బాస్మతికి ఆ సువాసన ఎలా వస్తుంది? ఇది పండించాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలి?

బిర్యానీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి.రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పూల నుంచి సువాసన రావడం తెలుసు. కానీ అన్నం నుంచి సుగంధ పరిమళం వస్తే..!

అలాంటి అన్నాన్ని అంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. పొడవైన మెతుకులు, ముత్యాల మాదిరి మెరిసిపోతున్నాయి. ముట్టుకుంటే మల్లెపువ్వంత మెత్తగా ఉన్నాయి. వాటి నుంచి సెంట్ కొట్టినట్లు మంచి వాసన వస్తోంది.

ఆ వాసనకు ఆకలి మరింత పెరిగింది. ముద్దముద్దకు మనసు మురిసిపోయింది. నేను తొలిసారి బిర్యానీ తిన్నప్పుడు కలిగిన అనుభవం అది. బాస్మతి అనే పేరును విన్నది కూడా అప్పుడే. బిర్యానీతో ప్రేమలో పడిపోయింది కూడా అప్పుడే.

ఇంతకూ బాస్మతికి ఇంతటి సువాసన ఎలా వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా సువాసన వచ్చే బియ్యపు రకాలు చాలా ఉన్నా దీన్ని మాత్రమే ‘‘క్వీన్ ఆఫ్ అరోమాటిక్ రైస్’’ అని ఎందుకు అంటారు?

బాస్మతి బియ్యం

ఫొటో సోర్స్, Getty Images

బాస్మతి పరిమళానికి కారణాలివీ

అరోమాటిక్ రైస్ రకాల్లో ఉండే కొన్ని జన్యువుల వల్ల వాటి నుంచి సువాసనలు వస్తాయి.

బాస్మతిలో ‘‘బీటైన్ అల్డిహైడ్ డీహైడ్రోజనైజ్ (బీఏడీహెచ్2)’’ అనే జన్యువు ఉంటుంది. ఈ జన్యువు కారణంగా ‘‘2-అసిటైల్-1-పిరొలీన్(2ఏపీ)’’ అనే ఒక కాంపౌండ్ అంటే సమ్మేళనం బాస్మతిలో ఏర్పడుతుంది. దీని వల్లనే దానికి ఆ సువాసన వస్తుంది.

వివిధ రకాల జన్యువులు, రసాయనిక సమ్మేళనాల వల్ల ఒక్కో రకం అరోమాటిక్ రైస్‌కు ఒక్కో విధమైన సువాసన ఉంటుంది.

అరోమాటిక్ రైస్‌కు ఉండే సువాసన ప్రధానంగా మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.

1.నేల రకం

2.పండించే విధానం

3.వాతావరణం

బాస్మతి

ఫొటో సోర్స్, Getty Images

పుట్టినిల్లు హిమాలయాలు

భారత ఉపఖండాన్ని ఏలిన ఎందరో రాజుల మనసులను దోచుకుంది బాస్మతి. సుల్తానులు బాస్మతికి సలాములు చేశారు.

బాస్మతి వంటి అరోమాటిక్ రైస్ రకాల మూలాలు భారత్, పాకిస్తాన్, నేపాల్, ఇతర దేశాలతో కూడిన సబ్-హిమాలయన్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ఆసియా మొత్తం ఆ వరి రకాలు విస్తరించాయి.

కాలక్రమంలో ప్రాంతాలు, వాతావరణం వంటి వాటిని బట్టి అరోమాటిక్ రైస్ రకాలు పరిణామం చెందుతూ వచ్చాయి.

హిమాలయాల్లోని పంటలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జమ్మూ కశ్మీర్ వంటి చల్లని ప్రాంతాలు బాస్మతి సాగుకు అనుకూలంగా ఉంటాయి.

పంజాబీ కవి వరీస్ షా, 1766లో రాసిన ‘‘హీర్ రంజా’’ కవితలో తొలిసారి బాస్మతి అనే పేరును ప్రస్తావించారు.

బాస్మతి అంటే ‘‘సువాసన కలది’’ అని అర్థం.

రాజస్థాన్‌లోని ఉదయపుర్‌లో క్రీ.పూ.2,000-1,600 మధ్య కాలం నాటి పొడవైన బియ్యపు గింజల ఆనవాళ్లు పురావస్తుశాఖ తవ్వకాల్లో కనిపించాయి. అవి బాస్మతి ముందటి రకాలు అయ్యుంటాయని భావిస్తున్నారు.

బిర్యానీ

ఫొటో సోర్స్, Getty Images

బాస్మతి ఎంత నిల్వ ఉంటే అంత రుచి

బాస్మతి ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంటే దానికి అంత సువాసన, రుచి వస్తాయి. నిల్వ ఉంచడం వల్ల గింజల్లోని తేమ తగ్గుతుంది. అవి విడుదల చేసే పరిమళంతోపాటు వండినప్పుడు గింజ ఎక్కువ పొడవు వస్తుంది. అన్నం కూడా ముద్దగా కాకుండా ఉంటుంది.

ఏడాది నుంచి రెండున్నరేళ్ల వయసు కలిగిన బాస్మతికి రుచి ఎక్కువగా ఉంటుంది.

నిల్వ చేయడం వల్ల బియ్యపు గింజలు కాస్త బంగారం లేదా గోదుమ వర్ణంలోకి మారతాయి.

బాస్మతికి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. మంచి వాసనను బియ్యం వెదజల్లుతూ ఉంటుంది. అన్నం రుచి తియ్యగా ఉంటుంది.

వండిన తరువాత అన్నం మెతుకులు సన్నగా ఉండి, 12 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు పొడవుగా ఉంటాయి. మెతుకులు ఒకదానికొకటి అంటుకోవు.

బాస్మతి సాగు

ఫొటో సోర్స్, Getty Images

బాస్మతి సాగుకు ఎలాంటి వాతావరణం ఉండాలి?

భారత ఉపఖండంలో కొన్ని వందల ఏళ్లుగా హిమాలయ సానువుల్లో బాస్మతిని పండిస్తు వస్తున్నారు. నేడు భారత్, పాకిస్తాన్‌లో ఎక్కువగా ఈ బియ్యం పండుతోంది.

భారత్‌లో జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ బాస్మతి సాగుకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.

ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి ‘‘బాస్మతి రీజియన్’’ అంటారు.

ఇక్కడ ఉండే చల్లని వాతావరణం, నేలలు బాస్మతి సాగుకు అనుకూలంగా ఉంటుంది.

వీటికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్(జీఐ) ట్యాగ్‌ను కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది.

బాస్మతి బియ్యం ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ నుంచి బాస్మతి బియ్యం ఎగుమతుల తీరు

బాస్మతి సాగుకు 700-1100 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి.

ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలి. పగలు 25 డిగ్రీలు, రాత్రి పూట 21 డిగ్రీలు ఉండాలి. అప్పుడే బాస్మతి గింజల నాణ్యత బాగా ఉంటుంది.

అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ నాణ్యత దెబ్బతింటుంది. అన్నం వండినప్పుడు గింజ పొడవు పెరగదు. అన్నం కూడా ముద్దగా అవుతుంది.

పంట మీద ఎండ ఎక్కువ కాలం పడాలి. గాలిలో తేమ ఎక్కువగా ఉండాలి.

భారత్‌లో ప్రభుత్వం గుర్తించిన బాస్మతి రకాలు 34 ఉన్నాయి. విత్తనాల చట్టం-1966 కింద వీటిని నోటిఫై చేశారు.

బాస్మతి 217, బాస్మతి 370, పంజాబీ బాస్మతి, దెహ్రూదూనీ బాస్మతి, పూసా బాస్మతి, హరియాణా బాస్మతి, కస్తూరి వంటి రకాలున్నాయి.

వీడియో క్యాప్షన్, బాస్మతి బియ్యానికి ఆ సువాసన ఎలా వస్తుంది?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)