బైజూస్: రాకెట్‌లా దూసుకెళ్లిన ఈ కంపెనీ ఎందుకింతలా పతనమైంది?

బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్
    • రచయిత, అంశుల్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ‘ప్రోసస్’ గ్రూప్ భారత్‌లోని ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ విలువను 5.1 బిలియన్ డాలర్లకు తగ్గించేసింది.

అంటే భారతీయ కరెన్సీ లెక్కల్లో బైజూస్ విలువ ప్రస్తుతం రూ.41,843 కోట్లు మాత్రమే.

న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొన్న ప్రకారం ప్రోసస్ గ్రూప్ నెదర్లాండ్స్‌లో లిస్ట్ అయిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్వెస్టర్. ఈ సంస్థ బైజూస్ విలువను 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) నుంచి 5.1 బిలియన్ డాలర్లకు (రూ. 41,843 కోట్లు) తగ్గించింది.

అంటే దీని విలువ 75 శాతానికి పైగా పడిపోయింది.

బైజూస్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా ప్రోసస్ గ్రూప్ ఉంది.

మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి బైజూస్‌లో తనకున్న 9.6 శాతం వాటాను ప్రోసస్ 493 మిలియన్ డాలర్లకు(సుమారు రూ. 4 వేల కోట్లు) తగ్గించుకుంది.

బైజు రవీంద్రన్ 2011లో నెలకొల్పిన బైజూస్ సంస్థలో ప్రస్తుతం పరిస్థితులు అంత బాగా లేవు.

ఈ కంపెనీ భారత్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత చేపడుతోంది.

రుణాల విషయంలో అంతర్జాతీయంగా ఈ కంపెనీ న్యాయ పోరాటాన్ని ఎదుర్కొంటోంది.

బైజు రవీంద్రన్

ఫొటో సోర్స్, Getty Images

బైజూస్‌లో అసలేం జరుగుతుంది?

2025 వరకు బైజూస్‌కి ఆడిట్ నిర్వహించాల్సిన డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ కంపెనీ కొద్ది రోజుల కిందట ఆ బాధ్యతల నుంచి తప్పుకొంది.

2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక పత్రాలను పొందకపోవడంతో తాము కంపెనీ ఆడిట్‌ను చేపట్టలేకపోయామని డెలాయిట్ చెప్పింది.

‘‘ఇప్పటివరకు ఆడిట్‌ తేదీలపై మాకెలాంటి సమాచారం లేదు. ఆడిటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఆడిట్ ప్రక్రియను చేపట్టి పూర్తి చేసే సామర్థ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీని పరిగణనలోకి తీసుకుని, తక్షణమే కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్లుగా మేం రాజీనామా చేస్తున్నాం’’ అని తెలుపుతూ డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, బైజూస్‌కి లేఖ రాసింది.

ఆడిటర్‌గా డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకొన్న తర్వాత కంపెనీ తన పెట్టుబడిదారులకు లేఖ రాసింది.

రాయిటర్స్ సమాచారం ప్రకారం ఈ లేఖలో బైజూస్ తన 2022 ఆదాయ వివరాలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నాటికల్లా.. 2023 వివరాలను డిసెంబర్ నాటికల్లా ఫైల్ చేస్తామని తెలిపింది.

డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ విరమించుకున్న అనంతరం కొత్త ఆడిటర్‌గా బీడీఓ(ఎంఎస్‌కేఏ అండ్ అసోసియేట్స్)ను కంపెనీ నియమించుకుంది.

ఐదేళ్ల కాలానికి ఈ సంస్థ పనిచేస్తుంది.

కంపెనీ ఈపీఎఫ్ డబ్బును తమ ఖాతాల్లో జమ చేయడం లేదని బైజూస్‌‌లో పనిచేసిన కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించినట్లు ఇంగ్లిష్ న్యూస్‌పేపర్ ‘ది హిందూ బిజినెస్ లైన్’ కథనం తెలిపింది.

ప్రతి నెలా తమ వేతనాల నుంచి పీఎఫ్‌ను కంపెనీ డిడక్ట్ చేసిందని, కానీ ఆ మొత్తాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) అకౌంట్‌లో జమ చేయలేదని వారు ఆరోపించారు.

బైజు రవీంద్రన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ రిపోర్ట్ వెలుగులోకి వచ్చిన తర్వాత బైజూస్ పేరెంట్ కంపెనీ ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్’ 2022 ఆగస్ట్ నుంచి 2023 మే వరకు 10 నెలల కాలానికి చెందిన పీఎఫ్‌ను వారి ఖాతాల్లో జమ చేసింది.

ఈ చెల్లింపుల కింద రూ.123.1 కోట్లను జమ చేశామని, మిగిలిన రూ.3.43 కోట్లను మరికొన్ని రోజుల్లోగా చెల్లిస్తామని చెప్పింది.

కంపెనీ బోర్డులోని ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేసిన విషయాన్ని గత వారం ‘ది ఎకనామిక్ టైమ్స్’ రిపోర్ట్ ధ్రువీకరించింది.

పీక్ ఎక్స్‌వీ పార్టనర్స్‌కు చెందిన జీవీ రవి శంకర్, ఛాన్ జుకర్‌బర్గ్‌కు చెందిన వివియాన్ వూ, ప్రోసస్‌కు చెందిన రస్సెల్ డ్రస్సెన్‌స్టాక్‌లు కంపెనీ బోర్డుకి రాజీనామా చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ కథనం రాసింది.

అయితే, ఈ కథనాన్ని బైజూస్ ఖండించింది.

‘‘బైజూస్ బోర్డు సభ్యులు రాజీనామా చేశారంటూ ఇటీవల వచ్చిన మీడియా కథనం పూర్తిగా కల్పితమైనది. ఈ ఆరోపణలను బైజూస్ తీవ్రంగా ఖండిస్తోంది. నిరాధారమైన వార్తలను లేదా ధ్రువీకరించని సమాచారం అందించడం మీడియా సంస్థలు మానుకోవాలని కోరుతున్నాం’’ అంటూ ఆ కంపెనీ ప్రకటన విడుదల చేసింది.

షేర్‌హోల్డర్ల తిరుగుబాటును ఆపేందుకు ఇన్వెస్టర్ల నుంచి డబ్బులను సేకరించేందుకు బైజూస్ వ్యవస్థాపకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కూడా ఈ ప్రకటనలో చెప్పింది.

ల్యాప్‌టాప్‌లు

ఫొటో సోర్స్, Getty Images

ఒక బిలియన్ డాలర్ల(రూ.8,211 కోట్లు) నిధులను సేకరించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త షేర్‌హోల్డర్లతో బైజూస్ జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని అమెరికా మీడియా సంస్థ ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది.

కంపెనీ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ నియంత్రణను తగ్గించేందుకు కొందరు పెట్టుబడిదారులు చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కూడా బైజూస్ ప్రయత్నిస్తోంది.

వెయ్యి మంది ఉద్యోగులను కంపెనీ తీసేసిందని ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లీష్ పత్రిక ‘మింట్’ రిపోర్ట్ చేసింది.

ప్రస్తుతం కంపెనీలో 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మరోవైపు అమెరికా కోర్టులో బైజూన్ న్యాయ పోరాటం చేస్తోంది.

1.2 బిలియన్ డాలర్లకు సంబంధించిన రుణం విషయంపై బైజూస్ కంపెనీ అమెరికాలోని న్యూయార్క్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది.

ఈ రుణాన్ని కంపెనీ తిరిగి చెల్లించాలనుకుందని, కానీ ప్రస్తుతం అంత మొత్తం చెల్లించేంత స్తోమత కంపెనీకి లేదని పేర్కొంది.

టర్మ్ లోన్ బీ(టీఎల్‌బీ)ని వేగంగా తిరిగి చెల్లించాలని తన లెండర్ రెడ్‌వుడ్ కంపెనీ నుంచి ఒత్తిడి ఎక్కువైందని బైజు రవీంద్రన్ చెప్పారు.

బైజూస్ ప్రకటనలో షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, BYJU'S

ఫొటో క్యాప్షన్, బైజూస్ ప్రకటనలో షారుఖ్ ఖాన్

కోవిడ్ కాలంలో వెలుగు వెలిగిన బైజూస్

కరోనా మహమ్మారి ప్రభావంతో భారత్‌ 2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది.

స్కూళ్లు, కాలేజీల నుంచి షాపులు, కార్యాలయాల వరకు అన్నీ మూతపడ్డాయి.

ఆ సమయంలో ప్రజల ప్రపంచం కేవలం వారి ఇళ్లు, ఇంటర్నెట్ మాత్రమే.

మహమ్మారితో స్కూళ్లు మూతపడటంతో, పిల్లలు చదువుల కోసం ఆన్‌లైన్ ఎడ్‌టెక్ కంపెనీల్లో నమోదు చేసుకున్నారు.

ఆ సమయంలో బైజూస్ అకస్మాత్తుగా వృద్ధి సాధించింది.

ఏడాది వ్యవధిలోనే మార్కెట్ నుంచి బిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించింది.

ఆ డబ్బుతో తన పోటీ సంస్థలను కొనుగోలు చేసింది. వారిని మార్కెట్లో లేకుండా చేసింది.

బైజూస్ కొనుగోలు చేసిన కంపెనీల్లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, గ్రేట్ లెర్నింగ్, వైట్ హాట్ జూనియర్ ఉన్నాయి.

ఈ కొనుగోళ్ల తర్వాత పిల్లలకు కోడింగ్ క్లాస్‌ల నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం వరకు అన్నిటిపైనా గుత్తాధిపత్యం సాధించింది.

అంతేకాక, వ్యాపార ప్రకటలపై ఖర్చు చేసే విషయంలో కూడా కంపెనీ అసలు వెనక్కి తగ్గలేదు.

ఒకానొక సమయంలో బైజూస్ భారత్‌లో టీవీ ఛానల్స్‌లో అత్యంత ఎక్కువగా కనిపించే బ్రాండ్‌గా నిలిచింది.

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌.

బైజూస్ కోడింగ్ ప్లాట్‌ఫామ్ వైట్ హాట్ జూనియర్‌కు హృతిక్ రోషన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

దీంతోనే కంపెనీ ఆగలేదు. వ్యాపార ప్రకటనల పరంగా కంపెనీ సరికొత్త పుంతలు తొక్కేందుకు, 2022 నవంబర్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

ఇది మాత్రమే కాక, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఐసీసీ, ఫిఫా వంటి వాటితో కూడా బ్రాండింగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

సుమారు మూడేళ్లు బీసీసీఐకి ప్రధాన స్పాన్సర్‌గా బైజూస్ నిలిచింది.

ఫిఫా వరల్డ్ కప్ 2022కి స్పాన్సర్‌ చేసేందుకు ఎంపికైన తొలి భారతీయ కంపెనీగా బైజూస్ పేరు పొందింది.

ప్రస్తుతం మూడు ఈ సంస్థలతో బైజూస్ తన బ్రాండింగ్ పార్టనర్‌షిప్‌ల నుంచి తప్పుకుంది.

బైజూస్ కంపెనీ

ఫొటో సోర్స్, Getty Images

బైజూస్‌కి ఎందుకీ ఇబ్బందులు

బైజూస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి మరింత తెలుసుకునేందుకు జర్నలిస్ట్ అండ్ రీసెర్చ్ కంపెనీ మార్నింగ్ కంటెక్ట్స్ సహా వ్యవస్థాపకుడు ప్రదీప్ సాహ, ఏంజిల్ ఇన్వెస్టర్ బిజినెస్ మోడల్ విమర్శకులు డాక్టర్ అనిరుధ్ మాల్పానితో బీబీసీ మాట్లాడింది.

బైజూస్‌లో ప్రస్తుతం జరుగుతున్నది చాలామంది అనుకుంటున్నట్లు అకస్మాత్తుగా సంభవించింది కాదని ప్రదీప్ సాహా తెలిపారు.

‘‘బైజూస్ వేగంగా వృద్ధి సాధిస్తోందని, అంతా బాగుందని అంతా అనుకున్నారు. ఇది జరుగుతుందనది మనకెవరకి తెలియదు. సబ్‌స్క్రిప్షన్లు భారీగా పెరుగుతున్నాయని చూపిస్తూ కంపెనీ పెద్ద మొత్తంలో డబ్బులను సేకరించింది. కానీ, కరోనా సమయంలో కంపెనీ బాగా పనిచేసిందని చెప్పడానికి సేకరించిన డబ్బుకు మించిన ఆధారాలు లేవు. ’’ ప్రదీప్ సాహా అన్నారు.

ఉదాహరణకు.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ వివరాలను చూస్తే, రెవెన్యూ స్థిరంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇదే సమయంలో కంపెనీ లోటు 19 రెట్లు పెరిగింది. అంటే కంపెనీలో నగదు సరఫరా సమస్య ఉన్నట్లే కదా అని సాహ వివరించారు.

‘‘టర్మ్ లోన్ బీ విషయంలో లెండర్లతో నెలకొన్న న్యాయ వివాదంతో కంపెనీ చిక్కుల్లో పడింది. వ్యాపారాలు నెమ్మదించాయి. 2022, 2023 ఆర్థిక సంవత్సరాలకు చెందిన రిపోర్ట్‌లను కంపెనీ దాఖలు చేసేంత వరకు కూడా దాని స్టేటస్ ఏంటన్నది మనకు తెలియదు’’ అని సాహ చెప్పారు.

మరోవైపు, కస్టమర్లతో, ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తించడమే కంపెనీ సంక్షోభానికి ప్రధాన కారణమని డాక్టర్ అనిరుధ్ మాల్పాని అన్నారు.

‘‘బైజూస్ ప్రారంభం నుంచే ఇలాంటి వాతావరణం సృష్టించారు. మార్కెట్ నుంచి ఆయన నిధులను సేకరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన వద్ద డబ్బులు లేకపోతే, ముందు చెప్పాల్సింది. కస్టమర్లకు డబ్బులను రీఫండ్ చేయలేదు. ఉద్యోగులను యంత్రాలుగా మార్చేశారు’’ అని డాక్టర్ అనిరుధ్ చెప్పారు.

‘‘ఈ ఘటన పరిణామాలు మంచిగా, చెడ్డగా రెండు రకాలుగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. అతి పెద్ద ఎడ్‌టెక్ స్టార్టప్‌కి ఇదొక విచారకర వ్యవహారంగా మారడం చెడ్డ విషయం.

కానీ, మంచి విషయం ఏంటంటే, దీని నుంచి ప్రజలు పాఠాలు నేర్చుకున్నారు. వాల్యూయేషన్‌పై దృష్టి పెట్టకుండా, వాల్యూను ఎంపిక చేసుకునేలా ఈ పాఠం నేర్పిస్తుంది’’ అని ఆయన అన్నారు.

బైజు రవీంద్రన్

ఫొటో సోర్స్, Getty Images

బైజూస్ ముందున్న ఆప్షన్లేంటి?

ఒకవేళ కంపెనీ లాభాలను సంపాదిస్తే, ఇది మళ్లీ మార్కెట్లో పుంజుకోగలుగుతుందని ప్రదీప్ సాహ విశ్వసిస్తున్నారు.

‘‘బైజూస్ ఈ సమస్యల నుంచి బయటికి వస్తుందా? లేదా? అన్నది చాలా విషయాలపై ఆధారపడి ఉంది. అమెరికాలో టర్మ్ లోన్ బీ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలన్నది మొదటి విషయం. ఇక రెండోది, వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్ మరిన్ని నిధులు సేకరిస్తుందా? లేదా? అన్నది చూసుకోవాలి. మూడో విషయం ఎంత వేగంగా వారు లాభాలను చేరుకుంటారన్నది. అత్యంత ముఖ్యమైంది, ఎంత త్వరగా వారు ఆకాశ్ ఐపీఓను తేగలరు? వీటన్నింటిపై బైజూస్ భవిష్యత ఆధారపడి ఉంటుంది’’ అని చెప్పారు.

బైజూస్ కానీ మరే ఇతర ఎడ్‌టెక్ స్టార్టప్ కానీ ఇన్వెస్టర్లకు కాకుండా కస్టమర్లకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే, ఎడ్‌టెక్ స్టార్టప్స్ తప్పనిసరిగా విజయవంతమవుతాయని మాల్పాని అన్నారు.

‘‘భవిష్యత్‌ను ఎవరూ ఊహించలేరు, అది అనిశ్చితం. బైజూస్‌కి తనకంటూ సొంత ఆలోచన లేదు. బైజూస్‌కి ముందు అన్‌అకాడమీ బ్రాండ్ ఉంది. ప్రస్తుతం భారత్‌లో విద్యా వ్యవస్థ అంతా మనీ మేకింగ్ మెషిన్లగా మారింది. అందుకే, సోషల్ ఎడ్‌టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మరింత ముందుకెళ్లేందుకు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నాను. ఇతర ఎడ్‌టెక్ కంపెనీలు ఆ దిశగా ఆలోచిస్తే మంచిది.’’ అని డాక్టర్ అనిరుధ్ అన్నారు.

ప్రదీప్ సాహ, అనిరుధ్ మాల్పాని ఇద్దరూ కూడా ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి బైజూస్ బయటపడాలంటే ఇన్వెస్టర్లు, కస్టమర్ల నమ్మకాన్ని మళ్లీ చూరగొనాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)