కెంట్: భారత సైనికులను కాపాడే క్రమంలో మిలిటెంట్ల కాల్పులకు బలైన జాగిలం

’21వ డాగ్ యూనిట్’కు చెందిన ఆరేళ్ల ఆడ శునకం ‘కెంట్’

ఫొటో సోర్స్, DEFENSE PRO

ఫొటో క్యాప్షన్, ’21వ డాగ్ యూనిట్’కు చెందిన ఆరేళ్ల ఆడ శునకం ‘కెంట్’
    • రచయిత, మోహిత్ కాంధారి
    • హోదా, బీబీసీ కోసం

ఇండియన్ ఆర్మీ ‘21వ డాగ్ యూనిట్’కు చెందిన ఆరేళ్ల ఆడ జాగిలం ‘కెంట్’ సాహసం మంగళవారం నుంచి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

మంగళవారం రాజౌరి జిల్లా నార్లా ప్రాంతంలో తీవ్రవాదులు, సైనికులు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెంట్ తన ఆపరేటర్‌ను(జవాన్‌ను) కాపాడే క్రమంలో ప్రాణాలొదిలింది.

తీవ్రవాదులను వెతికే సైనికుల బృందానికి కెంట్ సాయపడేది. ఈ సమయంలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో కెంట్ ప్రాణాలు కోల్పోయింది.

‘రాజౌరిలో ఆపరేషన్ సుజలిగాల పేరుతో చేపట్టిన దాడికి భారత ఆర్మీ ‘21 ఆర్మీ డాగ్ యూనిట్’కు చెందిన ట్రాకర్ డాగ్ కెంట్ కూడా వెళ్లింది. పారిపోతున్న తీవ్రవాదులను పట్టుకునేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు.

తీవ్రవాదులను వేటాడే క్రమంలో ఇద్దరి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. తన హ్యాండ్లర్‌ను(జవాన్‌ను) కాపాడే ప్రయత్నంలో భాగంగా తన జీవితాన్నే పణంగా పెట్టింది’ అని జమ్ముకు చెందిన రక్షణ శాఖ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ చెప్పారు.

‘రాజౌరి జిల్లా నార్లా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు. ఒక భారత జవాను కూడా అమరులయ్యారు. ఒక పోలీసు ఎస్‌పీఓ, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఈ ఘటనలో గాయాలు పాలయ్యారు’ అని జమ్ము రేంజ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ తెలిపారు.

కెంట్‌కి అంత్యక్రియలు

ఫొటో సోర్స్, ANI

కెంట్‌ అంత్యక్రియలు

కెంట్ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ఆర్మీ సిబ్బంది హాజరయ్యారు. కన్నీటితో కెంట్‌కు తుది వీడ్కోలు చెప్పారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ సైనికులు రైఫిల్‌మాన్ రవికి కూడా నాగ్రోటాకు చెందిన వైట్ నైట్ కార్ప్స్ ట్విటర్‌లో సంతాపం తెలియజేసింది.

‘‘ఆపరేషన్ సుజలిగాలలో రైఫిల్‌మాన్ రవి చేసిన అత్యున్నత త్యాగానికి వైట్ నైట్ కార్ప్స్ సెల్యూట్ చేస్తుంది. దేశానికి ఆయన చేసిన తిరుగులేని సేవ, అంకితభావం ఎల్లవేళలా గుర్తుంటుంది’’ అని వైట్ నైట్ కార్ప్స్ తన ట్విటర్(ప్రస్తుతం ఎక్స్) హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది.

సోమవారం అర్ధరాత్రి రాజౌరి జిల్లా నార్ల ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే, 21 ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన జాగిలాలను సైనికులకు సాయం చేసేందుకు ఎన్‌కౌంటర్ ప్రాంతానికి పంపారు.

రెండు వారాల శిక్షణ కోర్సు పూర్తయిన తర్వాత కెంట్‌ను ఇటీవలే విధులకు పంపామని జమ్ము రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

2023 ఆగస్టు 16 నుంచి ఆగస్టు 31 మధ్యలో రెండు వారాల పాటు శిక్షణ తీసుకున్న కెంట్ సెప్టెబర్ 1 నుంచే విధుల్లో చేరింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సెర్చ్ ఆపరేషన్‌లో కెంట్

2016 అక్టోబర్ 23న కెంట్ పుట్టిందని, 2018 మే 23న భారత సైన్యంలో చేరిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

ట్రాకర్ డాగ్ కేటగిరీలో కెంట్‌ను చేర్చామని, 2022 డిసెంబర్ 30 నుంచి విధుల్లోకి పంపామని చెప్పారు.

గత 9 నెలల్లో కెంట్ ఆరు ఆపరేషన్లలో పాల్గొంది. జమ్ములోని రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పిన వివరాల ప్రకారం, 2023 జనవరి 27 నుంచి సెర్చ్ ఆపరేషన్ డ్యూటీలో కెంట్‌ను వేశారు.

దీని తర్వాత, తన ఆపరేటర్‌తో కలిసి కెంట్ ఫిబ్రవరి 3న సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టింది.

ఏప్రిల్ 4న ఒక దోపిడి కేసును పరిష్కరించే విధులలోనూ కెంట్ ఉంది.

అంత్యక్రియలు

ఫొటో సోర్స్, MOHIT KANDHAR

కెంట్ ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్న ప్రజలు

కెంట్ ధైర్యాన్ని, త్యాగాన్ని చాలా మంది సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. కర్తవ్య నిర్వహణలో కెంట్ చేసిన త్యాగాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

గత ఏడాది కూడా ఆర్మీ డాగ్ యూనిట్లకు చెందిన జాగిలాలు జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాయి.

2022 జులై 30న పఠాన్‌లో జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యంలోని 26 డాగ్ యూనిట్‌లోని అతి చిన్న శునకాల్లో ఒకటైన రెండేళ్ల కుక్క ఆక్సెల్ ప్రాణ త్యాగం చేసింది.

జనాభా ఎక్కువగా ఉన్న ఒక ప్రాంతంలో ఇంట్లో దాగున్న తీవ్రవాదులను కనుగొనడం కోసం ఆక్సెల్‌ను తన శిక్షకుడు తీసుకుని వెళ్లారు.

శిక్షకుడిని ఆదేశాలను అనుసరించిన ఆక్సెల్, భవంతి లోపలికి వెళ్లింది.

సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆక్సెల్, గదిలో దాగున్న తీవ్రవాది జరిపిన కాల్పులకు గురైంది.

ఆక్సెల్ బెల్జియానికి చెందిన మాలినోయిస్‌ జాతి శునకం. డ్రగ్స్, బాంబు, గ్యాస్‌ గుర్తించే అనేక ఆపరేషన్లలో ఇది పాల్గొంది.

ఆర్మీ శునకాలు

ఫొటో సోర్స్, DEFENSE PRO

ఇంతకుముందు కూడా ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ విభాగాలకు చెందిన జాగిలాలు

2022 అక్టోబర్ 9న ఓ ఆపరేషన్‌లో ఆర్మీ డాగ్ యూనిట్‌కు చెందిన రెండేళ్ల జాగిలం జూమ్ కూడా అనంత్‌నాగ్‌లోని తీవ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయింది.

‘‘గత మూడు దశాబ్దాలుగా, శిక్షణ పొందిన జాగిలాలు ఇండియన్ ఆర్మీకి సహాయంగా పనిచేస్తున్నాయి. భారత సైనికులతో పాటు ఇవి కూడా వాటి ప్రాణ త్యాగం చేస్తున్నాయి’’ అని జమ్ములో నివసిస్తోన్న మాజీ డాగ్ ట్రైనర్ చెప్పారు.

‘‘ఈ శునకాలకు అమర్చిన కెమెరాలలోని ఫీడ్‌ను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తూ ఉంటారు. మిలిటెంట్లు దాక్కున్న ప్రాంతాలకు వారు గుర్తించకుండా ఈ జాగిలాలు వెళ్తుంటాయి. ఈ ఆపరేషన్‌లపై వాటికి శిక్షణ ఇస్తారు. సెర్చ్ సమయంలో అరవకుండా కూడా వాటికి శిక్షణ ఇస్తారు’’ అని డాగ్ ట్రైనర్ వివరించారు.

శునకాలు

ఫొటో సోర్స్, DEFENSE PRO

ప్రాణాలు కోల్పోయిన శునకాలకు ప్రత్యేక అవార్డు

ఒకవేళ ఈ శునకాలను మిలిటెంట్లు కనిపెట్టి, వాటిపై దాడి చేస్తే, ఇవి కూడా ప్రతిదాడి చేసేలా శిక్షణ ఇస్తారు. డాగ్ హ్యాండ్లర్ ప్రతి క్షణం అక్కడ జరిగే పరిస్థితిపై ఒక కన్నేసి ఉంచుతారు.

రోడ్డు ఓపెనింగ్ పార్టీ(ఆర్ఓపీ) విధుల్లో, పేలుడు పదార్థాలను గుర్తించడంలో, ఏదైనా వీఐపీ లేదా సెన్సిటివ్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చడంలో ట్రాకర్ డాగ్‌లను విస్తృతంగా వాడుతుంటారు.

ఎప్పటికప్పుడు భారత సైన్యానికి చెందిన ఆర్మీ డాగ్ యూనిట్ల ఉన్నతాధికారులు వీటికి అవార్డులను ఇస్తూ ఉంటారు.

సైన్యంలో అత్యున్నత ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రదర్శించిన శునకాలకు ప్రత్యేక అవార్డులను కూడా అందిస్తుంటారు.

వివిధ ఆపరేషన్లలో ఈ శునకాల పనితీరును గుర్తించి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డు, వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమెండేషన్ కార్డు, చీఫ్ కమెండేషన్ కార్డులో జీఓసీతో సత్కరించారు.

రెండేళ్ల ఆక్సెల్‌కు స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాన్ని అందజేసింది.

సైన్యంలో శునకాలు

ఫొటో సోర్స్, ANI

భారత సైన్య విభాగాల్లో శునకాలు

భారత సైనిక విభాగాల్లో వివిధ జాతులకు చెందిన శునకాలున్నాయి.

దీనిలో లాబ్రడార్, జర్మన్ షెఫెర్డ్, బెల్జియన్ మాలినోయిస్, గ్రేట్ మౌంటెన్ స్విస్ డాగ్స్ ఉన్నాయి.

ముధోల్ హూండ్ సేవలూ వినియోగించుకుంటున్నారు.

ఈ శునకాలను వివిధ రకాల అవసరాలకు అంటే గార్డు డ్యూటీకి, పెట్రోలింగ్‌కు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజస్(ఐఈడీలు) గుర్తించేందుకు, మైన్ల గుర్తింపు, డ్రగ్స్ వంటి వాటిని బయటికి తీసేందుకు ఉపయోగిస్తుంటారు.

భారతీయ సైన్య శునకాలకు శిక్షణ ఇచ్చేందుకు హ్యాండ్లర్ ఉంటారు. నిత్యం వాటికి మార్గనిర్దేశం చేస్తుంటారు.

మీరట్‌లోని రీమౌంట్, వెటర్నరీ కార్ప్స్ సెంటర్ అండ్ కాలేజీలో వీటికి శిక్షణ ఉంటోంది.

తొమ్మిది నెలల పాటు వీటికి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మూడు నెలల పాటు వీటిని రంగంలోకి దింపి శిక్షణ ఇస్తారు.

వాటి వయసును బట్టి ఏడు నుంచి ఎనిమిదేళ్ల పాటు ఆర్మీ ఉపయోగించుకుంటుంది.

ఇవి ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని ఇస్తారు.

దేశవ్యాప్తంగా భారతీయ సైన్యానికి 27కి పైగా డాగ్ యూనిట్లున్నాయి.

ఒక్కో యూనిట్‌లో 24 శునకాలను చేర్చుతారు. కొన్ని శునకాలు ఆర్‌వీసీ సెంటర్‌లోనే పుట్టగా.. కొన్ని బయట నుంచి తెచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)