అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?

శరద్ పవార్, అజిత్ పవార్

ఫొటో సోర్స్, ANI

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో తిరుగుబాటు చేసి అజిత్ పవార్ అధికార ఎన్టీయేలో చేరిపోయారు. ఆ పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు శరద్ పవార్‌ను వీడి అజిత్ పవార్ వెంట ఉండేందుకు సిద్ధమయ్యారు. మంత్రులుగా కొందరు ఇప్పటికే ప్రమాణ స్వీకారం కూడా చేశారు.

శిందే-ఫడణవీస్ ప్రభుత్వంలో అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించగా, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, అనిల్ పాటిల్, అదితి తత్కరే, సంజయ్ బన్సోడే, ధర్మారావు ఆత్రమ్‌.. ఇలా 8 మంది మంత్రులుగా మారారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్సీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్‌తో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

అయితే, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాత్రం అజిత్ పవార్ చేసిన పనిని తీవ్రంగా ఖండించారు. అజిత్ పవార్‌తో పాటు ప్రభుత్వంలో చేరిన వారెవ్వరికీ పార్టీ మద్దతు లేదని శరద్ పవార్, జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. మరోవైపు ఎన్సీపీ పార్టీగానే అధికార వర్గంలో చేరిపోయామని అజిత్ పవార్ చెబుతున్నారు.

మొత్తం మీద ఏడాది క్రితం శివసేనలో ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు తర్వాత ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితి ఇప్పుడు ఎన్సీపీలో కనిపిస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే 'అజిత్ పవార్ తిరుగుబాటు‌తో శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా అనే సందేహం తలెత్తుతుంది. దీనిపై రాజకీయ నిపుణులతో విశ్లేషించే ముందు అసలు అజిత్ పవార్ తిరుగుబాటు సందర్భంగా వచ్చిన స్పందనలు చూద్దాం.

అజిత్ పవార్

'మా పార్టీ అధికారంలో ఉంది': అజిత్ పవార్

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్‌లతో కలిసి అజిత్ పవార్ మీడియా సమావేశం నిర్వహించారు.

‘‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా మేం ప్రభుత్వంలో చేరాం. ఇక నుంచి ఎన్సీపీకి గడియారం గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం’’ అన్నారు.

“ఈరోజు మేము శిందే-ఫడణవీస్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నాము. మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మరికొందరికి కూడా మంత్రులుగా అవకాశం దక్కుతుంది. దేశ, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేను, నా సహచరులు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. అందుకే ప్రభుత్వంలో చేరాం’’ అని చెప్పారు.

“రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతి అంశానికి న్యాయం చేయడం అవసరం. మాకు చాలా ఏళ్ల పరిపాలన అనుభవం ఉంది. దీన్ని ప్రభుత్వంలో ఉండి ఉపయోగిస్తాం. దీంతో పాటు పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అన్నారు.

అయితే, ఎన్సీపీ అధికార కూటమిలో చేరిందని అజిత్ పవార్ చెప్పినా, శరద్ పవార్ మాత్రం దాన్ని తోసిపుచ్చారు.

శరద్ పవార్

ఇది పార్టీ విధానాలకు విరుద్ధం: శరద్ పవార్

అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత, శరద్ పవార్ పుణెలో విలేఖరుల సమావేశం నిర్వహించి, అజిత్ పవార్‌కు పార్టీ నుంచి మద్ధతు లేదని స్పష్టం చేశారు.

“త్వరలో పార్టీ ప్రముఖులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాను. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించాలని అనుకున్నాను. కానీ, ఈలోగానే మా పార్టీ నేతలు కొందరు పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు’’ అని శరద్ పవార్ అన్నారు.

“వాళ్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుంది. తిరుగుబాటు చేసిన నేతల్లో కొందరు మా దగ్గరికి వచ్చి ప్రభుత్వంలో చేరే విషయంలో సంతకాలు తీసుకోవాలని భావించారు. కానీ, మా వైఖరి వేరుగా ఉందని వారికి అర్ధమైంది’’ అన్నారాయన.

పార్టీని ఉపయోగించుకుని పదవులు పొందడాన్ని సహించబోమని శరద్ పవార్ స్పష్టం చేశారు.

‘‘ఈ రోజు తిరుగుబాటు చేసిన వారితో ఘర్షణ పడితే ప్రజలు ఆందోళన చెందుతారు. అందుకే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టాం’’ అని పవార్ అన్నారు.

“పార్టీ అధ్యక్షుడిగా, నేను ఆ పదవికి నాయకులను నియమించాను. పార్టీ ఫ్రేమ్‌వర్క్‌కు అతీతంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేసి పవార్, ఇది గూగ్లీ కాదని, దోపిడీ అని విమర్శించారు.

శరద్ పవార్‌తో పాటు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా అజిత్ పవార్ తిరుగుబాటు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు.

జయంత్ పాటిల్

ఫొటో సోర్స్, JAYANT PATIL

‘‘మేం పవార్‌తో ఉన్నాం’’: జయంత్ పాటిల్

ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ అజిత్ పవార్ వెంట వెళ్లిన నాయకుల్లో లేరు. అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం అనంతరం ట్విటర్‌లో శరద్ పవార్ ఫొటో ట్వీట్ చేస్తూ.. ‘‘మేం పవార్‌తో ఉన్నాం’’అని జయంత్ పాటిల్ ట్వీట్ చేశారు.

ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జితేంద్ర అవ్‌హాద్, అనిల్ దేశ్‌ముఖ్‌లతో కలిసి జయంత్ పాటిల్ ఒక విలేఖరుల సమావేశం నిర్వహించారు.

‘‘ప్రమాణ స్వీకారం చేసిన ఆ తొమ్మిది మంది పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లారు. నేను ఆ మిగతా ఎమ్మెల్యేలను ఏమీ అనను. ఎందుకంటే వారిలో చాలా మంది ఇప్పటికీ మాతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఇవ్వదు. మంత్రులుగా ప్రమాణం చేసిన ఎవరికీ మేం మద్దతు ఇవ్వబోం.’’ అని జయంత్ పాటిల్ అన్నారు.

‘‘కొంతమంది మా పార్టీ వ్యక్తులే ఆ క్యాబినెట్‌లో చేరారు. దీన్ని మహారాష్ట్రలోని రాజకీయ నిపుణులు, ఉద్యమకర్తలు కూడా ఖండిస్తున్నారు. ఇలాంటి కష్ట సమయంలో మేం శరద్ పవార్‌తోనే ఉన్నాం.’’ అని ఆయన చెప్పారు.

‘‘అసలు వారికి ఏం చెప్పి తీసుకెళ్లారో తెలియదు. అయితే, వారిలో చాలా మంది శరద్ పవార్‌తో మాట్లాడారు. ప్రస్తుతం తాము గందరగోళంలో ఉన్నట్లు చెప్పారు’’అని జయంత్ పాటిల్ అన్నారు.

‘‘శరద్ పవార్ లేదా ఎన్సీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలకు ఎలాంటి మద్దతూ ఉండదు’’అని ఆయన చెప్పారు. తాము జితేంద్ర అవహాద్‌ను ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తున్నామని వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

మహారాష్ట్ర

ఫొటో సోర్స్, ANI

పార్టీ ఎవరిది?

ఇప్పుడు పార్టీ ఎవరికి చెందుతుందనే విషయంపై రాజ్యాంగ నిపుణులు ఉల్లాస్ బాపట్ బీబీసీతో మాట్లాడారు.

‘‘అజిత్ పవార్ తిరుగుబాటును అసలు ఊహించలేదు. ఇప్పుడు జరిగిందే గతంలో ఉద్ధవ్ ఠాక్రేకు కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎన్సీపీ ఎవరికి చెందుతుంది.. శరద్ పవార్‌కా లేదా అజిత్ పవార్‌గా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది’’అని అన్నారు.

‘‘రాజకీయ పార్టీలు, శాసన సభా పక్షాలు భిన్నమైనవనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం శాసన సభ్యుల్లో ఎక్కువ మంది అజిత్ పవార్ వెంట వెళ్లినట్లు కనిపిస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో మళ్లీ వారు శరద్ పవార్ వైపు వస్తే, అదే సమయంలో అజిత్ పవర్ వెంట వెళ్లిన శాసన సభ్యులు పార్టీ మొత్తం శాసన సభ్యుల్లో మూడింట రెండొంతుల కంటే తగ్గితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది చాలా కీలకం’’అని ఆయన అన్నారు.

‘‘ఇప్పుడు ఈ వివాదం సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్‌లకు వెళ్తుంది. అక్కడే లెక్కలు తేలుస్తారు. అప్పుడే అన్నీ అర్థం అవుతాయి. అయితే, అంతిమ నిర్ణయం చెప్పేది ప్రజలే. ఎందుకంటే మరో ఏడాది లోపే ఎన్నికలు జరగబోతున్నాయి’’అని ఆయన అన్నారు.

సీనియర్ రాజకీయ విశ్లేషకుడు అభయ్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ‘‘వచ్చే రెండు-మూడు రోజుల్లో ఈ సంక్షోభం విషయంలో స్పష్టత వస్తుంది. ఎవరు ఎవరిపైపు? ఎవరు కోర్టుకు వెళ్తారు? లాంటి అంశాలన్నింటిలోనూ స్పష్టత వస్తుంది.’’అని ఆయన చెప్పారు.

‘‘అజిత్ పవార్ నిర్ణయానికి నాయకత్వంలో శరద్ పవార్ చేసిన మార్పులే కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ తర్వాతే అజిత్ పవర్ క్రియాశీలంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు’’ అని దేశ్‌పాండే అన్నారు.

‘‘రానున్న రోజుల్లో అజిత్ పవార్ ఏకంగా పార్టీనే తీసుకెళ్లిపోయారా? లేదా తిరుగుబాటు చేశారా అనే విషయంలో స్పష్టత రావచ్చు’’ అని ఆయన చెప్పారు.

అయితే, ప్రస్తుత ఎన్సీపీ సంక్షోభం నుంచి ఒక విషయం మాత్రం సుస్పష్టం. దీని వల్ల ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇంకా చెప్పాలంటే వారికి అదనపు బలం వస్తుంది.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)