియేటర్ కమాండ్ కేంద్రాలకు పంచేన్ని వనరులు లేవు’’ అని ఆయన విశ్లేషించారు.
ఈ సమస్యలన్నీ చాలా కాలంగా చర్చిస్తున్నవే. అందుకే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్‌కు అవసరమైన వనరులు సమకూర్చుకున్నాకే వాటిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి :
- కెనడా: ఈ మూడు నగరాల్లో శాశ్వత నివాసం కోసం విదేశీయులు ఎందుకు తహతహలాడతారు?
- ‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ గురించి ఆయన బాడీగార్డు చెప్పిన 'రహస్యాలు'
- జలగావ్ సెక్స్ స్కాండల్: ఎగ్జామ్ పేపర్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలను ఎలా మోసం చేశారు? మాజీ ఐపీఎస్ అధికారి రాసిన పుస్తకంలో ఏముంది?
- గ్రహాంతర జీవులు భూమి మీద మనుషుల్ని గమనిస్తున్నాయా?
- బద్దం బాల్‌రెడ్డి: పాతబస్తీలో హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక్క హిందూ నాయకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














