రబ్బర్‌ను చెట్ల నుంచి ఎలా తీస్తారో తెలుసా... ఈ పరిశ్రమకు భారత్‌లో మళ్ళీ మంచిరోజులు వస్తాయా?

చెట్ల నుంచి రబ్బరు పాలు (లాటెక్స్) తీయడం అనేది శ్రమతో కూడుకున్న పని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చెట్ల నుంచి రబ్బరు పాలు (లాటెక్స్) తీయడం అనేది శ్రమతో కూడుకున్న పని
    • రచయిత, ప్రీతి గుప్తా
    • హోదా, ముంబయి

దక్షిణాది రాష్ట్రం కేరళలో తన చిన్న పొలంలో గత 30 ఏళ్లుగా బాబు జోసెఫ్ రబ్బర్ చెట్లను పెంచుతున్నారు.

కేరళలో ఒకప్పుడు ఆయనలా చాలా మంది రబ్బరు చెట్లను పెంచేవారు. ఈ చెట్ల నుంచి రబ్బరు పాలను (లాటెక్స్) సేకరించి వీరు జీవనోపాధి పొందేవారు. కానీ, గత దశాబ్దంలో వీరి సంఖ్య చాలా తగ్గిపోతోంది.

‘‘ఒకప్పుడు రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటగా రబ్బరు ఉండేది. గత దశాబ్దంలో ఇది చాలా తగ్గిపోయింది. ధరలు కూడా పడిపోయాయి’’ అని జోసెఫ్ చెప్పారు.

చెట్ల నుంచి రబ్బరు పాలు (లాటెక్స్) తీయడం అనేది శ్రమతో కూడుకున్న పని. సాయంత్రం లేదా ఉదయం కార్మికులు చెట్ల బెరడుకు పెద్దపెద్ద రంధ్రాలు చేస్తారు, వీటి నుంచి బకెట్ల సాయంతో రబ్బరు పాలు సేకరిస్తారు. ప్రతి కొన్ని రోజులకూ ఒకసారి ఒక్కోచెట్టు నుంచి ఇలానే పాలు తీస్తారు.

చెట్టు దెబ్బ తినకుండా సరైన లోతు వరకూ బెరడును తొలగించడానికి చాలా నైపుణ్యం కావాలి.

అయితే, ధరలు పడిపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వడం అనేది నేడు కష్టంగా మారుతోంది.

‘‘లాభాలు పడిపోవడం, కార్మికుల జీతాలు పెరగడంతో నా లాంటి చాలా మంది రబ్బరు పంటను వదిలిపెడుతున్నారు’’ అని జోసెఫ్ చెప్పారు.

30 ఏళ్లుగా బాబు జోసెఫ్ రబ్బరు చెట్లను పెంచుతున్నారు

ఫొటో సోర్స్, BABU JOSEPH

ఫొటో క్యాప్షన్, 30 ఏళ్లుగా బాబు జోసెఫ్ రబ్బరు చెట్లను పెంచుతున్నారు

భారత్‌లో 2013లో రబ్బరు ఉత్పత్తి గరిష్ఠంగా 9,13,700 టన్నులకు పెరిగినట్లు దేశంలోని రబ్బరు బోర్డు గణాంకాలు చెబుతున్నాయి.

అయితే, 2016లో దిగుబడి ఒక్కసారిగా 5,62,000 టన్నులకు పడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ పెరుగుతూ వచ్చింది. అయితే, 2013 స్థాయికి మళ్లీ చేరుకోలేదు.

2011లో అంతర్జాతీయ మార్కెట్‌లో ధర గరిష్ఠానికి (కేజీ రూ.540) వెళ్లడంతోపాటు వాతావరణం కూడా అనుకూలించడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో రబ్బరు పంట విస్తీర్ణం పెరిగింది.

అయితే, ఈ ఏడాది అది కేజీ రూ.130కి పడిపోయిందని జోసెఫ్ తెలిపారు.

దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయినప్పటికీ, సహజంగా తీసే రబ్బరుకు డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లోని సహజ రబ్బరులో 70 శాతం టైర్ల తయారీకే వెళ్తోంది. ఇటీవల కాలంలో ట్రైర్ల తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లోనూ దీని వృద్ధి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

‘‘ఉత్పత్తిలో పెరుగుదలతో పోలిస్తే వినియోగం చాలా ఎక్కువగా ఉంది’’ అని ఆటోమోటివ్ టైర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏటీఎంఏ) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బుధ్రాజా చెప్పారు.

‘‘సహజ రబ్బరు ఉత్పత్తి, వినియోగం మధ్య భారీ వ్యత్యాసం.. భారతీయ రబ్బరు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తోంది’’ అని ఆయన అన్నారు.

‘‘ఇలాంటి కీలకమైన మెటీరియల్స్ కోసం దిగుమతులపై ఆధారపడటం మంచిది కాదు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ప్రభుత్వం రబ్బరు ఉత్పత్తిని ప్రోత్సహించాలి’’ అని ఆయన చెప్పారు.

దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయినప్పటికీ, సహజంగా తీసే రబ్బరుకు డిమాండ్ పెరుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయినప్పటికీ, సహజంగా తీసే రబ్బరుకు డిమాండ్ పెరుగుతోంది

‘‘దిగుమతులతో రైతులకు ఇబ్బంది’’

రబ్బరును దిగుమతి చేసుకోవడంతో దేశీయ రైతులపై చాలా ప్రభావం పడుతుందని రబ్బరు బోర్డుకు చెందిన ప్రసాద్ పురుషోత్తమ అన్నారు.

‘‘సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో రబ్బరు ధరలు దేశీయ ధరల కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి దిగుమతులు వచ్చినప్పుడు దేశీయ రబ్బరు ధరలు పడిపోతాయి. దీంతో దేశీయ రైతులు రబ్బరు పంట నుంచి దూరం జరుగుతారు’’ అని ఆయన చెప్పారు.

అయితే, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఏటీఎంకేకు చెందిన నలుగురు సభ్యులు రబ్బరు బోర్డుతో కలిసి పనిచేస్తున్నారు. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్‌లలో కొత్తగా 2,00,000 హెక్టార్లలో రబ్బరును సాగులోకి తీసుకువచ్చేందుకు వీరు కృషి చేస్తున్నారు.

‘‘ఈ ప్రాజెక్టు పనులు అనుకున్నట్లుగానే ముందుకు వెళ్తున్నాయి. మరో నాలుగైదేళ్లలో సహజ రబ్బరు ఉత్పత్తిలో ఈశాన్య ప్రాంతాల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది’’ అని బుధ్రాజా అన్నారు.

కేరళకు చెందిన చిన్మయన్ ఎంకే 18 ఎకరాల్లో రబ్బరు చెట్లను సాగు చేస్తున్నారు

ఫొటో సోర్స్, CHINMAYAN MK

ఫొటో క్యాప్షన్, కేరళకు చెందిన చిన్మయన్ ఎంకే 18 ఎకరాల్లో రబ్బరు చెట్లను సాగు చేస్తున్నారు

టెక్నాలజీ సాయంతో భారత్‌లోని రబ్బరు రైతులు అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడేలా చేయొచ్చని కొందరు నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

అస్సాంలోని గువాహటీ శివార్లలో రబ్బరు బోర్డు పరిశోధన కేంద్రంలో ప్రపంచంలోనే తొలి జన్యు మార్పిడి (జీఎం) రబ్బరును పండిస్తున్నారు. ఈ మొక్కల్లో ఈశాన్య ప్రాంతాల్లోని వాతావరణానికి తట్టుకొని నిలబడేలా మార్పులు చేశారు.

రబ్బరు మొక్కలు అమెజాన్ నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. కాబట్టి అక్కడి వేడి, తేమతో కూడిన వాతారణం రబ్బరుకు అనుకూలంగా ఉంటుంది.

అయితే, ఇక్కడి వేడి, చల్లని లేదా పొడి వాతావరణాల్లోనూ తట్టుకొని నిలబడేలా ఈ మొక్కల్లో జన్యుపరమైన మార్పులు చేశారు.

‘‘ఈ జీఎం టెక్నాలజీనే రబ్బరు భవిష్యత్‌’’ అని రబ్బర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ ఎండీ జెస్సీ చెప్పారు.

‘‘సంప్రదాయ విధానాల్లో కనిపించని కొత్త లక్షణాలను ఈ జీఎం మొక్కల్లో మీరు చూడొచ్చు’’ అని ఆయన అన్నారు.

కేరళలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఈ రబ్బరు మొక్కల్లో జన్యు మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘‘రాబోయే రోజుల్లో రబ్బరు సాగును ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణ మార్పులు కూడా ఒకటి’’ అని పురుషోత్తమ చెప్పారు.

కొత్త మార్పులతో రబ్బరు పంటను మిగతా ప్రాంతాలకూ విస్తరించొచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుతం అస్సాంలోనూ రబ్బరు చెట్లను పెంచుతున్నారు. ఇది దేశీయ దిగుబడిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకొనేందుకు కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు.

మరోవైపు కొందరు రబ్బరు రైతులు కొత్త టెక్నాలజీల వైపు కూడా చూస్తున్నారు.

వీడియో క్యాప్షన్, రూ.3,000 తో కోళ్ల పెంపకం మొదలుపెట్టిన పేద రైతు, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు

కేరళకు చెందిన చిన్మయన్ ఎంకే 18 ఎకరాల్లో రబ్బరు చెట్లను సాగు చేస్తున్నారు. రబ్బరు నుంచి లాటెక్స్‌ను తీసేందుకు ఆయన మెషీన్లను ఉపయోగిస్తున్నారు.

‘‘ఈ మెషీన్ల ధర కాస్త ఎక్కువ. అయితే, సంప్రదాయ విధానం కంటే ఇవి మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు.

రబ్బరు తీయడంలో నైపుణ్యంలేని వారు కూడా ఈ యంత్రాలతో మెరుగ్గా పనిచేయొచ్చు. కాస్త అనుభవంతో చాలా వేగంగా రబ్బరు నుంచి పాలు తీయొచ్చు.

కార్మికుల కొరత సమస్యకు ఈ యంత్రాలు కొంతవరకూ పరిష్కారం చూపిస్తాయని ఎంకే అన్నారు.

మెషీన్ల సాయంతో తన పొలంలో దిగుబడి 60 శాతం పెరిగిందని, ఖర్చు కూడా 40 శాతం వరకూ తగ్గిందని ఆయన చెప్పారు.

‘‘మొదట్లో నేను ఈ టెక్నాలజీపై ఆసక్తి చూపలేదు. కానీ, ఇప్పుడు నా పొలం మొత్తం దీనిపైనే నడుస్తోంది’’ అని ఆయన అన్నారు. కేరళలో పడిపోతున్న రబ్బరు సాగుకు టెక్నాలజీ పరిష్కారం చూపగలదని ఆయన అన్నారు.

‘‘ఇక్కడి చాలా పొలాల్లో చెట్లకు వయసు పైబడింది. వాటి స్థానంలో మళ్లీ కొత్త మొక్కలు నాటాలి. కానీ, చాలా మంది దిగుబడిని పెంచేందుకు మార్గాలు అన్వేషించకుండా పొలాలను అమ్మేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)