కార్గిల్: తల ఛిద్రమయ్యే వరకు పాకిస్తాన్‌పై పోరాడిన ‘పరమవీర చక్ర’ కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే సాహస గాథ

మనోజ్ పాండే

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, మనోజ్ కుమార్ పాండే తన జీవితమంతా శాకాహారిగా ఉన్నారు.
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గూర్ఖా రెజిమెంటల్ సెంటర్‌లోని ట్రైనీలకు, చేతులతో చేసే పోరాటంలో ఖుక్రీ (ఒక రకమైన కత్తి) అత్యంత ప్రభావవంతమైన ఆయుధమని చెబుతారు.

దానితో ఓ వ్యక్తి గొంతు కోయడం ఎలాగో కూడా శిక్షణ ఇస్తారు.

1997లో దసరా పూజ సమయంలో, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే 1/11 గూర్ఖా రైఫిల్స్‌లో చేరినప్పుడు, తన సత్తాను నిరూపించుకోవడానికి ఒక మేక తలను నరకమని ఆయన్ను ఆదేశించారు.

పరమవీర చక్ర విజేతలపై సుప్రసిద్ధ పుస్తకం 'ది బ్రేవ్' రాసిన రచనా బిష్త్ రావత్ అప్పుడేమైందో చెప్తూ... ‘‘మనోజ్ ఒక క్షణం కలత పడ్డాడు, కానీ అతను గొడ్డలితో బలంగా మేక మెడను నరికాడు. మేక రక్తం అతని ముఖం మీద చిందింది. తర్వాత, తన గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు అతను కనీసం ఒక డజను సార్లు ముఖం కడుక్కున్నాడు. బహుశా అతను తను మొదటిసారి చేసిన హత్యా నేరభారం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడేమో. మనోజ్ కుమార్ పాండే తన జీవితమంతా శాకాహారిగా ఉన్నాడు, అతను ఎప్పుడూ మద్యం కూడా ముట్టుకోలేదు" అని వివరించారు.

మనోజ్ పాండే

ఫొటో సోర్స్, FACEBOOK

దాడి చేయడంలో నేర్పరి

ఏడాదిన్నర కాలంలో మనోజ్‌లో ప్రాణాలు తీయాలంటే ఉండే భయం తొలగిపోయింది.

ఆయన దాడికి ప్రణాళిక రచించడం, శత్రువుపై ఆకస్మిక మెరుపుదాడి చేయడం, వాళ్లను అంతమొందించడం లాంటి పనుల్లో ప్రావీణ్యం సంపాదించారు.

ఆయన చలిలో కూడా నాలుగైదు కేజీల 'బ్యాక్ ప్యాక్'తో మంచుతో నిండిన పర్వతాలను అధిరోహించేవారు.

ఆ 'బ్యాక్ ప్యాక్'లో ఆయన స్లీపింగ్ బ్యాగ్, అదనపు ఉన్ని స్టాకింగ్‌లు, షేవింగ్ కిట్, ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలు ఉండేవి.

చలిని తట్టుకోవడానికి, ఉన్ని సాక్సులను చేతి తొడుగులుగా ఉపయోగించేవారు.

మనోజ్ పాండే

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, మనోజ్ పాండే

సియాచిన్ నుంచి తిరిగి వస్తుండగా కార్గిల్‌కు పిలుపు

11 గూర్ఖా రైఫిల్స్‌లోని 1వ బెటాలియన్, సియాచిన్‌లో తన మూడు నెలల పనిని పూర్తి చేసుకోగా, దానిలోని అధికారులు, సైనికులందరూ పుణెలో 'పీస్ పోస్టింగ్' కోసం వేచి చూస్తున్నారు.

బెటాలియన్‌కి చెందిన 'అడ్వాన్స్ పార్టీ' అప్పటికే పుణె చేరుకుంది. సైనికులంతా తమ శీతాకాలపు దుస్తులు, ఆయుధాలను తిరిగి ఇచ్చేశారు. చాలా మంది సైనికులు సెలవులపై వెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్‌లో పోరాటం వల్ల చాలా నష్టాలున్నాయి.

అక్కడి వాతావరణం ప్రత్యర్థి సైన్యం కంటే క్రూరంగా ఉంటుంది. సహజంగానే సైనికులందరూ చాలా అలసిపోయారు. దాదాపు ప్రతి సైనికుడు 5 కిలోల బరువు తగ్గాడు. అప్పుడు హఠాత్తుగా ఆ బెటాలియన్‌లోని మిగిలిన సైనికులు పుణె వెళ్లకూడదని, కార్గిల్‌లోని బటాలిక్ వైపు వెళ్లాలని ఆదేశాలు అందాయి. అక్కడ పాకిస్తాన్ భారీ చొరబాట్లకు పాల్పడుతోందన్న వార్తలు వస్తున్నాయి.

ఎప్పుడూ తన సైనికులను ముందుండి నడిపించే మనోజ్, రెండు నెలల పాటు సాగిన ఆపరేషన్‌లో కుకర్తాంగ్, జూబర్‌టాప్ లాంటి అనేక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు

అప్పుడు వాళ్లకు ఖాలూబార్ అగ్రాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మొత్తం మిషన్ నాయకత్వాన్ని కల్నల్ లలిత్ రాయ్‌కు అప్పగించారు.

మనోజ్ పాండే

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, మనోజ్ పాండే

అత్యంత కఠిన లక్ష్యం ఖాలూబార్

కల్నల్ లలిత్ రాయ్ ఆ మిషన్‌ను గుర్తు చేసుకుంటూ, "ఆ సమయంలో మమ్మల్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన పాకిస్తానీలు మా మీద తీవ్రంగా దాడి చేశారు. వాళ్లు ఎత్తులో ఉన్నారు, మేము దిగువన ఉన్నాము. ఆ సమయంలో మన సైనికుల మనోధైర్యాన్ని పెంపొందించేందుకు మాకు ఒక విజయం అవసరం చాలా ఉండింది’’ అన్నారు.

‘‘ఖాలూబార్ టాప్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. అది మా ప్రత్యర్థులకు ఒక రకమైన 'కమ్యూనికేషన్ హబ్' కూడా. మేం కనుక దాన్ని స్వాధీనం చేసుకుంటే, పాకిస్తానీల ఇతర స్థావరాలకు ఇబ్బంది కలుగుతుందని మేము భావించాము. అది వాళ్లకు సామగ్రిని తీసుకుని, వెనక్కి వెళ్లే మార్గాన్ని అడ్డుకుంటుంది. అంటే ఇది మొత్తం యుద్ధ గమనాన్ని మారుస్తుందని అర్థం’’ అని కల్నల్ రాయ్ వివరించారు.

మనోజ్ పాండే

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, మనోజ్ పాండే

సెకనుకు 2900 అడుగుల వేగంతో వచ్చే తూటాలు

ఈ దాడికి గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన రెండు కంపెనీలను ఎంపిక చేశారు.

వారితో పాటు కల్నల్ లలిత్ రాయ్ కూడా వెంట వెళ్లారు.

వాళ్లు కొంచెం దూరం ఎక్కగానే పాకిస్తానీలు వాళ్లపై పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో సైనికులంతా చెల్లాచెదురైపోయారు.

"సుమారు 60-70 మెషిన్ గన్నులు మాపై వర్షం కురిపించాయి. ఆర్టిలరీ షెల్స్ కూడా మాపై పడ్డాయి. వాళ్లు మాపై రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్ లాంచర్లను ప్రయోగించారు," అని కల్నల్ రాయ్ గుర్తు చేసుకున్నారు.

"మెషిన్ గన్ తూటా వేగం సెకనుకు 2900 అడుగులు. అది మీ చేతిలోంచి దూసుకుపోతే, మిమ్మల్ని ఎవరో బలంగా నెట్టినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే బులెట్‌తో పాటు 'ఎయిర్ పాకెట్’ కూడా వస్తుంది" అని వివరించారు.

కల్నల్ లలిత్ రాయ్ (ఎడమ నుండి మొదటి వ్యక్తి)

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, కల్నల్ లలిత్ రాయ్ (ఎడమ నుండి మొదటి వ్యక్తి)

“మేం ఖాలూబార్ టాప్‌కు 600 గజాల దూరంలో ఉన్నప్పుడు, రెండు ప్రదేశాల నుంచి మాపై భారీగా కాల్పులు జరిగాయి. కమాండింగ్ ఆఫీసర్‌గా, నేను చాలా అనిశ్చిత స్థితిలో ఉన్నాను. ఒకవేళ మేం ముందుకు ఛార్జ్ చేస్తే, మేమందరం చనిపోవచ్చు. అప్పుడు అందరి మరణాలకూ కారకుడైన కమాండింగ్ ఆఫీసర్‌గా చరిత్రలో నిలిచిపోతాను. ఒకవేళ మేం ముందుకు వెళ్లకపోతే, మేం మా లక్ష్యం కోసం ప్రయత్నించలేదని ప్రజలు అంటారు" అని కల్నల్ రాయ్ చెప్పారు.

ఖాలూబార్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఖాలూబార్ టాప్

"మేం రెండు బృందాలుగా విడిపోయి తెల్లవారకముందే అక్కడికి చేరుకోవాలని, లేకుంటే వెలుతురు వచ్చేసరికి మేమంతా బతకడం చాలా కష్టం అనుకున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న అధికారి ఎవరంటే కెప్టెన్ మనోజ్ పాండే."

"నువ్వు నీ ప్లాటూన్‌ని తీసుకుని వెళ్లు అని మనోజ్‌‌కు చెప్పాను. నాకు పైన నాలుగు బంకర్‌లు కనిపిస్తున్నాయి. నువ్వు వాటిపై దాడి చేసి వాటిని నాశనం చెయ్యి అని ఆదేశించాను."

"ఆ యువ అధికారి ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా, చలి, ఇంకా భయంకరమైన బాంబుల దాడి మధ్య చిక్కటి చీకటిలో పైకి వెళ్లాడు’’ అన్నారు కల్నల్ రాయ్.

మనోజ్ కుమార్ పాండే (ఎడమ నుంచి రెండో వ్యక్తి)

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, మనోజ్ కుమార్ పాండే (ఎడమ నుంచి రెండో వ్యక్తి)

ఒక్క గుటక నీరు ఆదా

మనోజ్ తన రైఫిల్ 'బ్రీచ్‌బ్లాక్'ని వెచ్చగా ఉంచడానికి, విపరీతమైన చలిలో గడ్డకట్టకుండా ఉండటానికి దాని పైన తన ఉన్ని దుప్పటిని కప్పారని రచనా బిష్త్ రావత్ తెలిపారు.

‘‘ఆ సమయంలో ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉన్నా, ఏటవాలు ప్రదేశాన్ని ఎక్కడం వల్ల భారత సైనికులు ఆ సమయంలో కూడా చెమటతో తడిసిపోయారు" అని వివరించారు.

"ప్రతి సైనికుడి వద్ద ఒక లీటర్ వాటర్ బాటిల్ ఉంది. కానీ వాళ్లు సగం దూరం వెళ్లేసరికే నీళ్లు అయిపోయాయి. చుట్టూ మంచు ఉన్నా, గన్‌పౌడర్ వల్ల అది చాలా కలుషితమైంది. అందుకని ఆ మంచు చుక్కలను కూడా తాగడం కుదరదు" అని బిష్త్ తెలిపారు.

"మనోజ్ తన ఎండిపోయిన పెదవులను చప్పరించుకున్నాడు. కానీ అతను తన వాటర్ బాటిల్‌ను మాత్రం ముట్టుకోలేదు. అందులో ఒక గుక్క నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అతను మిషన్ ముగిసే వరకు ఆ ఒక్క గుక్క నీటిని కాపాడుకోవాలనుకున్నాడు."

సైనికులు

ఫొటో సోర్స్, FACEBOOK

ఒంటరిగా మూడు బంకర్ల కూల్చివేత

కల్నల్ రాయ్ ఇంకా వివరిస్తూ- "మేము నాలుగు బంకర్లు ఉన్నాయని అనుకున్నాము, కానీ మనోజ్ పైకి వెళ్లి అక్కడ ఆరు బంకర్‌లు ఉన్నాయని చెప్పాడు. ఒక్కో బంకర్ నుంచి రెండు మెషిన్ గన్‌లు మాపై కాల్పులు జరుపుతున్నాయి. వాటిని పేల్చేయడానికి మనోజ్ హవల్దార్ దివాన్‌ను పంపాడు. దివాన్ కూడా ఫ్రంటల్ ఛార్జ్ చేసి ఆ బంకర్లను ధ్వంసం చేశాడు, కానీ ఆ పోరాటంలో బుల్లెట్లు తగిలి అతను అమరుడయ్యాడు" అన్నారు.

‘‘మనోజ్, అతని సహచరులు మిగిలిన బంకర్‌లను చేరుకోవడానికి నేలపై పాకుతూ వెళ్లారు. ఒక బంకర్‌ను పేల్చివేయడానికి ఏకైక మార్గం దాని లూప్ హోల్‌లో గ్రెనేడ్‌ను ఉంచి అందులో ఉన్నవాళ్లను అంతమొందించడం. మనోజ్ ఒక్కటొక్కటిగా మూడు బంకర్‌లను ధ్వంసం చేశాడు. అయితే అతను నాల్గవ బంకర్‌పైకి గ్రెనేడ్ విసిరే ప్రయత్నం చేస్తున్నపుడు, అతని ఎడమ వైపు కొన్ని బుల్లెట్లు తగిలి, తీవ్రమైన రక్తస్రావమైంది.’’

మనోజ్ పాండే మృతదేహం

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, మనోజ్ పాండే మృతదేహం ఉన్న శవపేటిక

హెల్మెట్‌ను చీల్చుకుని నుదిటిలో దిగిన నాలుగు బుల్లెట్లు

"ఇంకా ఒక బంకర్ మాత్రమే మిగిలి ఉందని మా కుర్రాళ్లు చెప్పారు. మీరు ఇక్కడ కూర్చుని చూడండి, మేము దానిని పూర్తి చేసి తిరిగొస్తాము అన్నారు. ఆ అధికారి ధైర్యం, కర్తవ్య భావం చూడండి!"

"అతడేమన్నాడంటే- కమాండింగ్ ఆఫీసర్ ఈ పనిని నాకు ఇచ్చాడు. దాడికి నాయకత్వం వహించడం, కమాండింగ్ అధికారికి విజయ సంకేతాన్ని చూపడం నా బాధ్యత."

"అతను నాల్గవ బంకర్ దగ్గరి వరకు పాకుతూ వెళ్లాడు. అప్పటికే అతను చాలా రక్తం కోల్పోయాడు. అప్పుడు కూడా లేచి నిలబడి గ్రెనేడ్ విసిరేందుకు ప్రయత్నించాడు. అప్పుడు పాకిస్తానీయులు అతణ్ని చూసి, మెషిన్ గన్ అతని వైపు తిప్పి, అతనిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు."

"ఈ బుల్లెట్లు అతని హెల్మెట్‌లోంచి దూసుకెళ్లి అతని నుదిటిలో దిగబడ్డాయి. పాకిస్తానీయులు ఏడీ మెషిన్ గన్ 14.7 మి.మీ.లను ఉపయోగించారు. వాటి దెబ్బకు మనోజ్ తల ఛిద్రమైంది. అతడు ఎగిరి నేలపై పడిపోయాడు."

"అప్పటికీ అతనిలో పోరాటస్ఫూర్తి తగ్గలేదు. చనిపోతున్నప్పుడు కూడా అతను వాళ్లను వదలిపెట్టనన్నాడు. అప్పటికి అతని వయసు 24 ఏళ్ల 7 రోజులు."

"పాకిస్తానీ బంకర్‌లో అతని గ్రెనేడ్ పేలింది. కొంతమంది చనిపోయారు. కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. మా జవాన్లు తమ ఖుక్రీలను బయటకు తీశారు. తమ పని ముగించారు, నాలుగు బంకర్‌లను ధ్వంసం చేశారు."

మనోజ్ పాండే

ఫొటో సోర్స్, FACEBOOK

అక్కడ మిగిలింది 8 మంది భారత సైనికులే

విశిష్టమైన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండేకు మరణానంతరం భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమ వీర చక్ర లభించింది.

ఈ పోరాటంలో, కల్నల్ లలిత్ రాయ్ కాలిలో కూడా బుల్లెట్లు దిగాయి, ఆయనకు కూడా వీర చక్ర పురస్కారాన్ని ఇచ్చారు. కానీ ఈ విజయం కోసం భారత సైన్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

తనతో పాటు రెండు కంపెనీలను తీసుకుని పైకి వెళ్లినట్లు రాయ్ చెప్పారు. ఖాలూబార్‌పై భారత జెండాను ఎగురవేసిన సమయంలో ఆయనతో 8 మంది సైనికులు మాత్రమే మిగిలారు. మిగిలిన వారు మరణించడమో, గాయపడడమో జరిగింది.

తన సైనికులు ఆ శిఖరంపై మూడు రోజులు ఆహారం, నీరు లేకుండా గడపాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. వాళ్లు అదే దారి నుంచి తిరిగి వస్తున్నప్పుడు, చుట్టూ సైనికుల మృతదేహాలు పడి ఉన్నాయి. చాలా మంది మృతదేహాలు మంచులో గడ్డకట్టిపోయాయి. పాండే మృతదేహం పైన బండలు కప్పగా, అదింకా అక్కడే ఉంది. అతని రైఫిల్ ఇంకా పాకిస్తానీ బంకర్‌ల వైపే చూస్తోంది, అతని వేలు ట్రిగ్గర్‌పై బిగుసుకుని ఉంది. అతని మ్యాగజైన్‌ను తనిఖీ చేసినప్పుడు, అతని రైఫిల్‌లో ఒక్క బుల్లెట్ కూడా లేదు. అవి గట్టిపడి ఒక రకమైన 'ఐస్ బ్లాక్'గా మారాయి.

వివరంగా చెప్పాలంటే, భారత సైనికులు తుది శ్వాస, ఆఖరి బుల్లెట్ వరకు పోరాడుతూనే ఉన్నారు.

"కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు మాత్రమే. అతనెప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. అతను చాలా ఉత్సాహంగా ఉండే యువ అధికారి. మేము అతనికి ఏ పని ఇచ్చినా పూర్తి చేసేవరకు నిద్రపోయేవాడు కాదు. దాని కోసం ప్రాణమిచ్చేవాడు. అతను పొట్టిగా ఉన్నా సాహసం, ధైర్యం, కర్తవ్యం విషయాలకు వస్తే అతను బహుశా మన సైన్యంలో అత్యంత ఎత్తులో ఉండే వ్యక్తి. ఆ ధైర్యవంతుడైన వ్యక్తికి హృదయపూర్వక వందనం సమర్పించాలనుకుంటున్నాను" అన్నారు కల్నల్ లలిత్ రాయ్.

MANOJ KUMAR PANDEY

ఫొటో సోర్స్, MANOJ KUMAR PANDEY FAMILY

పిల్లనగ్రోవి వాయించడం ఇష్టం

మనోజ్ కుమార్ పాండేకు చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరడమంటే ఇష్టం. అతను లక్నోలోని సైనిక్ స్కూల్‌లో చదివాక ఎన్‌డీయే పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.

ఆయనకు తన తల్లి అంటే చాలా ప్రేమ. మనోజ్ చిన్నతనంలో, ఒకసారి ఆయన్ను ఆమె జాతరకు తీసుకువెళ్లారు.

"ఆ జాతరలో అన్ని రకాల వస్తువులు అమ్మేవాళ్లు. కానీ చిన్నారి మనోజ్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది చెక్కతో చేసిన ఒక పిల్లనగ్రోవి.

మనోజ్ దానిని కొనాలని తల్లిని పట్టుబట్టాడు. వేరే ఏదైనా బొమ్మను కొనివ్వాలని తల్లి ప్రయత్నం, ఎందుకంటే పిల్లనగ్రోవి కొనిస్తే కొన్ని రోజుల తర్వాత తను పక్కన పాడేస్తాడేమోనని ఆమె భయపడింది. కానీ దానికి అతను అంగీకరించకపోవడంతో, ఆమె రెండు రూపాయలు ఇచ్చి అతని కోసం ఆ వేణువు కొంది. తరువాత ఆ వేణువు మనోజ్ కుమార్ పాండే వద్ద 22 సంవత్సరాలు పాటు ఉంది. అతను ప్రతి రోజు దాన్ని తీసి కాసేపు ఊది, తన బట్టల దగ్గర పెట్టుకునేవాడు" అని రచనా బిష్త్ రావత్ చెప్పారు.

పిల్లనగ్రోవి

ఫొటో సోర్స్, MANOJ KUMAR PANDEY FAMILY

"అతను తర్వాత ఖడక్‌వాస్లా, డెహ్రాడూన్‌ సైనిక పాఠశాలలకు వెళ్లిన వెళ్ళినప్పుడు కూడా ఆ వేణువు అతని వద్దే ఉంది. కార్గిల్‌ పోరాటానికి ముందు హోలీ సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు, మనోజ్ తన వేణువును తన తల్లి వద్ద ఉంచి వెళ్లాడు" అని బిష్త్ చెప్పారు.

MANOJ KUMAR PANDEY FAMILY

ఫొటో సోర్స్, MANOJ KUMAR PANDEY FAMILY

స్కాలర్‌షిప్ డబ్బుతో తండ్రికి కొత్త సైకిల్‌

మనోజ్ పాండే మొదటి నుంచి చివరి వరకు చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. వాళ్లు అంత సంపన్నులు కాకపోవడంతో అతను కాలినడకన పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది.

ఆయనతల్లి హృదయాన్ని హత్తుకునే కథ ఒకటి చెబుతారు.

మనోజ్ ఆల్ ఇండియా స్కాలర్‌షిప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సైనిక్ స్కూల్‌కు అర్హత సాధించారు. అడ్మిషన్ అయ్యాక హాస్టల్ లోనే ఉండాల్సి వచ్చింది. ఒకసారి ఆయనకు కొంత డబ్బు అవసరమైనప్పుడు, స్కాలర్‌షిప్‌లో వచ్చిన డబ్బును ఉపయోగించుకోవాలని తల్లి సలహా ఇచ్చారు.

దానికి సమాధానంగా మనోజ్, ఆ డబ్బుతో నాన్నకు కొత్త సైకిల్ కొనాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆయన సైకిల్ పాతదైపోయింది అని సమాధానం ఇచ్చారు. చివరికి ఒక రోజు మనోజ్ తన స్కాలర్‌షిప్ డబ్బుతో తన తండ్రి కోసం కొత్త సైకిల్ కొన్నారు.

కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా పరమ వీర చక్ర పురస్కారాన్ని స్వీకరించిన మనోజ్ పాండే తండ్రి గోపీచంద్ పాండే

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, 2000 జనవరి 26న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా పరమ వీర చక్ర పురస్కారాన్ని స్వీకరిస్తున్న మనోజ్ పాండే తండ్రి గోపీచంద్ పాండే

ఎన్‌డీయే ఇంటర్వ్యూలో చెప్పిన మాటే నిజమైంది

మనోజ్ పాండే ఉత్తర్ప్రదేశ్‌లో ఉత్తమ ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఎంపికయ్యారు.

ఎన్డీయే ఇంటర్వ్యూలో ఆయన్ను- ‘‘నువ్వు సైన్యంలో ఎందుకు చేరాలనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించారు.

దానికి మనోజ్, ‘‘పరమ వీర చక్ర గెలుచుకోవడానికి’’ అని జవాబిచ్చారు.

ఇంటర్వ్యూ చేస్తున్న ఆర్మీ అధికారులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఒక్కోసారి అలాంటి మాటలే నిజమౌతాయి.

మనోజ్ ఎన్‌డీయేలో ఎంపిక కావడమే కాకుండా దేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్రను కూడా గెలుచుకున్నారు.

కానీ ఆ పతకాన్ని అందుకోవడానికి ఆయన లేడు. ఆయన తండ్రి గోపీచంద్ పాండే 2000 జనవరి 26న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా వేల మంది ప్రజల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)